కురుస్తోంది వాన
విషాదమో..ఆనందమో
తెలీనంత హోరుగా
రెప్పలమాటు కరిగిన స్వప్నం
నిశ్శబ్దానికి చీకటి రంగు అద్దినట్టు
మౌనానికి కదలికేదీ ఉండదు
నిదురలేచిన జ్ఞాపకాలన్నీ
ఒకేసారి మనసు తలుపు తడుతున్నప్పుడు
గుండెచప్పుడు చినుకుసవ్వడికి
పోటీ అవుతుంది
అధిగమించాలనుకున్న విషాదం
ఉండీ ఉండీ మెత్తగా కాటేసినట్టు
నరాల్లో అలజడి ప్రశాంతంతను చెడగొట్టి
అనుభూతులతో రమిస్తూ
భావాల్ని పొదిగేందుకు సిద్ధపడ్డప్పుడల్లా
ఏదో సవాలు విసురుతుంటుంది..
హృదిలో స్వరాల్ని సమాధి చేసి
అసంగతమైన స్మృతులు తోడి
వర్తమానాన్ని బావురుమనిపిస్తుంది
ఇప్పుడీ వాన వెలిసినా గుండెతడి మాత్రం ఆరదనిపిస్తుంది
అవును..
ఆనందం ఉన్నప్పుడు విషాదం తప్పకుండా ఉండి తీరుతుంది..!!
No comments:
Post a Comment