ఎందుకో కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు
ఎన్నిసార్లు మనసు తరచి చూసుకున్నా
"నిన్నెందుకు మరచిపోలేదా!" అని
ప్రత్యుషం పలకరించు తేనెపాటల్లో
నీ ఊసులు కలగలసిన
మైమరపు నన్నొదలనందుకేమో
తొలిజాము కలలలో
వెన్నెలచారల వింతకాంతి
నీ రూపుదేనని ఊహించినందుకేమో
ఒక ఏకాంత తన్మయానుభవం
నాలో నువ్వున్న రహస్యం
నీకెప్పటికీ చెప్పకుండా ఉండాల్సింది
ఆశలు రాలే క్షణాలు
కన్నుల్లో ఉపనదులై ఊరతాయని
ఎప్పుడో గ్రహించాల్సింది
తామరాకు మీద నిలిచే నీటిబొట్టులా
నేనెప్పటికీ ఒంటరినేననే
విలువైన సత్యాన్ని ఒప్పుకోవలసింది
వలపు నిశ్శబ్దంలో
నేనెంతా శోకించినా నా మౌనాలాపన
నీకు నివేదించకుండా ఉండాల్సింది
రంగురంగుల పువ్వులోని మకరందం
కోటానుకోట్ల నక్షత్రాల్లోని వెచ్చదనం
రాసే అక్షరాల్లోని నా హృదయం
నీపై కుమ్మరించకుండా ఆగాల్సింది
ప్చ్..ఇప్పుడైతే
కాలం తిరిగే మలుపుల్లో
మన అరచేతులు కలిసున్నంత కాలం
మనం విడిపోలేమన్న నిజం
ఒక వసంతమై విరబూసినట్టనిపిస్తుంది..!!
No comments:
Post a Comment