ఉండటం..ఉండకపోవడం
ఇంతేనా జీవితం
వేదన తప్ప భావన మిగల్లేదంటే
హృదయం వర్షిస్తున్నట్లేగా
కోల్పోయినప్పుడల్లా గతంలో వెతుక్కోవడం
ఏమార్చిన క్షణాల్లోకి
గడియారాన్ని వెనక్కి తిప్పుకొని మరీ వెక్కిళ్ళు తెచ్చుకోవడం..
చేయి పట్టుకు నడిపించేది ఆశే అయితే
అది దుఃఖం వైపు అడుగులేస్తుంది నిజమే
అప్పట్లో మెరిసిన చిరునవ్వు
ఇప్పుడు ఉప్పగా ఊరుతోంది కన్నుల్లో
వెచ్చగా రాసుకున్న మనసు నీకు చడవడం రానప్పుడు
గుండెను ఖాళీ చేసుకునేం లాభం
ఏ ఒక్క రాగమూ నువ్వు వినలేనప్పుడు
ఎన్ని సంగతులు పాడినా ఏంటి విశేషం
శూన్యానికి పరిభాష నిశ్శబ్దమని
గ్రహించగలిగేది కొందరే
మనిషి బ్రతికుండగా చేతలతో చంపగలిగేవాళ్ళు కొందరే
ఆ కొందరిలో నువ్వుండటం
ఇక నిష్క్రమించమని నేనందుకున్న సంకేతం..

No comments:
Post a Comment