Saturday, 7 September 2019

//తెలుసు //

నీ ధ్యాసలో గడిపే క్షణాలకే తెలుసు
రాత్రన్నది నాకెంతిష్టమో
గాలికి  కదిలే పైటంచు కదలికలకీ తెలుసు
నీకోసమని నేనెంతా ఆదమరచిపోయానో..

అలుపురాని నా కళ్ళకి తెలుసు
నీ రూపాన్ని చూస్తూ ఎంత పరితపించానో
ఈనాటికీ ఆగిపోని శ్వాసకి తెలుసు
నీ పరిమళాన్ని నేనెంత నింపుకున్నానో

దాగుడుమూతలాడుతున్న ఆలోచనల అలలు
మనసులో నీతో ఆడుతున్నాయనీ తెలుసు
కవ్విస్తున్న కాలాన్నే ఒంటరితనానికొదిలి
నీతో కువకువలు మొదలెట్టాననీ తెలుసు

అపురూపమంటే..
నీకు నేనూ..నాకు నువ్వూ..ఒకరికొకరం మనమే..
అనుభూతికి హద్దులేదు కనుకనే
ఏకత్మగా ఒకరికొకరం కలిసి కవనమయ్యామనీ తెలుసు

Monday, 2 September 2019

RIP for Siddhartha garu

RIP V.G.Siddharth..An Inspiring Entrepreneur
జీవితంలో శాశ్వతమైనది ఏది
తలరాత రాసిన విథాతను కాదని
తమకు తాముగా అద్భుతాలు రాసుకుంటారు కొందరు
అపురూపమైన విజయం అలవోకగా వరించినా
నిరంతరం తపస్సు చేసి పొందిన స్థానాన్ని ఖాళీ చేయమని
ఓటమిని అంగీకరించక తప్పదని ఒత్తిడి తెస్తారు ఇంకొందరు
అందంగా మెరిసే కీర్తి కలికితురాయి కాస్త పగులివ్వగానే
దాని విలువ తరిగేది కాదని తెలిసుకోక
మృత్యువుపై బెంగపడి ముందే వెళ్ళి కావలించుకుంటారు మరికొందరు
ఎగిరేందుకు ఆకాశమెప్పుడూ విశాలంగానే ఉంది
రెక్కలు కత్తిరించుకున్నందుకే అస్తిత్వం శూన్యమై
అంతరాత్మకు గుచ్చుకున్న ముల్లుకే ఊపిరాగినప్పుడు
ఓ చరిత్ర నిశ్శబ్దంగా కాలగర్భానికి చేరువయ్యిందిప్పుడు..😰

//మన తెలుగుభాష//

మొదట చిరునవ్వుల భాషొక్కటే తెలిసేది

మాటతో చెలిమి కుదరగానే

వినసొంపు భావాల పరిచయం

మనసుకి ఆలంబన నవవసంతమయ్యేలా

మాతృభాష మాత్రమే ఏకనాదమై మమేకమయ్యేది..

అతిశమనుకున్నా..స్వంతమనుకున్నా

తెలుగులోని తీపిదనం జగతిలో ఇంకదేనికీ లేదు

సంస్కృతీ సాంప్రదాయమైనా..సాహిత్యాభినివేశమైనా

తెలుగులో అదో ప్రత్యేకం..వివిధకళల సమాహారం

విశ్వవ్యాప్తమైన తెలుగుభాష

పగటిసూర్య తేజస్సు కదా

తేటతెలుగో సుగంధ మలయమారుతం

కోటిరాగాల కమ్మనికృతిలా కోమలం

తరతరాల మన తెలుగందాన్ని పాడుకుందాం

మనసారా రసానుభూతి పానం చేద్దాం..💜


//ఆశ//

ముసురుకున్న నిరీక్షణలో మొదలైన ఆశ
మనసుపొరల్లోని నమ్మకాన్ని అనుభూతులతో జయిస్తుంది
పెదవులపై పుట్టే నిశ్శబ్దమే ఒక్కోసారి కన్నీరై కరుగుతుందని
నిర్మాల్యమైన జ్ఞాపకాలకి మాత్రమే తెలుస్తుంది

మనోవికారాలు దాచి దృశ్యకావ్యమై కనిపించేందుకు
జీవితమో హడావుడి జంటస్వరమైతే కాదు కదా
ఉసురు తీస్తున్నట్లనిపించే అప్రియాలు అభావానికొదిలి
నిరంతరం సున్నితత్వాన్నందుకే కాపాడుకోవాలి
ముడిపడినంత వేగంగా విడిపోయిన చిక్కుముడిలో రహస్యమేముందసలు
రుచిచూడాలనుకున్న గుప్పెట్లో చెక్కర తీయనని తెలుసుగా మనకైతే..
కారుచీకట్లలోనూ మెరిసే నవ్వులుంటాయనేగా..
అధిగమించలేని కాలం నడక ఆపకుండా కదిలిపోతుందలా..😊💜

// రెప్పలనడుగు..//


నీ కళ్ళ సముద్రంలో నీరంతా నేనే ఐతే

అదెంత తీపి ప్రవాహమో రెప్పలనడుగు..

నిశ్శబ్దంలో నీ గుండెనేపథ్యం నా అనురాగమైతే

పల్లవించు కృతులన్నీ మన కొంటె అష్టపదులేనంటూ

హెచ్చుస్వరమందుకున్న సముద్రపుహోరు..

నీ ప్రాణాన్ని అల్లాడిస్తూ..నా తలపునే పాడుతుంది విను..

నా హృదయానికింత ఆనందపు అనుభూతి

నిన్నింత దగ్గరగా ప్రతిరేయీ చూసేందుకేనని ..

గదిలోని దీపం దృశ్యకావ్యమై కథలల్లుతోంది..

నీ విరహాన్ని ఆశల హరివిల్లుతో రంగులు నింపాలనే మరి..

హాయిరాగాలు పాడుతున్న కోయిల జంటను చూసే
మన గతజన్మ జ్ఞాపకం చప్పున గుర్తొచ్చి

వీచేగాలి రాకపోకలా చెప్పాపెట్టకుండా

నీ మనసు కాగితంపై అక్షరంలా నేనిలా ఒదిగిపోయా..💕💜

//ఎవరికి తెలుసు....//


ఎవరికి తెలుసు..

విషాదాన్ని అధిగమించాలనుకున్నప్పుడు ఆనందం చేరువై
ఆకాశాన్ని చిత్రించినట్టే చీకటీ దిద్దబడుతుందేమో..

పూటకోమారు పులకరించాలని పువ్వులకు తెలిసినట్టు
కొత్తగాలి కొన్ని మలుపులు దాటొచ్చి తడుముతుందేమో..

అరక్షణంలో అనంతంగా విస్తరించిన భావం
లిప్తల్లో వర్షించే వసంతంగా మారిపోతుందేమో..

నిశ్శబ్దానంతర అనుభూతి అందించే సంగీతరవం
అనుభవాల రాపిడితో తొలితీపి శ్లోకమవుతుందేమో..

అంతుపట్టని కొన్ని జన్మల చిక్కుముళ్ళు
ఏ మునివేళ్లొచ్చి విడదీస్తాయో.. వేచిచూడాల్సిందే..💞💜

//ఈ గాలి..//


సుదూరం నుంచీ వీస్తున్న ఈ గాలి

నీ పరిమళాన్ని సమ్మోహనంగా నాకు పూస్తుందీ ఉదయం

ప్రభాతంలోని అందాలు ముత్యాలసరాలైన నీ భావాలుగా

నన్నల్లుకుంటున్న మల్లెపువ్వుల సౌరభం

హ్మ్

మౌనానికి రాగం వస్తే ఏం పాడుతుందో తెలుసా

మనసుపడ్డ ఆకుపచ్చని ప్రకృతి పాట

నువ్వో తనివితీరని దృశ్యమై నా తలపుకొస్తే

ఓరకంట నాదాలు పలికించు పులకరింత

ఇంకెన్ని స్వప్నదారుల్లో నడిపిస్తావో కదా

నాలోని ఆర్తి సుధాగానమై నిన్ను చేరులోగా 💕💜

//నీకొరకు//

మగతగా ముంచుకొచ్చే నిద్రలో హాయి
అసలది సంపూర్ణంగా అనుభవించిందెప్పుడని
కాసేపు నీ కన్నుల్లోకి అదేపనిగాచూసి ఆర్తిపడినా
సహజమైన నవ్వు మనసుని తాకి చానాళ్ళయింది మరి

హృదయఘోష విన్నవించేందుకు సరిపోని భాష
కన్నీటిని సిరాగా నింపి కవనాలు మాత్రం రాస్తుంది
తుషారబిందువుగా మొదలై ఓ చల్లదనంతో
నన్నంతా పూర్తిగా తడిమేస్తుంది నిన్ను రాయమని..

మధురమురళి రసరమ్య రాగం నువ్వయితే
ముగ్ధమోహన మంజుల భావం నేనవనా
అందుకే నాతో నిన్నూ తీసుకొచ్చేసుకున్నా
పదిలమైన స్మృతిలా నన్ను బ్రతికిస్తుంటావని..

నా హృదయం చూసేది నీ చూపు..
వేలపున్నముల వెలుగు సమానమది నాకు
నువ్వొస్తావన్న ఆశనసలే దూరం చేయకు
కొన్ని యుగాలైనా వేచి ఉండాలనుందిలా నీకొరకు..💕

//జీవితం..//


మనసుకి సరిపడా ఆనందాన్ని
తోడుకోవాలని ఆశించింది జీవితం..

మజిలీ అంటూ ఎరుగని
అనంత ప్రయాణంలో అలసి
సేదతీరే ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు

అనుకోకుండా గుండె తేలికయ్యింది
అలివికాని అనురాగం చేయందించి
కొత్తమలుపు దారొకటి వేసింది

చిరునవ్వు వేయగల మంత్రం
చిట్టిపాపలోని అమాయకత్వం
గతజన్మలో విడిచేసిన
ప్రియమైన ఆలింగనం
విచ్చుకున్న వసంతం

అలుకలుపోయిన అవనిపై
గిలిగింతలు కురిపించిన వాన
నడిరాతిరి ఉక్కపోతని
ఆహ్లాదముగా మార్చిన సమీరం

చెలిమిలో కనుగొన్న సత్సంగం
తొలివలపులో చిలికిన రాగం

ఎదనెవరో నునుతట్టి పిలిచినట్టు
అనుభూతిమయమైన ఆథ్యాత్మికత
వెరసి
వర్తమానమో ప్రేమమయమైనట్టు
నమ్మకాన్ని మించిన నిజం సాక్షాత్కరించినట్టు
హృదయానికి పరిమళమబ్బింది 💜

 

//నిశీధి//

నిశీధిలో పోటెత్తుతున్న సముద్రం

ఆకాశం కళ్ళలోకి ఎంత ఆర్ద్రంగా చూస్తుందోనని

విస్మయం తీరేలోపు

అలలు అలలుగా నురుగుపువ్వులు

మనసునదుపు తప్పిస్తూ మంజీరనాదాలు

మోగిస్తున్న సవ్వళ్ళు

ఎప్పుడు విన్నా..ఇదే తొలిసారన్నట్టు

గొంతువిప్పుకున్న మోహనవర్ణానికి

సొగసులు చిమ్ముతున్న చూపులచివుళ్ళతో

హృదయం పోగులై ఊహలు నేస్తుందప్పుడే

అమాసనాటి ఇన్నివేల చుక్కల్లో తను కనిపిస్తాడో లేడో

కల్లోకైనా రమ్మని చెప్దామంటే

నిదురకి బొట్టుపెట్టి పిలవాలిప్పుడు

చీకటితో గొడవపడి కొంత వెన్నెలవాసనైనా ఇమ్మనడగాలి 😊💜


//జీవించు..//


గుండెగది తలుపులు మూసేసాక
ప్రియమైన పిలుపుని అందుకోలేని దిగులు
అంతుబట్టని అకారణ విషాదమవుతుంది

మనసులో తడి ఆవేదన రూపంలో
మాటలపై పొగమబ్బులుగా కమ్ముకొని
అలికిడికి దూరంగా ప్రవహిస్తున్నప్పుడు
ఎప్పుడో జరిగిన అనుభవం గుర్తుకొచ్చి
వర్తమానాన్ని కప్పెట్టేస్తుంది

కనులకి అందేంత దగ్గరలో ఉన్న ఆకాశాన్ని చూడొకసారి
సగం చందమామ నవ్వుతూ పిలుస్తుంది

ఆకులసందుల్లోంచీ నీ ఏకాంతాన్ని తొంగిచూసే నీడను గమనిస్తే
అది వెదజల్లే ఆకర్షణలోనూ ఒక సౌందర్యం రంగులీనుతుంది

నువ్వు..నువ్వు కాదని ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతావు
జీవించు..ఒకసారి కొత్తగా..
ఆనందం అంతర్వాహినైతే
బంధం మరింత అందమైన అవ్యక్తమవుతుంది చూడు 😊

//నేనంటూ..//

నేనంటూ కదులుతున్నప్పుడు
నీ అడుగులనే అనుసరిస్తున్నట్లు

నాలో మౌనం తెరవేసినప్పుడు
నీ ధ్యాసలో ఎద రమిస్తున్నట్లు

ఊహకందని తలపులు తోసుకొచ్చినప్పుడు
పరవశానికి తలుపులు తెరిచినట్లు

అనుభూతుల అలికిడి మొదలైనప్పుడు
మనిద్దరం ఒకటే కౌగిలన్నట్లు

చిరుముద్దుతో రెప్పలకదలికలు అలలైనప్పుడు
మనమో దీవికి వలసపోయినట్లు

గుండెల్లో గుసగుసలన్నీ
నువ్వు చల్లిన పదాలే అన్నట్లు

నిద్దురపట్టక ఆకాశాన్ని చూసినప్పుడు
మనమే తారాచంద్రులుగా అనిపించినట్లు
కలియుగపు ఇంటింటి రామాయణంలో
మనమే సీతారాములమైనట్లు..💕💜

//అక్షరమంటే..//

అక్షరానికో అందముంది
రసహృదయాలను మాత్రమే అది చేరగలుతుంది
కష్టాన్ని సుఖంతో సమానంగా తూచలేనప్పుడు
అక్షరమొచ్చి ఆదుకుంటుంది

కాగితంపై పరచగానే కాస్తంత ఉపశమనమందిస్తుంది

అప్రమేయంగా దూరమైన దేహాత్మ పాదముద్రలను

నలుచెరగులా వెదికి మరీ పలకరిస్తుంది

ఉగ్గబెట్టుకొనే ఊపిరిలాంటిదే అక్షరమంటే

కరుగుతున్న ఋతువుల్లో శ్వాసను నింపే ప్రాణవాయువు

విషాదంలోనూ ఆటవిడుపుగా
మనసు కృంగిన ప్రతిసారీ విజయాన్ని అందిస్తుంది

ఆనందమనే మకుటాన్ని అలంకరించి

ఆకాశమంత అద్భుతాన్ని తొడుక్కునేలా చేస్తుంది

జీవితాన్ని ఆరాతీసే చదువరులంతా భావకులే

హరివిల్లుని హృదయంలో ఇరికించుకోగలరు కనుకనే

కన్నుల్లోనూ చిరునవ్వు దీపాలు వెలిగించుకు తిరుగుతుంటారు..

మీలాగా.. 💕


//నన్ను గుర్తించు //


 

ఏమీ చెప్పకుండా వెళ్ళావేమో నువ్వప్పుడు
ఏదో మిగిలుందని నాకనిపిస్తుంది నిన్ను చూసినప్పుడు
ఈ నిశ్శబ్దపురొద భరించలేనని నీకు తెలిసుండాలి
ప్రతిరాత్రీ నిదురను వెలేస్తుంటానని తెలిసినప్పుడు

ఇన్నాళ్ళూ నువ్వెక్కడున్నావోనని వెదికిన చూపులు
ఇప్పుడు నవ్వులుగా మారిన సంగతి గుర్తించావా లేదా
ప్రవాహం ఎక్కువవుతోంది తెలుసా..
కొంచం దిగులు..కొంచం ఆనందం..కొంచం అసహనం..ఇంకొంచం అంతర్మధనం

ఆఘమేఘాలుగా ఏవో జ్ఞాపకాలు
కురిసి నన్ను తడిపేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు
జన్మజన్మల సాన్నిహిత్యం ఏదో గుర్తొచ్చినట్టు
కలలోనో కలవరంలోనో ఉలికిపాట్లు

నీకూ నాకూ మధ్య అడ్డున్న ప్రహరీని పడగొట్టు
అశ్రువులన్నీ వానచుక్కలయ్యేలోపు నన్ను గుర్తించు 💞💜

//నల్లనిపాట//

కాలం కోల్పోయాక తెలిసొస్తుంది
నిన్న మరోలా కలొచ్చి ఉంటే బాగుండేదని

మౌనరాగంతో మెలిపెట్టే నల్లనిపాట
ఈరోజు నిజమైన నిరాశాక్షణాలను కదలనివ్వదు

పువ్వుల ఉనికిని పరిమళం పట్టించినట్టు
మనసు కదలికలతో బ్రతికున్నాననే ఆనవాళ్ళు
చీలిపోతున్న ఇష్టాలను స్మృతికి తెచ్చి
జతకలిసే ఆత్మ వైపు అడుగులు వేయమంటుంది

పొగులుతున్న దుఃఖాన్ని ఆపే దారి మూసుకుపోయాక
వదిలించుకున్న గాయం తిరిగి చేరుతుంది

వైరాగ్యమెంతో దూరం లేదని తెలుస్తుందప్పుడే
అపూరూపమైన కోయిల గొంతు బొంగురుపోయిన గుర్తుగా..😣

//గాయాల సలుపు//




ఒక్క క్షణం నీలోపలికి ప్రయాణం చేసి ఉండవలసింది
ఆ పాతపరదా మాటు వాడిపోయిన మల్లెలు ఏం చెప్తాయో

కనుకొలుకుల్లో ఆవిరైన నీరెటుపోయిందో
అరచేతులు కలిసిన మెత్తదనం మిగిలుందో లేదో చూసేందుకైనా

పగుళ్ళతో పనిలేని కాలమెలానూ కదులుతూ ఉంటుంది
నిరాశతో నిరీక్షిస్తున్న హృదయం మాత్రం ఎక్కడిదక్కడే ఆగిపోతుంది

పురాతన గాయాల సలుపులోనే సంతోషం ఉన్నప్పుడు
వర్తమానంలో కళ్ళు తెరిచినా మూసుకున్నట్టే లెక్క

నిశ్శబ్దపు చెరో అంచునా మాటలు మిగిలిపోయాక
విసుగెత్తించే ఏకాంతం విషాదపు అలికిడిని మోస్తుంటుంది

భావరహితమైన చూపుల్లో నవ్వులు నిజంకాదని తెలిసాక
పెదవులపై గానం ఎదలోని ధ్యానమై ముగిసిపోవాల్సిందే

Whatever..Distance Doesn't Seperate People.. Silence Does...😣

//గమనించు //




చలించని మానసాన్ని జ్ఞాపకాల తోటల్లో తిప్పిరావాలి అప్పుడప్పుడూ
ఆనందభాష్పాల ఊరడింపుతో కన్నులు మెరవడం తెలుస్తుందప్పుడు

అరక్షణం వెలిగినా చాలనిపించే దీపం వెలుతురులోని ఆత్మవిశ్వాసం
నీడలు నిజాలేననే విషయం హృదయాన్ని తేలిక చేస్తుంది నిజం..

నిన్నటి నిద్రలో పొలమారినప్పుడు జీవితానికర్ధం తెలుస్తుంది
నవ్వించేందుకు నీకోసం ఒక్కరున్నారనే సత్యం బయటపడుతుంది

రెప్పలదొప్పల్లో దాచుకున్న కలలన్నీ వెన్నెల్లో తడవడం
చీకటిలో గుండెచప్పుడు మరో గుండెను కలిపి విన్నంత సంతోషం

మనసుపొరల్లో దాగిన విషాదానికందుకే రెక్కలిచ్చి చూడు
నిరాశ విహంగమై ఒక్కసారిగా ఎగిరిపోతుంది గమనించు 💕💜

//ఈ రాతిరి//


ఈ రాతిరి
మెత్తని పువ్వైన నీ నవ్వుతో లాలించబడుతుంది
చీకటేమో
నా గుండెచప్పుడు వినాలని వెలుతురు తెరలన్నీ మూసేస్తుంది
మనిద్దరం కలిసున్న కల
పున్నమిని తలపిస్తూ
వలపుని రమించేందుకు రమ్మంటుంది చూడు
సాయింత్రం నుంచీ
ఆ కస్తూరి వాసన
నీ మేనిగంధన్ని అంటుకట్టింది నిజమే
నాలో మాయమైన నిన్ను వెతుకుతున్నా ఇప్పుడు
తలపుల తోకచుక్కలా నా చుట్టూనే తిరుగుతుంటావని..💜

//నేను నీకు తెలుసా..//


నేను నీకు తెలుసా..

కన్నులు మూతబడ్డ క్షణాలప్పుడు ఆ నవ్వు
మునుపు మనకేదో పరిచయమున్నట్టు చెప్తుంది

ఇన్నాళ్ళూ మబ్బుల్లో దాగిన చినుకులా నీ ఆగమనం
ఆకాశం ఆపుకోలేని ఆర్తిలా నాపై దూకినట్టు
పూసలదండలో పువ్వుల పరిమళం

తపించిన జ్ఞాపకమేదో తొలిసారి కదిలొచ్చి
ఎదురుచూడని కొంటె కోయిల పాటగా
స్వరార్చన చేయమని పెదవులనడిగింది

ఎవరో నువ్వని ఆరాతీసిన మనసులో
మొదటిసారి మౌనం మాటేసిన విచిత్రం
నీకూ నాకూ వంతెన వేసిన కాలానికి తెలుసేమో

చెప్పూ..
రెండూ రెండూ నాలుగని అంతా అంటున్నది నిజమేనా
నీ ధ్యాసలో మత్తెక్కించిన నిన్నటిరాత్రి
నాలో ఏదో మార్పు తెచ్చిందంటావా..😊💜


//లోలోపలి మైమరపు//


స్వచ్ఛమైన స్వరం అభూతకల్పనలోంచీ పుట్టినదేనైనా
అది ఆస్వాదించిన అనుభూతి అసంపూర్ణమైతే కాదుగా

చెంపల మైదానంపై జారిన ప్రతినీటి బొట్టూ
ఉప్పగానో చేదుగానో ఉండాలనేం లేదుగా

ఎవరో వదిలేసిన క్షణాలను ఏరుకొన్నామంటే
ఒక జీవితపు శూన్యాన్ని నింపగలిగే అవకాశమొచ్చినట్టుగా

గడ్డిపూల గుంపులో నిలుచున్నా.. గులాబీ సుమగంధం
ఊపిరి పీల్చిన ప్రతిసారీ గుండెను తడమక ఆగదుగా

జ్ఞాపకాల మడతల్లోని పరిమళమే శాశ్వతమనుకొన్నప్పుడు
ఏకాంతంలో కేవలం ఒంటరిగీతం పాడుకోక తప్పదన్నట్టు

నీరవమైన చీకట్లోనూ తడిమేవి కొన్నుంటాయని తెలిస్తే చాలు
లోలోపలి మైమరపు ఎడతెగని తాదాత్మ్యమవుతుంది చూడు..💕💜

Sunday, 1 September 2019

//నీ పిలుపు..//

నీ పిలుపు..
చిటారుకొమ్మన ఊయలూగుతున్న మనసు మైమరపు
గారడిచేస్తూ ఆరడిపెట్టే తొలకరి మెరుపు

మువ్వలా మోగి నా మోహం తీర్చేదో
పలికే ప్రతిసారీ ఊహాతీతమై రవళించేదో
శిధిలహృదయానికి ఊపిరి పలవరింతో
ఎదురుచూడని ఆనందపు గాంధర్వమో

లయతప్పని కోకిలపాటకి స్పందించినట్టు
మునుపులేని ఏదో స్వాతిశయం మొదలయినట్టు
అనువణువూ పులకరింతలు సంతరించి
అపూర్వమైన మౌనానికి నవ్వుతెరలు వేసి మరీ ముద్దిచ్చినట్టు

నాకే తెలియని ఎదురుచూపుకి బదులొచ్చి
నాలో సమస్తం సౌందర్యానికి సరితూగి
అనుక్షణం అదే మృదులగానమై ఓలలాడించ
నేనవుతున్నా నీ బెంగతో అంతుచిక్కని ప్రవల్లిక

పిలుస్తూనే ఉండలా..
ఆకాశపు అనంతం సైతం అగిచూసి విస్తుపోయేలా 💕💜


/ఆహ్లాదం//


పుప్పొడి పలకరింపులు
కరువైన వానాకాలం
పున్నమెలా ఉంటుందోనని కంగారు పడ్డాను..

వానెందుకో తెరిపించింది
హృదయాలు వికసించేందుకు
ఆహ్లాదం అవసరమని తెలుసుకొనుంటుంది

విషాదపు రంగుని
వెన్నెల కప్పేసినందుకేమో
కనుచూపు మేరంతా ప్రకాశవంతమే ఇప్పుడు

నువ్వక్కడున్నా
నా మొహంలోని ఎరుపుదనం
అంతరంగపు పొరల్లోని ఆనందానికేమో

నా చిరునామా
నీ కనుల పొత్తిళ్ళ అరనవ్వులు కనుకే
ఆ గమ్మత్తు రెప్పల్లో మత్తిల్లుతాను

శిలనో శిల్పాన్నోనని కంగారు పడకిప్పుడు
కావ్యసృష్టికని మొదలెట్టిన నీ యాగంలో
మీటితే మురిపాల విపంచినై పలుకుతానో లేదో చూడు 😍💜

//దారితప్పిన నేను//


ఏడుస్వరాలు ఏకమైనట్టనిపించే నేను
ఏడు జన్మలుగా నిన్ను అనుసరిస్తున్నా
సంగమ స్వరఝరిలా అటునిటు ప్రవహిస్తూ
కాస్తయినా తడపవెలా..

గతంలోని గాయాలు రేపుకొని
గతితప్పిన ఇతిహాసంలోని
నిశ్శబ్దాన్ని ఓర్చుకుంటావ్ కానీ
నేనాలపిస్తున్న వలపురాగాన్ని ఆలకించవెలా..

స్వప్నంలో దారితప్పిన నేను
నీ తలపుల వాకిటనే నిలబాడ్డా
కనులెత్తి నువ్వు రాస్తున్న
చాటుకవితనని పసిగట్టవెలా

లిప్తలుగా కదులుతున్న కాలంలో
అలుపెరుగక ఎగిసిపడుతున్న కెరటంలా
ప్రకృతికి పూసిన నందివర్ధనపు పువ్వులా
నీ మౌన ప్రవాసానికి సవ్వడిలా
అంతర్లోకాన మనసైన పల్లవిలా
సజీవమై నిలిచినా చూడాలనిపించలేదా..

ఏ మేలిమలుపులో ఎదురవ్వాలో నేనిప్పుడు
నీ ఊహల పువ్వొత్తుల పొగలో నన్ను గుర్తించేందుకు 😉💜

// చెప్పూ..//


నాకు నేనుగా పులకించిన మధురక్షణాలు
నీ తలపుల్లోనివంటే
అబ్బురపడేందుకు కొత్త విషయం కాదుగా
ఆకాశంలో చిలిపి తారలా
హృదయ దిగంచలంలో దాగి
అప్పుడప్పుడూ మిణుక్కుమనేది నీవు కాదా

తప్పస్సు ఫలించినందుకే
స్వప్నంలో సాక్షాత్కరించుంటావని చెప్పినా
మైమరపును అతిశయించవుగా
అనుగ్రహవీచికలని కూర్చున్న ఏకాంతంలో
కాసేపు ఆలింగనమై సేదతీర్చి
హఠాత్తుగా మాయమైపోయేది నిజమేగా

చెప్పూ..
శ్రావణంలో మాత్రమే కురిసే వానలా..
నువ్వు నా లోకానికి అతిథివా..
తరగని అలల తెల్లని నవ్వులా
వెలకట్టలేని మలయసమీరపు స్పర్శవు కదా నువ్వు..
గండె పడితే పడనీ గుండెకిప్పుడు
ఇంతటి ఆర్తిని పొందబోయే క్షణాలప్పుడు..💕💜

//తెలుసా..//

చూస్తూ ఉండమంటావలా..
తెలుసా..
నువ్వు చెప్పకపోయినా అప్పుడప్పుడూ అలా చూస్తూ ఉంటా
కాలం సైతం కాసేపు ఆగుతుందనుకుంటా
నేనేం చేస్తానోనని
ఇంతింతై మనసింతై విస్తరించే నిన్ను
కన్నుల్లో నింపుకున్నాక రెప్పలు మూసేస్తా

ఈ అనేకత్వాలూ..బ్రహ్మత్వాలూ నాకేం తెలీదు
ఇష్టంలో పరమ ఇష్టం
నిన్ను ఆస్వాదించడమని మాత్రం తెలుసు

ఏం వింటున్నావలా..
మౌనరాగంతో తూట్లు పొడిచేస్తూ నవ్వుతావ్ అలా
అరమోడ్పుల మాటు భావుకతను వెదజల్లకలా
ఏకాంతంలో సిగ్గుపడటం నాకింకా తెలీదసలా 😉💜


//నువ్వెవరో తెలిసింది//


నువ్వెవరో తెలిసింది
నాకోసమింత ఎదురుచూస్తున్న ఆశావాహంలో..
యుగాలుగా కదులుతున్నా
ప్రతిసారీ నీకో కొత్తపరిచయంలా

వినిపిస్తున్న సవ్వడిలో..

ఊయలూగుతున్న కొమ్మలన్నీ
ఒక్కసారిగా నేల జారి

సుతిమెత్తని ఆ నవ్వులేంటో

మిలమిలలాడుతున్న మధ్యాహ్నం

నాలోంచీ నన్ను తప్పించిందెవరో

ఆరాతీస్తున్న పువ్వుల చొరవేంటో

ఏకాంతాన్ని తరిమేయాలిక

వర్షం రాకుండానే తడిచావేంటని

ఎవరైనా ప్రశ్నించేలోపు

మది సాధన చేస్తున్న మోహనవర్ణాన్ని ముగించాలి మరి 😉💕

// నేనో అభిసారిక//

పరిచయమున్న గాలి
భావాల ఉధృతిలో ఉన్న నన్ను
పరవశంగానే పలకరించింది..

ఝల్లుమన్న గుండె మృదుత్వం
మలయసమీరపు భాషలో
నీ కలవరింతను నాకు చేర్చినందుకేమో
మౌనారాధనలో స్పర్శించుకున్న కనుకొనుకుల తడి
నీ చూపుల ఆర్తిని తడుముకున్నట్టు
నాలో మోగిందొక వెచ్చని పల్లవి

నిశ్శబ్దం ఆవరించిన అంతర్లోకంలో
లాలనగా చెంపలు నిమురుతున్న చేతులు
పదాలకందని సాంత్వనై గుట్టుగా పొదుపుకున్నాయి..
కవిత్వం కాలేని రేయి నుండీ
నేనో అభిసారికనై
నిలువెల్లా నీకై ఎదురుచూసానీ తెల్లారివరకూ 💕💜


//పచ్చని పాట//




శిశిరానికి రాలని ఆకుల్ని చూస్తే
ఆయుష్షు తీరని పచ్చదనమొకటి వాటిలో కనిపిస్తుంది

ఆకుపాటల ఆనందాన్ని చిరునవ్వులతో పోల్చుకున్నప్పుడు
పెదవిప్పడం మర్చిపోతే
మంచుశిలగా మారడం మొదలయినట్టు
అడుగులు దూరమై
మాటలు కొరవడితే పలకరింపు భారమవుతుంది

చెదిరిన గుప్పెడు కలలు
భావరాహిత్యానికి చేరువై
పునరావృత్తమయ్యే అదే మాయలోకి
మనసుని చేర్చినప్పుడు
శూన్యమో శాపమై జీవితం బరువెక్కుతుంది

శాశ్వతంగా సేదతీర్చే సంతోషాలేవీ తేలిక కాదనుకున్నాక
వసంతమొచ్చినప్పుడే దాన్ని ఆస్వాదించడం నేర్వాలిక 💕

// నిశ్శబ్దపు రాగం//

మాటలు కరువైనప్పుడు
మౌనం విస్తరించి
మెల్లమెల్లగా మనసు ముసురేస్తే
మెలకువున్నప్పటి బెంగ పెరిగిపోతుంది

నిశ్శబ్దపు రాగానికి స్పందించడం
తెలియని హృదయం
అదేపనిగా బాధపడుతూ
తప్పదన్నట్టు జీవితాన్ని మోస్తుంది

అనంతమయ్యే లోలోపల తలపదేమో
ముగ్ధమైన మందారాలుగా మారి
నిదుర రాని రాత్రులెల్ల
యుగళగీతాన్ని రాసుకుంటుంది..💜

//పరిమళించిన నేల//


ఆత్మీయంగా కురిసే వానచినుకుకి తెలుసోలేదో
తన పలకరింపుతో ఎన్ని హృదయాలు చెమరించాయోనని

ఎడారిగా మారిన గుండెకు ఆనందం ఓ సుదూరపుస్వప్నం
మాట కలిపేందుకో చెలిమి ఆగమనం..అదో మహాసముద్రం..

మనసు ద్రవించి తొలివెలుగు రూపాన్ని ధరించాక
ఒంటరితనాన్ని తడుముకొనే అగత్యం చీకట్లోనే ముగిసిపోతుంది

తీరం ఎదురుపడి గమ్యమై చేయిచాచిన క్షణాల్లో
కెరటమై అల్లుకోగలిగే ఆర్తి కంపిస్తున్న హృదయానికుండాలి

సమాంతరదిశల హద్దులు చెరుపుకుంటూ చినుకులు ఏకమై కురిసినందుకే
నెర్రలీనిన నేల తడిచి పరిమళించిందని ఒప్పుకోవాలి 😊


//నీదవ్వాలి//




ఒక నాలో నువ్వు..ఇంకో నాలోనూ నువ్వే

గుండె ఎడారిగా మారినా..
ఘనీభవించి శిలగా మిగిలినా..
ఋతువులు కదులుతున్నా..
కాగితం లేకుండా రాయగలిగే ప్రేమలేఖలు నావి..

ఎడబాటులో తడుముకున్న తలపులూ
గుట్టుగా పొదుపుకున్న జ్ఞాపకాలూ
ముగ్ధనై రాసుకున్న రమ్యకృతులూ
ఎప్పటికీ ముత్యాలరాగాలే మది కదలికలు

జీవనశృతిలో రేగిన రాగమధూళి కృతులు..
పదాలుగా మారిన నిశ్శబ్దాలూ..
మాటలు కాలేని మౌనాలూ..
అన్నీ నీకోసమే..చదవగలిగే మనసు నీదవ్వాలిప్పుడు..😄💜

//పగలే వెన్నెల//

రోజూ నవ్వే కళ్ళే

నా పెదవుల్ని సవాలు చేస్తూ

ఎందుకింత నగ్నంగా

వర్షాకాలపు మత్తునంతా ఒలికిస్తున్నట్టు

అంతరంగంలో తరంగిస్తూ

వలపుతీవెల మమేకమై

వేకువ క్షణాలకు నీ చూపులే

లాలిత్యపు ప్రాణం పోస్తున్నట్టు

ఏమైనా తెలుసా..

ఈరోజు నీ చిరునగవుసిరి

మోహనరాగపు శృంగార స్వరజతిలా

నా మతి పూర్తిగా పోగొట్టిందని

ఆ నిట్టూర్పు వేడిసెగకి

చలిచెదిరి దూరమైందని

కలలన్నీ కావ్యాలై నిన్ను హత్తుకోమన్నాక

నా హృదయ దిగంచలంలో పగలే వెన్నెల విరగ్గాసిందని..💕💜

//అద్భుతం//

కలత నుండీ జీవితంలోకి ప్రయాణించడానికి
కన్న కలలు సాకారం చేసుకోవడానికి
అప్పటిదాకా మోస్తున్న దిగుళ్ళను కిందకి దించాలి
ఓ ప్రేరణతోనో..మరో ఉషోదయంపై నమ్మకంతోనో..

తరుముకొస్తున్న విషాదం వెనుకబడుతుందని
నిన్నటి జ్ఞాపకం రేపటికి మరుపు కావొచ్చని
శిశిరమొక్కటే ఋతువు కాదని
వేడుకిచ్చే వసంతాన్ని పదే పదే తలచుకోవాలి..

మనసుని ముట్టుకొనే అద్భుతమొకటుంటుందని
మాపటికి కొన్ని అపురూపాలు వేచుంటాయని
వికసించే పువ్వులు పాటలు పాడగలవని
కొన్ని ఊహలు లిఖించగలగాలి..

ఆకాశంలో నువ్వో ఒంటరి చుక్కవి కావని
కోట్లాదిమందికి నువ్వో ఆహ్లాదమని
చీకటంటే లాలిత్యాన్ని చిలికే ఏకాంతమని
అంతర్లోకానికి దారి వెతకాలి

తపించడానికే లోకమింత పరిమళాన్ని దాచుకుంది
అది ఆస్వాదించేందుకే మరి... నీకో అతిశయముండాలి..💜😍

//రాచిలుక//


నేనైన వృత్తంలో
నీతో గిరగిరా తిరుగుతూ
మరో ప్రపంచాన్ని మరచి
ఆకాశమంత ఆనందమైనప్పుడు

నేనుగా సంకల్పించిన
అపురూప ధ్యానంలో
నువ్వంతా నేనై
ఒకరిలో ఒకరు రహస్యమయ్యాం

నీకోసం సుతిమెత్తనైన నేను
చీకటిలోకి జారకుండా
వెలుతురుతో జతకట్టాను

అవును..
నువ్వొక్కసారి చూపు కలిపినందుకే
నవ్వులన్నీ రాసిచ్చేసిన రాచిలుకనయ్యాను..💕💜

 

//ప్రేమ//


విశ్వవ్యాప్తమైన ప్రేమ
గాలికే గంథాన్ని పులిమే పరిమళమంటిది..

మెలకువలో మెదిలే ఊహలా
పరిసరాలను మైమరపిస్తుంది

ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోని పులకరింతలా
మనసుని స్పృశించే చూపులా
ప్రేమ సుతారం కనుకనే ఆర్తిగా పొదగాలి

ప్రేమ జ్యోతితోనే జీవితం
వెలుతుందని నమ్మాలి

ప్రేమ మందుతోనే మనోవ్యాధి
నయమవుతుందని తెలియాలి
అప్పటికి ప్రేమ వర్షమై..వరాళిరాగమై..వర్ధిల్లుతున్నట్టు లెక్క 💕💜



//నావైపు చూడవూ//

చినుకులు వర్షంగా మారితే

నీ చూపులు నవ్వులుగా మారినట్టు

తడి మట్టి పరిమళమేదో నాలో మొదలైనట్టు
ఊపిరాడనివ్వని పచ్చివాసనో తమకమయ్యినట్టు

పొలిమేరలు దాటిపోతున్న చీకట్లు
మధురానుభూతులు మాత్రం మనసుకి మిగిల్చాక

ఇన్ని క్షణాల తాదాత్మ్యం
యాదృచ్ఛికం కాదని తెలిసిపోయింది

ఏకాంతం చేరువైన మురిపెములో
అంతులేని ఊహలు కొట్టుకొస్తుంటే
ఇప్పుడంతా మనదో వేడుకగా
అప్రమేయమైంది మది ఆహ్లాదం

కాస్తంత నావైపు చూడవూ..
నీ విషాదానికి ఆటవిడుపు నేనవ్వాలనుంది 💕💜


//ఉత్సవం//

ఒదిగిపోతున్న నిశిలో
పరస్పరం జారిన స్మృతులను సాగనంపి
నిరాశను మృదువుగా విస్మరించి
ఒకేసారి అపరిచితలోకంలో ఎదురుపడి
మౌనానికి మాటలతో సాంత్వనిచ్చి..
చూపులు నవ్వుకొనేలా కన్నులు కలుపుకొని
రంగులమయమై కదిలామనే
నిశ్శబ్దాన్ని ఇసుకలా విదిల్చినట్టు
ఇప్పుడంతా ఒక ఉత్సవం

మనమిప్పుడు..
వెచ్చగా ఒకరినొకరు కప్పుకొనే వెన్నెల క్రీనీడల మాటు
కావ్యభాషను కలిసి నేర్చుకుంటున్న కనుపాప రెప్పలం
తొలిసారి మంచుబిందువు స్పర్శకి తడవబోతున్న పువ్వులం

అసలు వర్షం కోసం ఎదురుచూపులు మనకెందుకు
వలపుజల్లు పులకింతల్లో మనకి ఏకాంతం కానుకవుతున్నప్పుడు 😌💜


//కురవని వర్షం//


నీ లోలోపల నేనాలపించే సన్నాయిరాగాన్ని

నిశ్శబ్దంగా వింటూనే కరగనట్టుంటావు

ఓ ఇష్టంగా నన్ను దాచుకుంటూనే

కురవని వర్షంలా మెదలకుంటావు

ఎప్పుడూ సుషుప్తిలోనే నువ్వుంటూ

నేనేదో కలలు కంటానంటావు

కదలికలన్నీ కవితలుగా రాస్తేనేమో

కంగారుగా కలవరపడతావు

కనురెప్పలార్చి ఏం తెలీనట్టు చూడకలా

కెరటంలా మారి కప్పేస్తానలా..😊💜

//నిజమేగా//

దూరముంటూ చేరువైన మనసులు

వలపును బహుమతిగా ఇచ్చిపుచ్చుకున్న రాగాలు

తలపులను కలబోసుకొనే ఇన్నిన్ని మాటలు

ఆరని రెప్పలకు చిక్కుకున్న అపురూప భాష్పాలు

నీ చూపుని కౌగిలించినంతసేపూ

నా పెదవులు నవ్వుతుంటాయి

దోబూచులాడుతున్న కాలపు కదలికలతో

మన కలలు ఏకమవుతాయి

నిదురంటూ రాని ఆకాశంలా నువ్వూనేనూ

ఋతువులెన్ని కరుగుతున్నా మనమొకటే అయినట్టు

ఒకరికొకరం క్రీనీడలైన కాగితాన

కవిత్వమై కలుసున్నది నిజమేగా

రసధునిలా నా ఇష్టములో నువ్వు..

భావములో నీ భాగ్యముగా నేను..💕💜


//నీ తలపులు//


నీ తలపులు
ఏకాంత సరస్సులో ఎర్ర కలువలు పూయించగల కవనాలు
గోముగా పలికే అల్లరి పదాలు మృదువుగా మెదిలి
పూల సౌరభానికి పులకించి పాడే కోయిలపాటలు
కడలిలోని ముత్యాలు కిలకిలమని ప్రతిస్పందించి
ఇదంతా కల కాదంటూ పెదవులకు పాకే ఎదలోని చిరునవ్వులు

శీతల స్వర్గపు మలుపుల గుండా అలవోకన జారి
తమకంతో తడిగా నిలిచే నేత్రాంచలాల భాష్పాలు
నిశ్శబ్దపు రాపిడిలో సంగీతరవాన్ని పుట్టించి
అనుభూతుల కోలాహలాన్ని మేల్కొలుపు అనుభవాలు
ఈ క్షణాలందుకే నాకెంతో మురిపెమైనవి
నీ లాలిత్యపు కళ్ళతో నాలో జీవాన్ని నింపే రాత్రులవి..😌

 

//ఏమవుతానో తెలీదు..//


ఆ కన్నుల నవ్వుల్లోకి పూర్తిగా చూడకుండానే

తొలిచూపుల కలవరం రేగి గుండెల్లో చిత్రమైన నిశ్శబ్దం

ఎద కోలాహలమో ప్రశాంత పవనమై

తీయని నిస్త్రాణలోకి నెట్టినదీ హాయి సౌరభం

క్షణాలు అలలై కదులుతూ నీ తలపుల తీరాన్ని సంగమిస్తున్న వేళ

నా ఏకాంతమో అంతుపట్టని మహార్ణవం

ఎందుకలా నీ కళ్ళు..

కౌగిలి చాచి రమ్మన్నట్టు ఆ రెప్పలు

తదేకమై నన్ను తడుముతాయి

మనసుని జోకొట్టినట్టుంటూనే

మధువనంత పులకింతల పుప్పొళ్ళు జల్లే

చిలిపి కలువమొగ్గలై ముద్దుగుంటాయి

ఏమవుతానో తెలీదు..

తొంగిచూసిన ప్రతిసారీ..

ఏడురంగుల ఊయలేసి ఊపుతున్న పొత్తిళ్ళు నాకు గుర్తొస్తుంటే

పసిపాపనై మరో జన్మెత్తేందుకు కలవరిస్తాను..💕💜

 

//మనస్సమర్పణ//

పులకరించడం తెలిసిన రాత్రికి
తారలతో నిండి ఉండటమో అతిశయమైతే
అంతరంగపు మధువును
నీకు రుచి చూపిన నా అందానికేం తక్కువ

వెన్నెల పుప్పొడి రాలుతూ చేస్తున్న
సజల హృదయ సవ్వడికి
మనసు మోదుగుపూల బుట్టల్లో జారిందంటే
మౌనవాసాన్ని వీడిన నీ నవ్వులకర్ధమేంటో


నా ఒడి నీ ప్రపంచమైన చిలిపికలలో
సప్తస్వరాలు ఏకంచేసి నే పాడుకున్న కృతి
మనస్సమర్పణకు మారుగా నీకిచ్చుకున్నా..

ఆపై...

చూపులతో లాలించడం తెలిసిన నీ కన్నులు
అటుఇటూ తప్పించుకోని విధంగా పెనవేసాక
ఈ అనుభూతి శాశ్వతం కావాలని కోరుకున్నా..💕💜


//స్వప్న వాక్యం//


స్వప్నంలో మొలకెత్తిన వాక్యాలు
ఉదయానికి అనుభూతి పూలు పూయించినట్లు
నే తొలిపొద్దు చుక్కలనే ఇష్టపడతాను.

కన్నులు మాట్లాడుతాయని అంతా అంటుంటే విని
ఈ మెరిసే దారుల్లో నీ కోసం వేచి
కొన్ని తీపి కవితలు రుచి చూడాలనుకున్నాను

సుకుమారంగా కదిలే నా ఊపిరి
ఆపాదమస్తకాన్ని తొణికించిందంటే
నీపై బెంగతో ఎగిసి పడుతుందనుకున్నాను

సందేశాలు మోస్తున్న మబ్బుల హుషారుకేమో
నిశ్శబ్దంగా నవ్వుతున్న ఆకాశం
కాసేపట్లో పూలవాన కురిపించేట్టుంది కదాని సరిపెట్టేసుకున్నా ను..💕💜

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *