కారు చీకట్లను కత్తిరించాలనేం అనుకోలేదు
తోయంపుగాలి భావావేశపు
గిలిగింతలతో మదిని తాకినప్పుడు
వేడెక్కిన ఊహలు దృశ్యాలుగా సాక్షాత్కరిస్తాయని అనుకోలేదు..
ఏకాంతమనే తపస్సులో మనసు
విలీనమవుతున్న క్షణం
రంగులద్దుకున్న కల కన్నులను పలకరించింది
భావనాకాశంలో ఆత్మావలోకనమే అయ్యిందో
అంతరంగములో సంగీతమే విరిసిందో
మిరుమిట్లు గొలుపు వెలుగొకటి పడగలెత్తింది
ఇప్పుడిక రెప్పలమాటు నిశీధి కోరల్లో
కలకలాలేమీ లేవు
పుప్పొళ్ళ పరిమళాలన్నీ పెదవులద్దుకున్నాక
రాత్రి తెల్లవారకున్నా బాగుండనే అనిపిస్తుంది
రెక్కలు విప్పుకున్న భావాలను స్నేహిస్తూనే ఉండాలనిపిస్తుంది..!!
No comments:
Post a Comment