ఆకులు రాలిన కాలమయ్యాక
ప్రకృతికి వసంతమో పునర్జన్మ
కాసిని కన్నీళ్ళతో
కష్టాలకు నీళ్ళొదిలేసాక
పెదవులను వీడి పరారైన చిరునవ్వు
వెనుదిరిగి బుగ్గలు పుణికింది
మనసుపాడే మరుగీతికి అక్షరాలనందించి
స్వరకల్పన చేసిన రీతిన
కాటుక కన్నులకు కలలు పూచే రేయిగా
మదిలో చిరుకవిత పల్లవించింది..
మాటలవసరం లేని కొన్ని భావాలు
మౌనరహస్యమేదో చెవిలో ఊది
జీవితపు పరిమళాన్ని పీల్చుకోమన్నాయి
అడుగుల్లేని దారిలో దూరాలు కొలిచే
ఏకాకితనమొకటి
నిశ్శబ్ద బంధురమై ఎగిరిపోయాక
మనసాకాశంలో హరివిల్లు దిద్దుకోవడం
చేతిలో పనయ్యింది..
రంగుపిట్టల సంగీతంలో
సాహిత్యపు మధురిమను మిళితం చేసి
పునర్జన్మెత్తిన వేకువనై ఉదయించానప్పుడే..

No comments:
Post a Comment