బంగారూ..
నే నవ్వితే నవరత్నాలేనోయ్..
పెదవుల్లో జారు ముత్యాలసరాలు
నక్షత్రాల జల్లై రేయిని వెలిగించాక
కెంపుల పెదవులు అరవంకీలు తిరిగి
నెలవంకను సవాలు చేసాక
వజ్రమంటి నా కంటి చూపుకి
నీ హృదయానికి కోతలు తప్పవుగా
పచ్చపూసల సౌందర్యంతో
ఆ నవ్వుకి కాంతులు దిద్దాక
పుష్యరాగమంటి భావాలు
నీ కవితకు నేనిచ్చే మకుటాలేగా
ఇంద్రనీలమంటి స్వప్నాల లోగిళ్ళలో
ఏకాంత మౌనాల నీరాజనాలిచ్చాక
పగడమంటి కుంకుమ బొట్టుతో
గోమేధికమంటి మిసిమి చాయతో
నీ వేకువకు వెన్నెల నేనేగా
పొగడపువ్వుల పరిమళంలా
మువ్వలగజ్జెల గలగల రవములా
మింటిమెరుపుల ఆనంద కేళిలా
పూలతీగల ఒయ్యారములా
రంగురంగుల సీతాకోకలా
మధురక్షణాల కౌగిలింతలా
నవ్వనా నేనిలా..
చైత్రమాసపు తొలి కోయిలై కిలకిలా..

No comments:
Post a Comment