కాలానికున్న తొందర మరోసారి నిరూపించుకుంది
కలిసున్నప్పుడు చల్లగా సాగినా
విడిపోయేప్పుడు వేడి నిట్టూర్పులను బదులిస్తుంది
స్వప్నించని మధురిమలెన్నో వాస్తవంలో ఎదురైనా
ఇప్పుడిక నిద్దురనే కలగనాల్సి ఉందేమో
అన్వేషించని గమ్యమో శూన్యమై ఎదురైనట్లు
హృదయమలా కుదించుకుపోతుంది
పందిరిమల్లెలకే పరాకైన భావనలో
పేరుకుపోయిన మొన్నటి సువాసనలు
తొణికితే చురకలై మండిస్తాయేమో
అయినా తప్పదు..
చీకటికి దడిచి భయపడేకన్నా
వేకువొస్తుందని ఎదురుచూడటమే చేయవలసిన పని
అనంతమైన ఆకాశం నీడ గొడుగు పట్టిందనే ప్రీతి
ఎల్లలు దాటి మరోసారి కలుద్దామనే రీతి..!
No comments:
Post a Comment