నిజమనిపిస్తున్న కలను
కౌగిలించిన ప్రతిసారీ
వశీకరించిన అనుభూతుల మడువులో
కరిగిపోతున్న క్షణాలను
కాసేపు ఆగమని బ్రతిమాలాలనిపిస్తుంది
విషాదం నిండిన జీవితానికి
కాసిని రంగులద్దే స్వప్నాలంటే మక్కువెక్కువే మరి
రెక్కలు విప్పుకున్న ఆశల కలువలు
పరిమళించే కాసేపూ
మధురిమల వీచికలే నిశీధి ఒంటరితనానికి
అవ్యక్త దరహాసపు మలయసమీరానికి
కాసిని కన్నీటి చినుకులు ఆనందభాష్పాలుగా రాలే రాతిరిలో
మనసంతా వెన్నెల మరకలు
మౌనానికి మాటలొచ్చే మనోమయలోకంలో
శూన్యానికిప్పుడు చోటేది
వసంతంలో స్నానమాడిన ఊహాలోకపు సరిహద్దుల్లో
నులివెచ్చని ఉచ్ఛ్వాసనిశ్వాసలు సైతం కవితలే
నీలి కన్నుల సౌందర్యమంతా ప్రేమైక ఇంద్రజాలమే..!!
No comments:
Post a Comment