ప్రయత్నించలేదేనాడూ
ఒక ప్రశాంతతను హృదిలో కనుగొనాలని
నిశ్శబ్దానికో సవ్వడుంటుందని
అదో తన్మయత్వపు తీరాలను చేర్చుతుందని
అపరిచితమైన ఓ అజ్ఞాత సౌందర్యాన్ని
భరించలేని ఆనందాన్ని
విశ్వసంగీతాన్ని
విచ్చుకున్న ఏకాంతంలో
కృష్ణపక్షపు తాదాత్మ్యాన్ని
హత్తుకోగలిగే సౌకుమార్యం
పుప్పొడి నెత్తావులను పూసుకున్న లావణ్యం
నిశ్శబ్దపు కౌగిలిలో ఆస్వాదించడమో అలౌకికం
కన్నుల్లోని కలలకు రెప్పలసవ్వడి తెలుసనుకున్నా ఇన్నాళ్ళూ
మౌనాన్ని ఆలకించే నయనాలకు
నిశ్శబ్దరాగాలను అవలోకించడం నేర్పుతున్నా ఈనాడు..

No comments:
Post a Comment