ఉరుకులపరుగుల జీవనగతిలో
ఆలోచనలకు చోటులేని యాంత్రికతలో
పువ్వుల బాషను మరచి..పున్నమి నవ్వులను విడిచి
యుగాల ప్రేమను వదిలి..అనివార్య సంఘర్షణల ఒంటరితనంలో
గమ్యం మరచిన అడుగులతో
చలించని జడచేతనవై నువ్వక్కడ
నీ తలపుల కుండపోతతో నిద్దురలేని రాత్రులలో
కరిగిన కాటుక కన్నుల తడి చూపులతో
అవ్యక్తరాగాల వియోగపు ఊపిరి మునకల్లో
కదలని కాలాన్ని బ్రతిమాలుతూ
నల్లని అక్షరాలతో ప్రేమను రాసుకుంటూ
తీపి జ్ఞాపకాల తేనెవెక్కిళ్ళతో నేనిక్కడ
అమృతం కురుస్తున్న అనుభూతులే అన్నీ
సౌరభం కొరవడిన జీవన పయనంలో
నింగినీ నేలనూ కలిపేందుకూ వానొస్తుంది..
మరి..నిన్నూ నన్నూ కలిపేందుకు ఏ అద్భుతం జరగాలో..

No comments:
Post a Comment