నిట్టూర్పులకు కొదవలేని
నిశ్శబ్ద సమాధిలో
గొంతెత్తి పాడాలనుకున్న పాటలేవీ
పెదవంచు దాటి బయటకు రాలేదు
కొన్ని జ్ఞాపకాల కుదుపులకు
అస్తవ్యస్తమైన అంతరంగానికి
అశాంతిని ధరించడం
ఇప్పుడో కొత్త విషయం కానే కాదన్నట్లుంది
ఎప్పుడూ దూరంగానే ఉంటున్న వసంతం
సరిహద్దు దాటి రమ్మని
చేయి చాచడం నిజమని నమ్మలేకపోతున్నా..
క్షణాల నూలు పోగులు
వడివడిగా కదిలి విడిపోతుంటే
ఇంద్రధనస్సు కావ్యాలింకెక్కడివి
ఒంటరి తరువుగా నిలబడ్డవేళ
నిద్దుర రాని చీకటి రాతిరి
నేత్రాంచలాల నిలబడ్డ భాష్పాలనడగాలి
మౌనాన్ని మోసుకు తిరిగే మబ్బులకైనా
విశ్రాంతి దొరుకుతుందేమో గానీ
అంతరాత్మ వీధుల్లో తిరిగే
ఆలోచనకు విరామమెందుకు లేదోనని
వేకువకు తొందర లేదంటున్న మనసుపొరల తవ్వకాల్లో
ఇంకెన్ని స్మృతుల సునామీలు ముందున్నాయో మరి..

No comments:
Post a Comment