ఏమైంది నా మనసుకి...
ఉదయం నుండి మబ్బుపట్టిన ఆకాశంలా స్తబ్దుగా ఉన్న నామనసు
ఒక్కసారిగా చైతన్యవంతమైంది ఎందుకూ...?
ముసిరిన మేఘాలు, కురిసే చినుకులతో విసుగెత్తిస్తున్న వాతావరణం
ఒక్కసారిగా ఆగిపోయి, చీకట్లను చీల్చుకుంటూ ఒక వెచ్చని ఎండ పొర ప్రకాశించినట్లు..
చికాకుగా, గజిబిజిగా ఉన్న నా అంతరంగంలోకి ఒక వెలుగు రేఖ ప్రసరించి హృదయమంతా దేదీప్యమైంది ఎందుకూ...
నిండుగా, నిశ్చలంగా ఉన్న నదిలో ఒక్కసారిగా ప్రవాహం మొదలైనట్లు...
గంభీరంగా ఉన్న నా మదిలో ఏదో తెలీని ఆనందం ఒక కెరటంలా ఎగసిందెందుకూ...
ఆషాడమాసమంటి నా మనసు ఋతువులో
హఠాత్తుగా శ్రావణ జల్లేదో కురిసినట్లు కొన్ని మైమరపులెందుకూ
కలలోనే అనుభవించిన సంతోషం
వెన్నెలగా మారి నా నవ్వుల్లో నాదమై మౌనాన్ని తరిమిందెందుకూ..
ఓహ్....
ఇప్పుడు తెలిసిందిలే....
నా మదిలో మెదిలిన నీ తలంపు మహిమే కదా ..........ఈ గమ్మత్తు..

No comments:
Post a Comment