ఏదో రాయమంటావని
నేననుకోలా
నీ తలపులు గువ్వలై
కలం పట్టే సమయమైందని
వేకువనే రొదపెడుతుంటే
పదాలు పేర్చుకుంటూనే మనసుండిపోయిందలా..
కొత్తగా నిన్నావిష్కరించేందుకు
హృదయస్పందన ఆలకిస్తూ
మౌనంతోనూ మాట్లాడగలిగే నిన్ను
అక్షరంలోనికి అనువదించాలంటే
నాకున్న భావాలు సరిపోవనిపించగానే
వాస్తవం వెక్కిరించినట్లయ్యి
వాక్యాలు వెనుదిరిగి
ఒంటరిగా నన్నొదిలి నవ్వుకున్నాయి..
మాటలు పొడిపొడిగా మారిపోయాక
వాక్యాన్ని సరిచేయాలని కలమందుకోగానే
నెమరేసుకున్న స్మృతులు
కలబోసుకున్న కబుర్లు
మౌనానికి కట్టిన మబ్బు తెరలై..
నిశ్శబ్దాన్ని ఆవరించాయి..
ఇప్పుడు కాలాతీతమైన కధానికేదైనా సృష్టించాలి..
నిన్ను సంతోషపెట్టేందుకై..
నాలుగు మాటలను ఉలితో చెక్కి
నాపై నువ్వుంచిన నమ్మకాన్ని నీ మునివేళ్ళతో అల్లుకోవాలంటే..!!
No comments:
Post a Comment