Monday, 6 June 2016

//ప్రేమంటే..//



మనసు ముత్యమవుతోంది వింతగా
నీ జ్ఞాపకాల ఆల్చిప్పల్లో జారిపడ్డప్పుడల్లా
రెప్పలు మూస్తే కన్నులను ముద్దాడినంత మెత్తగా నీ స్మృతులు
వెచ్చని మాధుర్యంతో మనసల్లుకుంటూ
ఎక్కడ ఎప్పుడు ఎలా పరిచయమో గుర్తైతే లేదు
ఎదురైతే నీ చూపుల్లో నెమలీకల కాంతులు తప్ప
పదేపదే నా మోముపై వాలే ముంగురులు సవరించే నీ చేతులు
నా కాటుకలు దాటి స్వప్నాలను పలుకరించే నీ చూపులు
నా నుండీ కొత్త పువ్వుల పరిమళమేదో అందుకున్నట్లుండే నీ నవ్వులు
దేహపు సరిహద్దులు దాటి హృదయంలోనికి దూసుకుపోయే నీ పలుకులు
దూరంగా ఉంటూనే నన్ను నియంత్రించే నీ కదలికలు
వెన్నెల్లో నక్షత్రాలు కలిసినంతగా నాలో నువ్వు కలిసినట్లయ్యాక..
ఆలోచించేదేముందిక
ప్రేమంటే అభిప్రాయాలు కలవడం కాదని..
మనసులు కలవడమని తెలుసుకున్నాక..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *