ఎటుచూసినా అందమే..
వెన్నెల కురిసినా అందమే..ముత్యాల మాలికలూ అందమే
నీలిమేఘాలు,నల్లకలువలూ..పూల
కదిలే అలలూ, కన్నుల కలలూ, శ్రామిక సౌందర్యం, చిందిన స్వేదం..
నల్లని కోమలాంగీ, పచ్చని మదనిక..ఆటవెలదీ, తేటగీతి
జానపదము, యుగళగీతము..నల్లని కోయిల, పంచవన్నెల చిలుక
చిరుగాలి సవ్వడి, చిగురాకుల సోయగం..పసితనమూ, అమ్మతనమూ
మోహనరాగమూ, కదనకుతూహలమూ..పచ్చని చెక్కిళ్ళు, ఎర్రని దరహాసమూ..
ప్రతీదీ అందమే..అన్నిట్లో అందమే..
అందాన్ని అంతగా ఆరాథించిందనేమో..ఆమే అందమయ్యింది..
ఆనందమై ఒదిగిపోయింది..మనసందం కన్నుల్లో దివ్వెలా వెలిగింది..
అరె..అదెలా..
ఎన్ని అనర్ధాలు అందానికి..
పచ్చని చెట్టుపైనేగా దృష్టి కళ్ళన్నీ, పసిడిమోముపైనేగా ఆంక్షల ముళ్ళన్నీ..
అరంగుళం పెదవిసాగి నవ్వకూడదట..కాటుక కళ్ళు ఊసులసలే ఆడకూడదట..
గొంతులో గమకాలు మనసులో నోక్కేయాలట..
ఎదలో మయూరం దిగులుమేఘం చాటవ్వాలట..
అమెలోని స్త్రీత్వాన్ని వేరెవ్వరూ గుర్తించకూడదట..
ఆమె ఒక తండ్రికి బిడ్డ, భర్తకు భార్య, బిడ్డకు తల్లి..అంతే..
వేరే అస్తిత్వం కూడదట..ప్రత్యేకమైన ఆదర్శాలు కూడదట..
అమాయక సగటు స్త్రీలా ఒద్దికగా ఉంటే చాలునట..
అతనిలో సగమైనా పాదాల చెంతే ఉండాలట
పుట్టింటి గౌరవం, అత్తింటి మన్నన పెంచాలట..
ఉంది అలాగే..
కొన్నాళ్ళకి..
మాటలనే ఛర్నాకోలు చేసి ఝుళిపిస్తూ కొందరు..
కసిదీరా కళ్ళలో కన్నీటిచెలమను తవ్వుతూ కొందరు..
ఆశలరెక్కలను నిర్దయగా కత్తిరిస్తూ కొందరు..
మనసందం చూడకనే మసిపూస్తూ కొందరు..
గాజులు తొడిగిన చేతులేనట అవి..సంకుచిత్వపు సంకెళ్ళతో బందిస్తూ ఆమెను..
ఆడవారికి మగవారు శత్రువనుకున్నా..ఆడవారు కూడా శత్రువని తెలిసింది..
వరమేదీ అందానికి..శాపాలే తప్ప
విలువేముంది అపభ్రంశపు లోకంలో అందానికి..
ఆక్రోశమే తప్ప చోటెక్కడుందని ఆనందానికి ..!!
No comments:
Post a Comment