అదేమో అలవాటుగా మరినట్లుంది మనసుకి
పదేపదే నువ్వే కావాలని మారాం చేయడం
మౌనవించినట్లు పైకి నటిస్తున్నా
హృదయం సాంతం కంపిస్తూనే ఉంది
నువ్వెంత దూరంగా మసులుతూన్నా
నీ ఊపిరి సవ్వడి వినబడుతూనే ఉంది
నీ ఆలోచనల్లో నేనష్పష్టమైనా
నా అవ్యక్తంలో ప్రధమానుభూతి నీదవుతోంది
ఉదయాన్నే అరవిరిసిన కన్నుల్లో వికసించే నీ రూపం
నడిరేయి నిద్దురలోనూ నడియాడుతుంటే
నీ పరామర్శకే నే వివశమవుతూ..
పద్మగంధంతో పరిమళిస్తున్నా
రాజహంసల గుంపు రవమువలె నీ పలుకు గుసగుసల పులకరింతకే
తనువంతా చెవులు చేసి కాచుకుంటున్నా
నా విరహాన్ని ఆశాబంధమనే మాలకట్టి..
కరాలతో నిన్నలుకొనే క్షణాలకై వేచిచూస్తున్నా..!!
No comments:
Post a Comment