రాధిక రాదిక
కృష్ణయ్యా..నీవు వేణుగానమాలపించనంటే..
కన్నయ్యా..నీవు ప్రియమార నన్ను పాడనంటే
మధురానుభూతులు మనోనేత్రంలో ఊగిసలాడ నా విరహం అవధులు దాటుతోంది
కొసరికొసరి ముద్దాడే నీ అధరామృతం కరువై ప్రాణం వీగిపోతుంది
మన్మధుడు వేసే ప్రతిబాణం గురితప్పక గుచ్చి ప్రతీక్షణం కలవరమిస్తుంది
కలువకాడలెన్ని కప్పుకున్నా ఓపలేని తనువు నిట్టూర్పు సెగలను రేపుతున్నది
వసంతకాలమైనా గ్రీష్మాన్ని తలపిస్తూ ఊపిరి బిగుసుకుంటుంది
ఎంత పన్నీరు చల్లుకున్నా..ఎన్ని గంధాలు పులుముకున్నా తాపమే
ముత్యాలూ మల్లెలు సైతం తీర్చలేని భారమే
చంద్రుని వెన్నెలలోనూ నాకు నిత్యజాగరణ తపమయ్యింది
నిజమే కృష్ణయ్యా..
నా వివశం నిన్ను చేరలేదంటే
నీ రాధనే నువ్వు ఒడి చేర్చకుంటే
నా ప్రాణం నిలువడమింక కష్టసాధ్యమే..
మరో వసంతాన్ని నేను చవిచూడటం కల్లనే..!!
No comments:
Post a Comment