Monday, 6 June 2016

//సవ్వడి మరచిన మువ్వలు//




కుసుమపరాగాల మన ప్రేమ..
గాలితెరలలో కమ్మగా ఊయలూగినట్లు
ఉచ్ఛ్వాసనిశ్వాసల్లోని గమకాలకి తలూపుతున్నది..

సప్తవర్ణాల పువ్వులశరాలతో నీ చూపు ఎక్కుపెట్టగానే
సిగ్గుతో వాలిన కాటుక చివరి నా కొనచూపు
సప్తస్వర సమ్మేళనమై నిన్నల్లుకుంది

ముద్దమందారాలైన చెక్కిళ్ళు
మన మధురోహలన్నీ నిజమైనవని చెప్పి
నువ్వు చేసిన సంతకాన్ని తడిమిచూసుకోమనగా..
కాలం మత్తుగా కరిగిపోతుంటే
నీ భావాల కొసలకి వేళ్ళాడుతున్న హృదయం
అధరాలపై తేనెలూరించింది

ఏన్నో కావ్యాలకు ఆజ్యం పోసే నీ మౌనంలో
నులివెచ్చని గుసగుసలను ఆలకిస్తూ
మత్తెక్కించిన నీ పరిమళానికో
హరివిల్లై నింకెగిసిన హృదయభావనకో..
వసంతగీతికై వినిపించిన సంతోషానికో..
సవ్వడి మరచిన నా మువ్వలు..
ఊహల వాకిట్లో నిలబడిపోతుంటే నేనేం చేయను..!!
 

1 comment:

  1. రాధికా మ్యామ్ ఈరొజు నేను బ్లాగు చుసాను చాల అద్భుతంగా ఉన్నాయి అండి మీ పోస్టులు

    నేను ఈ పోస్టు మీ పేరు మెన్షన్ చేసి తీసుకుంటున్న

    ReplyDelete

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *