ఆకలిరాజ్యాల వెంట తిరిగి
తాను రాయలేని ఆక్రందనలకు విస్తుపోయిందో..
ఓటమిలాంటి జీవితాన్ని
గెలుపు వైపు మళ్ళించలేక నీరసించిందో
ఎందరి బ్రతుకు పుటల్ని తరచి చూచి
తర్జుమా చేయలేక అలసిపోయిందో
సాలభంజికల సంకేతాల
సమస్యల సుడిగుండాలలో ఉక్కిరిబిక్కిరయ్యిందో..
వెలలేని విషాదాశ్రువులను వర్ణించలేక
నిర్వేదంలో విశ్రమించిందో..
అక్షరాలను ఆరాతీసేందుకు ఆరాటపడే కలం
నిస్సహాయతను రాయలేనంటూ నేడు..
పునరాలోచనలేని మనోవ్యధకో ముగింపునివ్వలేక
నిశ్శబ్దాన్ని మూటగట్టుకు నిద్రపోతూ
బ్రతుకు రచనగా మార్చుకున్న భావాలన్నీ
ఒక్కోటీ తరలిపోతుంటే
చిరునవ్వుల పుప్పొడి మిగల్లేదంటూ
నిస్పృహలో జారిపోయిందో..!!
No comments:
Post a Comment