ఎన్ని ఆనందభాష్పాలో హృదయానికి..తన మౌనంలోనికి నువ్వొచ్చాక
ఇన్నాళ్ళూ మరణించాలనే కోరికే బలీయమై నాలో ఉందనుకున్నా
నీ రాకతో కొత్త మలుపొకటి జీవితం తీసుకున్నాక
నీ సమక్షంలో కాలమలా కర్పూరమై కరిగిపోతుంటే
అంతకుముందూ..ఆ తరువాతగా విభజించుకున్నా రోజులన్నీ.
నిశ్శబ్దరాగాలకు జీవమొచ్చి రవళించిన రహస్యమొకటి
హృదయాంతరాళలో పరవశించి పల్లవించగా
కాలాతీతమైన గ్రీష్మంలోనూ చిగురించా
యుగయుగాలుగా మది ఆలపిస్తున్న యుగళగీతంలో
అనురాగపు జంటస్వరం నీదేనని కనుగొన్నా
నీ తలపుల పరిష్వంగంలో పొదుగుకున్న స్వప్న్నాలన్నీ
నా అరచేతిలో అక్షర నిక్షేపాలుగా మలచుకున్నా
ఇప్పుడిక ఎగిరే గువ్వలను చూసి అసూయ పడటం మానేసా
విశ్వాంతరాలలో నువ్వేమూలనున్నా నా మనసు నిన్ను చేరుకోగలదని..!!
No comments:
Post a Comment