ఎన్ని వెన్నెలరాత్రులు నీతో గ(న)డిచినా..
ఇంకా తనివి తీరనే లేదంటావ్
గమ్యమే తెలియని పయనమని తెలిసినా
నాకూ నీ చేయి మాత్రం వీడువాలనిపించదు
నిన్నటిదాకా మాటలే రానన్న నువ్వే
నాదో అందమో ఆకర్షణో తెలియట్లేదంటుంటే
కాలనిక్కూడా తొందరెక్కువేనని తెలిసింది
నిన్నూ నన్నూ కలిపి కూడా తెగ ఉరకలేస్తుంటే
నీ మాటల మైమరపు నా కన్నుల్లో
నా చూపుల కొసమెరుపు నీ హృదయంలో
సరి తూగిందనే అనుకుంటున్నా మరి
సూర్యుడు పడమరకి పరుగెడుతున్నా
పూర్ణమయ్యేందుకు రేరాజు త్వరపడుతున్నా
నాకు మాత్రం దూరం జరగాలనే అనిపించలేదు..
గుప్పిట్లో చిక్కిన నీ అరచేతిని వీడి
ఈ రాత్రికిక నిద్దుర మాటెక్కడిదిలే
నీతో కలిసి పల్లవించిన పెదవులను తడుపుకుంటూ
మనసాకాశంలో వెలిగే చుక్కలను లెక్కపెట్టుకుంటూ
జాగారమేగా నేను చేయగలిగింది..!!
No comments:
Post a Comment