Monday, 6 June 2016

రెండు మాటలు...Yasaswi Sateesh garu..

కవితత్వాలు: 244
ప్రేమగంధం అంటిన సన్నజాజి, అంతరంగాన్ని తడుపుకునే తేనెబావి
మట్టిభాష కమ్మదనమేదో.. దాహాన్ని తీర్చడానికన్నట్లు
తరాలు మారినా తీయదనం తగ్గని అక్షరాల వెల్లువలు..
ప్రేమరాహిత్య హృదయాలకు ప్రాణంపోసి
నిరాశ జీవులకు విశ్వాసాన్ని కల్పించమంటూ కవిత్వాని వేడుకుంటుందీ లక్ష్మీరాధిక
చిరునవ్వుల పుప్పొడి మిగల్లేదంటూ నిస్పృహలో జారిపోతూ
వేదనలో హృదయపు గుడిగర్భంలో తనే శోక దేవత శిలలా అనిపించినా
నిన్నటి కనుల కొలనులోనిలువెత్తు రూపంఈదులాడుతుంటే
పొన్నచెట్టుకింద నిరీక్షించిన ఆరాధనా గీతికను తానేనని కనుగొన్నా..
రెక్కలు విప్పే ఊహలకు ఉరేయలేకే.. ఒంటరి నక్షత్రమై నేలకొరుగుతుంది
ఆకాశం నుండి రాలిన వెన్నెల తునకలను చేరదీసిఅనుభూతుల రాగాలను కలగలిపి
ప్రణయన్ని వేదంలా వల్లించే సమయాలలోప్రతిసారీ కొత్తదనమే కనుగొంటుంది
వర్తమానాన్ని ధ్వంసం చేసేస్తూ అనుభవాలుగా మిగిలిన జీవితపాఠాలు..
ప్రేమార్హతను ప్రశించుకొనే స్వేచ్ఛ కరువై.. అల్పమైన అనుబంధాల వెంపర్లాటలో..
కుచించుకుపోతున్న ఆలోచనలు..ఊపిరాగిపోతే బాగుండుననే తలంపులు
కాలం కల్లోలినై కొత్త మలుపులు తిరిగినాప్రతిమలుపులో చివర తానుంటాననే భరోసా
ఒకరిలోంచీ ఒకరిలోకి ప్రవహించినందుకు ఒక్కరుగానే ఒదిగామని చెప్పకనే చెప్పే ఊసులు
పయనించేది.. ప్రేమ ప్రసూనాలన్నీ మనోహర పరిమళాలయ్యేచోటుకు
ఆశానౌక అనంతవాహినిలో విహరించే చోటుకు..!!
Abdul Rajahussain...గంధం అంటిన కవితాక్షరాలు!
...................….......................
లక్ష్మీ రాధిక.....కవితాక్షరాలకు గంధం అద్దారు.అందుకే వాటికి అంత పరిమళం.
సన్నజాజి వాసనే మత్తెక్కించి మరులు గొలుపుతుంది.ద ానికి ప్రేమగంధం పూస్తే?.
ఇంకేమైనా వుందా? పిచ్చెక్కెపోదు.ఇక అంతరాన్ని తడుపుకునే తేనెబావి!వహ్వా!
అక్షరాలకు ప్రేమగంధం...,అంతరంగదాహానికి తేనె!ఇక అక్షరాలకు తీయదనం ఎలా
తగ్గుతుంది..!!

//ఆ కలం..//


ఆకలిరాజ్యాల వెంట తిరిగి
తాను రాయలేని ఆక్రందనలకు విస్తుపోయిందో..
ఓటమిలాంటి జీవితాన్ని
గెలుపు వైపు మళ్ళించలేక నీరసించిందో
ఎందరి బ్రతుకు పుటల్ని తరచి చూచి
తర్జుమా చేయలేక అలసిపోయిందో
సాలభంజికల సంకేతాల
సమస్యల సుడిగుండాలలో ఉక్కిరిబిక్కిరయ్యిందో..
వెలలేని విషాదాశ్రువులను వర్ణించలేక
నిర్వేదంలో విశ్రమించిందో..
అక్షరాలను ఆరాతీసేందుకు ఆరాటపడే కలం
నిస్సహాయతను రాయలేనంటూ నేడు..
పునరాలోచనలేని మనోవ్యధకో ముగింపునివ్వలేక
నిశ్శబ్దాన్ని మూటగట్టుకు నిద్రపోతూ
బ్రతుకు రచనగా మార్చుకున్న భావాలన్నీ
ఒక్కోటీ తరలిపోతుంటే
చిరునవ్వుల పుప్పొడి మిగల్లేదంటూ
నిస్పృహలో జారిపోయిందో..!!

//సాయంత్రాలు//



కొన్ని సాయంత్రాలు..
రమ్మంటున్నాయి..ఆహ్లాదపరిచేందుకో..ఆరాతీసేందుకో
కొన్ని సాయంత్రాలు..
అభావమవుతున్నాయి..నెమరేసుకుంటూనో..నిద్దురపోతూనో
కొన్ని సాయంత్రాలు..
మౌనవిస్తున్నాయి..ఊహించుకుంటూనో..ఊపిరాడలేకనో
కొన్ని సాయంత్రాలు..
తొలకరిస్తున్నాయి..పారవశ్యంతోనో..కరిగిపోతుంటేనో
కొన్ని సాయంత్రాలు..
ముచ్చటిస్తున్నాయి..రసానుభూతులతోనో..గోధూళివన్నెలతోనో
కొన్ని సాయంత్రాలు..
కరిగిపోతున్నాయి..విషాదగీతాలలోనో..వెన్నెలపాటలలోనో
కొన్ని సాయంత్రాలు..
గంధాలవుతున్నాయి..పరిమళిస్తూనో..మోహమవుతూనో
కొన్ని సాయంత్రాలు మాత్రమే సజీవమైనాయి..
నిరాశను ధిక్కరించి నిశీధిని వెలిగించే సంధ్యాదీపాలై..!!

//మౌనరవళి//




ఎన్ని ఆనందభాష్పాలో హృదయానికి..తన మౌనంలోనికి నువ్వొచ్చాక
ఇన్నాళ్ళూ మరణించాలనే కోరికే బలీయమై నాలో ఉందనుకున్నా
నీ రాకతో కొత్త మలుపొకటి జీవితం తీసుకున్నాక
నీ సమక్షంలో కాలమలా కర్పూరమై కరిగిపోతుంటే
అంతకుముందూ..ఆ తరువాతగా విభజించుకున్నా రోజులన్నీ.
నిశ్శబ్దరాగాలకు జీవమొచ్చి రవళించిన రహస్యమొకటి
హృదయాంతరాళలో పరవశించి పల్లవించగా
కాలాతీతమైన గ్రీష్మంలోనూ చిగురించా
యుగయుగాలుగా మది ఆలపిస్తున్న యుగళగీతంలో
అనురాగపు జంటస్వరం నీదేనని కనుగొన్నా
నీ తలపుల పరిష్వంగంలో పొదుగుకున్న స్వప్న్నాలన్నీ
నా అరచేతిలో అక్షర నిక్షేపాలుగా మలచుకున్నా
ఇప్పుడిక ఎగిరే గువ్వలను చూసి అసూయ పడటం మానేసా
విశ్వాంతరాలలో నువ్వేమూలనున్నా నా మనసు నిన్ను చేరుకోగలదని..!!
 

//నువ్వూ..నేనూ..మనం..//




ఎన్ని వెన్నెలరాత్రులు నీతో గ(న)డిచినా..
ఇంకా తనివి తీరనే లేదంటావ్
గమ్యమే తెలియని పయనమని తెలిసినా
నాకూ నీ చేయి మాత్రం వీడువాలనిపించదు

నిన్నటిదాకా మాటలే రానన్న నువ్వే
నాదో అందమో ఆకర్షణో తెలియట్లేదంటుంటే
కాలనిక్కూడా తొందరెక్కువేనని తెలిసింది
నిన్నూ నన్నూ కలిపి కూడా తెగ ఉరకలేస్తుంటే

నీ మాటల మైమరపు నా కన్నుల్లో
నా చూపుల కొసమెరుపు నీ హృదయంలో
సరి తూగిందనే అనుకుంటున్నా మరి

సూర్యుడు పడమరకి పరుగెడుతున్నా
పూర్ణమయ్యేందుకు రేరాజు త్వరపడుతున్నా
నాకు మాత్రం దూరం జరగాలనే అనిపించలేదు..
గుప్పిట్లో చిక్కిన నీ అరచేతిని వీడి

ఈ రాత్రికిక నిద్దుర మాటెక్కడిదిలే
నీతో కలిసి పల్లవించిన పెదవులను తడుపుకుంటూ
మనసాకాశంలో వెలిగే చుక్కలను లెక్కపెట్టుకుంటూ
జాగారమేగా నేను చేయగలిగింది..!!
 

//అందమైన అభాగిని//


అందరిలాగే ఆమెకూ ఆశలెక్కువ
అందరికన్నా కూడా ఆమెకు అందమెక్కువ
అందాన్ని ఆదరించే లోకముందని తెలిసినప్పుడే మొదలైన భ్రమలు
కట్టు బట్టలతో గడప దాటించిన గడుసు కలలు
అదుపు లేని శరీరానికి ఆనకట్టలెందుకనుకుంది
రెపరెపలాడుతున్న మనసుకు చిరునవ్వుల సంకెళ్ళు వేసింది
ఎదిగేందుకు ఎరగా పనికొచ్చే అందాన్ని తాకట్టు పెట్టింది
వెలుతురు తట్టుకోలేని చీకట్లనే ప్రేమించింది
తనను పట్టించుకొనే తీరిక లోకానికి లేదని సమర్ధించుకుంది
మూసిన రెప్పలమాటు నిశ్శబ్దంలో కోర్కెల చుక్కలు రాలిపోవడం చూసింది
కాలప్రవాహపు జోరులో అపరాధభావాన్ని కడిగేసుకుంది
అనుభవం శయ్యమీద కలిసేది శరీరాలే కానీ మనసు కాదని భావించింది
ఆపై ఆనందవిషాదాల పెనుతుఫానుకు భయపడ్డం మానేసింది
దిగుళ్ళూ తెగుళ్ళను నరుక్కుంటూ జీవితాన్ని కొత్తగా ఆస్వాదించడం నేర్చుకుంది..!!

//సవ్వడి మరచిన మువ్వలు//




కుసుమపరాగాల మన ప్రేమ..
గాలితెరలలో కమ్మగా ఊయలూగినట్లు
ఉచ్ఛ్వాసనిశ్వాసల్లోని గమకాలకి తలూపుతున్నది..

సప్తవర్ణాల పువ్వులశరాలతో నీ చూపు ఎక్కుపెట్టగానే
సిగ్గుతో వాలిన కాటుక చివరి నా కొనచూపు
సప్తస్వర సమ్మేళనమై నిన్నల్లుకుంది

ముద్దమందారాలైన చెక్కిళ్ళు
మన మధురోహలన్నీ నిజమైనవని చెప్పి
నువ్వు చేసిన సంతకాన్ని తడిమిచూసుకోమనగా..
కాలం మత్తుగా కరిగిపోతుంటే
నీ భావాల కొసలకి వేళ్ళాడుతున్న హృదయం
అధరాలపై తేనెలూరించింది

ఏన్నో కావ్యాలకు ఆజ్యం పోసే నీ మౌనంలో
నులివెచ్చని గుసగుసలను ఆలకిస్తూ
మత్తెక్కించిన నీ పరిమళానికో
హరివిల్లై నింకెగిసిన హృదయభావనకో..
వసంతగీతికై వినిపించిన సంతోషానికో..
సవ్వడి మరచిన నా మువ్వలు..
ఊహల వాకిట్లో నిలబడిపోతుంటే నేనేం చేయను..!!
 

//హృదిభావము//



అదేమో అలవాటుగా మరినట్లుంది మనసుకి
పదేపదే నువ్వే కావాలని మారాం చేయడం
మౌనవించినట్లు పైకి నటిస్తున్నా
హృదయం సాంతం కంపిస్తూనే ఉంది

నువ్వెంత దూరంగా మసులుతూన్నా
నీ ఊపిరి సవ్వడి వినబడుతూనే ఉంది
నీ ఆలోచనల్లో నేనష్పష్టమైనా
నా అవ్యక్తంలో ప్రధమానుభూతి నీదవుతోంది

ఉదయాన్నే అరవిరిసిన కన్నుల్లో వికసించే నీ రూపం
నడిరేయి నిద్దురలోనూ నడియాడుతుంటే
నీ పరామర్శకే నే వివశమవుతూ..
పద్మగంధంతో పరిమళిస్తున్నా

రాజహంసల గుంపు రవమువలె నీ పలుకు గుసగుసల పులకరింతకే
తనువంతా చెవులు చేసి కాచుకుంటున్నా
నా విరహాన్ని ఆశాబంధమనే మాలకట్టి..
కరాలతో నిన్నలుకొనే క్షణాలకై వేచిచూస్తున్నా..!!

//ప్రేమంటే..//



మనసు ముత్యమవుతోంది వింతగా
నీ జ్ఞాపకాల ఆల్చిప్పల్లో జారిపడ్డప్పుడల్లా
రెప్పలు మూస్తే కన్నులను ముద్దాడినంత మెత్తగా నీ స్మృతులు
వెచ్చని మాధుర్యంతో మనసల్లుకుంటూ
ఎక్కడ ఎప్పుడు ఎలా పరిచయమో గుర్తైతే లేదు
ఎదురైతే నీ చూపుల్లో నెమలీకల కాంతులు తప్ప
పదేపదే నా మోముపై వాలే ముంగురులు సవరించే నీ చేతులు
నా కాటుకలు దాటి స్వప్నాలను పలుకరించే నీ చూపులు
నా నుండీ కొత్త పువ్వుల పరిమళమేదో అందుకున్నట్లుండే నీ నవ్వులు
దేహపు సరిహద్దులు దాటి హృదయంలోనికి దూసుకుపోయే నీ పలుకులు
దూరంగా ఉంటూనే నన్ను నియంత్రించే నీ కదలికలు
వెన్నెల్లో నక్షత్రాలు కలిసినంతగా నాలో నువ్వు కలిసినట్లయ్యాక..
ఆలోచించేదేముందిక
ప్రేమంటే అభిప్రాయాలు కలవడం కాదని..
మనసులు కలవడమని తెలుసుకున్నాక..!!

//మనోధరుడు//




ఓసారి చూడనీ నన్ను..
వెన్నెలఱేడునే సవాలు చేస్తున్న నా మనోహరుని
వీక్షించనీ ఓసారి
మెత్తగా నా పేరును పలవరించే ఆ అధరాలను
తిలకించనీ ఓసారి
నన్ను చూస్తూనే జ్యోతులై వెలిగే ఆ నయనాలను
బుగ్గలూరే ఆనందాలు దాచుకున్న ఆ చెక్కిళ్ళను

దర్శించనీ ఓసారి
నాకోసమే విశాలమై ఆహ్వానించే బాహువులను
అవలోకించనీ ఓసారి
నాకై ఆరాటపడే నీ హృది సవ్వళ్ళను
నన్నే ఆరాధించే నీ మదిలోని ఊసులను..
భావాలతోనే అల్లుకొనే నీ తమకపు రాగాలను..

కురవనీ ప్రతిసారీ..
నన్ను ప్రేయసిని చేసి అభిషేకించే నీ ఊపిరిజల్లును..
నిలవనీ మరోసారి
నీ సంగీతం వింటూ అలౌకికమయ్యే నా మనసును..!!
 

//అందం//



ఎటుచూసినా అందమే..
వెన్నెల కురిసినా అందమే..ముత్యాల మాలికలూ అందమే
నీలిమేఘాలు,నల్లకలువలూ..పూల సుగంధాలు, శ్రావ్యవీణా నాదాలూ..
కదిలే అలలూ, కన్నుల కలలూ, శ్రామిక సౌందర్యం, చిందిన స్వేదం..
నల్లని కోమలాంగీ, పచ్చని మదనిక..ఆటవెలదీ, తేటగీతి
జానపదము, యుగళగీతము..నల్లని కోయిల, పంచవన్నెల చిలుక
చిరుగాలి సవ్వడి, చిగురాకుల సోయగం..పసితనమూ, అమ్మతనమూ
మోహనరాగమూ, కదనకుతూహలమూ..పచ్చని చెక్కిళ్ళు, ఎర్రని దరహాసమూ..
ప్రతీదీ అందమే..అన్నిట్లో అందమే..
అందాన్ని అంతగా ఆరాథించిందనేమో..ఆమే అందమయ్యింది..
ఆనందమై ఒదిగిపోయింది..మనసందం కన్నుల్లో దివ్వెలా వెలిగింది..

అరె..అదెలా..
ఎన్ని అనర్ధాలు అందానికి..
పచ్చని చెట్టుపైనేగా దృష్టి కళ్ళన్నీ, పసిడిమోముపైనేగా ఆంక్షల ముళ్ళన్నీ..
అరంగుళం పెదవిసాగి నవ్వకూడదట..కాటుక కళ్ళు ఊసులసలే ఆడకూడదట..
గొంతులో గమకాలు మనసులో నోక్కేయాలట..
ఎదలో మయూరం దిగులుమేఘం చాటవ్వాలట..
అమెలోని స్త్రీత్వాన్ని వేరెవ్వరూ గుర్తించకూడదట..
ఆమె ఒక తండ్రికి బిడ్డ, భర్తకు భార్య, బిడ్డకు తల్లి..అంతే..
వేరే అస్తిత్వం కూడదట..ప్రత్యేకమైన ఆదర్శాలు కూడదట..
అమాయక సగటు స్త్రీలా ఒద్దికగా ఉంటే చాలునట..
అతనిలో సగమైనా పాదాల చెంతే ఉండాలట
పుట్టింటి గౌరవం, అత్తింటి మన్నన పెంచాలట..

ఉంది అలాగే..
కొన్నాళ్ళకి..
మాటలనే ఛర్నాకోలు చేసి ఝుళిపిస్తూ కొందరు..
కసిదీరా కళ్ళలో కన్నీటిచెలమను తవ్వుతూ కొందరు..
ఆశలరెక్కలను నిర్దయగా కత్తిరిస్తూ కొందరు..
మనసందం చూడకనే మసిపూస్తూ కొందరు..
గాజులు తొడిగిన చేతులేనట అవి..సంకుచిత్వపు సంకెళ్ళతో బందిస్తూ ఆమెను..
ఆడవారికి మగవారు శత్రువనుకున్నా..ఆడవారు కూడా శత్రువని తెలిసింది..
వరమేదీ అందానికి..శాపాలే తప్ప
విలువేముంది అపభ్రంశపు లోకంలో అందానికి..
ఆక్రోశమే తప్ప చోటెక్కడుందని ఆనందానికి ..!!

//పులకింత//


నిన్నటిదాకా చేమంతినే అనుకున్నా..
నీ చూపుతాకి చెంగల్వగా మారేవరకూ
అద్దంపు చెక్కిళ్ళు మందారాలుగా..
అరవిరిసిన పెదవులు నెలవంకలుగా..
కోయిల కన్నులై నిన్ను విరహించే వరకూ..

వసంతమో హేమంతమో మరచింది మది
నిన్ను తపించే ఉదయాస్తమాలలో..

నా మృదుస్పందన ఆలకించేందుకు
లాలనగా దాచే నీ హృదయమొక్కటీ చాలనుకున్నప్పుడే..

తలచిన ప్రతిసారీ అనుభవమవుతోంది..
శ్వాస తీసుకోవడంలోని సరికొత్త సుఖమెందుకో నేడు
క్షణానికయ్యే పులకింతలో గమకాలన్నీ గతి తప్పుతుంటే
అపురూపాలన్నీ ఎదలోనే దాచుకుంటున్నా..
ప్రేమవిందుకు వేళైన శుభముహూర్తాన
నీ ఆలింగనాల తాదాత్మ్యంలో నీకర్పిద్దామనే..!!

//మౌనభాష్యం//



మౌనం ఎంత గొప్పదో..
కోటి భావాలని పెదవిప్పకనే పలికిస్తుంది
మంత్రమేసినట్లు భావాలన్నీ లాలిస్తుంది

మౌనం ఎంత గడుసుదో
క్షణానికో కావ్యాన్ని అలవోకగా రాసేస్తుంది
మనసులోని మాటలన్నీ చూపుల్లో దాచేస్తుంది

మౌనం ఎంత మృదువైనదో
నిశ్శబ్ద స్వగతంలోనికి మెత్తగా జార్చేస్తుంది
వెన్నెల్లో విషాదాన్ని ఆనందంగా తాగేస్తుంది

మౌనం ఎంత ఆకర్షణీయమైనదో
సంతోష సరాగాలన్నీ చిరునవ్వులో చూపిస్తుంది
ఎదలోని స్వాతిశయాన్ని పరిమళభరితం చేసేస్తుంది

మౌనం ఎంత ప్రియమైనదో
మనోగతాన్ని అపూర్వమైన అనురక్తితో పాలిస్తుంది
ఒంటరితనాన్ని ఏకంగా ఏకాంతంగా మార్చేస్తుంది..!!

//నివేదన//



అనురాగాన్ని అక్షరం చేసి పాడాలనే కలనైనా..
నీ పేరే పలుకుతోంది
ఉదయాన్నే ప్రసరించే తొలి వేకువ కిరణంలోనా
నీ రూపే అగుపిస్తోంది..

చెదిరిపోయిన జీవితపుటలను సరిచేసే వేళ
అందమైన వాక్యమై అమరిన చెలిమి నీది
రేయంతా చీకటికి పహారా కాసే నయనానికి
ప్రత్యుషపు సౌందర్యానివి నీవు

నీవో..
ఆత్మ ఆలపించే ఆనంద గీతానివి..
వెలుగురవ్వలై విరిసే నా పెదవంచు చిరునవ్వువి
నాలో భావపవనానికి కదిలే లేచిగురువి
నిన్ను ప్రేమగా పలకరించాలని చూసే వాసంతికను నేను

ఓ మౌనమా..
ఒక్కసారి చూపుతోనైనా మాట్లాడవూ..
నీ కనురెప్పల వాకిలికి తోరణమై మిగిలిపోతానిక నేను..!!

//అగమ్య మనసు//




మనసు మౌనవిస్తోంది
నన్ను గతంలోకి జార్చేసావన్న నిజాన్ని జీర్ణించుకోలేక
వర్తమానరాహిత్యంలో ఇమడలేని
హృదయాన్ని ఓదార్చలేక

నిన్నటికి నాకు తెలిసిన నిజమొకటే..
నా ఏకాకితనపు నిశీధిని వెలిగించేందుకు
ప్రజ్వరిల్లిన దీపానివి నువ్వు..
నువ్వూ, నేనూ, ఏకాంతముంటే
ఊహలలోనే జీవితాన్ని విరచించాలనుకొనే నేను
ఇప్పుడదో అబద్ధం లాంటి నిజమని తెలుసుకొని కుమిలిపోతున్నా

అయినా..
నన్ను మరవాలని నువ్వు ప్రయతిస్తున్నావంటే
నమ్మకానికందని వాస్తవమొకటి నవ్వుకుంటోంది
నా గెలుపైనా మలుపైనా నువ్వేనని తెలిసాక
కలలో సైతం నీ మనసు నాదేననే గర్వం
ఇప్పుడు వాల్చుకున్న కొనచూపులో
బలవంతంగా ఊహను ఆపినట్లు
నాపై కురిసే ప్రేమనే సుధామధువును
నిలువరించడం న్యాయమా..!!
 

//వాంఛా నేరం//



నిశ్శబ్దం కదిలించిందేమో..
ఎన్ని సవ్వళ్ళో
ఎన్ని నిట్టూర్పులో
మనసుల ఆవేదనలో
మరణించిన అనుభూతి తప్ప
ఒక భావం లేదు..
ఒక బంధం లేదు
తప్పొప్పుల మనసు పట్టికలో
నెమరేసుకుంటూ
గాయపడుతూ
శోకాన్ని భరించాల్సిందేనంటూ
స్మృతుల ప్రవాహంలో
ఊహించని శిక్షలు..

నిర్నిమేషమైన చూపులో
ఏకాకితనపు ఆవేదనలో
విషాదం కమ్ముకుంటుంది
హృదయస్పందను తర్జుమా చేయలేని
చంచలత్వమొకటి
మౌనవించి చేరువయ్యింది
నశించిన ఆశలూ
ఎగిసిపడే కలలూ
కరిగిపోయి
చెదిరిపోయి
అదుపుతప్పి ఛిధ్రమయ్యాయి
ఇప్పుడక్కడ
జ్ఞాపకమొకటి గడ్డ కట్టినట్టుంది
వాంఛలను అదుపు చేయలేనంటూ..!!

//రాధా పరితాపం//


రాధిక రాదిక
కృష్ణయ్యా..నీవు వేణుగానమాలపించనంటే..
కన్నయ్యా..నీవు ప్రియమార నన్ను పాడనంటే
మధురానుభూతులు మనోనేత్రంలో ఊగిసలాడ నా విరహం అవధులు దాటుతోంది
కొసరికొసరి ముద్దాడే నీ అధరామృతం కరువై ప్రాణం వీగిపోతుంది
మన్మధుడు వేసే ప్రతిబాణం గురితప్పక గుచ్చి ప్రతీక్షణం కలవరమిస్తుంది
కలువకాడలెన్ని కప్పుకున్నా ఓపలేని తనువు నిట్టూర్పు సెగలను రేపుతున్నది
వసంతకాలమైనా గ్రీష్మాన్ని తలపిస్తూ ఊపిరి బిగుసుకుంటుంది
ఎంత పన్నీరు చల్లుకున్నా..ఎన్ని గంధాలు పులుముకున్నా తాపమే
ముత్యాలూ మల్లెలు సైతం తీర్చలేని భారమే
చంద్రుని వెన్నెలలోనూ నాకు నిత్యజాగరణ తపమయ్యింది
నిజమే కృష్ణయ్యా..
నా వివశం నిన్ను చేరలేదంటే
నీ రాధనే నువ్వు ఒడి చేర్చకుంటే
నా ప్రాణం నిలువడమింక కష్టసాధ్యమే..
మరో వసంతాన్ని నేను చవిచూడటం కల్లనే..!!

//అమృతధార//



కురుస్తోంది వాన
నాపై నీకున్న ప్రేమలా
మునుపెరుగని ఉల్లాసమేదో లోలోన
హృది నవ్విన శుభసమయాన
మెరుపు కిరణాలన్నీ చేరి ఆకాశాన్ని వెలిగిస్తుండగా
కలవరధ్వనులతో రాత్రి ప్రకాశిస్తోంది
ప్రేమపక్షులు గూళ్ళలో సయ్యటలాడే వేళ
మదిలో కుసుమగంధాలు పోటీగా
కమ్మగా వ్యాపిస్తున్న మట్టివాసనకు
సమయాసమయం లేని నెమళ్ళు పురివిప్పుకోగా
వర్షధారలు నాట్యం చేస్తూ ఆకాశానికీ భూమికీ తెల్లనిదారాలతో ముడేస్తుంటే..
గాలి సైతం పగలబడి నవ్వుతున్నట్లుంది
క్షణక్షణానికీ పెరుగుతున్న శీతలస్పర్శతో
నవపల్లవమై కాస్త ఒణకడం గుర్తుంది
ఆపై నీ హృదిలో చేరిపోయాక ప్రపంచంతో సంబంధం తెగిపోయింది
అయినా వేరే తొలకరులు నాకెందుకులే
ప్రతిక్షణమూ ప్రేమతో కురిసే నీ చూపులజల్లులుండగా..!!

//వలపు సవ్వళ్ళు//




నిన్ను తలచిన క్షణాలన్నీ పువ్వులై
వింతైన పరిమళానికి వివశమై నేనుంటే
వెన్నెలవుతున్న భావాలతో
మౌనాన్ని మోసుకుంటూ నువ్వుంటావు

మనసంతా మయూరమై నర్తించేవేళ
అడుగడుక్కీ తమకమాపలేని గమకాల తడబాట్లలో
హృదయమెంత నవ్వుకుందో..
నీ కవనంలోని అమృతధారలో పూర్తిగా తడిచాక

అనుభూతి గంధాలనలానే పూసుకుని
కలకాలం చైత్రమై నిలిచిపోవాలనుందంటూ మది సొదపెడుతుంటే
వేరే వసంతమేదీ వద్దనుకున్నదీ అప్పుడే
రెప్పల బరువులోని రూపం నాదని నీవన్నాక..!!
 

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *