Wednesday, 7 August 2019

//సమ్మోహనాలు//

అరవిందములు అర్ధమరాత్రి ఊసులకని

అపరంజి మదనుని కోరినప్పుడు

గారాలుపోతున్న గాలి గమకాలు

స్వరాలతో పోటీపడు మధురాక్షరాలు

మౌనాన్ని ముగ్ధంగా మార్చుకున్న సమ్మోహనాలు

ఒకేసారి మున్ముందుకొచ్చి త్వరపడుతుంటే..

మాసమేదైతేనేమి..

మరులు గొలుపు

మధువులో మునిగినట్టేగా మనసప్పుడు

జోలపాడినా నిద్రించలేని పరవశాలు పరిమళించునప్పుడు.. 💕💜


//మకరంద ధార//


ఇన్నాళ్ళుగా రవళించకుండా ఆగిన మది
నిద్దురపోతున్న స్వప్నాన్ని ఎందుకు లేపిందో
కొబ్బరి మొవ్వలో కదిలే వెన్నెల మెత్తగా తనలోకి జారి
మునుపులేని స్పందనకు శ్రీకారం చుట్టింది

మధురభావానికి మందహాసం తోడై
నా చెక్కిలిపై పరచుకున్న వింత కాంతి
నీ చూపుకొసలు మృదువుగా మీటిన కిరణాలై
అవ్యక్తపు వెలుతురు వెదజల్లినట్టి పరవశం

చిగురు కోసం ఎదురుచూస్తున్న ప్రేమఋతువులో
అనురాగపు సరాగం సంగీతమై
ఏకాంతపు ముగ్ధలావణ్యాన్ని మనసంతా పూయించి
ప్రేమాక్షరాల కృతులు ఆలపించమని ఆదేశించిన వెన్నెలరాతిరి
అలవోకమైన మకరంద ధార
అరమోడ్పుల పారవశ్యాన్ని అందించడమంటే
చినుకుగా జారిన కన్నీటి రుచి
తీయగా మారి ఆనందపు తీపిని తెలిపినట్టుంది 💜

//ఏకాంతం//

ఇక్కడిక్కడ లోకమనే కచేరీలో పాడుతున్నట్టే కనిపిస్తా

ఓ నిమీలిత అనుభూతినై ఏకాంతంలో నేనున్నా

మోహంలో మునిగినట్టుండే ఆత్మస్పృహ
నేనో అంతర్లోకంలో విహరిస్తున్నట్టు బాహ్యానికి కనిపించకున్నా
కొన్ని యుగాల నుండీ
"గ్రహణం" వీడని జాబిలిగానే నేనుంటున్నా

నీకు తెలియనిదేముంది..
నీ మౌనానికి నేనో సంగీతమై
అమరత్వసిద్ధికని వేచి చూస్తున్నా..💕💜


//ఈ ఆషాడం//


ఈ ఆషాడం

నీ కంటి ఎరుపు నా అరచేతిలో పండిన సంగతి

మన విరహాన్ని విరచించమని గుర్తుచేస్తున్నట్టుంది

గోరువెచ్చగా ముగిసే సంధ్యాకాలం

నా ఏకాంతపు వాకిట నిన్నో చిలిపి గమకమై నిలబెట్టినప్పుడు

మనసాపుకోలేని నేనో పరివేదనై

నిశ్శబ్దపు సరాగాన్ని ఆశ్రయించాను..

తొలిచూపుల కలయికలోనే పచ్చబొట్టేసుకున్న నిన్ను
రవ్వంత పారవశ్యానికే సున్నితమయ్యే సన్నజాజిలా
ప్రేమదారంతో ముడేసుకున్నాక
ఈ కాస్త దూరం వల్లనే..
పల్లవిని మరచి తడబడుతున్న పాటలా మారిపోయాను

నా కనుపాపల ఆవిరి తగిలి
నీ మనసు వర్షిస్తే చెప్తావు కదూ..
మన కలవరాలొకటేనని కొన్ని జన్మలకైనా వేచి ఉంటానిలా..

నువ్వు రాగానే ఆపేద్దాం మన అరచేతులొకటి చేసి కాలాన్నలా..💕💜

 

//మనలో విరహాలు//


నీ ఊసులకని ఎప్పటికప్పుడు

ఎదురుచూపులు పరచి నిలబడుతున్నా..
మూగమనసు పల్లవిస్తున్న రాగాలన్నీ
కాలవాహిని సుస్వరపు ఆనవాళ్ళుగా అనుకున్నాక
ఊగుతున్న మనసుని ఆపలేకపోతున్నా

నీ ఒక్క పలుకు వేలపరమాన్నాల తీపైతే

ఎప్పుడెప్పుడు నీ మాటల పండగోనని
ఆ వరప్రసాదానికి నిముషాల్ని లెక్కిస్తున్నా..

ఆశకో హద్దు లేకున్నా
నీ కవనపు ప్రతిబింబమయ్యేందుకు

కలంలో చేరేందుకే సిద్ధమవుతున్నా

మల్లెలింత పరిమళిస్తుంటే
మధుమాసమని సరిపుచ్చుకున్నా..

కానీ

అపురూపాలింకా పెరగాలేమో..
మనలో విరహాలు మధురమవ్వాలంటే అనుకుంటున్నా ...😉💕

//పాతబడిన ఇష్టం..//


శబ్దరాహిత్యపు ప్రపంచంలో
క్షణమో యుగమై కదిలినట్టు అనిపించినా
కదలికలున్న కాలం
చెంగుచెంగున ఉరకలేస్తూనే పోతుంది

సముద్రగర్భపు మంచు స్పర్శలో
ఎడారి అంచున శూన్యపు నిట్టూర్పుల్లో
సంతోషాన్ని వీడిపోయిన విషాదాల్లో
వెతికేందుకేముందని..
ఉక్కిరిబిక్కిరయ్యే సందిగ్ధం తప్ప

ఇష్టాలు పాతబడి
ఒంటరితనపు చీకటిగదిపై మనసుపడ్డాక
గుండెను తట్టే చిరునవ్వులేవీ ఉండబోవిక
చిరుముద్దులు సమాధైన చోట
కన్నుల్లో కన్నీళ్ళు మరుగడం నిత్యమయినట్టేనిక

//మనసులిపి //

నీ కనురెప్పల పరిష్వంగంలో
చిక్కుకున్న కవితనై
ఒక ఇతిహాసానికి పునాది కావాలని
నిత్యమందుకే స్వప్నలోకంలో

ప్రణవమై పలకరిస్తూంటా..

అప్పటికి..

ఆద్యంతంలేని ఆకాశం
దోసిలిలో ఒదిగి
గుండెనంతా ఒణికించినట్టు
నిశ్శబ్దమో సింధూరపువర్ణమై
కాలాన్ని ఆపమంటుంది

నీ తమకపు గమకంలో
చిలిపి స్వరమై కదిలి
మౌనతలపున ఆవిరినై
వాడిపోని 'విరి'గా

అంతరంగమంతా పరిమళిస్తూంటా..

అందుకే
వర్ణనకందని తొలిపాట
సాన్నిహిత్యపు వాస్తవమై
మనసుపొరల్లో తడిచినుకై
సవ్వడిస్తూ మొదలవుతుంది

ఓయ్..

మనసులిపి తెలుసు కనుకనే నీకిన్ని చెప్తున్నా

కొంత తడుముకున్నా నీ వెనుక నా నీడని గుర్తిస్తావని..💕💜


//చెదిరిన చిరునామా..//

భావాలు నిరంతరమూ ప్రవహించే చోట

చెలిమి చిరునామాకని ఎదురుచూసే అవసరమే ఉండదు

ఒకరి కథలో మరొకరు ఎన్నాళ్ళుంటారో

చెప్పలేని వీల్లేనప్పుడు

అర్ధంలేని మౌనానికి చోటిచ్చి

మాటలు ముగిసాయంటే

దిగులుమేఘం ఎగురుతున్నట్టు..

జ్ఞాపకాల్లోకి జారేంత ఖాళీ సృష్టించబడేప్పుడు

కన్నీటిదీపాలను అడ్డుకొనే వానతెరలు ఘనీభవించునేమో

నిజాయితీగా ప్రేమించిన ప్రాణమొకటి
ఆపాటికే విరిగి ముక్కలయ్యుంటుంది ..💔


//తపమా..//


వసంతం తలుపు తట్టి
వినిపించే యుగళగీతాలు ముత్యాలసరాలైనప్పుడు
ఆ కనుసైగలన్నీ నువ్వాడే ఊసులేగా..

రేపు రాయబోయే చరణంలో
నీ కన్నుల కాంతి వలయాలే
నా అనుభూతి క్షణాల ఆదివాక్యాలు

ఉనికినందించే పూల పరిమళంలా
నీతో చెప్పాలనుకున్న అర్ధమరాత్రి కబుర్లు
చీకటిలో మెరుస్తున్న ఆరుద్ర నక్షత్రాలు..

చిలిపిదనం తెలియనట్టుండే నీ చూపులు
నా మనోవ్రతాన్ని మరిపించి అల్లుకున్నాయంటే
ఎంత పసిదనాన్ని పలవరించాయో..
మౌనాన్నందుకే నే సహిస్తున్నా..
నీ కళ్ళలో నా కలను చూస్తూ మురిసిపోతూ
తపిస్తున్న హృదయాన్ని మెత్తగా జోకొడుతూ..💜

 

//రసాస్వాదనం..//

పువ్వుని పరామర్శించినంత మెత్తగా పలకరిస్తావు

ఇన్నాళ్ళూ మౌనంతో అలసిపోయిన ఋషిలా నువ్వు

అప్పటికప్పుడు..

వెన్నెల్లో వసంతరసాన్ని తాగినంత గమ్మత్తుగా

నేనో నిమీలితనై కలల్లోకి విసిరేసినట్టవుతాను

ఇష్టమది జార్చిన సుషుప్తిలో

పగలే రేయిగా మారిన సంగతి

నులివెచ్చని ఆవిరిగా మారిన నన్ను
నిశ్శబ్ద పరిష్వంగంలోనికి నెట్టినట్టు తెలియనివ్వదు..

నీ గుంతుదాటి సగం గుటకలో ఆగిన తేనెచినుకు
నా పేరు స్వగతంలో పలవరించినందుకేమో

రెక్కలు మొలిచిన మనసు హద్దులు దాటి

అంతఃస్వరాల యుగళగీతమై నీవైపుకే పయనిస్తుంది

అల్లనల్లన కదులుతున్న కలకలం
అలజడిని తొలగించుకున్న ఏకాంతంలో
నేనో మంత్రముగ్ధనైన రహస్యం

కేవలం నీ పిలుపులోని రసాస్వాదనం..💕💜


//నీకూ నాకూ మధ్య //

నీకూ నాకూ మధ్య ఓ నిశ్శబ్దం ప్రవహిస్తుంది

నిదురకు దూరమైన నేనందుకే కలలకూ దూరమయ్యాను

నా కనులకి అంటుకున్న రంగుల్లోంచి పుప్పొడి రాలుతుంటే

నీతో లయమైన మనసు నీ అనురాగపు పాట విని పరవశిస్తుంది

సారంగీ నాదాల సంతకాలు పూర్తయినా కూడా

నా ఉదయం నీ స్పందనతోనే మొదలవుతుంది

ఒప్పేసుకుంటున్నా అందుకే

మనిద్దరం ఒకటేనని..💕💜


//మోహనరాగం...//

ఆకాశం నీలికాంతులు వెదజల్లుతున్న వేళ

ఏకాంతంలో మొదలైన పరిమళం

సప్తస్వర సమ్మోహన గంధమైతే

వలపువీణా నాదం..

మోయలేని మధుర క్షణాల పరవశం..

ఇన్ని మాయలు తెలిసిన మౌనమందుకే

ముద్దులొలికే మోహనరాగం..💜 


Tuesday, 6 August 2019

//ఊపిరి కెరటం..//

మునిమాపు ముగ్ధమైన సమయం

మనసు పూలమాలగా ఊగుతున్న వైనానికేమో

సగం చదివిన ప్రబంధానికి అరమోడ్చిన రెప్పలకి తోడు

గాలి అలలు అలసటతో ఆగి చూస్తున్న చందం

కలతపడ్డ కాలం

నిన్నటి ప్రేమకావ్యాన్ని నెమరేస్తున్న లాలిత్యం

నా ఓరకన్నుల నెలవంకలైతే

నీ చూపులు రంగవల్లులు దిద్దిన ద్వారబంధం

పదాలన్నీ పాటలై గుండె గొంతును పలికిస్తుంటే

ధ్యానంలోని ఆనందం నీ రూపెత్తినట్టు

నువ్వూ నేనూ వేరుకాదనిపించే క్షణాలే

బరువెక్కిన ఊపిరి ఘుమఘుమల కెరటం..💕💜

//పరధ్యానం..//

ఎదురు చూస్తున్న కాలానికి రెక్కలొచ్చి

ఎగురుకుంటూ నా ముందు మోహరిస్తున్నా

పరధ్యానం పలుకదెందుకో

సంతోషంతో విప్పారిన చూపులు

గుండె తలుపు తట్టి మరీ ప్రశంసించే

అందమేముందేమో నాలో

పూల ముచ్చట్లు ఆలకిస్తున్న కన్నులు

ఒక్కసారిగా కలవరాన్ని తూలి వాలినవెందుకో మరి

నన్ను తరుముతున్న భావం నీ ప్రేమరాగమని

ఓలలాడుతున్న హృదయానికిప్పుడు తెలిసిందేమో..!

అలల ఊసులో ఆంతర్యాన్ని వెతికి

చిగురిస్తున్న ఊహలతో కొత్తపాట రాసి

నీకర్పించాలనే ఆత్రమెందుకో..!

మునిమాపుకే ముంచుకొచ్చే మంచు తెర

ఈ పూటేం విశేషాలను పంచుతుందో

నిశ్శబ్దానికి ఎదురు చూడాల్సిందే..😊💜


//ఉషస్సు..//

మనోగగనపు నక్షత్రాలన్నీ
నేత్రాంచలానే మెరుస్తుంటే
ప్రేరణిచ్చే ఆసరాకని ఎదురుచూపులెందుకు

వాడని పొగడదండలా
నిత్యం వెలిగే ఆశలుండగా
హృదయంలోని అనురక్తికి అతిథులెందుకు

మనసుపొరల్లోని గతజన్మలాంటి పరిమళాలు
కొత్తగా పులకింతల్ని పరిచయిస్తుంటే
కావ్యభాషలాంటి మౌనాక్షరాలు

విసుగెత్తే ఏకాంతానికి నిజమైన నేస్తాలు కదా

అయినా..
ఉషస్సెందుకో నవ్వుతోంది..

పులకించిన ఘడియలన్నీ స్వప్నాల్లోనివని నేనంటే..😉💜


//జ్ఞాపకాల ముసుర్లు//

తీయని పిల్లంగోవిలా నువ్వు మాట్లాడినంతసేపూ
అరమోడ్చిన కన్నులతో పరవశమై
నేను వెన్నెల్లో పరిమళాన్ని తాగినట్టున్నాను

వేలికొసతో మొదలై కలగలిసిన చేతుల్లో
ఇచ్చిపుచ్చుకున్న ప్రతిస్పందనలు
ఎప్పటికీ మధురమైన ప్రవాహాలే కదా మనకు

మనసు కల్పించుకున్న ఊహలన్నీ
కొన్ని నవ్వులుగా పంచుకున్నాక
అలలుగా పెనవేసుకున్న అనుభూతులు

గొంతులో దాచేసిన పెదవి ఒణుకు
ఒక విరుపై చీకటిని వెలిగించినప్పుడు
మౌనంగా కలుసుకున్న తొలిచూపుల్లో
అనువదించేందుకు భాషనీ వెతకలేదప్పుడు

నీతో కలిసి నడిచిన ఏకాంతపు అడుగులు
కవిత్వంవైపు దారి చేసుకున్నట్టు
అనిపించిన క్షణాలే ఇవన్నీ..

సీతాకోక చిలుకల్లాగా ఈ జ్ఞాపకాల ముసుర్లు
రాత్రి వాన పడే సూచనేమో మరి..💜💕


//ఉషోదయం..//

నిద్ర లాంటి నిశ్శబ్దంలోని కళ్ళలా
ఆరని స్మృతుల అల్లిక నన్ను పెనవేస్తూ

ఏకాంతం ఆదమరచి.. ఓ బంగారు లోకానికి తెరతీసి
మనోగీతాల వెచ్చని స్వరజతులను కోరినందుకేమో

తలవని తలపులోని కోయిల పాటలా

ఓ సరికొత్త నేపథ్యం

సరుగుడు చెట్ల సవ్వళ్ళలా ఆ చూపుల చిలిపిదనాలు

తపస్సు నుండీ తెల్లారే మేల్కొల్పినట్టు
మనసంతా వెన్నెల కళ్ళాపి జల్లి
కలల పుప్పొడినే ముగ్గులా దిద్ది
మరో ఉషోదయానికి పిలిచినందుకేమో..
గోరువెచ్చని క్షణాల గుసగుసలు ఆలకిస్తూ నిద్దురలేచాను..💜😊


//నా ప్రపంచం..//

పగలంతా ఒకటికొకటి కలుసుకోని మబ్బులు

రాత్రైతే వెన్నెల చల్లదనాన్ని భరించలేనట్లు

దగ్గరగా జరిగి హృదయాలేకమైనట్టు నవ్వుతాయి

ఓ పక్క..

మదిని మృదువుగా తొలుస్తున్న మోహం

ఆప్తక్షణాల మలుపులో నిలిచి

సహజమైన పరవశాన్నే అపురూపం చేస్తుంది

ఈ పక్క

నక్షత్రాల్లా మెరిసే నీకంటి మెరుపులు

నాపై తొలిసారి వాలినంత కొత్తగా

ప్రాణం పోసేందుకన్నట్టు చనువుగా వాటేస్తాయి

అనునిత్యం అల్లుకొనే ఊహల ఓలలాటకి

కుదురులేని కూనిరాగపు కదిలికల్లో

ఆప్పుడెప్పుడో నువ్వు రాసిన ప్రేమపాటలు మొదలవుతాయి

చీకటైనా ఒంటరితనం అనిపించని సమయం

దూరాన్ని జయించే అంతరంగపు సంతోషం

అదే..నాకెప్పటికీ ఇష్టమైన ప్రపంచం..💕💜


//ఓ రసధునీ..//

రెప్పలమాటున చిలిపి తమకం ఉలిక్కిపడిందిగా
నీ పలకరింపు యుగళగీతమైన ఆ క్షణం
మనసు గతి తప్పి మరో లోకానికి పయనించిన
అనుభూతిగా అదో తొలి మధురానుభవం..

గుండెకోనల్లో మృదురవళిలా నీ ఆగమనం
నాలో నిశ్శబ్దానికి రెక్కలొచ్చిన వైనం
నా కలలతో చెలిమి చేస్తున్న నీ కళ్ళకు తెలిసి
మెత్తగా నన్నల్లుకున్నది ఓ పూలసుగంధం..

మొన్నటి నీ ధ్యాసలో మొదలైన పరిమళం
రేపటికి మెడ ఒంపున వెచ్చదనమవుతుందనే నమ్మకం
పదేపదే వినిపిస్తున్న నీ చిరునవ్వులకేమో
గుండెల్లో మకరందం స్రవిస్తున్న కమ్మదనం..

ఓ రసధునీ..
ఏకాంతం చలిస్తే బరువెక్కుతుందని తెలిసింది
రసప్లావితమైన నేనో శిలనై ఘనీభవించినందుకే మరి..😌💜


//ఓ వాన పడితే..//


సంధ్యారాగం మొదలెట్టింది ఆకాశం
మునిమాపులు ముసురేసిన ఈ సాయింత్రం
పట్టుచిక్కక పరుగెడుతున్న మానసం..
సుళ్ళు తిరుగుతూ పరిమళిస్తున్న తరంగం

ఎటుచూసినా పచ్చని నిగారింపుల సౌందర్యం
తడిచిపొమ్మని తొందరపెడుతూ వర్షాకాలం
నరనరానా ఉరకలేస్తున్న రుధిర జలపాతం
మిలమిల మెరుపులవుతుంటే సంగీతం
సంజె కెంజాయి.. నీలమై నవ్వుతోంది నాకోసం
వానొచ్చి తీపిజల్లులు కురిపించినందుకే సంతోషం..

నా నువ్వు కవ్విస్తున్నట్టు కలవరం
బరువెక్కిన పువ్వులా పులకరిస్తున్నదీ దేహం
తవ్వకుండానే బయటపడ్డ గుండెగని అమూల్యం
నువ్వున్నందుకే కదా నాలో ఊహలైనవి అనంతం..😍💜

//అలసిపోతున్నా //

అలసిపోతున్నా నీలో నేను..

నాకు నేను

నువ్వంటే ఓ వ్యసనం నాకు

మనసు వెలితినలా నింపేసుకుంటున్నా

నా ఊహలోని నీతోనూ..నీ ఊసుతోనూ

నాకు నేనో అనంతమైనట్టు

ఎన్ని యుగాలు దాటితే

ఈ క్షణానికి చేరానో

ఎంత మౌనాన్ని భరించి

ఇన్ని మాటలు కూర్చుకున్నానో

నాలోని ఆర్తి సంగీతం కాదా

నీకు ఆత్మసమర్పణ చేసేందుకు

సంశయాలన్నీ ముగిసిపోనీ..

నా తలపు లాలనగా

నిన్ను నిమురుకుంటున్నవేళ..😊


//పొలమరింపు//

ఎంతో శ్రద్ధగా అద్భుతాన్ని తొడుక్కు తిరుగుతున్న ఆత్మకి

తడబడుతూ అనాలోచితంగా ఎదురైన ప్రాణం

అనంతమైన అనుభూతికి కారణమేదని అడిగితే

విషాదపు చిటారుకొమ్మన

కాలం అమర్చిన ఆనందాలుంటాయని

చిరుగాలి లయతో ఎగిరొచ్చే పరిమళంలో

దూరాల్ని దగ్గరచేసే పలకరింపులుంటాయని

రాలిపడుతున్న వెన్నెల చినుకుల్లోనే

మమేకమయ్యే చిరునవ్వుల క్షణాలుంటాయని

అంతరంగాన్ని అతలాకుతలం చేసే మౌనానికీ

చెప్పకుండా మిగిలిపోయే కొన్ని మాటలుంటాయని..

పదాల మధ్య ఒదిగే భావనగా

ఓ సంశయానికి సమాధానమందించింది..

ఊపిరాడని దేహానికి అప్రమేయంగా అందిన శ్వాసకేమో

భరించలేనంత పొలమరింపు

కన్నులు ధారగా కురిస్తేనేముందిప్పుడు..

కౌగిలిలో ఓదార్పు మాదిరి అవి ఆనందభాష్పాలైనప్పుడు..💕💜


// అపురూప ముద్దు //

తొలిపొద్దు చుక్కల
సుతారమైన వెలుగులో
నీ ఆత్మానుభూతిని ఆలకించు
గువ్వల గొంతుతో కొన్ని కూజితాలు వినిపిస్తాయి

నా కన్నుల్లో దాగిన కలలన్నీ
ప్రియమైన పదాలుగా మారి
మోహంతో అలమటిస్తున్న నిన్ను చేరి
రసోదయానికి రమ్మని పిలుస్తాయి

అప్పటికే పాట పాడుతున్న పువ్వుల్లో
నా నవ్వుతున్న పెదవుల్ని పోల్చుకొని
ఒకే ఒక్కసారి స్పర్శించు
అందిన ముద్దు అపురూపమైందో లేదో అప్పుడు చెప్పు..💜😉


//చెలి కోయిల//

నా మనసు విహంగం

నీలిగగన విహారమై

నీరెండ సాయింత్రాన

నీ కనులవాకిట్లో

నిన్నటి కలని

గుర్తుచేసినప్పుడు

నీకు వినబడుతున్న

ఆ మనసుపాట

నా విరహానిదేనని

ఆ కన్నుల తడిదిగులే

చీకటిగా మారబోతుందని

గుర్తించు

నిశ్శబ్దపు క్షణాల్లో

మొదలైన అలజడి

గుప్పెడు అక్షరాలుగా మారి

నీవైపు ఎగిరొచ్చాక

నీ చెలి కోయిల

మధురప్రయాణం

రాత్రిని వెలిగించేందుకు

నీ ఊహల అంచుల్లో

ఆగిందని ఆనందించు..💕💜 


//నా కలలో..//


ఎలా వస్తావో తెలుసా నా కలలోకి
ఎంతో నిశ్శబ్దంగా కరుగుతున్న ఊహలోంచీ
మెత్తగా కదులుతున్న నవ్వుల్ని అనుసరించి
వేల తరువుల పచ్చదనాన్ని
ప్రకృతీ ప్రేమల మధురాల్ని

గతజన్మ బంధాన్ని వశీకరించినంత నిజంలాగొస్తావు ..

వెదురుతోటల్లోని రాగాల రసగంగ
తనువారా నాలో ప్రవహించేలా
మనసుపట్టని నీ భావాల మోహాన్ని
నీ చూపుల కొస నుండీ
నా హృదాయాచలానికి ముడేసి
మబ్బులకు చిక్కిన చందమామలా నువ్వొస్తావు..

వేసంగి వెన్నెల్లో.. ఏకాంత సీమల్లో
వర్షించేందుకొచ్చిన తమకములా
అపురూపంగా ఒడిలో ఒదిగే పసిపాపలా

ఎప్పటికీ నలగని నెమలికన్నులా

మౌనాన్ని ఓదార్చుతున్న మునిలా
తదేకమైన కవిత్వపు వాక్యంలా నువ్వొస్తావు

నిరంతర వాహిని కదా నువ్వు..
పరవశాన్నందుకే నాకు పంచుతూ ఉండలా..💕💜

//మౌనం..దూరం..//


మౌనంగా మొదలైన మాటల్లో

గుసగుసలే కవనాలై

బుగ్గల రంగు మార్చిన సంగతి

ఈ రాత్రి నీకు చెప్పినా అర్ధంకాదు

అక్కడ తొలకరితో మొదలైన వాసన

ఇక్కడ నే చిలుకుతున్న సిగ్గు సమానమై

నీతో నేనున్న రహస్యపు అలజడి

మదిగదిలో సంగీతమైందని చెప్పినా నమ్మవు

అరచేతుల ఏకాంతంలోకి ఓసారి తొంగి చూడు

ఆకాశం కింద మనం కూర్చున్న భంగిమ

నన్ను నీకు కోల్పోయినట్టు కరిగిన నీటిచుక్క

నిశ్శబ్దం రవళిస్తున్న హాయినైనా ఆలకించు..

లోకమింత విశాలమైందని తిట్టుకుంటే తప్పులేదుగా..

ఒకరికొకరం అందనంత దూరాన్ని లెక్కకట్టినప్పుడు..😁💜

// ఒక్కోసారంతే..//


అప్పుడే విరిసిన పచ్చి మల్లి
తన పరిమళాన్నెవరికీ పంచనన్నట్టు
ఎగిరితే రెక్కలు అలసిపోతాయని
పక్షి చెట్టుకొమ్మకే ఊగుతున్నట్టు
సంగీతం తెలిసిన పెదవులు
రాగాల మూర్ఛనలు ఆపి నిశ్శబ్దమైనట్టు
కష్టపడి ఏరుకున్న ఆల్చిప్పలన్నీ
ఒకేసారి చేజారి ముక్కలైనట్టు
చేరికైన పిలుపులో దూరాలు వినబడి
సంకల్పించిన కలలు వలసపోయినట్టు
ఒక్కోసారంతే..
సమయం మొత్తం ఖాళీగా మారి
చీకటి కిరణాల్ని లెక్కేస్తుంటుంది..
కొన్ని అసహనాలెప్పటికీ జీవనదులే కదా ..

నిద్దురనాపి రేయింబవళ్ళు ప్రవహించే

నీలాల మాదిరి కదులుతున్నాయంటే..😖

//రాత్రి//

అలజడి రేపడం రాత్రికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదనుకుంటా
నిద్రొస్తుందని కన్నులు మూతపడుతున్నా
దేనికి మారం చేస్తుందో తెలియని మనసు కుదురునివ్వదు
ఊహల్లో పొర్లుతున్న దేహం శాంతిని అతిక్రమించి .
ఏవేవో శబ్దాలు సుళ్ళు తిరుగుతూ గుండెను హోరెత్తిస్తున్న యాతన
నన్ను మాత్రమే సతాయిస్తున్న ఈ క్షణాలకు పున్నమితో పనిలేనట్టుంది..
నావల్ల కాని జాగారాన్ని బలవంతంగా చేయించేట్టుందీ మాయావి.. 😣


//సోమరి రాత్రి..//


సోమరిగా కదులుతున్న రాత్రి
నాలో నవ్వులు పూయించలేనని వెనుదిరిగింది
కాస్త వెన్నెలకే కుదురుకొనే హృదయానికేమైందో తెలీక
చుక్కలు దిక్కులు చూస్తూ గుసగుసలు మొదలెట్టాయి
పలకరించాలనొచ్చిన పూలగాలి
వివశత్వామేదీ నాలో లేదని విసుక్కుంటూ పోయింది
ప్చ్..
ఎక్కడో జారినట్టుంది మది
అనంతమైన పెనుగులాటతో కలత పడుతోంది
మౌనంలోనూ పెను ఆర్తనాదమై వినబడుతూ కొత్తగా..
నిశ్చలమైన నిశ్శబ్దానికీ భయపడుతోంది

నా నుంచీ నన్ను దూరం చేసిన మాయగా..

నిన్ను ఆహ్వానించి ఖాళీ అయినందుకేమో
సగం నిద్దురలో ఊపిరికోసమీ పెనుగులాట
కలలోనూ కలవలేకపోయిన బెంగ అదేమో
విషాదానికి కొనసాగింపులా ఈ తొణికిసలాట

ఏమీ రాయాలేనిక ఈ పూట
నీ వేలికొస అయినా నాకు తగలకపోయాక..😖

 

//నీ ధ్యానంలో..//


చీకటైతే గడ్డకట్టే నిశ్శబ్దంలో
నువ్వూ నేనూ పంచుకున్న పాటలు వింటుంటా
కనుమూస్తే కలలొస్తాయని తెలిసినా
కల్పనలోనే కరిగిపోతూ నేనుంటా

పదే పదే గుర్తుచ్చే నీ కళ్ళు
చంద్రోదయానికి రమ్మన్నట్టు తేలిపోతా
మనలా చూపులతో నవ్వుకోవడం

ఎవ్వరికీ తెలీదనుకుంటా

నిద్దురలోనూ నన్నే కలవరిస్తూ
అలజడవుతున్న నీ మనసు తెలిసి
రేయంతా నే తపనపడుతుంటా

ఏకాంతమంత వింతకాంతి
మనోహర దృశ్యంలో నిన్ను చూపిస్తే
రెప్పలు తెరిచే నీ ధ్యానంలో పడిపోతా

నువ్వు పంచుతున్న వాత్సల్యానికి తోడుగా
వెన్నెలంత సొగసుగా
నా హృదయమెప్పుడూ
పరిమళిస్తూనే ఉండాలని నేననుకుంటా 💕     

//ఆ ఒక్కరు..//

ఎక్కడో ఉంటారు ఆ ఒక్కరు..
అదృశ్యంగా మనసుని మాయ చేస్తారు..

విరినవ్వుతో మల్లెలు పూయించేవారు
కొనచూపుతో కలల తీరానికి చేర్చేవారు
చేయిపట్టి ప్రేమవనమంతా తిప్పేవారు

గ్రీష్మపు అలజడిలో నువ్వుంటే మల్లెలవనానికి కొనిపోయేవారు
మారాకు వేసిన మనోవేదన మెత్తగా తుడిచేవారు
నీ ఏకాంత క్షణాన ఆటవిడుపుగా కలదిరిగేవారు

నీ మూగబోయిన వీణ తీగలను సవరించి
సరికొత్త రాగాలను కూర్చేవారు

చెమ్మగిల్లిన నీ ఊహలను తడియార్చి
మౌనంగా మధురకావ్యాన్ని రాసేవారు..

ఇక్కడే మన పక్కనే ఉంటారు..
దోబూచులాడుతూ మనలోనే మమేకమవుతుంటారు..

ఉదయాస్తమానాలు సరిపోనంత గమ్మత్తుగా
ఊసుల ఊయలూపి జీవనోల్లాసాన్ని నింపేవారు 💜😍 


//మోదుగుపూల చూపులు//

మోహపు ఒరవడికి మోదుగుపూలు పూసిన కన్నులు

అరమోడ్పులై అశాంతిని రెప్పలార్చుతాయి

ప్రేమ పరవశమొకటి ఆలాపనగా మొదలై

పగలే కలలకి కబురెట్టి రమ్మంటే

హృదయం బరువెక్కినట్టు అనిపిస్తుంది..

మౌనంగా నీతో సంభాషిస్తున్నందుకు

మాటలు అలిగి ఎటో పోయినా

దూరం తరగని క్షణాలు కోపిస్తున్నా

మదిలో సంగీతం మాత్రం స్వరకల్పన ఆపలేదు..

ఎదురుచూసేందుకేం లేదేమో మరి..

నీ గుండెచప్పుడు పల్లవినే పాడుతున్న వేళ

నా గుండెగది ఇరుకయ్యిందేమోనని చిన్న అనుమానం..😉💕 


//విరహమైతేనేం..//

నీ విరహాన్ని మోస్తూ తిరిగే నా మనసుకి తెలుసు
మన ఎడబాటు క్షణాల నిట్టూర్పుల వేడి బరువెంతో..
ముసురుతున్న చీకటినెల్లా వేడుతున్నా అందుకే
అంత నిశ్శబ్దంలో కొన్ని ఊహలనైనా తోడిమ్మని
అనంత వినీలాకాశంలా నువ్వెదురవుతావప్పుడే
కన్నులకీ పెదవులకీ మధ్య శ్వాసలో కలిసిపోతావీలోగానే..
తలపు సంతకం కోసమని నిన్ను పిలవకపోయినా
నా మదిలో వాక్యమై మొలిచేందుకే వెంటుంటావు
ప్రతిరోజూ సంతోషమంతా నీ సమక్షానిదవుతుంది..
నడివేసవిన వెన్నెల ప్రయాణాలన్నీ కలిసి చేస్తున్నామనే..
కాలమలసిపోతున్నా చింతలేదు నాకిప్పుడు

నీ ఉనికి ఊయలై నన్నూపుతుంటే కావాలనుకున్నప్పుడు...💜 


// నాతో రా..//


నీ కంటినవ్వులు గుర్తొచినప్పుడు అప్పటికప్పుడు నేను నిన్నల్లోకి జారిపోతా..
మల్లెగాలి వీచినప్పటి హాయి పరిమళం సొంతం చేసుకుంటూ పక్షిలా ఎగిరిపోతా..
ఎవరో అన్నారు నీకు మాటలు రావని..😀
చూపులతో అలజడి రేపి నిశ్శబ్దాన్ని చెరపగలవని..
వినగలిగే నాకది అనంతమైన రాగమని చెప్పకుండానే నిన్నాస్వాదిస్తా..
నిద్రించానని నువ్వనుకుంటూ నా తలపుల్లో మేలుకొనే సంగతి
నీకిష్టమైన దోబూచులాటని ఎప్పుడో కనిపెట్టేసా..
ఆనందాన్ని పెనవేసుకొనే క్షణాలు ఇవేనని నేనందుకే రాత్రికోసం నిరీక్షిస్తుంటా..
సగం సగం మాటలింక దాచుకోకు..
నా ఏకాంతాన్ని వెంబడిస్తూ నీ సమయాన్ని వివశించుకుంటూ నాతో నడక మొదలెట్టాలనుకున్నాక..😊💕

 

//విశ్వమాయ//

ఏదైతే
నీ అంతరంగాన్ని నిశ్శబ్దంలోకి నెట్టి
కాలం గడిచే కొద్దీ రెండుగా విడిపోతుందో
విషాదాన్ని మోహరించినట్టు చేసి
వెలుతురుని వెళ్ళగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందో
తిరగబడ్డ మనసుకి శాంతిని దూరం చేసి
దేహానికీ ఆత్మకీ మధ్య అగాథాన్ని సృష్టిస్తుందో
అదంతా నీలో ఉన్న ఆలోచనా చైతన్యరాహిత్యమే..
ఏకత్వం సిద్ధిస్తే తప్ప ఈ ద్వంద్వయుద్దాన్ని ఆపలేని
అల్ప మానవులం మనం..
అప్పటివరకు ఆ విశ్వమాయను మోస్తూ తిరగవలసిందే..😒 


Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *