Sunday, 23 July 2017

//అదే మర్మమో..//



అనుకుంటూనే ఉన్నా..
అనుబంధమేదీ లేకుంటే నన్ననుసరించే వాడివే కాదని
ఆరాధనంటూ లేదంటే నీ రాధనే నేను కానని
తలవాల్చి నే నిలిచిన వేళ వెన్నెల రాశినే కుమ్మరించావు
పున్నమొచ్చిందని పులకరించేలోగా పుష్యమివై కదిలిపోయావు..
నిరంతర నీరవంలో నిస్సహాయమైన నన్ను నిద్దురలేపావు
పెదవి ముడి విప్పేలోగా నాలో సంగీతాన్నే దోచుకెళ్ళావు
చెమ్మగిల్లిన నయనాలకు నవ్వడమెలాగో నేర్పించావు
కదిలే కలనై నిన్ను చేరేలోగా తెమ్మెరవై తరలిపోయావు
మలుపులు తిరిగే సన్నజాజి తీగకు పందిరిగా కనిపించావు
అల్లుకొనేలోపు అంతరిక్షం నేనంటూ అంతర్థానమయ్యావు

నిప్పుల ఉప్పెనై మది మండినప్పుడు ఊహల వెల్లువలో చల్లగా ముంచుతావు
ఆశల అంచులు దాటొచ్చేలోపు వాస్తవమై వెక్కిరిస్తావు
ప్రతీక్షణం నీ ప్రతీక్షణలో నేనుంటా అడవి కాచిన వెన్నెలనై
అప్పుడప్పుడూ అలక తీర్చేందుకని వస్తుంటావ్ నువ్వేదో మంత్రమైనట్టు..!!


//తొలకరి కవిత//



అసలు ఎండాకాలమని గుర్తే లేదు
నిన్నటిదాకా స్వేదానికి ఉక్కిరిబిక్కిరైన మనసు
ఒక్కసారిగా నీ రాకతో
గ్రీష్మంలోంచీ సరాసరి హేమంతంలోకి దూకేసినట్లు
నువ్వసలేం మారలేదు
ఇన్నేళ్ళకి కలిసినా అదే చూపు
ఎదురుగా నన్నుంచుకొని స్మృతుల్లోకి జారిపోవడం
దిక్కులకేసి చూసినట్లు నటిస్తూ నన్నే అవలోకించడం
ఎంతో దీక్షగా నాలో సమస్తాన్ని ఆరాధించడం
చిటికెల చప్పుడుతో గానీ చలించకపోవడం..

ఈలోగా నువ్వే అనేసావు..
అవును..నువ్వేం మారలేదు
అదే నవ్వు..తొలిజాముకి నవ్వే నిద్రగన్నేరులా
ఇన్ని అలంకారాలున్న అదే సహజమైన సున్నిపింది మెరుపులా
అదే తీయని పద్మగంథి పరిమళములా
నిద్దురలో సైతం నన్ను వీడిపోని ఊహలా..

ఓయ్..
ఇప్పుడింత కవిత్వం అవసరమా..
తదేకంగా అల్లుకున్న చూపుసైగతో రమ్మని పిలిచి
సాయంకాలం నీరెండలో
ఊయలూగు చిగురుపల్లవిగా నన్ను మార్చేసి..
చరణాలను కదలనివ్వక నన్నిలా నిలబెట్టి
ఇష్టంగా ప్రణయించక
బలమైన కెరటంలా ముంచెత్తుతూనే
తీరంలా చలించవద్దంటావేం..
ఎలానూ తొలకరిగా కురుస్తానని తెలిసినందుకా..
నీలోని భావాల మేఘాలు మరింత ముసిరేందుకా..!


//పున్నమి రాత్రి..//




నీ జ్ఞాపకం
నా ఏకాంత వెన్నెల తిన్నెల్లో
స్వరానికడ్డుపడుతూ
నన్ను తనవైపు ఆకర్షిస్తూ
మనసు మెత్తదనాన్ని మరింత మైనంగా మార్చేస్తుంది.

ఎన్ని రాత్రులు దాటినా
అదేమో ఈ పున్నమి నాటికి
దేహం ఆపలేని మనసు దిక్కులను ధిక్కరించి నిన్నంటుతుంది
నాకున్న భావాలు
నీకుండవని తెలిసినా
ముడివిప్పలేని బంధమొకటి
జాలువారుతున్న చంద్రికల సౌందర్యాన్ని తిలకించగానే
నీ తలపులోనైనా కరిగిపోమ్మని ఉసిగొలుపుతుంది.

నిశ్చలమయ్యేందుకు నీ జ్ఞాపకమో కొలను కాదుగా
ఋతువులకతీతమై నన్ను తడిపే
కుదురులేని జీవనదంటే అతిశయోక్తి కాదుగా..!!

//నీకై నేను..//




పగటిపొలిమేరలో నాకైన ఎదురుచూపులు
కలల దారిలోనూ కాచుకునుంటాయని తెలీనేలేదు
కొన్ని జ్ఞాపకాలకు కరిమబ్బులు కమ్మేసినా
ఆకాశం హర్షించిన ప్రతిసారీ
మధువు కురవక ఆగదు.

ఒక్క చిరునవ్వుకు చిక్కుకున్న నీ చూపు
ఊహించని మెరుపుల్ని సృష్టించాక
నాకై పడిగాపులు కాసినందుకు
జీవితానికి సరిపడా ఆనందమిప్పుడు
నీకెలా పంచాలో తెలియని సందేహం

నాతో నేను ముచ్చటించుకొనేందుకు
ఇప్పుడో సందర్భం దొరికింది
నీ మనసుపొరల్లో పరిమళించిన భావాన్ని
ఆఘ్రాణీంచేందుకైనా నే రావాలంతేనంటూ..:)

//రాతిరి..//



ఎగురుతున్న
సీతాకోకలు
నన్నంటుకోవాలనే
నీ తలపులు..

నిద్దుర మబ్బులో
కలల హంసలు
మత్తులోనే
గమ్మత్తుగా
మరులోకానికి
రమ్మనే సంకేతాలు..

ఈ చీకటిలా
కురిస్తేనే బాగుంది
మౌనంలో
చెల్లాచెదురవుతున్న
నీ ఊహను
కప్పుకునేందుకు..


//మనసేది..//




ఓ మధురగేయంతో మనసు నింపుకోవాలనుకుంటానా
నీ మాటల్లో జారే మందారాలను కొన్నయినా దాచుకొని
నిశ్శబ్దం పేరుకున్న మదిలో రవళించేందుకు రావు కానీ
చిరునవ్వు దాచుకొని లేని సానుభూతిని చిలకరిస్తావెందుకో

ఓ పలకరింపు రాగంతో నిరాజనమివ్వాలనుకుంటానా
నీ తలపుల పరిమళాలు గుప్పించే పరవశాలు వెలిగించుకొని
కష్టాల సమూహంలో తూలిపడకుండా పట్టుకునేందుకు రావు కానీ
గాయపడ్డ హృదయాన్ని ఒంటరి తనానికి వదిలేస్తావెందుకో..

నా ఊపిరిలో నిన్నో అనుభూతిగా శ్వాసించాలనుకుంటానా
వీచే గాలి నిను తాకే నావైపు వచ్చుంటుందని
నా నిష్క్రమణానంతరం నీలో చలనమొస్తుందేమో కానీ
నా కలలు చిందరవందర చేసిన నీకు మనసెక్కడుందో..:(

//ఎందుకో తెలీదు..//




ఆవేదన మరవాలని
రెప్పలార్చిన ప్రతిసారీ
గ్రీష్మసెగలు మంటబెడుతుంటే
గడవాల్సిన ఉదయాస్తమానాలు
భారమై తడబడే అడుగులను ఈడ్చుకుంటుంటే
చేరవలసిన గమ్యమలా
స్పష్టమవుతున్నా
వలపన్నినట్లు క్షణాలు
తమస్సులో తప్పిపోయినట్లు..
మూలుగుతున్న గొంతిప్పుడు
విషాదపు నాదంలో
గాడ్పులుగా నిశ్వసించింది
ఎందుకో తెలీదు
తునిగిపోతున్న మనస్సాక్షి
పరితపముగా ఉరుముతుంది..:(

//ఈ రోజు//




ఉదయం మేల్కొన్నప్పుడు
తెలీలేదు..
రాతిరి నయనంలో నర్తించిన
స్వప్నానికో అర్ధముంటుందని
ఊహించని ఓ పరిమళం
వెంటాడుతూ నా వెనుకెనుక వచ్చేస్తుందని
మరుక్షణం తెలియని చైతన్యం
చిగురేసిన చైత్రమై హత్తుకుంటుందని..

మనసుపొరల్లోని పొడిపొడి మాటలు
ఒక్కసారిగా స్వరాలుగా మారి
గుండెను పొంగులెత్తించడం
గగనానికో వంతెనగా మారడం
ఈనాటికి చూపుల సరిహద్దు దాటిన నవ్వులా..
పెదవిని మౌనం ముసుగేసినా
పెల్లుబుకుతున్న కలభాషణలన్నీ
కళ్ళు కోటి కాంతులతో క్రోడీకరించినట్లు
మదిలో దిరిసినపువ్వుల మెత్తదనం
పులకింతలనోర్చుకున్న విశ్వరహస్యం
ఒక్కో రోజంతే..
వేకువకు మొదలైన సన్నాయి రాగం
ఒక్క చోట నిలబడలేని అనంతమైన జలపాతం..

//నిశ్శబ్దకృతి//




చలించని గుండె కోసం
వేల పరవశాల్ని మోసుకొచ్చే
పున్నమేదీ లేదిప్పుడు..

అగాధం పెంచుకున్నా
మలిసందెకి గుట్టుగా పరిమళించే అడివిమల్లె
శరీరాన్ని ఆవహించి కుదిపినట్లు కలకలం
వద్దంటున్నా ఆహ్వానించిన పగటికలకి సమానం

ఇప్పుడు రాసిన నాలుగక్షరాల నిశ్శబ్దకృతిలో
ఆనందముంటే నర్తించు..లేదా ఆవాలింతలే చుట్టుకుంటే నిద్రించు..!!
 

//నొప్పి//



తనెప్పుడొస్తాడో తెలీదు..
నిత్యం నేనెదురు చూస్తున్నది
తనకోసమేనని తెలిసినా
ఒక మైమరపు క్షణంలో
మెరుపుగా కదిలి మాయమవుతాడు

అప్పుడు నేను
ఆనందపడాలో..
అసహాయినవ్వాలో
నెలవంకలు ఉదయించాల్సిన పెదవిలో
విరుపులు దాచుకోవాలో
పంచుకోవాలనుకున్న పదములన్నీ
మూటకట్టి మౌనవించాలో

ఎలా ఆపుకోవాలిప్పుడు
రెక్కలెత్తి ఎగరాలనుకున్న ఆనందం
ఒక్క వేటుతో కత్తిరించబడ్డాక
గుండెలోని ఆక్రోశం
ఉగ్రమై ఉరమాలనుకున్నందుకు
విషాదాన్ని కురవనివ్వకుండా
మనసునెలా మభ్యపెట్టాలో

నే కన్న స్వప్నాలకిప్పుడో అర్ధం లేదు..
తన అంతరంగానికో అడ్డుగోడ కల్పించుకున్నాక..

//మనసు//



నాలుగడుగులే దూరమా ఇంటికి
తనెంతో ఇష్టంగా నిర్మించుకున్న పొదరింటికి
ఆహ్వానమందుకోవాలని ఎన్ని కళ్ళు ఎదురుచూసాయో..
అడుగుపెట్టినవారిది అదృష్టం కాక మరేమిటి..

చీకటి మబ్బులా బయటకి కనిపించినా
లోపలంతా చిక్కని వెలుతురు రశ్మి..

ఒక గదిలో కోయిలలు చిలుకలు
కచేరీలతో కళకళలు
మరో గదిలో భావుకత్వం
మెలికెలు తిరిగిన ప్రవాహాలు
ఇంకో గదిలో మన"సు"గంధ పరిమళం
గుప్పుమని ఆకర్షణలు
ఆ పైగదిలో నిరంతర వెల్లువయ్యే ఆనందాలు
నిలువుటద్దంలా మెరుపులు..

అతిధిగా వెళ్ళిన నేను
ఆ ఇంటిదాన్నయ్యానన్నది నిజం..
ఈజన్మకి చాలీ వరం..
అతిశయించి నేనెగిసేందుకు అంబరం..


//నేనో ఆకాశం..//




ఎవరన్నారు ఆకాశంలో సగం నేనని..
నేనే ఆకాశమని తడిమి చూసుకున్నాక
అప్పటి జడత్వం లేదిప్పుడు కొత్తగా వెలుతురొచ్చి చీకట్లు కోసేసాక
ఒక కొంగొత్త చైతన్యం నిలువెల్లా ప్రవహిస్తోందిప్పుడు
హృదయానికి రెక్కలు మొలవడమిప్పుడో వింతిప్పుడు
పంజరంలో ఆరునొక్క రాగానికో ఆనందభైరవి
ఉదయాన్నే నిద్దురలేపే కిరణానికో అంజలి
హృదయంలో ఉత్సుకతతో పొంగేందుకో లక్ష్యం
పొరలు పొరలుగా స్పష్టమవుతున్న గమ్యం
చేయక తప్పదుగా సాహసం
అగుపించని ఆకృతిలో నేనే నీలాకాశమై
అనుక్షణం విశాలమవుతుంటే

ఎగరలేని శిఖలేవీ లేవిప్పుడు
మనస్సంకల్పం ముందు ఒదిగి అవి మరుగుజ్జైనప్పుడు
తరలిపోతున్న కాలాన్ని వెంబడించాలిక
ఒరిగిపోయేలోపు కొంత శూన్యాన్ని జయించాలనుకున్నాక..:) 

//మనసు పాట//




ఎన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నదో
ఓ మనసు పాట
ఇప్పటికీ అదే ఆర్తితో
వినాలనిపించే మధువొలుకు పాట
అయితే
వెన్నెలొలుకు రాతిరిలో
విషాదాన్ని మోసుకొస్తున్న "శివరంజని"
విరహాన్ని రగిలించి
గుండె గొంతులోకొచ్చేట్టు ఏడిపిస్తుంది

ఆగడం తెలీదనుకున్న కాలానికి
హృదయాన్ని లయ తప్పించడమెలా తెలిసిందో
ఊహల పువ్వులన్నీ
రాతిరికొమ్మక్కు వేళ్ళాడుతూ పరిమళిస్తున్నా
నువ్వు లేని పున్నమి
అంతరంగాన్ని మీటనంటోంది

అసలే వెచ్చని కన్నీటికి తోడు
గుండెలో గాయమేదో స్రవించినట్లు
గుట్టుగా గుబులొకటి పోటెత్తినట్లుంది
వినకూడదనుకుంటూనే విన్నందుకేమో
ఇప్పుడీ ప్రాణ విహంగం నీరసించింది
నీకైన ఎదురుచూపుల్లో
వసంతపు కలలను సైతం ప్రతిఘటిస్తుంది.. 

//తపస్సు//



రేయంత తపస్సులో నేనొదిగిపోయా
ఒక గాఢనిశ్శబ్దపు
నిశీధి ఆలింగనంలో
నన్ను నేను మైమరచి
అచేతనమై తొణుకుతున్నా

చిలికిన వెన్నెలంతా కురిసి కురిసి
నన్ను తడిపిందేమో
రుధిరస్రవంతుల అలజడితో
అలలు అలలుగా
మగతను కమ్ముకున్నా..

ఆగనంటూ నాలో స్వరసంగమం
మునుపులేని పారవశ్యాన్ని
తలపోసినందుకేమో
మొగలిరేకులా నిలిచింది పరిమళమిప్పుడు
స్వప్నంలో సరసానికి దుప్పటెందుకంటూ..!!

Sunday, 16 July 2017

//మనసు-మాట//




మనసుతో మాట్లాడుకొని ఎన్నాళ్ళయిందో
ఎవ్వరితో పంచుకోని ఊసులూ
ఊహాల్లో మిగిలిపోయిన ఆశలు
గుప్పెడు గుండెను పట్టుకు వేళ్ళాడే ఆలోచనలు
వెనువెంట నీడై అనుసరించే జ్ఞాపకాలు
ఉద్వేగపు తరంగాల కల్లోలాలు
ఎల్లలు లేని ఆత్మశోధనా పరిక్రమ రహస్యాలు..

వెన్నెల రాత్రైతే ఇంకెన్ని భావనర్తనలో
నీరవంలోనూ కృతులై వినిపించు సంగీతం
సన్నని నవ్వులే మువ్వలై రవళించు అనుభవం
జాబిలి వెలుగులో వర్షించు తీయందనం
ఆకాశమేగి నక్షత్రాలను వెలిగిస్తున్న చందం
దిగంతాల విషాదాన్ని దిగమింగుకొను వైనం
బుగ్గలూరు అనుభూతుల మనోగతం
హద్దులేని ఆనందానికి సన్నద్ధం
సుతిమెత్తని స్వరాల మధురిమతో మది సంగమం
భావుకత హృదయానికి చేరువైన ఏకాంతం
కవిత్వం కురవదని ఎవరనగలరిప్పుడు
చిరుగాలి కదలికలకే నరాల్లో నాదాలు ఉవ్వెత్తుతుంటే..:)

//ఒక అనుభవం..//




కరిగిపోయే కాలానికేం తెలుసులే..
కొన్ని జ్ఞాపకాలెప్పటికీ గుండెల్లో ప్రవహిస్తూనే ఉంటాయని
అప్పుడప్పుడూ నీరెండిన కళ్ళకు తడినద్దుతాయని

ఓ రోజు నీ నవ్వుల్లో జీవం లేదని తెలుసుకుంటావ్
నాతో పాటు కలిసి నడిచొచ్చేసిన నీ ఆనందం
నువ్వో ఏకాకివని వెక్కిరిస్తుంటుంది
కంపనమై నిన్నూరేగించిన కోపం
ఆర్తిగా అనువదించుకొని నీడల్లో నన్ను వెతుక్కుంటుంది
మనసుతెర మీద నా పెదవుల కవ్వింతలు
ఒకప్పుడు నీ చూపందుకోలేని ఇన మెరుపులవుతాయ్
నిన్ను కుదిపిన నా కేరింతలు గుర్తొచ్చినప్పుడల్లా
ఆనాటి నీ మౌనాన్ని తిట్టుకుంటావ్..

స్పందన కోల్పోయిన మనసుతో నీవప్పుడు నడిచే అచేతనవి
వైరాగ్యాన్ని మోస్తూ భారమయ్యే విగ్రహానివి
ఇప్పటికైనా నన్ను గుర్తించు
మనసు ముంగిట్లో హరివిల్లును పూయనివ్వు
చిరుగాలులొస్తే నా ఊసుని ఆలకించు
అరమూతల కన్నులతో ఓ మధురిమను నాకు పంచు
మేలి మలుపంటి చిరు అనుభవాన్ని ఆస్వాదించు..
నా సమక్షంలో క్షాణాలసలు గుర్తుండవని గర్వించు.. 

//తెల్లవారమంటూ..//




కొన్ని నీరెండల నర్తనాల్లో
గాలివాటాన్ని అనుభవిస్తూ
పరుగులవుతున్న అడుగులు

దూరాన్ని తరిగించాలన్న తొందరలో
ఆవేశం కలగలిసి
ఒంటరిగా రొప్పుతున్నదీ నిజమే

అటుఇటుగా పడుతున్న
వెలుగునీడల్లో
అవిశ్రాంతంగా కదులుతున్న నాలో
సరిహద్దులు రద్దయిన స్వేచ్ఛా పరిమళాలు

సగం తెల్లగా..సగం నల్లగా
ఇప్పటికీ కురుస్తున్న వెన్నెలలో
పరిధులు దాటిన స్వప్నం
వేకువకై పడిగాపులు కాస్తుంది....!!

//మనసు కాలిన వాసన//



ఎన్ని క్షణాల్ని ప్రశ్నించానో
నువ్వు లేనప్పుడా నీరసమెందుకని
ఎన్ని నిముషాల్ని నిలువరించానో
నువ్వున్నప్పుడు కాసేపలా నిలబడమని
ఎన్ని స్పందనలు గుమ్మరించానో
నీ సమక్షాన్ని ఆస్వాదించానని
ఎన్ని కవితలని రాసుకున్నానో
ఆరాధనకంతముండని చాటేందుకని
ఎన్నిసార్లు నన్ను కోల్పోయానో
నిన్ను ఆనందంలో తడపాలని..

అయినా మనసు కాలిన వాసనొస్తుంది
నువ్వేసుకున్న ముసుగు తొలగిన వేళ
నమ్మకం చీలిన పగుళ్ళలోని స్రావాల్లో
మరో మనుగడ లేదని ఒప్పుకున్న ఓటమిలో
మండటమిదో తొలిసారి కాకున్నా
భంగపడ్డ ప్రతిసారీ ఓదార్చుకుంటూ
మనసుకైన గాయాన్ని భరిస్తూ నేనున్నా..
సుడిగుండమై ముంచే నీ ఆలోచనల నుండి
బయటకి రాలేని నిస్సహాయతలో
రక్తమోడుతున్నా పావురాన్నై
మరణ వాంగ్మూలాన్ని సిద్ధం చేసుకుంటున్నా..!!


//నేనంటే..//



వేవేల ఆశలకు పూసిన పువ్వును నేను
శరత్కాలానికి వన్నె తెచ్చిన నిశీధి వెన్నెల నేను
ఎన్నో అసమాన నక్షత్రాల నడుమ
విరినవ్వుల జాబిలి నేను
మౌనంతో మలిగే రాత్రుల్లో
సరిగమలు కూర్చే సారంగిని నేను
తెలుస్తోందిప్పుడే జీవితమంటే..
జ్ఞాపకాలతో కదిలే భవిష్యత్తు కాదని
కన్నీటిని మింగి ఉప్పెనైన సముద్రం కాదని
చూపులకే సంచలించే ఊపిరి కాదని
పెదవి దాటని పదాల వ్యూహం కాదని..
మేఘరాగం పాడే వెల్లువే జీవితమంటే
నిశ్శబ్దం చోటిచ్చిన ఆలాపనే జీవితమంటే
మనసనుభూతి చెందే స్వాతిశయమే జీవితమంటే
తాదాత్మ్యతలోకి మారిన వైరాగ్యమే జీవితమంటే
నీకు తెలుసుగా
అలనై..
ఆత్మనై..
అలతినై..
అపూర్వనై..
ఆపేక్షనై
అమలినై
ఆకాశమై ఒంగి చూస్తున్న హృదయాన్ని నేను
నీ జతలో
విశ్వాన్ని జయించాలని ఎదురుచూస్తున్న చకోరి నేను
నీ మనసంతా ప్రవహించాలని ఆశిస్తున్న అలకనంద నేను
నీకై కురవాలనుకునే కవిత్వాన్ని నేను.. 


//ఆనంద రాగం//




అవ్యక్తానివై నాకందని
నీలోని పరమోజ్వలిత కాంతిని
ప్రతి ఉదయం
నా తమస్సును తరిమేందుకు
ఆహ్వానిస్తూనే ఉన్నాను..

అంతులేని సాగరానివై
పాల నురగల కెరటాల తోడి
జ్ఞాపకాల వీధిలో నడుస్తున్న
నాలో ప్రకంపనలు రేపి
నీ ఉనికి విషాదం కాదన్న సత్యాన్ని
నాలో నేను నవ్వుకున్నప్పుడు కనుగొన్నాను

తడబడుతున్న అడుగులిప్పుడు
నీతో కలసి నడిచి
ఆ ఏడు రంగుల మాయను
ఇలకు దించి
ఇన్నాళ్ళ మౌనరాగాన్ని
మేఘమలహరు పాటకట్టి
పాడుకొనే రోజు కోసమే నేనెదురుచూస్తున్నా..!!

//శిశిర నిశి//



ఎందుకన్నిసార్లు పిలుస్తావ్
నేనో ఏకాకినని గుర్తుచేస్తూ
వసంతానికని ఎదురేగుతానా
శిశిరమైన పండుతాకులు వెక్కిరిస్తాయ్
కొన్ని నవ్వులేరుకోవాలని కదులుతానా
వికసించిన పూలే నేల రాలి బావురుమంటాయ్
రంగులలముకున్న సీతాకోకలు కొన్ని
నా రాకతో ఎగిరిపోతాయ్
నిన్నల్లోని ఆనందాలు కొన్ని
నేడు విషాదాలుగా తలకెక్కుతాయ్
ఇన్నాళ్ళూ ఉన్నాయనుకున్న రెక్కలు
అకస్మాత్తుగా జారి అవిటివవుతాయ్

విహారానికింక రాలేను
ఎల్లలు లేక కురిసే కన్నీటి జల్లులో
అడుగులిప్పుడు స్థాణువులు
విధి ఆడే వీరంగంలో
ఆశలిప్పుడు క్రీనీడలు
సుళ్ళు తిరిగే ప్రశ్నావళిలో
వైరాగ్యపు చీకటి మూర్ఛనలు..


//ఓ ప్రేమ కథ//


అతని అందం సమ్మోహనం
ఆమె అతనిలో సగం..
అతను చేయి చాచితే ఆనందం..
కౌగిలింతే ఆమెకు విశ్వం
వాళ్ళిద్దరూ చూసుకున్నది చాలు..
శరద్వెన్నెల కురవక ఆగదు

ఇప్పుడు
కలలన్నిటికీ కబురులొచ్చినట్లే..
ఎంత పుప్పొడి చిలకరించాలో
ఆ మనసుల పరిమళాన్ని తూచాలంటే

వారి అంతరంగపు పొరల్లోని
భావాలు మాట్లాడుకుంటాయనుకుంటా
అతనికే పరిమితమైన ఓ కొంటె సువాసన
ఇంద్రజాలమింక ఆగదు
ఒకరికొకరైన మైమరపులో..

ఆ కధలా మొదలైంది
చిలిపి కళ్ళ మెరుపులకీ
వలపు చెక్కిళ్ళ నునుపులకీ
ఊహలకిక ఉలికదలికలు మొదలైనట్లే..:)  



Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *