Thursday, 27 October 2016
//మరుగీతిక//
పువ్వుల పరిమళం తాగిన పెదవులుగా మొదలై
స్వరాల తీగలు తెగిన వీణగా మిగిలినట్లు
కన్నుల్లో స్వప్నాలన్నీ దూదిపింజలేనని గుర్తించాక
మనసైన సాయంత్రాలన్నీ స్మృతుల నీరవంలోకి జారిపోయినట్లు
చెల్లా చెదురైన సీతాకోక చిలుకల గుంపులో
ఒంటరిగా మిగిలిన ఊదారంగు విషాదం మాదిరి
నీలి అగాధపు లోతులను కొలుచుకుంటూ
శూన్యంలో క్రీనీడలు వెతుక్కుంటూ
సౌరభం మిగలని మల్లెపువ్వులా
మరలిరాన్ని కథలని తలపోసుకున్నాక
కాలం జాబితాలో త్యాగమనే తలంపును దిద్దుకోక తప్పదుగా
జీవన గీతిక నిట్టూర్పు సెగలకు మరోసారి మండిపోవడం నిజమేగా..!!
//పునర్జన్మ//
ఆకులు రాలిన కాలమయ్యాక
ప్రకృతికి వసంతమో పునర్జన్మ
కాసిని కన్నీళ్ళతో
కష్టాలకు నీళ్ళొదిలేసాక
పెదవులను వీడి పరారైన చిరునవ్వు
వెనుదిరిగి బుగ్గలు పుణికింది
మనసుపాడే మరుగీతికి అక్షరాలనందించి
స్వరకల్పన చేసిన రీతిన
కాటుక కన్నులకు కలలు పూచే రేయిగా
మదిలో చిరుకవిత పల్లవించింది..
మాటలవసరం లేని కొన్ని భావాలు
మౌనరహస్యమేదో చెవిలో ఊది
జీవితపు పరిమళాన్ని పీల్చుకోమన్నాయి
అడుగుల్లేని దారిలో దూరాలు కొలిచే
ఏకాకితనమొకటి
నిశ్శబ్ద బంధురమై ఎగిరిపోయాక
మనసాకాశంలో హరివిల్లు దిద్దుకోవడం
చేతిలో పనయ్యింది..
రంగుపిట్టల సంగీతంలో
సాహిత్యపు మధురిమను మిళితం చేసి
పునర్జన్మెత్తిన వేకువనై ఉదయించానప్పుడే..

//కధానిక//
ఏ పావురాయి చెపుతుందో
నీ కంటి కధానికలు..
పదేపదే గుండె ఊయలలో ఊగిందెవరో
మదిని హరివిల్లు రంగులు చల్లిందెవరో
నీ ఊహల గూటిలో కొలువున్నదెవరో
తొలివలపు ఊసుకు దాసోహమయ్యిందెవరో
నువ్విన్నదీ..నేనన్నదీ ఒకటేనని తెలిసాక
హోరువానలో కాగితప్పడవ ప్రయాణాన్ని కలగన్నట్లు
ఇంకా అనుమానమెందుకు..
జీవితంలో వసంతాలు సహజమేనని తెలిసాక
అనుభూతుల రాగాలకు బాణీలెందుకు
పరిమళాల ఉషస్సుకై ఆరాలెందుకు..

//నిశ్శబ్ద సమాధి//
నిట్టూర్పులకు కొదవలేని
నిశ్శబ్ద సమాధిలో
గొంతెత్తి పాడాలనుకున్న పాటలేవీ
పెదవంచు దాటి బయటకు రాలేదు
కొన్ని జ్ఞాపకాల కుదుపులకు
అస్తవ్యస్తమైన అంతరంగానికి
అశాంతిని ధరించడం
ఇప్పుడో కొత్త విషయం కానే కాదన్నట్లుంది
ఎప్పుడూ దూరంగానే ఉంటున్న వసంతం
సరిహద్దు దాటి రమ్మని
చేయి చాచడం నిజమని నమ్మలేకపోతున్నా..
క్షణాల నూలు పోగులు
వడివడిగా కదిలి విడిపోతుంటే
ఇంద్రధనస్సు కావ్యాలింకెక్కడివి
ఒంటరి తరువుగా నిలబడ్డవేళ
నిద్దుర రాని చీకటి రాతిరి
నేత్రాంచలాల నిలబడ్డ భాష్పాలనడగాలి
మౌనాన్ని మోసుకు తిరిగే మబ్బులకైనా
విశ్రాంతి దొరుకుతుందేమో గానీ
అంతరాత్మ వీధుల్లో తిరిగే
ఆలోచనకు విరామమెందుకు లేదోనని
వేకువకు తొందర లేదంటున్న మనసుపొరల తవ్వకాల్లో
ఇంకెన్ని స్మృతుల సునామీలు ముందున్నాయో మరి..

//రేపటి వేకువ//
కాలానికున్న తొందర మరోసారి నిరూపించుకుంది
కలిసున్నప్పుడు చల్లగా సాగినా
విడిపోయేప్పుడు వేడి నిట్టూర్పులను బదులిస్తుంది
స్వప్నించని మధురిమలెన్నో వాస్తవంలో ఎదురైనా
ఇప్పుడిక నిద్దురనే కలగనాల్సి ఉందేమో
అన్వేషించని గమ్యమో శూన్యమై ఎదురైనట్లు
హృదయమలా కుదించుకుపోతుంది
పందిరిమల్లెలకే పరాకైన భావనలో
పేరుకుపోయిన మొన్నటి సువాసనలు
తొణికితే చురకలై మండిస్తాయేమో
అయినా తప్పదు..
చీకటికి దడిచి భయపడేకన్నా
వేకువొస్తుందని ఎదురుచూడటమే చేయవలసిన పని
అనంతమైన ఆకాశం నీడ గొడుగు పట్టిందనే ప్రీతి
ఎల్లలు దాటి మరోసారి కలుద్దామనే రీతి..!
//స్వప్నాలు//
నిజమనిపిస్తున్న కలను
కౌగిలించిన ప్రతిసారీ
వశీకరించిన అనుభూతుల మడువులో
కరిగిపోతున్న క్షణాలను
కాసేపు ఆగమని బ్రతిమాలాలనిపిస్తుంది
విషాదం నిండిన జీవితానికి
కాసిని రంగులద్దే స్వప్నాలంటే మక్కువెక్కువే మరి
రెక్కలు విప్పుకున్న ఆశల కలువలు
పరిమళించే కాసేపూ
మధురిమల వీచికలే నిశీధి ఒంటరితనానికి
అవ్యక్త దరహాసపు మలయసమీరానికి
కాసిని కన్నీటి చినుకులు ఆనందభాష్పాలుగా రాలే రాతిరిలో
మనసంతా వెన్నెల మరకలు
మౌనానికి మాటలొచ్చే మనోమయలోకంలో
శూన్యానికిప్పుడు చోటేది
వసంతంలో స్నానమాడిన ఊహాలోకపు సరిహద్దుల్లో
నులివెచ్చని ఉచ్ఛ్వాసనిశ్వాసలు సైతం కవితలే
నీలి కన్నుల సౌందర్యమంతా ప్రేమైక ఇంద్రజాలమే..!!
//నాలుగు మాటలు..//
ఏదో రాయమంటావని
నేననుకోలా
నీ తలపులు గువ్వలై
కలం పట్టే సమయమైందని
వేకువనే రొదపెడుతుంటే
పదాలు పేర్చుకుంటూనే మనసుండిపోయిందలా..
కొత్తగా నిన్నావిష్కరించేందుకు
హృదయస్పందన ఆలకిస్తూ
మౌనంతోనూ మాట్లాడగలిగే నిన్ను
అక్షరంలోనికి అనువదించాలంటే
నాకున్న భావాలు సరిపోవనిపించగానే
వాస్తవం వెక్కిరించినట్లయ్యి
వాక్యాలు వెనుదిరిగి
ఒంటరిగా నన్నొదిలి నవ్వుకున్నాయి..
మాటలు పొడిపొడిగా మారిపోయాక
వాక్యాన్ని సరిచేయాలని కలమందుకోగానే
నెమరేసుకున్న స్మృతులు
కలబోసుకున్న కబుర్లు
మౌనానికి కట్టిన మబ్బు తెరలై..
నిశ్శబ్దాన్ని ఆవరించాయి..
ఇప్పుడు కాలాతీతమైన కధానికేదైనా సృష్టించాలి..
నిన్ను సంతోషపెట్టేందుకై..
నాలుగు మాటలను ఉలితో చెక్కి
నాపై నువ్వుంచిన నమ్మకాన్ని నీ మునివేళ్ళతో అల్లుకోవాలంటే..!!
//నిశ్శబ్ద రవళి//
ప్రయత్నించలేదేనాడూ
ఒక ప్రశాంతతను హృదిలో కనుగొనాలని
నిశ్శబ్దానికో సవ్వడుంటుందని
అదో తన్మయత్వపు తీరాలను చేర్చుతుందని
అపరిచితమైన ఓ అజ్ఞాత సౌందర్యాన్ని
భరించలేని ఆనందాన్ని
విశ్వసంగీతాన్ని
విచ్చుకున్న ఏకాంతంలో
కృష్ణపక్షపు తాదాత్మ్యాన్ని
హత్తుకోగలిగే సౌకుమార్యం
పుప్పొడి నెత్తావులను పూసుకున్న లావణ్యం
నిశ్శబ్దపు కౌగిలిలో ఆస్వాదించడమో అలౌకికం
కన్నుల్లోని కలలకు రెప్పలసవ్వడి తెలుసనుకున్నా ఇన్నాళ్ళూ
మౌనాన్ని ఆలకించే నయనాలకు
నిశ్శబ్దరాగాలను అవలోకించడం నేర్పుతున్నా ఈనాడు..

//నవ్వితే నవరత్నాలు..//
బంగారూ..
నే నవ్వితే నవరత్నాలేనోయ్..
పెదవుల్లో జారు ముత్యాలసరాలు
నక్షత్రాల జల్లై రేయిని వెలిగించాక
కెంపుల పెదవులు అరవంకీలు తిరిగి
నెలవంకను సవాలు చేసాక
వజ్రమంటి నా కంటి చూపుకి
నీ హృదయానికి కోతలు తప్పవుగా
పచ్చపూసల సౌందర్యంతో
ఆ నవ్వుకి కాంతులు దిద్దాక
పుష్యరాగమంటి భావాలు
నీ కవితకు నేనిచ్చే మకుటాలేగా
ఇంద్రనీలమంటి స్వప్నాల లోగిళ్ళలో
ఏకాంత మౌనాల నీరాజనాలిచ్చాక
పగడమంటి కుంకుమ బొట్టుతో
గోమేధికమంటి మిసిమి చాయతో
నీ వేకువకు వెన్నెల నేనేగా
పొగడపువ్వుల పరిమళంలా
మువ్వలగజ్జెల గలగల రవములా
మింటిమెరుపుల ఆనంద కేళిలా
పూలతీగల ఒయ్యారములా
రంగురంగుల సీతాకోకలా
మధురక్షణాల కౌగిలింతలా
నవ్వనా నేనిలా..
చైత్రమాసపు తొలి కోయిలై కిలకిలా..

//ఊహాలహరి//
కొన్ని జన్మల పారవశ్యాన్ని
వెంటేసుకొచ్చిన హరితస్మృతులు కొన్ని
ఎడారిలాంటి ఎదలో
మొలకలుగా మొదలై శాఖలుగా
విస్తరించాక
నీ తలపును నా తనువంతా పూసుకున్నట్లు
మునుపులేని రసానుభూతి స్పర్శను
తడిమి చూసుకున్న సంతోషం
సారంగి తీగలపై వినిపించిన మంత్రమై
పండువెన్నెల కురిసి
వెలుగుపువ్వులు వికసించిన సుగంధమైంది
అలలై పొంగిన
ఊహాలహరిలో ఊయలూగుతున్న
మౌనరాగానికి భాష్యమిప్పుడు
పూలరేకులై పురులు విప్పి
నా పెదవిని తాకిందిలా సరసస్యందనై..!
//కొత్తకొత్తగా..//
ఒకనాడు సంతోషానికి సన్నిహితమైన నన్ను
దిగులొచ్చి దూరంగా లాగి
పరిచయం లేని నీరవానికి నేస్తం చేసి
హృదయానికి తెలియని పూతలు పూసి
పెదవుల్లో నవ్వు కన్నుల్లో కనిపిస్తుందని
వెక్కిరించి మరీ ఆహ్లాదాన్ని తరిమింది
నీలి స్వప్నాల లోగిళ్ళన్నీ
కాటుకపిట్టల రంగులలముకున్నాక
కలలకు దూరమై
రాని నిద్దురని తిట్టుకున్నా..
ఇప్పుడు మరోసారి గతంలోకి పయనించి
ఆనందాన్ని ఆలింగనం చేసి
ఖాళీ అయిన మనసు కుంభాన్ని
పారవశ్యపు రసఝరిలో ముంచాలనుకుంటున్నా..
కుహూరవాల కోయిలనై ఎగిసి పల్లవించాలనుకుంటున్నా..

//అరె ఏమైంది...//
ఏమైంది నా మనసుకి...
ఉదయం నుండి మబ్బుపట్టిన ఆకాశంలా స్తబ్దుగా ఉన్న నామనసు
ఒక్కసారిగా చైతన్యవంతమైంది ఎందుకూ...?
ముసిరిన మేఘాలు, కురిసే చినుకులతో విసుగెత్తిస్తున్న వాతావరణం
ఒక్కసారిగా ఆగిపోయి, చీకట్లను చీల్చుకుంటూ ఒక వెచ్చని ఎండ పొర ప్రకాశించినట్లు..
చికాకుగా, గజిబిజిగా ఉన్న నా అంతరంగంలోకి ఒక వెలుగు రేఖ ప్రసరించి హృదయమంతా దేదీప్యమైంది ఎందుకూ...
నిండుగా, నిశ్చలంగా ఉన్న నదిలో ఒక్కసారిగా ప్రవాహం మొదలైనట్లు...
గంభీరంగా ఉన్న నా మదిలో ఏదో తెలీని ఆనందం ఒక కెరటంలా ఎగసిందెందుకూ...
ఆషాడమాసమంటి నా మనసు ఋతువులో
హఠాత్తుగా శ్రావణ జల్లేదో కురిసినట్లు కొన్ని మైమరపులెందుకూ
కలలోనే అనుభవించిన సంతోషం
వెన్నెలగా మారి నా నవ్వుల్లో నాదమై మౌనాన్ని తరిమిందెందుకూ..
ఓహ్....
ఇప్పుడు తెలిసిందిలే....
నా మదిలో మెదిలిన నీ తలంపు మహిమే కదా ..........ఈ గమ్మత్తు..

//నువ్వక్కడ..నేనిక్కడ//
ఉరుకులపరుగుల జీవనగతిలో
ఆలోచనలకు చోటులేని యాంత్రికతలో
పువ్వుల బాషను మరచి..పున్నమి నవ్వులను విడిచి
యుగాల ప్రేమను వదిలి..అనివార్య సంఘర్షణల ఒంటరితనంలో
గమ్యం మరచిన అడుగులతో
చలించని జడచేతనవై నువ్వక్కడ
నీ తలపుల కుండపోతతో నిద్దురలేని రాత్రులలో
కరిగిన కాటుక కన్నుల తడి చూపులతో
అవ్యక్తరాగాల వియోగపు ఊపిరి మునకల్లో
కదలని కాలాన్ని బ్రతిమాలుతూ
నల్లని అక్షరాలతో ప్రేమను రాసుకుంటూ
తీపి జ్ఞాపకాల తేనెవెక్కిళ్ళతో నేనిక్కడ
అమృతం కురుస్తున్న అనుభూతులే అన్నీ
సౌరభం కొరవడిన జీవన పయనంలో
నింగినీ నేలనూ కలిపేందుకూ వానొస్తుంది..
మరి..నిన్నూ నన్నూ కలిపేందుకు ఏ అద్భుతం జరగాలో..

//ఒక విచిత్రం//
కంటి చివర జారేందుకు
సిద్ధంగా ఉన్న కన్నీటిచుక్క
బుగ్గలను సుతారంగా తాకాలని
తొందరపడినంత నులివెచ్చగా
నీరెండ వెలుతురులో
కళ్ళు చికిలించి
సగం ఇష్టంగా
నా మోమును పరికించాలనే సంశయంలా
నువ్వెప్పటికీ నాకర్ధం కాని విచిత్రానివే
నేనో విషాదపుటంచున నిలబడ్డ రాగాన్నైతే..!
అర్ధరహితమైన నా ఆలోచనను వెక్కిరిస్తూ నీవుంటే..
వేకువలో స్వాప్నించాలని ప్రయత్నిస్తూ నేనుంటా..!
//పరవశ పరిమళం//
దోసిళ్ళతో చూపులు వెదజల్లుకున్న వేళ
ఒక అమాసను వెలిగించిన వెన్నెల
ఆరోజు కురిసిందన్నది నిజమే కదూ
పచ్చని చెక్కిట కెంపులు ఒదిగి
సంధ్యారాగపు సరిగమలు
గంటల్ని క్షణాలుగా కరిగించినప్పుడు
ఆ ఆనందంలో ఒక రాగం రవళించింది
నా నవ్వును స్వీకరించిన
నీ నయనం విడిచిన భాష్పం సాక్షి
మిణుగురు మెరుపుల సంతోషాలు
నా శ్వాసను అల్లుకున్న స్వరాలై
ఎదురైన మనోవనాన్ని
పరిష్వంగంలో పొదుగుకున్నాక
తేనెచుక్కల తీయందనమేనది
మెల్లెవాకల పరవశ పరిమళం మన సొంతమే మరి..

//రంగుల కల//
కారు చీకట్లను కత్తిరించాలనేం అనుకోలేదు
తోయంపుగాలి భావావేశపు
గిలిగింతలతో మదిని తాకినప్పుడు
వేడెక్కిన ఊహలు దృశ్యాలుగా సాక్షాత్కరిస్తాయని అనుకోలేదు..
ఏకాంతమనే తపస్సులో మనసు
విలీనమవుతున్న క్షణం
రంగులద్దుకున్న కల కన్నులను పలకరించింది
భావనాకాశంలో ఆత్మావలోకనమే అయ్యిందో
అంతరంగములో సంగీతమే విరిసిందో
మిరుమిట్లు గొలుపు వెలుగొకటి పడగలెత్తింది
ఇప్పుడిక రెప్పలమాటు నిశీధి కోరల్లో
కలకలాలేమీ లేవు
పుప్పొళ్ళ పరిమళాలన్నీ పెదవులద్దుకున్నాక
రాత్రి తెల్లవారకున్నా బాగుండనే అనిపిస్తుంది
రెక్కలు విప్పుకున్న భావాలను స్నేహిస్తూనే ఉండాలనిపిస్తుంది..!!
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Baby Shark DooDoo DooDoo Doo.. మళ్ళీ బాల్యంలోనికి పరుగెత్తాలనుంది ఇంద్రజాలమై కదిలే కాలాన్ని వెనక్కి తిప్పాలనుంది చాక్లెట్లు పూసే చెట...
-
అందరిలాగే ఆమెకూ ఆశలెక్కువ అందరికన్నా కూడా ఆమెకు అందమెక్కువ అందాన్ని ఆదరించే లోకముందని తెలిసినప్పుడే మొదలైన భ్రమలు కట్టు బట్టలతో గడప దాట...
-
ఈ వేసవి సాయంత్రాన..ఏదో సుతిమెత్తని రాగం.. మదిలో మొదలైన నిశ్శబ్దం కరిగి కోలాహలమేదో మొదలైనట్టు.. పచ్చదనం మాదిరి పదేపదే పెనవేసుకొనే చిరు...
-
ఇక్కడిక్కడ లోకమనే కచేరీలో పాడుతున్నట్టే కనిపిస్తా ఓ నిమీలిత అనుభూతినై ఏకాంతంలో నేనున్నా మోహంలో మునిగినట్టుండే ఆత్మస్పృహ నేనో అంతర్లోకం...