Wednesday, 13 September 2017

//మరు..వాన..//


కదలికలాపలేని కాలం
ఋతువులు మార్చుకుంటూ వయ్యారాలు పోతుంది
అప్పుడెప్పుడో మరచిపోయిన గీతంలోని
వావిరిపువ్వుల వానలు గుర్తొస్తాయి
అనంతాన్ని అన్వేషిస్తూ
చిరునామా లేని మేఘం వెంటబడ్డట్టు
వెలిసిపోయిన వానిప్పుడు
మదిలో చెమ్మని వర్షించమంటుంది

ఇసుకలో నడిచిన పాదముద్రలు
అనుసరించిన ప్రతిసారీ
నెమరింతల్లో నీడ అడ్డుపడ్డట్టు
శిధిలాలుగా మిగిలిన స్మృతుల శకలాలేమో
అతికించాలనుకున్నా పొంతన కుదరవు
అర్ధంకాని భావాలు విహంగాలై కవ్విస్తుంటే
ప్రవాసానికి పయనమైన విహారినై
ఆకాశమంతా గాలించినా
కొన్ని జ్ఞాపకాలను రాయలేకపోతుంటాను
అలల్లో చెదిరినట్టు
అక్షరాలందుకే చెల్లాచెదరవుతుంటాయి
మదిలో ఖాళీ జాగాన్నందుకే దాచిపెట్టాను
ఏ రూపంలో వానొచ్చి కురిసినా
కాసింత పరిమళాన్ని ఒడిసిపట్టాలని
తడిచిన పుప్పొడిలోని రహస్యాన్ని
మధుకావ్యంగా పూర్తి చేయాలని..:)

//అప్పుడు..//



నాకిలా నవ్వాలనే ఉంటుంది..
నీ పదాలు వాక్యాలై నన్ను రాస్తూ పోతుంటే
నా కన్నుల్లోని ఆనందాలు
కన్నీరై జాలువారినా ఫరవాలేదనిపిస్తుంది
నన్నో వర్షంతో పోల్చినప్పుడల్లా
నీలో హర్షం నర్తిస్తుంది చూడు
ఆ చూపుల్లోని ఆర్ద్ర నన్నెప్పటికీ దాటిపోదు

మనసిచ్చావేమో తెలీదు
నిన్నడగాలనుకున్న ప్రతిసారీ
అవే భావాలు
నా మనసంతా పరుచుకున్నట్టు హరివిల్లులు
నేనో ఆకాశమయ్యానేమో అనిపించినట్టు
నువ్వెలా ఉన్నా ఏమనాలనిపించదు..
నన్నిలా సప్తవర్ణాలతో నింపుతున్నప్పుడు..


//నా పాట..//




ఎక్కడి నుంచి వినిపిస్తుందో పాట
"సంపెంగి నవ్వుల నువ్వేనా.."
మళ్ళీ అదే మైమరపు
ఆ పాట నాకోసమే నువ్వు పాడినట్టు
నానార్ధాలతో నన్ను మెచ్చుకున్న పాట..
ఒక స్పందన నిలువెల్లా పాకి
కలో నిజమో గిల్లుకొనేలోపు పూర్తయిపోతుంది

ఆనందంతో కొట్టుకులాడుతున్న గుండె
హృదయాలు కలిసిన చోటే ఆగిపోమంటుంటే
నిరసనలోంచీ మళ్ళీ మొదలవుతుంది
ఎక్కడో మునిగి మరెక్కడో తేలే అలల్లా
కొన్ని స్మృతుల జోరు
నరాలు జివ్వుమనిపించే మధుపవనపు హోరు..

కాలం పాటగా మారిన చోట
కన్నుల్లో విరిస్తూ నవ్వులు కొన్ని
నీకు వశమై కొన్ని జన్మల తపనలు తీరాక
మంత్రాలతో పనిలేదంటూ..:)

//ఏమవుతానో..//



నీ ఎదురుచూపుల యామినినై నేను
వేకువకు లోకువయ్యాను..

వసంతానికని మొదలైన నేను
పండుటాకునై రాలిపోయాను..

నవ్వునై విరబూయాల్సిన నేను
ముభావానికి మక్కువయ్యాను..

నిరంతర నీ తలపుల్లో తేలిపోయే నేను
వాడిపోయిన స్మృతుల దండనయ్యాను..

ప్రణయసీమకు రాణినైన నేను
నీ కౌగిలి ఆసరాకని భిక్షువునయ్యాను..

ప్రేమను ఇవ్వడమే తెలిసిన నేను
నిన్ను మాత్రం బదులు కోరి భంగపడ్డాను..

ఇంకేమవుతానో తెలీదు..
నానాటి బతుకులో నాటకీయతొక్కటి మిగులుతుంటే..


//గతం..//


//గతం..//
ఎంత నడిచినా అలుపురాని కాళ్ళు
బహుశా గతంలోకి ప్రయాణమంటే ఇష్టమనుకుంట
చురుగ్గా నవ్వుతున్న కన్నుల్లో
చిత్రమైన కాంతి..రేయే పగలైనట్టు

ఏ మాటలు స్మృతుల్లో వినబడ్డందుకో
నాలో మౌనమిలా ఒలికింది
చూపుతో నాటలేని చిత్రాలు కొన్ని
పిలవకుండానే మస్తిష్కంలో ముద్రలై
అదిగో..
నీ ఉనికిని గుర్తు చేస్తున్న పరిమళం
నా చుట్టూ పరిభ్రమిస్తున్న మేఘం
కలలా కదిలే కొన్ని ఊహలు
ఒంటరితనానికి సాంత్వనిస్తున్నాయి..

ఎవరంటారిప్పుడు నేనేకాకినని
నా భావంలో నీకు భాగస్వామ్యమిచ్చి
అనుభూతుల మన సహజీవనం మొదలయ్యాక..
ఇప్పుడో ఎండుటాకులా గలగలమనవలసిన పనిలేదు
వడ్డించిన విస్తరిలో రుచులొక్కొక్కటిగా తెలుస్తున్నాక..:)

//ఇంకేం మాట్లాడను..//



ఒక్క పలకరింపుకే నేనెదురు చూస్తుంటా
నిన్న కొంగుకు కట్టుకున్న ఆనందాలు
ముడివిప్పిన సీతాకోకలై నేడెగిరిపోతుంటే
అందుకోలేక అలసిపోయి చతికిలబడుతుంటాను

నిన్ను తడమలేక ఓడిపోయిన నా తలపులు
నులివెచ్చని నిరాశను ఒలికించబోతే
గుండెల మీద చెయ్యేసుకొని ఊరడిస్తాను
నీ వర్ఛస్సుతో వెలగాలని చూసే నా కన్నులు
ఎదురుచూపుల భంగపాటుతో సోలిపోతుంటే
రాబోయే ఉప్పెనను రెప్పలకు తెలియకుండా దాచాలనుకుంటాను.

మానసికానందం మరచిన నీ చెలిమిలో
ప్రతిసారీ నువ్వపరిచితమవుతుంటే
జ్ఞాపకాన్ని పారేసుకోలేక
నీకు నేనేమవుతానన్న ప్రశ్నతోనే మౌనాన్ని సంధిస్తుంటాను..
ఇప్పుడింకేం మాట్లాడను..
నీతో కలిసి కదలాలనుకున్న కాలం ఏకాకిగా నన్నొదిలేసాక..
నాతో నేను బ్రతకలేక నిర్జీవితనై మిగిలిపోయున్నాక..


//తొలి కిరణం//


నా తొలిచూపు కిరణం
నీలోకి మకాం మార్చి
అనుభవానికని తొంగిచూసింది

అప్పుడెప్పుడో అందుకున్న చుంబనం
మధురిమగా మారి
గాలికోసం వెంపర్లాడింది

నీ తలపిప్పుడు నారీకేళపాకం
పెదవుల్లో ప్రేమరాగం

నా ఎదలో మొదలైన పరిమళం
నీ వైపొచ్చి నిద్దుర లేపుద్దని తెలుసు
ఈరోజంతా విశేషమే నీకిక
ఉద్వేగం ఉప్పెనైనందుకు..

//వాన//



వస్తావనుకోలా..
అన్ని మైళ్ళ దూరాన్ని అధిగమించి
కిటికీ లోంచీ చూసినప్పుడల్లా అనుకుంటా
నా నిశ్శబ్దాన్ని ఒక్కసారి చెదరగొట్టేలా
మట్టివాసనకి నా మతిపోయేలా
నువ్వు రావొచ్చు కదాని..

ఏమాట కా మాటే
జరీపోగుల్లా జారే వెండితీగల సోయగం
అనుభూతికి వెంపర్లాడమన్నట్టు రుధిరం
మనసంతా వెచ్చని ప్రవాహపు కోలాహలం
కొన్ని చినుకుల్ని ఏరుకోవాలనుకున్న ఆనందం
ఎప్పటికీ ఆరబెట్టుకోవాలనిపించని జ్ఞాపకం

నిజమే
ఒక్కసారి చలి పెంచేసేట్టు వస్తావు
అణువణువూ బరువెక్కేట్టు చేస్తావు
వానంటే నువ్వే..
పచ్చపచ్చని బ్రతుకు రహస్యం నువ్వే
ఎప్పటికీ నేనిష్టపడే నేపధ్య సంగీతం నువ్వే..


//మౌనగీతం//




అదిగదిగో ముద్రలు
నిన్నటి జ్ఞాపకాల తాలూకు శిధిలాలు
ముక్కలైన మనసు రాళ్ళు..నేల రాలిన పారిజాతాలు
సున్నితత్వానికో బరువు తూచాలని
కళ్ళు మూసిన ప్రతిసారీ అవే దాగుడుమూతలు

నిశ్శబ్దమో గంథమే అయితే
ఆ పరిమళానికో గమ్మత్తుందేమో
రాతిరి కదిలే రహస్యాల్లో
తొలిసారి తీసుకున్న సంతకం
చల్లగా కదులుతుంటే దేహంలో
కనబడని విద్యుత్తు ఉల్లాసమై ఊగుతోంది

స్పందించే మనసుకి
గడ్డిపోచల కదలికలోనూ ఒయారమే కనిపించినట్లు
ఆకాశంలో నక్షత్రాలు మెరవకపోయినా
కన్నుల్లో పాలపుంతల కలలేగా
ముఖకవళికలెన్ని మారినా
వదనం చందమామకి సమానమైనప్పుడు
ముడతలు వయసుకే కానీ మనసుకి కాదుగా
మాటలన్నీ మౌనంలోకి జారిపోయినా
ఊపిరితీగల చలనంలో సంగీతమేగా..:)

//గ్రహణం//




సన్నజాజులు మంటపెట్టే రాత్రుంటుందని తెలీదు
కొన్ని జ్ఞాపకాలు మధురంగా వేధిస్తుంటే
హృదయస్పందనలోని వేగం
నీ థ్యాసతో అలమటిస్తుంతే
నీలికన్నులకెందుకో కలలు కావాలని ఆరాటం
రెప్పలార్చుతూ సీతాకోకలై రెపరెపలాడుతుంటే చూపులు
ఈ రేయికి నిద్రెక్కడుంటుందని సందేహం..

నీవైపుకే ప్రయాణించు క్షణాలు కాస్తయినా ఆగనంటుంటే
తవ్వేకొద్దీ గుంపులుగా అనుభూతులు ఆత్మీకరించుకుంటూ ఎగిరొస్తుంటే
తరంగమవుతున్న తలపులు
నన్నల్లుకోవాలని చూస్తున్న ప్రణయాలు
దూరానుంటూ నువ్వు చేసే అల్లర్లు
నిలువెల్లా రేపుతున్న అనురాగ కంపనాలు
అదేపాటని పదేపదే పాడుతూ పెదవులు
నీరవానికి స్వరాలు నేర్పుతున్న సందళ్ళు..
ఓయ్..
గ్రహణానికి మంత్రజపం సిద్ధిస్తుందట
మంత్రాక్షరిగా మారిన నీ పేరే వరాన్ని అనుగ్రహిస్తుందో
అకస్మాత్తుగా మొలకెత్తిన ఆనందమిప్పుడు..
ఎదురుచూపులో మేలిమలుపుని ఆశిస్తుందన్నట్టు..:)

//Poetic Thrill..//




మౌనం ముసురేసింది..
ఓహ్హ్..అర్ధమైంది
మరో ప్రబంధం రాసే వేళయ్యిందని..
ఓ పక్క వాన కురుస్తూనే ఉంది
మరులుగొలిపే లోకంలో నువ్వూ నేనూ
గోడకు వేళ్ళాడుతున్న అద్దానికో కుతూహలం
అప్పుడే నిశీధిలో స్నానం చేసొచ్చిన మైమరపులో నేనుంటే
నన్ను ముంచేసేంత మోహం నీ కన్నుల్లో
పూల రేకుల మెత్తదనం నా తనువుదైనప్పుడు
అంతులేని వాత్సల్యం నీ ఆలింగనం..

ఆదమరచి నిద్రించాలని చూసిన ప్రతిసారీ ఇదే కల
ఎక్కడో ఊహల సరిహద్దులో
నా పెదవంటే నీ చూపుల తీపులు
సిగ్గుపూల సువాసనలేస్తూ మన శ్వాసలు
ఊపిరి బరువు తెలిసే ఆ క్షణాలూ
నాలో ఉదయించిన ప్రశ్నలకు నీలో సమాధానం వెతుకుతున్నందుకేమో
కల్పన కొనసాగింపు కానివ్వమంటూ కలం
కవితలో నిన్నుంచినందుకదో గర్వం..;)

//నువ్వే..//




నీలో నువ్వు అంతర్ముఖమై అంతఃచక్షువులతో
అస్తిత్వాన్ని చదువుకున్న వేళ
అంతరంగానికి ఆడా మగా ఒకటేనని
అద్దంలా వెలిగే వ్యక్తిత్వానివి

అనుభవిస్తున్న చింతలూ వంతలూ
వెంటాడే జ్ఞాపకాలూ..నిన్నటి ఆనందాలు
నిష్కారణ బాధలూ..గుండెల్లోని ఘర్షణలు
నిష్కృతి కోసం ఎదురుచూసేందుక్కాక
తారా తారా నడుమ ఆకాశపు అందంలో
అప్పుడప్పుడూ శూన్యాన్ని స్వీకరించగలిగే సత్యానివి

క్షణాల సాన్నిథ్యంలో..ఆత్మ వశీకరణంతో
కన్నీటి చుక్కల్లోనూ కుంచెను ముంచుకొని
ఊహలు చింత్రించుకోగల తపనతో
చీకట్లో సూర్యోదయాన్ని రెప్పలకద్దుకోగల నేర్పువి

మానసికంగా నువ్వెప్పుడూ చైతన్యానివే..
అక్షరలక్షల సముపార్జనలో విజయుడివే..!!

//మనసు చప్పుడు//



ప్రస్తుతంలో బానే ఉన్నాంగా
ఊహ నుంచీ వాస్తవాన్ని వేరు చేయలేకపోయా
అంతే, నవ్వులన్నీ ఆగాధంలో చేరి
మొత్తం తలక్రిందులయ్యింది

ఏదో చెప్పాలని మొదలెట్టి
మరేదో కావాలని ఆశించి
చివరికింకో విషాదాన్ని కూర్చుకున్నట్టు
దూరాన్ని చేరువ చేసే జ్ఞాపకాలూ
రంగురంగుల వాసనేసే విరహాలూ
చీకటవుతూనే చెంత చేరే కలలూ
ఇప్పుడన్నీ మనసు పొలిమేరల్లోనే ఆగిపోతున్నాయ్

అవును..
నిదురపట్టని క్షణాలకు పరుగెత్తడం రాదు
దోసిళ్ళలో దాచుకున్నా భావుకలు
ఆకాశానికెగిసి నక్షత్రాలైనట్టు
నేనిప్పుడు ఒంటరిగా మిగిలిపోయా
నా చూపుల్లో నువ్వు చదవగలిగే
సారాంశమంతా శూన్యమిప్పుడు
మౌనరాగాల నిస్పృహలోనూ అపశృతులు
నాలో నేనైన నేను..
నిరంతర నిశ్శబ్దాన్నిప్పుడు..


//Pain Killer..//



ఈ బాధకో ఉపశమనాన్ని వెతకాలి
కొన్నాళ్ళుగా ఇదే నొప్పి
ఎక్కడ మొదలైందో తెలియని దిగులు శాపమై నర్తిస్తుంది..

పూసిన గులాబీకో అర్ధమున్నట్టు
కాలం తీరిన పిచ్చుకకో కథున్నట్టు
నాలో వైరాగ్యానికో సమాధానముంటే బాగుండు..

కన్నీటి చుక్కల చెక్కిలి మైదానంలో
చూపులు గిచ్చని నొప్పులు నాలుగింతలు..
ఇరుకైన హృదయమనే రాజ్యంలో
చోటులేని చిరునవ్వుకు ఉక్కబోతలు

ఇప్పుడీ నొప్పికో మందు కావాలి
ముసురేసిన తలపులో కవిత్వమన్నా కురవాలి..!!


//ఏమ్మాయో..//




మూసిన రెప్పలపై
కలలు కేరింతలయే వేళ
ముసురేసిన చీకట్లో..చినుకు సందళ్ళు
నా రాత్రిని భంగం చేస్తూ
మనసు పరిమళిస్తున్న వేడుకలు
చిగురు పెదవిపై మకరందమిప్పుడు
తానో తుమ్మెదై రావాలనన్నట్టు..;)

//రాతిరికి స్వరమొస్తే..//




కురవకుండానే కదిలినందుకేమో మేఘం
నిన్నటి కల గుర్తొస్తుందిప్పుడు
కన్నుల్లో నీలినీడలు తొలగి
నక్షత్రాలకు చోటిచ్చినట్లు
మదిలో వెన్నెలకు తోడు మైమరపు

త్వరపడుతున్న క్షణాలను ఆగమనాలనుంది
ఒక్క పలకరింత సోకి
హృదయస్పందన రెట్టింపైనట్టు
నవ్వులన్నీ నందివర్ధన పువ్వులిప్పుడు

మౌనం మాటున మోహనరాగం
భావగీతాన్ని కూర్చుకుంటున్న ఏకాంతం
కోటికలల కొత్తందాలు
కావ్యనాయిక నేనైన కలవరాలు

పూలగదిలోని పరిమళమంతా ప్రేమైనట్టు
విషాదానికి తాంబూలమిచ్చి పంపాక
ఆనందం ఆమనిగా అడుగులేసింది నావైపే
మోహతరంగమిప్పుడు.. వీచే కురుల విన్యాసం
మంచిగంధపు కళ్ళాపి చప్పుడు..మురిసిన రేయి సౌందర్యం..:)

//నీలాలు..//




ఎంతకని తొంగిచూస్తావో..ఆ ఇంద్రనీలాల గనుల్లో
వెన్నెల్లో నీలిస్వప్నాల వెచ్చదనాన్ని వెదికినట్టు
ఆర్తి..నీ అంతులేని మోహావేశమా..

డావిన్సీ క్రిష్టల్స్ గా మెరిసే కన్నుల్లో
ఎప్పటికీ నీ రూపమేగా జాబిల్లి..

నీ జతలో మోయలేని హాయిని మోసే కళ్ళివి
తీయని తలపులు పండించు ఎర్రని చెంగల్వలు
నీ భావుకతకు అరమోడ్పు అందాలను
సంధించు రంగురంగుల విల్లులు
విషాదంలో ఆనందాన్ని..ఆనందంలో విషాదాన్ని
కలగలిపి సుస్వరాన్ని పలికించు కళ్ళు
నీ నిరీక్షణ శూన్యాకాశంలో నల్లని కాటుక పిట్టలు
ఎప్పటికీ నీలో అనుభూతిని వర్షించాలనుకొనే నీలాలు..:)

//నా అక్షరం//




నా అక్షరం ఆకాశం
దాని భావం అనంతం

నా భావం అక్షయం
దాని అనుభూతి వర్ణనాతీతం

నా అనుభూతి అపురూపం
దాని లక్షణం ఆనందం

నా ఆనందం దరహాసం
దాని సంగీతం అమూల్యం

నా సంగీతం అక్షరం
దాని గమ్యం రసహృదయం..:)

//జీవని//




అక్కడో దౌర్జన్యం జరుగుతుంది
అయితే అడిగే వారుండరు..
అవును..ఆమె జీవితం అతడ్ని పెనవేసుకొని పాతికేళ్ళయ్యింది మరి

ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరిగానే ఉంటుందామె
ఎవరి కలానికీ అందని భావజాలం ఆమె కన్నుల్లో
మదిలో సునామీలు సుళ్ళు తిరుగుతున్నా
నిశ్శబ్దాన్ని మోసుకు తిరుగుతున్నట్లుంటుంది
అయితేనేం..
ధర్మాన్ని అనుసరిస్తూ పోతుంటుందామె
కలల్లో ఒత్తిగిలి పడుకుంటూ
ఇప్పటికీ అతని కోరికలకు చీకటి వస్త్రాన్ని కప్పుకుంటుంది
కోపం, కసి, బాధ..ఏదున్నా కన్నీటితో కడిగేసుకుంటుంది

చీకట్లో వెలుతురును వెతుక్కుంటూ
బిగిసే పిడికిళ్ళలో నిస్సహాయతను దాచుకుంటుంది
దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ
మనసుని మారాం చేయలేక ముడుచుకుపోతూంటుంది

చుట్టూ ఎందరున్నా అంతర్లోకంలో ఆమె ఒంటరి
జీవించేందుకు ఓ ఆశలేకున్నా
జీవించడమే ఓ గెలుపైనట్టు బ్రతుకుతుంది..!!
 

.//రెప్ప చాటు ఉప్పెన//




నిన్న పూచిన పువ్వు గురించి
నాలోని Mental Stimulation గురించీ చెప్పాలనుకుంటానా..
ఎప్పుడూ ఏదో మాయలో
సంచరిస్తుంటావనుకుంటా
నా రాక పరిమళాన్ని గుర్తించలేని నీ మానసం
ఎంత విషాదాన్ని కన్నుల్లో కదిలిస్తుందో తెలుసా..

మనోగగనాన సూర్యుడిలా నువ్వుదయిస్తుంటే
ప్రతి ఉదయం వేకువ కిలకిల నడుమ
నీ రూపాన్నే ఊహిస్తా నేను..
కలల నెమరింతల పొద్దుల్లో
నా సమస్తాన్ని కేంద్రీకరిస్తుంటాను
మనసు పలికే మౌనరాగంలో అక్షరాలు కూర్చుకుంటాను

నువ్వింత పాషాణమెందుకో తెలీదు
దిగులుతో దిక్కులు చూస్తున్నా దరి చేర్చేందుకు రావు

ఇప్పుడందుకే రెండూ సమానమేననిపిస్తుంది..
కలలకు అర్ధాలు మారిన క్షణాలు
నీ ఎదురుచూపుల్లో ఓడిన నా నయనాలు..:(

//ఏకాంతం..//



చక్కని ఏకాంతం..
తనువో తరంగమై
ఆకాశమంత విస్తరించి
మదిలో మెత్తదనాన్ని మీటుకుంటున్న వేళ
ఆ కాసిని స్మృతులూ
మెలకువ కలలో
స్వరాలు తొడిగిన సంతోషాలవుతున్నా
పంచుకొనేందుకు నువ్వు లేనప్పుడు
క్షణక్షణాల విస్ఫోటనాలకెంతని ఓర్చను..!!

//నీరవం..//




మనిషి నిజం..మనసు అబద్దం..
నవ్వింది నిజం..ఆనందించడం అబద్దం
గడియారం ముల్లును వెనక్కెలా తిప్పగలను
దాహమంటున్న మనసు వెక్కిళ్ళనెలా ఆపగలను
మాటలన్నీ మౌనంలో దాచుకుంటూ
విషాదాన్ని సహనంగా ఓర్చుకుంటూ
కవితలన్నీ స్వరాలుగా కూర్చుకుంటూ
నిముషాల్ని నిర్దయగా తరుముకుంటూ
నేనో చంచలితనై నటనలో ఆరితేరిపోతున్నా..
కానీ..
నన్ను నేను నిగ్రహించుకోలేక ఓడిపోతున్నా
ఎందుకిలా అనుకున్న ప్రతిసారీ
కొన్ని ప్రశ్నలకు జవాబులుండవన్న విధి
అరనవ్వులు రువ్వుతూ నొసలు ముడేస్తుంది
నన్ను మాత్రమిలా ఏకాకిలా జ్వలించమంటూ..:( 
 

//సంగీతం..//



నువ్వు లేకుంటే ఏమయ్యేదో
భావుకత్వమంతా నీరవమై మిగిలేదో
జీవితమే శూన్యమైపోయేదో
ఆనందం బ్రహ్మత్వమై..ఆత్మలో మమేకమై
వెన్నులోకి తన్మయత్వం జారిందంటే
అది నీవల్లనే..
ఓ సంగీతమా..
నేనో ఒంటరిని కానని నిరంతరం నాలో ప్రవహిస్తూ
విషాదంలోనూ విరాగం ఉందంటూ
మాయని గాయానికి ఓదార్పు చిరునామా నువ్వు..
యుగాలనాటి గుండెసడికి నేస్తానివి నువ్వు..!!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *