Wednesday, 6 April 2016

//కలల వనం//



అదిగో కలలవనం..నను పిలిచే బృందావనం
నాకై ఎదురుచూసే నీవో వరం..అందుకే అయ్యా నీలో సగం
ఎన్ని ఊహల మాలలు గుచ్చానో
మన కలలవాకిలికి తోరణాలను కట్టేందుకు
శ్వాసకే బరువెక్కే రెప్పలను పైకెత్తలేక
నేలకే నేత్రాల నవ్వులను తోడిచ్చేసా
గువ్వల కువకువలో మన కలరవాన్ని కావలిస్తూ
అప్పుడప్పుడూ మెలకువలోనే కలలు కంటున్నా
నీ హృదయస్పందన తర్జుమా చేసే రాగాలెన్నో నా కలలో
నీకై చేసే నా తప్పస్సు వృధా కాదని..
మరో వేకువకైనా నిజమై తీరుతుందని ఒప్పిస్తూ..!!

//ఎందుకో ఇలా//



వసంతం కోసం ఎదురు చూడకుండానే
గండు కోయిలల్లె వచ్చి కొత్తపాట మొదలెడతావు
వేసవిగాలే కదాని విస్మరించగానే
కొత్తపూల నెత్తావులేవో మోసుకొచ్చి మాయచేస్తావు
నీ జ్ఞాపకాల తీవెను విపంచిగా మీటకుండానే
చిరునవ్వులో లీనమై నన్ను పలకరిస్తావు
కాలపురెక్కలతో ఎగిరిపోయిన గాయాలను నిమురుకోకున్నా
తళుక్కుమన్న కిరణమై స్వప్నంలోకి విచ్చేస్తావు
చూపుతో స్పృసించి చేయి చాచకుండానే
అనుభూతుల అలలలోకి రమ్మంటూ కౌగిలిస్తావు
మరపురాని తీయనిబాధ ఎక్కువగా ఉందెందుకో నేడు
నిశ్శబ్ద గతంలో నిన్ను తడుముకోకున్నా
మనం అనే ఇద్దరిని చెరిపేసి
ఒకరిలోంచీ ఒకరిలోకి ప్రవహించినందుకు
ఒక్కరుగానే ఒదిగామని నువ్వు చెప్పకనే చెప్పినందుకేమో..!!

//వెన్నెలకాపు//



మదిలోనే సంప్రదింపులు మొదలెట్టాను
నీ అలుకేమైనా తీరిందేమోనని
నన్ను పలుకరించి అరగంటైనా కాకముందే
నీ జ్ఞాపకాల ముత్యాలు
నా చూపులో తడిగా చేరి చెమరిస్తూ
నీపై గుండెలో దాచుకున్నా ఆపేక్షనంతా
కురిపిస్తున్నవి కమ్మగా..

నీ కోపం
శిశిరానికి రాలే చివరి ఆకైతే బాగుండనే ఆశలో
వసంతగాలిని వీయమని వేడుకుంటున్నా
నాలో రహస్యంగా దాచుకున్న నీ నవ్వులన్నింటినీ తట్టి
హృదయన్ని పరిమళింపజేసుకున్నా
ఏదో క్షణాన నువ్వొచ్చి
ప్రేమగా పలకరిస్తావని..
మదిలో మళ్ళీ వెన్నెలకాపు కాయిస్తావని..!

//ఒంటరి సాయంత్రం//


ఒంటరిగానే ఉండాలనిపిస్తోందెందుకో
విఫలమైన కోరికను నెమరేసుకుంటూ
గుండె చప్పుడెందుకో కఠోరంగా వినబడుతోంది
కాస్త అదుపు తప్పినందుకేమో
నిర్వేదమో..నిర్జీవమో
అదో శూన్యాకాశమైన భావమేమో

ఏదో తడుముకుంటోంది
ఎందుకిన్ని కలలు కంటావనో
ఎందుకిన్ని ఊహలు అల్లుతావనో
ప్రతి ఆలోచనా వేయిగా విడువడి
మస్తిష్కాన్నే చిందరవందర చేసేస్తూ
నిశ్శబ్దమే ఘోషగా మారి
తలపులో సుళ్ళు తిరుగుతూ
విషాదంలోకి జారిపోతుంది
అర్ధం కాని ఆశల నిట్టూర్పులో
శ్వాస సైతం చీలిపోతుంది
అదేనేమో..అంతరంగం ఇరుకైన భావనంటే..!!

//అస్పష్ట ప్రకాశిక//



తాత్కాళికంగా ఎడబాటొకటి సృష్టించాలనుకున్నా
కేవలం నీకు శూన్యాన్ని పరిచయించాలని..
నీకు తెలిసిన నిజాన్ని పలువురికీ చెప్పి
చులకనవరాదని..

నీ మనోభావానికి వాస్తవం తెలిసాక
నీలో నేను కొత్తగా చేరలేదని..
నా పుట్టుక మొదలయ్యిందే నీలోనని
కొత్తగా విషాదాలూ వియోగాలూ
ఇవన్నీ కల్పనలేనని నాకు ముందే తెలుసనీ..
తృప్తినిచ్చే ఒక ముగింపు నేనవ్వాలనుకున్నా..

కాలం కల్లోలినై కొత్త మలుపులు తిరిగినా
ప్రతిమలుపులో చివర నేనుంటాననేది నీకవగతమైతే చాలు
అక్షరంగా మలచుకుంటావో..భావాల గంధాలే పులుముకుంటావో
నీ కధకెప్పటికీ నేనే నాయికనూ
నీ ఎదకెప్పటికీ నేనే స్పందననూ..!!

//ఓయ్//



ప్రేమించడం త్వరగా నేర్చుకోవా..
నాలోని భావాలన్నీ ఎడారి కాచే వెన్నెలయ్యేలోగా..

అనుభూతులన్నీ అంగవైకల్యంతో పెనుగులాడేలోపు
నా అందాల మరందాల మాల
నీ ఎదను అలంకరించే తరుణాన..
మధుసాక్షాత్కార పరిమళం నా అణువణువునా అలదవా..

నిశ్శబ్దంలో మనసు..
నీతో విశ్వరహస్యాన్ని పంచుకోవాలంటోంది..
వెన్నెలంతా నీ అడుగులో చేర్చి..
ఉత్తుంగమై నా వైపే పయనించవా..! 


//నీ రాక//



ఎలా వచ్చావో తెలీదు
ఎప్పుడొచ్చావో కూడా గుర్తులేదు
కానీ నీ అడుగుల చప్పుళ్ళు
నా గుండెకు చేరినట్లు
ఎవరో మెత్తగా నడిచెళ్ళిన భావనప్పుడు
మళ్ళీ వచ్చావు
పదివేల పువ్వుల పరిమళాలేవో మోసుకుంటూ
ఎదకనుమలలో నడిచి నడిచి
అకస్మాత్తుగా పెదవులపై చిరునవ్వుగా జారావు
ఉషోదయాలు మాత్రమే తెలిసిన నాకు
రసోదయాలు..

మనసే మోహనమయ్యిందో
నీ రాకే శ్రీకరమయ్యిందో
మూగగొంతులో ఎన్నడూ పలుకని రాగాలు
పదేపదే ప్రపంచానికి దూరంగా నన్ను లాక్కుపోతూ
నీ సాన్నిధ్యంలోని అలౌకికం
నాలోని నన్ను కొత్తగా చూపిస్తూ
తడిచినుకు పాటలేవో రాయమంటూ
మళ్ళీ వెళ్ళొస్తావెందుకో
నువ్వొచ్చిన సంతోషాన్ని కాస్తైనా నిక్షిప్తం చేసుకోకుండానే
ఊపిరై నాలో చేరిన ప్రతిసారీ
నిశ్వాసగా నిన్ను వదలాలంటే బాధగా ఉంటోంది
కానీ నా ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నీవు నిండావనే
ప్రాణమింత హాయిగా ఉందనిపిస్తోంది..!!

//ఆత్మానందం//



కన్నులతోనే కరాచలనం చేసే కొంటెదనాన్ని
వారించలేని నా వాలుకళ్ళు వాలిపోగా
చూపులతోనే కొసరి వేడుకున్నావని
నిరుపమానమైన నవ్వులన్నీ నీకిచ్చేసా

ఆత్మను ఆవహించిన అల్లరొకటి
అణువణువునా అడుగులేస్తుంటే
మునుపెరుగని ఆనంద నృత్యం
నా హృదయవేదికపై సాగింది

నీ నవరాగాల అనుపల్లవి పదములకే
నీరవంలోని నలుపంతా విరిగినట్లు
ముక్కలైన మౌనం సాక్షి
మువ్వై మోగింది నా ఏకాంత కలరవం

అభినయానికందని భావాన్ని నేను పాడి
దిగంతాలకందని నీ ధ్యానంలో వినిపించినట్లు..
తొలిసారిగా నీ కన్నుల్లో పరిచయమైన ప్రేమ
నన్నో విరహిణిగా మార్చి నిన్ననుసరించింది

కోటి వీణలొక్కమారే మీటగా
మరచిపోయిన గతజన్మ అనుబంధమేదో గుర్తుకొచ్చినట్టు..
ఎప్పుడు మొదలయ్యిందో నాలో తీయని స్పందన
యుగాల నీ నిరీక్షణకు సమాధానమవుతూ..!!

//అంతులేని కధ//



కొన్ని విషాదాలకి అంతముండదు
ఎక్కడ మొదలయ్యిందో కూడా గుర్తుండదు
నన్ను వీడిపోయిన నీ చెలిమిలాగా
నువ్వెళ్ళినా..నీ సౌరభం నాతో మిగిలున్నట్లు
గతజన్మ స్మృతులతో మనం కలిసున్నట్లు
కల్పనేదో కలవరపెడుతుంటే
పున్నమినే గుర్తించలేకున్నా
హృదయమంతా పరచుకున్న నీలినీడలు
నక్షత్రాలను సైతం దాచి పెడుతుంటే
నిశీధి నిశ్శబ్దమొక్కటే నాకు తోడయినట్లుంది
శిశిరంతో పోల్చుకొని మరీ మనసు
నా నుండీ వేరుపడుతుంటే..
నాలోని ద్వంద్వాన్ని తట్టుకోలేకున్నా..
ఏకమైతే తప్ప విముక్తి లేదన్న మనసును
అదిమిపట్టలేని అవస్థలో నేనున్నా
మూతబడుతున్న రెప్పలమాటు
తామరతుంపరల గలగలలో
వర్తమానాన్ని కరగదీయాలని చూస్తున్నా..!!

//మనోరూపం//



కదలనంది కాలం..
కలవరించే హృదయాన్ని నిలువరించలేకున్నా
ఊహకందని మోహం వివశమై
నన్నల్లుకునేవేళ
నీవెప్పుడూ నాతోనేనన్న నిజం
ఎక్కడున్నా నీ ఊసు నేనేనన్న నమ్మకం
నా ఊపిరిని స్వరబద్ధం చేస్తుంది
నీ భావాన్ని అవలోకించి చూడు
మందహాసంలో మధురిమగా మారి
నీ అధరం నేనవలేదూ..
ఆ కనుపాపల నల్లని వెలుగులో
నీ రాత్రిని వెలిగించే దీపం నేనవలేదూ
నీ హృదిలోని మార్దవం
నేనని తెలిసాక
నీ మనోరూపాన్ని నేనన్నది సుస్పష్టమేగా..!!

//ప్రణయ ప్రహేళిక//



ఆర్తినీ..సంశయాన్నీ తమలో
దాచుకున్న నా కన్నులు
నీ ఊహలతో ఎన్నో ఊసులాడాలని
రాత్రుళ్ళు మేల్కొని..
భరించలేని పరితాపంతో నిన్నే పెనవేసుకుంటాయి..
రెప్పపాటు చప్పుడుకే..
కలగాని వాస్తవమొక్కటి చెళ్ళునకొట్టి
నిన్ను ప్రశ్నించమంటోంది..
ఇంతకీ నన్ను ప్రేమించానని నువ్వు చెప్పింది నిజమా..కల్పనానని
అందుకే అడిగేస్తున్నా..
నా మనసు తెలిసి
నీ పెదవి విచ్చుకుంటే నన్ను గెలిపించినట్టు..
ఇంకా నీకు నేనర్ధం కాలేదంటే..
నాలోని విరహం నిన్నింకా చేరలేనట్టు..!!

//సడి చేయని స్మృతులు//



ఎందుకలా వెంటాడుతావో..
జ్ఞాపకాల్లో జారినట్లుండక
పదేపదే నెమరింతల్లో చోటిమ్మంటూ..
రాత్రులన్నీ నీ తలపులతో కలతనిదురలు సరే
వేకువైనా వీడని నీ స్మృతుల గడుసరులు..

నీ మందహాసాన్ని ఊహించే వేళలో
ఎన్ని మైమరపులో నా కన్నుల్లో..
విశాలభావాలన్నీ తిరిగి తిరిగి
వివర్ణమై నిన్నే అల్లుకుంటున్నా
పరధ్యానంగా నేను చేసే చేష్టలతో
నీ ధ్యానంలో విచ్చుకొనే కొన్ని నవ్వులు..
ఎద నిండా నువ్వున్నా..
అనుమానిస్తూ అన్వేషిస్తానెందుకో..

మధురోహల దోసిలి పట్టకనే నువ్వొచ్చి
రెప్పల దోనెల్నో కలలు నింపి పోతావు
ఏ తావిలోనో ఎగిరొచ్చి
హృదినే రసప్లావితం చేస్తావు
పరుగు పెడుతున్న ఊపిరిలో చేరి
ఆత్మలో విలీనమవుతావు
వేల తటిల్లతలై మెరిసే నీ తలపే ఇంత వెలుగైతే
నువ్వెదురు పడితే ఎన్ని సౌధామినులు విరిసేనో
ఎన్ని వేల వెన్నెలలు నన్ను కోరి అభిషేకించేనో..!

//మలుపు//



గెలిచిందో వలపు..
నీ కవిత్వాన్ని స్వీకరించి..
తిరిగిందో మలుపు..
మరో కొత్త జీవితానికి నాంది పలికి

అక్షరాలన్నీ అలవోకగా చేరి..
తమను చేర్చుకోమని అల్లరి పెట్టగా..
రమ్యమై జారింది పరవశమైన పదమలా..

పెదవులపై విరిసివిరియని..
ఇన్నాళ్ళూ నాకే తెలియని
నెలవంకొకటి మెరిసింది చిత్రంగా..!!

//నీలోని నేను//



తొలిసంధ్య కుంకుమవన్నెలను చూశావు కదూ..
గుర్తుకొచ్చుంటానుగా ఆ ఎర్రని కాంతిలో
నా మోము నీ ఊహలకౌగిలిలో అరుణిమైనట్లు..
ఏ నీలిమను చూసినా నీ కనుపాపలు
నన్నే అన్వేషించినట్లు నీలో భావనలు
తరగిణులై నిన్నల్లుకొనే అల్లరిగాలులు
సుస్వర నాదమై నన్ను పాడి..
నీలో అలౌకికాన్ని మేల్కొల్పలేదూ
ఏ నిముషాన్ని నిమురుకోవాలని చూసినా
పరవశించే ప్రతిఘడియా
పరితాపమై పదే పదే ప్రణయాన్నే పల్లవిస్తోందిగా
సన్నజాజి పరిమళంలో దాగి ఉన్న నా జ్ఞాపకం
నీ నిరీక్షణలో మరింత తీయనై
ప్రేమామృత ధారలతో హృదయాన్ని ఉప్పొంగించిందిగా

ఏకాంతవేళల్లో మన రెండు గుండెల చప్పుడు
నీ హృదయాంతరాళల్లో వినబడ్డాక
ఇంకా అనుమానమేముంది
నీ ఆలోచనలో ఆంతర్యాన్ని నేను
నీ ఆత్మానందాల అనుభూతి నేను
నీ మనోరూపానికి దర్పణం నేను
నీ ఆవేదనాకెరటాల గమ్యం నేను
నీ మౌనంలోని రహస్యాన్ని నేను
నీ నివేదనకు ఫలితాన్ని నేను
నువ్వంతా నేనయ్యాక వేరే దిగులేముందని
అవ్యక్తమైన తాదాత్మ్యతలో లీనమైన ఆత్మలసాక్షి..
అక్కడ మిగిలింది అద్వైతమైన మన ప్రేమొకటేగా..!!

//తాపసి//



విరాగిలానే జీవితం చాలించాలేమో..
వెలుతురన్నదే లేనట్లు..అమాసకే నేను బంధువైనట్లు
ఎప్పటికీ స్వప్నం కాని కొన్ని వాస్తవాలు
ఒంటరిని చేసి నన్ను వెక్కిరించినట్లు
నాపైనే నాకు జాలిని గుప్పిస్తూ

అస్తిత్వం గురించిన ఆలోచన చేయవద్దంటూ
హృదయాంతర్భాగమెప్పుడూ చెమ్మగిల్లి
నీకోసం కాచుకొనే అపురూపాలేవీ లేవంటూ..
నన్ను మరింత విషాదానికి గురిచేస్తూ..

ఏ దూరతీరాలకో సాగిపోదామనుకున్న ఆలోచనలన్నీ..
రెక్కలు తెగిన కాటుకపిట్టలై
అదే చీకటిలో సమాధి కాబడుతూ
కూపస్థ మండూకంలానే ఈ జన్మకి బతికిపోమంటూ..
నాకేదో అన్యాపదేశ ఉపదేశం అందించినట్లు..!!

//మరాళినే//



పరాకుగానున్న హృదయంలో
జీవం కోల్పోయిన మాటలన్నీ చేరి
కొట్టుకుపోతున్న జ్ఞాపకాలను చేరి
ఎండమావిని ప్రవహింపజేస్తున్నట్లుంది
కురిసే ప్రతిమౌనం
అస్థిమిత భావోద్వేగమై
గొంతులోనే నొక్కిపెట్టిన భావమయ్యింది..

నీ పిలుపులోని అర్ధింపులన్నీ
అలుకనై నే తిరస్కరించిన వేళ
వద్దన్నా వెంటాడుతున్న నీ తలపులు
పరిష్వంగంలోకి రమ్మని పిలుస్తున్నట్లుంది
రహస్యంగా నీవాడే ఊసులన్నీ
మానసిక స్పందనలై
హృది మోగుతుంటే
వేళ విపంచిలకలై వినబడుతోంది

రెప్పలు వాల్చని నీ చూపు
పల్చగా నన్ను తడిమినట్లయ్యి
గుప్పిళ్ళు విప్పనన్న బిడియాన్ని బ్రతిమాలి
అణువణువూ అల్లుకుపోతోంది
నా చుబుకాన్ని చేరిన నీ వాత్సల్యంతో
వలపులన్నీ నిన్నే కోరుతుంటే
మరోసారి..
మరాళినై నటించాలనుంది
సద్దు లేని నీ ఆలింగనంలో..సంగీతమై ప్రవహించాలనుంది...!!

//ఆరాధిక//



హేమంతమని పిలిచినప్పుడే గమనించావనుకున్నా..
వసంతుని మించిన అందంతో..
హృదివేదికపై పరవశానికే వారసుడిగా నువ్వడుగేసినప్పుడు..
వాయులీనమై వినబడ్డ వేణుగానం..
ఆలపించింది నువ్వేననుకున్నా
తడియారని నా స్మృతులను తడుముకుంటుంటే..
ఆ పొన్నచెట్టుకింద నీకై నిరీక్షించిన
ఆరాధనా గీతికను నేనేనని కనుగొన్నా..
నీవో స్వరమాలపిస్తే నీలో నాదాన్నై..
నీవో కుంచె కదిపితే నీ గీతాల్లో గిలిగింతనై..
నీవో కవితనావిష్కరించబోతే నేనే కలాన్నై..
నీలో ఒదిగిపోయింది నేనేనని అనుకున్నా..
ఇన్నిమాయలూ చేసిన నీవో ఇంద్రజాలమైతే..
నీ మోవిలోని మకరంద మాధుర్యం నాదని అంటావేం సరసిజా..!!

//అస్థిరత్వం//



ఒకటిగా కలిసినట్టుగానే కనిపిస్తాం
నేనూ నా అస్తిత్వం
కానీ నాలో ప్రవహించే నిజమైన చైతన్యానికి
ముసుగేసుకున్న అస్తిత్వమొక ఆనకట్టవుతోంది
కలసి పయనిద్దామని నేను పిలిచిన ప్రతిసారీ
తన మాటే నెగ్గాలంటుంది
ఎప్పుడు చీలిపోయామో సరిగ్గా గుర్తులేకున్నా..
ఒకరొక నిజముగా ఎదిగాక..
మరొకరు అబద్దంగా ఆవిరయ్యాక
ప్రపంచానికి ఒక్కరుగానే పరిచయమయ్యాం
జీవితంలో గెలిచిన అడుగులు
కొన్ని యాంత్రికంగా మారిపోయాక
ఆనందపు అనంతత్వానికి దూరమయ్యా
ఒంటరితనమో పామై బుసగొట్టాక
అస్తిత్వమనేదొక కేవల భ్రమని సరిపెట్టేసా
అస్థిరత్వానికి మారుపేరుందేమోనని వెతకడం మొదలెట్టా..!!

//ప్రేమభావము//



కొన్ని భావాలంతే..
పెదవిదాటి బయటకు రాలేక
ఎదలోనే మౌనవించి
అల్లరి అదుపు తప్పినప్పుడల్లా
నన్ను నన్నుగా ఉండమంటూ..
అనుభవతీర్ధంలోకి రమ్మంటూ
నన్నాహ్వానిస్తాయి..

నిన్నటి కనుల కొలనులో
నిలువెత్తు నీ రూపం
ఈదులాడుతుంటే
దీపావళి జ్యోతుల్లా..కార్తీక దీపాల్లా
వెలుతురై విచ్చుకున్న ఆనందంలో
కాలావధులన్నీ చెరిపేసా

ఆకాశం నుండి రాలిన వెన్నెల తునకలను చేరదీసి
అనుభూతుల రాగాలను కలగలిపి
ప్రణయన్ని వేదంలా వల్లించే సమయాలలో
ప్రతిసారీ కొత్తదనమే కనుగొంటున్నా

ప్రేమగంధం అంటినవారికి
సంపెంగలూ..సన్నజాజులూ సమమేగా
అమృతధారలేవీ కురవకపోయినా
తడచిపోవడం మాత్రం నిజమేగా

చిక్కుకున్న నీ తలపుల వలలో
నా కలలన్నీ కవితలయ్యాక
పెదవులపై అరనవ్వు చేరి
ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చింది..
ఒక్కసారిగా నీ తలపు నాదయినట్టు..
నీ గురించిన ఆలోచనలన్నీ ఏకమైనట్టు..!!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *