Thursday, 10 March 2016

//నేనెవరో//



నేనేగా
నీ వర్తమానపు అద్దంలో
చూపుకందని శూన్యానికావల
రెక్కలు తెగి రాలిపడిన
చిదిమేసిన కలను

నిహారికా నిశ్శబ్దాలలో
నా హృదయపు సవ్వడే
విషాదపు ఘంటికై
వినబడుతున్న ఆత్మఘోషను

గుండెలోతుల్లో పేరుకొన్న మౌనాన్ని
ఏ వెలుతురూ చెరపలేని చీకటిలో
నేలకొరుగుతున్న
గగనమాపలేని ఒంటరి నక్షత్రాన్ని

ఎడారిలో శిశిరానంతరం
వసంతానికి పూసిన పువ్వులా
నిన్ను తడిమే వేళలో
నా ఎదలో...ఈ చెమరింపెందుకో
ఇంతకీ
నేనెవరినో..నీ గాయాన్నో..వైరాగ్యాన్నో..అభినివేశాన్నో

//నిన్న సాయంత్రం//


చుక్కలు వెలిగిన వేళ
చందమామతో నేనున్నట్లు
నీతో కలిసిన ఆ అపురూప క్షణాలు
పాలపుంతల కౌగిలింతలో నన్ను చేర్చి లాలించినట్లు
విరిసీ విరియని నీ మరువంపు నవ్వులు
నాలోని సోయగాన్ని తట్టిలేపి
మనసంతా మెల్లెపూలు జాలువారిన సవ్వళ్ళు..
పన్నీటి తలపులన్నీ నా ముందు నిలువెత్తు నిలిచి
నీలా నన్ను తొంగి చూస్తుంటే
వివశానికి పల్లవి కూడి ప్రేమను పాడమని తొందర పెట్టింది
చిత్రంగా పూసిన పెదవుల కాంతి..
కెరటమై సాగిన ఆనందాన్ని
తీపి మరకల తమకంగా తీర్చిదిద్దింది
లీలగా మెదిలిన ఎదలో పులకరింత
తనువంత తడిమి..కాటుకలనే కవ్వించి
మరో సాయంత్రం నీ పిలుపుకై ఎదురుచూడమంది..!!

//ఎదురుచూపు//


ఎంత కఠినమో ఎదురుచూపులు
నీకై వేచిన కొద్దీ నిరాశలో ముంచేసి
లోకువయ్యాననే ఆవేదనను మనసులో గుప్పించి
అణువణువూ ఒణుకు పుట్టిస్తూ..
నిన్నటి ఆలోచనల రొదలో..
విశ్రాంతి తీసుకోని మది
న్యూనతాభావంలో కొట్టుకుపోతూ..
ఆనందాన్ని నెత్తురోడింది
పిలుపందని మౌనమొకటి నాలో కలదిరిగి
వాస్తవానికి రమ్మంటూ సద్దు చేసింది
ప్రేమకై చేసే అన్వేషణలూ..తపస్సులూ నిరుపయోగాలని
వేడుకను ఆశించడం వ్యర్ధమని..
ఏకాకితనం ఎన్నటికీ చిగురించని వసంతమని నొక్కి చెప్పింది..!!

//రేపటి ఆశ//



నిన్న..
మనసంతా నువ్వై నిండిన అలౌకిక భావనేదో బాగుననుకున్నా
ప్రేమతో ఆర్ద్రమైన హృదయానికి లోకంతో సంబంధం లేదనుకున్నా
శూన్యమంటిన జీవనంలోనూ చంద్రోదయాలు సాధ్యమేననుకున్నా
చిగురించిన వసంతానికి శిశిరంతో పనేలేదనుకున్నా
నేడు..
మాధుర్యమంతా ఒక్కసారిగా హరించినట్లయ్యింది..
ఒక్కసారిగా నువ్వు దూరం కాగానే
వేల అమాసలొక్కసారే కమ్ముకున్నట్లు
చీకటి కోరల్లో చిక్కుకున్నాక..
ఆనందపు ఊడలెవరో లాగేసినట్లుంది
అంతరాలలో ఉబుకుతున్న విషాదానికి తోడు
ఆరిపోయిన నవ్వుకి మొహం నల్లబడి..
మౌనంలోనికి కూరుకుపోయింది నాలో చైతన్యం..
జ్ఞాపకాల తాకిడికి గుండె బరువెక్కి
నిరాశ మూలుగై నిట్టూర్చుతుంటే
తిరిగి అవే ఆలోచనల్లోకి అడుగులేస్తున్న నేను
స్వప్నాన్ని వేడుకుంటున్నా..
జీవనసంధ్యలో తళుక్కుమన్న నీ మెరుపుతో..
రాత్రినైనా వెలిగించమని..
నిరంతరానందమిచ్చే నీ తలపులను..
స్మృతిగానైనా నావెన్నంటి ఉంచమని..!!

//మౌనరాగం//



అక్కడే ఆగిపోయావెందుకు..
దగ్గరకి రావాలనిపించినా

నిన్నటిని తిరస్కరించినా
రేపటి మన క్షణాలను
గుర్తించి
కన్నులలిపితోనే సంభాషించా
నీ మౌనాన్ని అనువదించుకుంటూ..

నాకూ అనిపిస్తోంది..
మన మధ్య మిగిలిన సంకెల
తెగిపోకుండా
ఈ జన్మకిలా ఉండిపోతే చాలని

ఎప్పుడు విన్నా అవేగా
ఆ పాల వెన్నెల్లో
నీ మాటలన్నీ నాకు పాటలై వినబడ్డట్టు
నా చిరునవ్వుల్లో చోటిమ్మని వేడుకున్నట్టు
నీ అహరాహాల జపాలొచ్చి నన్ను తడిమినట్టు..

నువ్వెక్కడున్నా..
నా సర్వస్వం నీవేనని..
హృదయాంబరమే గొడుగు పట్టినట్టు..!!

//మధురభావమొకటి//



నేనో మోవిని ఆలకించాను
చెప్తే నమ్మవని.
కోయిల కూసిందని సరిపుచ్చుకున్నాను..

మధుమాసం తడిమినిందనుకున్ననోసారి..
వెన్నెల వెచ్చగా గిచ్చుతుంటే
హిమబిందువుని కాస్త సాయమడిగాను

కెంపులను రమ్మన్నాను
నా పెదవులపై విశ్రమిస్తే
పంచమవేదం నేర్చుకోవచ్చని నచ్చచెప్పాను

కనురెప్పలపై కావ్యాలు..
మడత విప్పితే కందిపోగలవని
మనసుతో మధుమాలికలను చదివాను

తీరానికావలి వైపు నీవున్నావనే నమ్మకంతో
ఆశానౌకకై వేచి చూస్తూ
క్షణమో యుగముగా నిశ్వసిస్తున్నాను..

నాలో ఊపిరి.. నీ తలపుగా..జీవిస్తున్నాను...!!

//హృదయ పరితాపం//

//హృదయ పరితాపం//

ఎక్కడని నిరీక్షించాలో..
నీ అనుభూతి మల్లెలు మనసుపొరల్లో పరిమళిస్తూ
కనిపించని నీతో మమేకమైపోతుంటే
నాలో నేను లేనని లీలగా అనుభవమవుతోంది..
కనులు మూసినా నిదుర రాని కన్నులు
నీ రూపును మాత్రం వెతుక్కొని వేదనపడుతుంటే
నాలోని ఆర్తేనేమో కన్నీరై జారింది..
బృందావనమంటి వెన్నెల రాత్రులన్నీ
కలలకే పరిమితమై నిశ్శబ్ద స్వరాలలో చేరిపోతుంటే
ఆకులు రాలిన సవ్వడి మాత్రమే మిగిలింది..
శూన్యాలయమంటి మదిలో గుడ్డిదీపం
ఆశల నిశ్వాసలకి రెపరెపలాడుతుంటే
దిక్కుతోచని ప్రేమకక్ష్యలో విహరిస్తోంది..

నిన్నలేని నీకోసం నేడింత పరితపించడమెందుకో
అంతులేని వేదనను చెలియలకట్ట దాటించడమెందుకో..
నువ్వు లేకుండానే ఇన్నాళ్ళూ ప్రవహించిన జీవితం
నీవొచ్చి మునగలేదని ముడుచుకుపోవడమెందుకో..!!

//రెప్ప చాటు నీలం//



పులకరింతలు పదివేలైనప్పుడు గమనించా..
కలబోసుకున్న కబుర్లతో తిరిగి జన్మించానని

రెండుహృదయాల ఎదురుచూపులకెన్ని విరహాలో
సిగ్గుతో వాలిన నిమీలితాలే నిర్వచిస్తుంటే
గమ్మత్తైన ఆవిరి నులివెచ్చగా గుండెను తాకింది
మాటలే పూర్తికాని రాత్రి..వేల కావ్యాలను రచించినట్లు
కమ్మని నీ స్మృతులు పరిమళాలై మేనల్లుతుంటే
మనసాపలేని పారవశ్యం పెదవుల్ని చేరి నవ్వయ్యింది

మనిద్దరమే ప్రణయమై మిగిలున్న ఆనందంలో
మధుమాసపు మైమరపొకటి
ముంగురుల్లో చేరి మనోహరాన్ని గుప్పించింది
ముసిరిన వెన్నెలరాత్రి
నీ గుసగుసల మంద్రస్వరానికి
మోహం నిద్దురలేచి నియంత్రించలేని దాహాన్ని రేపింది

పురులు విప్పుకున్న తమకాన్ని
తర్జుమా చేసుకున్న ఏకాంతం..
సడిచేయని పరిష్వంగంలో నీ పాపగా ఒదగమంది..
శిశిరాన్ని వీడిన మనోగతం
అపూర్వమైన నీ భావంలో లయమయ్యాక..
ఈ రాత్రినిలాగే ఆపేయమంది..!!

//అదే నిజం//



కొన్ని క్షణాలు తిరిగి రావు..

అడవిలోనైనా..
శిశిరమంటి హృదయాన్ని వసంతమొచ్చి పలకరించడం తధ్యం
చీకటి తెరలను చీల్చుకు వెలుగుకిరణం చొచ్చుకురావడం సత్యం

కదలనంటున్న కాలం..
నువ్వు దూరమైన భావాన్ని భరించలేక
హృదయ కారాగారాన్ని
ఛేదించాలని..
యావజ్జీవిత ప్రేమనంతా
నీ అంతరంగంలో చవిచూడాలని..
అన్వేషణేచ్ఛను జాగృతం చేయడం నిజం..

నీకోసం నిశీధి పొలిమేరను దాటాలనుకోవడం నిజం..
నీ నవ్వుల్లో నెలవంకనై మిగిలిపోవాలన్నది నిజం
నీ ప్రణయకక్ష్యలో పారాడాలనుకున్నది నిజం
నాకోసమే నిరీక్షించే నిన్ను కాదనలేనుగా ప్రియతమా...!!

Sunday, 6 March 2016

//ఒక్క అనుభూతి కోసం//




అనుభూతికందని పరిమళమొకటి..
ఆనందం నీలా.. నాలో కరిగిపోతుంటే..
నిన్ను స్మరించీ స్మరించీ..
నేను విరహమైపోయా..
అల్లరికదుపేముందని..
పలకరిస్తే పదనిసలో కలిసిపోతానంటూ..
తెలిమంచు తొలి తెమ్మర వీచికలో
పరవశాల తీపినైపోయా
సుధలు కలిపి అమృతమైన భావన
హత్తుకున్న అధరాలనలా కలిపి ఉంచితే..
గాడ్పుగ మారిన నిశ్వాసలో..
నీ కదలికలు వెచ్చగా మెలిపెడుతుంటే..
మధురోహలు నిజమైన భావన..
ఇంకా రమ్మని పిలుస్తావెందుకో..
నీ కరాల అల్లికలో నే మాలికనయ్యాకా కూడా..!!
 

//నేను//




మనసులోని మర్మమేదో బయటపడుతోంది..
కలలో మేల్కొల్పిన వేకువలా..మది వీడలేని కల్పనలా..
పెదవిప్పి చెప్పకపోయినా ఎన్ని ఊసులు వినబడ్డవో..
నీ ఒక్క అక్షరంలోన ఎన్ని భావుకలు నృత్యించినవో..
తలవకుండానే తలపుల థిల్లానా..
తడమకుండానే తపనల తమకానా..
ఇంకా అనుమానమా..
నేనో..కాదోనని..!!
 
 

//సమ్మేళనం//


ఎక్కడెక్కడి పల్లవులో నాలో మౌనవించే వేళ
నీ వియోగాన్ని మరపిస్తూ
అన్వేషణంతా ఏకం చేసే నా మధురోహలో..
అనుభూతులన్నీ నిన్నే కోరాయి

నా మనసుపొరల్లో నీదైన పరిమళమొక్కటి చాలేమో
వివశమైన నా మదిని వివరించేందుకు
నీ భావమనే పొగమంచు మధువుల్లో
నన్ను ముంచి పులకరింతలు పూసేందుకు

ఎప్పటికప్పుడు నిన్ను చేరాననే అనిపిస్తుంది
నా రాగం నీకు సంగీతమై వినబడుతుందన్నావని..
ఒక్క నీ హృదయాంతరాళ సాంగత్యంలోనే
రూపాతీత రహస్యమై ఉండాలనిపిస్తుంది

నువ్వాలకించే ప్రతి నీరవానికీ చాటి చెప్పాలనుంది..
ఒకే ఒక్కసారి నా వేణువై రవళించవూ
ఆగాధ నీలికడలి వంటి ఇంద్రియపులోతుల్లో
ఆత్మ సమ్మేళనమొకటి జరిగేందుకు సహకరించవూ..!!

//అవ్యక్తమైన ప్రేమ..//

అవ్యక్తమైన ప్రేమ..
రెండక్షరాలలో ఇమిడిపోయినట్లు కాదుగా
ఒక్కరోజే ప్రేమను ఆస్వాదించడమంటే
నిత్యమూ ప్రవహించాలి ప్రేమ
ఎదలో జీవనది ఉరకలేసినట్లు
భావానికందని ప్రేమ..ఒక్క కొనచూపుతో పెనవేసినట్లు
ఇంద్రధనుసై విరియాలి ప్రేమ
ఆకాశమంత అనుభూతి అలంకారములా
చూపుల ఏకత్వంతో మనసులు మమేకమయ్యేట్టు
లోకం కొలతలకు అందని ప్రేమే..కన్నుల్లో వెలిగే చిత్రమైన కాంతి
హృదయంలో అవ్యాజమై పెల్లుబుకు శాంతి
ప్రేమెప్పుడూ పండుగే..చేసుకొనే సరదానే నీకుంటే..!!

//చిన్ని చిన్ని ఆశలు//




ఆకాశమంత హృదయానికి
హద్దులెందుకనుకున్నాయేమో కొన్ని ఆశలు
ఎగిసిపడుతూనే అందుకోవాలని ప్రయత్నిస్తూ
నిద్దురపొద్దులు ఉరకలేస్తూ..

జీవనసారమంతా వినబడిపోతుంది..
మరుద్విహారమొనరించే పక్షిపాటలోనే
ఊహలకు రెక్కలు మొలిచిన కొత్తదనమేదో..
మదిలోనే మేఘమైనట్లు..

నెర్రలైన హృదయంపై కాలసాగరమొకటి ప్రవహించగానే..
గ్రీష్మానికే దాహం తీరినట్లుంది
కారుమేఘాలు మెరుపుతీగలై ప్రజ్వరిల్లగానే
నిశ్శబ్దమొకటి రాలిపోయింది నిట్టూరుస్తూనే..

అన్వేషణొకటి మొదలయ్యింది
ఉత్కృష్టమైన పరమరహస్యానికి దారి వెతుకుతూ..
అగాధలోతుల మాయాజాలాల్ని దాటుకుంటూ..
పువ్వులమధ్య పరిమళించేందుకు..
పుప్పొడిలోని తడిని శ్వాసతో తడిమేందుకు..!!
 

//ఆశల చప్పుళ్ళు//



కాలానికి గాలమేసినా
అందుకోలేని దూరం నడకని నిర్వీర్యం చేస్తుంది

మబ్బుపట్టిన ఆలోచనల తాకిడికి
మనసులో ఎగురుతున్న ఆశల గాలిపటాలు
ఒకేసారి నేలకూలిన కర్ణోపేయమైన శబ్దాలు..
రెక్కలు తొడగని చిన్నారి ఊహలన్నీ
చిద్రుపలై రాలిపడుతుంటే తెలుస్తోంది..
అనుభూతి రాహిత్యమైన మనసులో
నివసించడమెంత దౌర్భాగ్యమో..

నిలకడలేని నిశ్శబ్దం తాండవమాడి
సూక్ష్మమైన బుద్ధికి ప్రళయగర్జనేదో వినబడినట్లు
కూలిన ఆశల చప్పుళ్ళలో
మరణమృదంగమొకటి వాయించినట్లుంది
స్వానుభూతుల నిర్జన గృహంలోకి మనసుని పదపదమంటూ..
రెప్పల చాటు ఉప్పెనను చెలియలకట్ట దాటనివ్వొద్దంటూ..!!




//నవ్వు//



అదే పాలనవ్వు..పాపాయి నవ్వు
మూగబోయిన మదిని మీటు నవ్వు
చెలియ చూపుల చేమంతి నవ్వు
చింతలను తరిమేసే చిత్రమైన నవ్వు..
పూల తరంగాలపై తేలియాడు నవ్వు
సుస్వరమై వినిపించే సున్నితమైన నవ్వు
యవ్వన విందులోన పొంగారు నవ్వు
శరదరాత్రులను పదేపదే కలవరించు నవ్వు
వెన్నెల పువ్వుల కువకువ నవ్వు
మనసున దోబూచులాడే ముసిముసి నవ్వు
పచ్చని పొదరిళ్ళ పరిమళాల నవ్వు
మల్లెపువ్వును మరపించే మనోహరాల నవ్వు..!!


//మౌనతంత్రం//



ఆ కన్నులనీడల్లోని నిశ్శబ్దాలనే వెక్కిరించినట్లు..
ఎందుకంత శూన్యమా చూపుల్లో
జ్ఞాపకాల వీధుల్లో సంచరించి అలసిపోయిన బాటసారిలా
నన్ను మరచిన క్షణాలను వెతికి విసుగుతావెందుకో
ఆకుల మధ్య హిమబిందువైన చినుకులా నిన్ను తడిమిన
హేమంతం నేనని గుర్తుపట్టనట్లు..
రాలుతున్న శిశిరపత్రాల్లో
ప్రేమలేఖలను అన్వేషిస్తూ మౌనాన్ని మోహిస్తావెందుకో
ఏకవచనంలోకి జారిన నీ చూపులో జతిస్వరాలు వినబడి..
స్పందించిన నా పద్మరాగపు పాదాలు స్వరజతులై నర్తించగా
కృష్ణబిలానికి చోటెక్కడిది..
మన సమ్యోగపు దీపపు వెలుగులో
నిట్టూర్చిన నిశీధి పూర్తిగా కరిగిపోగా..!!

//భావన//



ప్రియ నేస్తమా..

అందనని నీకు నువ్వనుకుంటే తగ్గిపోయిన భారమా..wink emoticon
దాహాన్ని వెతుకుతున్నావా
లేదా ముసుగేసుకున్న మౌనన్ని కదిపి అంతర్లీనంగా ప్రవహించే కన్నీటిని పైకి తేవాలనుకుంటున్నావా
నన్ను మరిచే మాట అటుంచితే..
తలవని తలపుందేమో ముందు చూడు..
నిద్రపట్టక తెల్లవారి వెన్నెల్లో తిరిగే నీ భావుకత నాకు కొత్తది కాదుగా
అసలు నిన్ను చూసే వర్ణించాడేమో ఆ భావాల విరించి..
విరహాన్ని వేడుకుంటూ అనుభూతినెందుకు తక్కువ చేస్తావు
నువ్వు పిలిచిన తీయని పిలుపు..
మరుత్తర తరంగాల్లో ప్రతిధ్వనించి నన్ను చేరిందిగా
ఆనందాన్వేషణకు అర్రులు చాచకుండానే నీ హృదయాంతర్భాగంలోనికి రమ్మందిగా
వేరే సందేశమేమివ్వను..
అనురాగ పూర్ణమైన బాహువల్లరిని కానుక చేయ..
ఊహల రెక్కలు తొడుక్కొని నీ రెప్పలపై వాల..
వసంతకుసుమ నగవులతో..

నీ మనోభావాల హేల..!!


//ఆపేక్ష//


ఆమె పెదాలలోని మౌనం..
ఒక విస్పోటానికి కారణమవరాదని..
శూన్యాన్ని హత్తుకుపోయింది..

నీ కన్నులు చదువుతూనే ఉన్నా
పెదవులు కదపలేని నిస్సహాయమైంది
నీ జీవితం కాలేని దౌర్భాగ్యం..
హృదయాంతర్గతాన్ని వెక్కిరించింది

కొన్ని క్షణాల సంక్షోభం
సమయాన్ని అగాధంలోకి నెట్టేస్తున్నా
ఆమె పెదవిప్పని శిలగా మారింది..
మధురస్మృతుల సంగీతాన్ని నీకు కానుకగా ఇవ్వాలనే..
నష్టపోయిన ఒక సాయంత్రాన్ని మరచి..
ప్రత్యుషానికి నిన్ను రాజును చేయాలనే..
ఆపేక్షను అర్ధం చేసుకొని..
ఏకాంతంలో మాత్రమే ఎదలోకి ఆహ్వానిస్తావని..!!

//నీవే విపంచి//



ఆరుకాలాలూ ఆమనిగానే అనిపించే ఓ మధురభావం..
నీ తలపుల్లో లీనమైనందుకే కాబోలు..
ఏడేడు జన్మాల బంధమని లోకులంటారు కదూ
నాకైతే వేయిజన్మలైనా నీ సాన్నిహిత్యం చాలదనిపిస్తోంది
అయినా ఎందుకలా దిగంతాల గురించిన ఆలోచనలు..
అంతర్నిహితమై నీలోనే నే కలదిరుగుతుండగా
పాటలే మిగలని శిశిరంలా మౌనవిస్తావెందుకు..
గలగలరావాలతో అలరించే నేను తోడుండగా
చైత్రమై నేను చేయి చాచింది..
వసంతకుసుమమమై నిన్నల్లుకొనుండాలనేగా
ఎక్కడ సమాప్తమవుతుందో తెలియని విషాదంపైన అడుగేయక
అనురాగపు నక్షత్రమై నిలబడ్డ నా చెంత చేరవూ
నా ప్రేమను విపంచివై ఒక్కమారు ఆలపించవూ..!!

//హృద్ప్రకంపన//



కలగా మిగిలిన నిన్నటి జ్ఞాపకాలలో..
బీడుగా మారిన హృదయాన్ని తాకుతుంటే
గుండెచప్పుడూ కఠోరమై వినబడుతుంటే
దేహపు సరిహద్దుల్లో ప్రకంపనలు

అలజడి తగ్గని అంతరంగ ఘర్షణొకటి
హృద్గుహలో తొక్కిసలాటను తలపిస్తుంటే
వర్తమానాన్ని ధ్వంసం చేసేస్తూ
అనుభవాలుగా మిగిలిన జీవితపాఠాలు..

ప్రేమార్హతను ప్రశించుకొనే స్వేచ్ఛ కరువై..
అల్పమైన అనుబంధాల వెంపర్లాటలో..
కుచించుకుపోతున్న ఆలోచనలు..
ఊపిరాగిపోతే బాగుండుననే తలంపులు..!!

//మమేకం//



ఏదో అన్వేషణ..
ఏదో కలవరం
మరేదో తెలియని కలరవం
మనోహరమైన ఆనందం..
మనసును ఊయలూపేస్తూ
ఊహలకి గాలం వేసేస్తూ
నిన్నూ నన్నూ ఒక్కటిగా చూపిస్తుంటే..
మమెకమైపోయా..

నీ మౌనపు మంచుపల్లకిలో నేనూరేగుతున్నట్లు..
నీ వెచ్చనికౌగిలి వేలకావ్యాలకు సాటవుతుంటే
కరిగిపొమ్మన్న చినుకొకటి నీ చూపులో నన్నదేశిస్తుంటే
విశ్వమంతా నువ్వై నన్నల్లుకున్నాక..
నీకన్నా వేరే నిజమేముందనిపించడంలో అతిశయమేముంది
తొలిప్రేమనే నమ్మని నాకు వలపుసెగను ధూపమేసి..
మునుపెరుగని పరిమళపు ఆవిరులు తనువుని చిత్తడి చేస్తుంటే
రెప్పలు మూసుకొని మెలకువలోనే ఉంటున్నా..
వాస్తవం కాలేని ఒక మైమరపును మోసుకుంటూ..
చెంగావి కలనలా కన్నుల్లోనే కౌగిలిస్తూ..!!


//ఆత్మవంచన//




ఎవ్వరా అన్నది
అతివ నవ్వును చూడలేని కంటకులు
ఆమె కనురెప్పలెత్తితే వాడికి సంగీతం వినబడలేదా
గులాబీ పెదవంచున గుభాళింపు ఆస్వాదించలేదా
చెక్కిటనొక్కున చెంగల్వను ఏనాడూ తడమనేలేదా

ఎందుకంత అహంకారమో వాడికి
ఎగిసిన అలలో ఆమె నవ్వును సరిపోల్చుకోనట్లు..
చిరుగాలుల సవ్వళ్ళలో ఆమె కేరింతలు గుర్తుపట్టనట్లు..
విరిసిన పువ్వులు ఆమె నవ్వులు ఆవిష్కరించం భరించలేనట్లు..
ఆమె నవ్వుతోనే వేకువవుతుందని తెలిసీ
అసూయనే నిశీధిలో తలదాచుకున్న వాడు..
శీతలాంజనం వాడికా నవ్వేనని చెప్పేదెవ్వరో..
ఆ సస్మితవదన మరందమోవిని రుచి చూసేదెన్నడో..!!
 

//మనోరోదన//




వేదన..
అంతులేని మనోవేదన
నిట్టూర్చినా శ్వాసలో కరిగిపోని రోదన..
ఎక్కడని చేసుకోను పరిశీలన..
వద్దంటూనే కట్టుకున్నానో గుదిబండ..
కిరీటమంటే ఏదోననుకున్నా గుచ్చుకొనేవరకూ
జీవితపు గానుగలో నలగ్గొడుతున్నారని తెలియక
ఎవరి దృక్పధాలనో అంటగడుతూ..
వేరెవరి అబద్ధాన్నో నిజం చేయమంటూ..
చీకటి తెరలకు నిప్పుపెట్టి వినోదించే వైకల్యం..
విలువలేని ద్వంద్వాల మధ్య నొక్కిపెడుతూ
జీవన్మరణాల మధ్య ఉరకలెత్తించే ఉన్మాదం..
ఎంతకని మంచితనంకోసం తపించాలో..
పచ్చదనం కరువైన ప్రకృతిలో పచ్చికను వెతికినట్లు వెతుక్కుంటే..
హృదయపు గర్భగుడిలో శోకదేవతనై నాకు నేనే శిలగా కనిపించా..
అంధకారంలో కీచురాయొకటి ప్రతిధ్వనిస్తూ వెక్కిరించినట్లు..!!
 

//నా పయనం//




మనసైన స్మృతులతో..
వల్లమాలిన అభిమానంతో..
నీలో నేను చేరుకుంటూ..
నాలో నిన్ను తలచుకుంటూ..
ఒక అందమైన ప్రయాణం..
నీ పెదవంచు నవ్వు కొరకు..
నీ కనుచూపు కొసళ్ళ వరకూ..
కదలని కాలాన్ని తిట్టుకుంటూ..
నిన్ను చేరేందుకు రెక్కలు లేవనే అసహనన్ని తట్టుకుంటూ..
ఈ దశమినాటి వెన్నెల రాత్రి..
విరహన్ని మోసుకుంటూ..
నీ ఆనందాన్ని అక్షయం చేయాలని..
నీ కన్నులకు పండుగవ్వాలని..
నీ మనసుని హత్తుకోవాలని..
నీ ఆనందాన్ని రెట్టింపు చేయాలని..
ఇదిగో వచ్చేస్తున్నా..తలపుల కిటికీ తెరిస్తే నీ ముందే సిద్ధంగా..!!
 

//నీలివెన్నెల//



వేకువ పొద్దులో నీలివెన్నెల నీడలో నీ నవ్వును మోహించినందుకే..
రాతిరి పలుకరించిన నిదురను సైతం తోసిరాజని..
నీ తలపుల తలంబ్రాలు పోసుకొని..పసిడి ఊహలతో..
పచ్చని మోముకి కెంజాయిలద్దుకొని నా ఎదురుచూపులు..
ఆలపిస్తున్నానో అసావరీరాగాన్ని..
సంపెంగల చలిని సైతం ఓర్చుకొని..
అలసిన కన్నుల ఎర్రనిచూపును దాచిపెట్టి..
నిశ్శబ్ద తారకలకు భంగం కాకుండా..
నీకు మాత్రమే వినబడేలా మదన మంత్రాన్ని..
నువ్వో ఆనందభైరవిగా నా వైపు అడుగులేస్తావని..!!


Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *