Saturday, 6 August 2016

//ఏమయ్యిందంటే..నే చెప్పలేను//




ఎప్పుడు పలుకరించావో గుర్తులేదు
ఒంటరి సాయంత్రానికి సాయంగా
నా నిశీధి రాగానికి సంగీతమై
అక్షర సుమాలలో పరిమళానివై
నా స్వప్న ప్రపంచానికి రారాజువై
చిలిపినవ్వుల తొలి సుప్రభాతానివై..

ఎలా చేరువయ్యావో చెప్పనేలేను
అల్లరి అదుపు తప్పి ప్రేమకు నాందిగా
నా మౌన పరితాపానికి మందహాసమై
నిరీక్షణా రాదారిలో పూలగాలివై
నా అధరాల కొసమెరుపు కావ్యానివై
తనువంత పుప్పొళ్ళ తమకానివై

ఎందుకు ప్రాణమయ్యావో తెలీనేలేదు
నీవులేని క్షణాలు కదలనంత భారంగా
నా వలపు వర్ణాల హరివిల్లువై
హృదయస్పందన వెన్నంటు తాళానివై
నా వియోగపు రాతిరికి వెన్నెలవై
ఎప్పటికీ మదిలో ప్రవహించు అనుభూతివై..

ఏదేమైనా నేనంటూ మిగిలైతే లేనుగా
నీ ఆలింగనంలో ఒక్కసారి ఒదిగిపోయాక
చిగురాకు పసిపాపనై ఊయలూగాక
వేరే తపమేదీ చేయనుగా నేనిక
వేయిజన్మలకు వసంతుడ్నే గెలుచుకున్నాక..!!
 

//కవిత్వపుజల్లులు//



మధుర సుధలు
రాగరంజిత అనురాగ గీతాలు
మందార భావాల కుసుమాకరాలు
వేల అనుభవాల అనువాదాలు
ఆర్తిని అనుగమించు ఆర్ద్రకృతులు
నవ్వులతో కలవరిస్తున్న నిమీలితాలు
తరంగాలను తలపించు తేనెవాకలు
మల్లెలై వికసించిన పరిమళాలు
చినుకై కురిసిన కవిత్వపుజల్లులు..

కవిత్వమందుకే పిపాస..
అల్లిబిల్లి అక్షరాల అల్లిక
జీవన ప్రవాహంలోని లాలస..
తీపి మరకల చంద్రిక..
నా మనసుని కట్టిపడేసే అభిరుచి
నన్ను నీకు చేరవేసే అభివ్యక్తి
సమ్మోహన పదాలతో మంత్రించు భావగరిమ..
మానసిక అవసరాన్ని నియంత్రించు వేదమహిమ..!!

//ఆవేదన//


నీ రూపమే
నేనెప్పుడూ చూడాలనుకొనే వెన్నెల
ఎప్పటికీ అదే కోరిక
ఈ పిచ్చి..
ముదిరిపోతుందని తెలుస్తోంది

ఉన్న కాసేపూ నవ్వించి వెళ్ళిపోతావ్
ఏకాంతంలో నీ స్మృతులు
పదేపదే తడిమితడిమి
ప్రేమగా పలకరిస్తాయి..

నీవున్నప్పుడు కదిలే కాలాన్ని
ఆగమని అడగలేకపోతా
నీవెళ్ళాక కదలని క్షణాలను
ఒంటరిగా విమర్శిస్తుంటా

నవ్వాలని ప్రయతించిన ప్రతిసారీ
కనుకొలుకుల్లో కన్నీరే
వలపు బరువుని కన్నులు ఆపలేనట్లు
నీ జ్ఞాపకమే ఎదలో ఊయలూగుతోందింకా

ఇంత చెప్పినా..
నీ ఉనికేదని ప్రశ్నిస్తావెందుకో
నా భావంలో అక్షరాలు మాయమై
పూర్తిగా నిన్నే ఆవిష్కరిస్తున్నా..

Even If I Spent D Whole Day With U..
I'll Miss U D Second U Leave

//ఊహాగానాలు//



స్వరసంగమాలన్నీ ప్రవహించి
బుగ్గల్లో సిగ్గుపూలు పూయించినప్పుడు
గాలి గుసగుస వినబడుతూనే ఉంది
మందహాసాలన్నీ మధుర సంగీతాలై
నా ఊహాగానాలకి నువ్వెదురైనవేళ
తమకాల కౌముదే నా మనసుకిప్పుడు

వలపునే సాహిత్యంగా కూర్చుకున్నందుకు
నీ తలపుసెగల సవ్వళ్ళకు వగలుపోతున్న రాతిరికి
తన్మయత్వపు పులకింతలు తోడవుతుంటే
పరిమళించక మానదుగా సురానుభూతి

ఆమడ దూరానుండి మనసును వశీకరించే
ప్రేమమంత్రమెక్కడ నేర్చావో గానీ
నాలో లయమయ్యే నీ భావసంచలనముతోనే గగనమెక్కిన ఆనందాలు
వేరే చైతన్యమేదీ వద్దంటూ మది రాలుగాయి రాగాలు..!!

//ఓ ప్రేమ..//



వెలుగుతున్న వెన్నెల మునిమాపులో
ఒదుగుతున్న కనురెప్పల చప్పుళ్ళలో
మౌనవించిన మది ఊసులు
ఆనందసాగరమై ప్రవహించాలంటే
ప్రతిస్పందించే హృదయముండాలి

నా కలలకే పరిమళముంటే
నిదురపోతున్న తన అంతరంగాన్ని తట్టిలేపుతాయిగా
అందుకోసమేగా నా ఈ విరహమాంతా
అనుభూతి మల్లెరెక్కల విహారమంతా

అవును..
ప్రేమంటే..ఆకర్షణో..అనుభవమో కాదు
అదో అనిర్వచనీయ భావం..వేయి వసంతాల విలీనం..!!

//ఈనాడే ఏదో అయ్యింది//



జీవించడమంటే ఏంటో తెలిసొస్తుంది
నిన్నటిదాకా బ్రతకడం మాత్రమే తెలిసినట్లు
వసంతపు తొలిపూతను చూడగానే కలిగిన ఆనందం
నిద్దుర లేపిన కోయిల సంగీతానికి ముగ్ధమవడం
ఉదయాన్ని లేపిన భూపాలరాగం హృదయతంత్రులను కదిలించడం
పూసిన ప్రతిపువ్వు మధురంగా పరిమళించడం
వీచిన గాలికి పల్లవాలతో పోటీపడి మనసు ఊగడం
వింతైన హాయిలో వివశమవ్వడం
కురిసిన తలపు చినుకు ముత్యమై మెరిసి అంతలోనే అంతర్ధానమవడం
ఇవన్నీ నిన్న కూడా ఉన్నవే..
కన్నులు తెరిచి నిద్రించే కంటికి కలలు కనబడనట్లు
శ్వాస తీసుకోవడంలోని సుఖం అవగతమవుతోంది నేడే
మరతనాన్ని వీడి మనసు బయటపడ్డందుకో
యాంత్రికతను దాటి హృదయం చెమరించినందుకో..!!

//నిదుర మబ్బు కోసం//


నాకు నేనే దూరమైనట్లనిపిస్తున్నా..
ఆనందాన్ని లాక్కోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ
రోజూలాగే రాత్రవుతోంది
నిద్దురను మాత్రం నా నుంచీ తీసుకుపోతూ
జీవితమెందుకు కళావిహీనమో అర్ధం కాదు
మనసు ఊయలూగినట్లే అనిపిస్తుంది
అప్పటిదాకా నిద్రించిన స్వరాలు ఒక్కోటీ
నిశీధిని చీల్చుకు బయటపడ్డట్టు
మళ్ళీ కొత్తగా పుట్టొచ్చుగా అంటూ మందలిస్తాయి..
తరలిపోతున్న ప్రవాహంలోని స్మృతులు
ఉప్పునీటిని చేదుగా మార్చి
కన్నులను మండిస్తుంటే
అప్పటిదాకా తొక్కిపీట్టిన నిశ్వాసలు
బుసకొట్టినట్లు జారిపోతాయి
శూన్యాన్ని మోస్తూ కూర్చోలేనన్న తనువు
ఊహల ఒడిలో కాసేపు ఊపమంటూ
బ్రతిమాలుతుంది
మరోసారి ఆశావాదాన్ని నింపుకోవాలనుకున్న మనసు
చిక్కుపడ్డ గుండె దారపుపోగులన్నీ విడదీసి
వెన్నెల వెల్లువలో మల్లెలు కడదామని రమ్మంటుంది
అప్పుడే పారవశ్యానికి చేరువ కాబోతున్న
అరమూతల కన్నులు
ఆనందాన్ని కలగా మారుస్తానంటూ ఊరింతలిస్తున్నాయి..
ఇప్పుడు చూడాలిక..
ఈ రాత్రైనా నిద్రాదేవి సాక్షాత్కారం లభిస్తుందేమోనని..!!

//నీ చిరునవ్వు//




అక్కడెక్కడో కిక్కిరిసిన జనారణ్యాల మధ్యలో
ఊపిరి సలపని వేసవిలో
చిరునవ్వులను వెతకాలని చూస్తావెందుకు..
లోకమంతా నిదురించిన తర్వాత
వెన్నెలవిందులో ఒకసారి ఆశీనమవరాదా
అమలినమైన శూన్యంలో
కాంతివాహినై విచ్చేసే మందహాసమొకటి
నీ మనసుని తప్పక తాకుతుంది
మూసిన రెప్పలమాటు ఆనందంలో
లోకానికందని స్వచ్ఛమైన చిరునవ్వు
వెల్లువై నీ మోమంతా తప్పక పరుచుకుంటుంది
ఎక్కడో సాగరగర్భపు అడుగున దాగిన ముత్యపుచిప్ప లోపల
నీ నవ్వే స్వాతిముత్యమై ఒదిగిపోతుంది
ఒకనాడు పాలనురగల తరగలతో
కుసుమనాదాల మెరుపురెక్కల కడలికెరటాలతో
కలిసి తప్పక తేలియాడుతుంది..!!
 

//మది స్వగతాలు//



అడవిపూల స్వరాలాపనలో సౌరభాలు..
కుసుమించిన ప్రకృతిలోని ప్రకంపనాలు
వసంతకోయిలలు గళం విప్పిన గానాలు
మధురిమలెన్నో నింపుకున్న నవరసరాగాలు

తరళనీలిమ రంగుల్లో నీ నయనాలు..
నా చెక్కిలిని చేరి ఆర్ద్రమైన వైనాలు..
ప్రణయ సాగరంలో ఎగిసిపడుతున్న కెరటాలు..
నెలవంక విరి అంచున పూసిన ఆనందాలు..

విరహంతో వేసారిన ఆషాడమేఘాలు..
ఆకాశమాపలేని సురభిళ శ్రావణజల్లులు..
నీకై నిరీక్షణలోని నా మౌనాలు
ప్రత్యుషానికై తపస్సు చేసే చీకటిరాత్రులు..!!

//ఒంటరి//



ఇప్పటి లోకంలో
సమూహంతో కలిసున్నా..నేనో ఒంటరిదాన్ని
కనురెప్పల మాటు నిశ్శబ్దంలో
జ్ఞాపకాలనే ఊహలుగా తలచుకుంటూ
విషాదాన్ని వర్షించే దుఃఖాన్ని హత్తుకుంటూ
వెలుతురు కిరణాల గుండా ప్రసరించిన వెన్నెలను వెతుక్కుంటూ

చిరునవ్వునే ఆభరణం చేసి నిరీక్షించిన రోజులు
ప్రేమతోనే అందానికి మెరుగులు దిద్దుకున్న రోజులు
భావాల కెరటాలలో మునిగి తన్మయించిన రోజులు
విరజాజులని పరిహసించే పరిమళాలను వెదజల్లిన రోజులు
భావాలకందని ఆనందాల హరివిల్లును అంటుకున్న రోజులు..
మళ్ళీ తిరిగి రావుగా ప్రవాహంలో తరలిపోయిన మెరుపులు..

హృదయవనమెప్పుడు దహించిందో
మొండిగోడలు మాత్రం మిగులున్నవి
దిగంతాల ఆర్ద్రగీతమొకటి గొంతులోనే కొట్టుమిట్టాడగా
నిరంతర కలలన్నీ మిగిలిన వ్యధగా కదిలినవి
ఆవేదనను మించిన ఆత్మశోకమొకటి దగ్గరయ్యి
భాషకందని భాష్పాలతో ఆశలను కరిగించాక
నిస్తేజభావాలు మాత్రం బ్రతికున్నవి..!!

//స్వేదం//




స్వేదం ఏదో చెప్పనలవికాని అసౌకర్యమనుకున్నా ఇన్నాళ్ళూ
నా జీవన చైతన్యంలో సౌందర్యంతో అభివ్యక్తీకరించిన
నిన్ను చూసి కొత్తగా స్వేదాన్ని చదవడం నేర్చుకున్నా
ఆనాడు..
రవికిరణాల తాకిడికి చిరు చెమటలకోర్చే నా మోము చూసి నవ్వుతుంటే మైమురుస్తున్నావనుకున్నా
అలుకలో అలముకున్న స్వేదం అందాన్ని రెట్టింపు చేస్తుందంటే ఆటపట్టిస్తున్నావనుకున్నా
మోహం చిందించే నీ కన్నులు చిరుచెమ్మల సమ్మోహనమంటుంటే వెన్నెల కురిసిందనుకున్నా
ఈనాడు..
నీకు దూరమైన విరహంలో సంగీతం సైతం నాలో స్వేదమై వెలుగుతుందనుకుంటున్నా
అంతర్నిహిత వేదనలో మనసు చెమరిస్తుంటే నీకై నా బలహీనతే స్వేదమయ్యిందనుకుంటున్నా
నును చెమటకే చెంగలువలు నీ తలపులో పరిమళాలుగా విరబూస్తుంటే మనసును ఆపలేకున్నా
చిన్నారి పులకలేవో మదిచిత్తడిలో మొలకలేస్తుంటే దిగులు వెన్నెలవడం తెలుసుకుంటున్నా..:)
 
 

//నువ్వుంటే చాలు//




నువ్వుంటే చాలనుకున్నా...
ఎన్ని చీకట్లు అలముకున్నా
వేదనకో వేడుకలా

గడచిన కాలపు కల్లోలాన్ని
ఉల్లాసమౌనంలో దాచుకున్న నయనం
అనుభూతికందని ఊపిరి వెచ్చదనంలో
హేమంతపు చలి గిలిగిలింతలా
అరవిరిసే పూవుకై ఎదురుచూసిన కన్నులు
ఊగిసలాడు హృదయాన్ని దాచుకున్నట్లు
తలపు విప్పలేని కవితలెన్నో
స్వప్నాలలో రాసుకొని మురిసిపోతూ

రూపం లేని శిలనై నిలబడినా
నిశ్శబ్దానికి చేరువైన రాతిరిగా మిగిలున్నా..
ఉనికిలేని గగనం వంక చూస్తున్నా
రాగానికందని పల్లవిగా పడిఉన్నా
కాలమెంత కన్నీటిని కానుకిచ్చినా
నీ వలపు నిజమనుకొనే బ్రతికున్నా
మనసు మూగబోయి మూలకూర్చున్నా
నిరంతరం నీ స్మరణలో ఐక్యమవుతున్నా..!!
 

//మనోకూజితం//



కన్నులు తెరువాలనీ లేదూ..
నీ ధ్యానం వీడాలనీ లేదూ..
గుండెగదిలో నీవాలపించే మౌనరాగం..
మరొకరికి వినిపించాలనీ లేదు..

మంచులో తడిచిన పుష్పం వలె
నా హృదయం బరువెక్కుతుంటే..
కన్నులు మోసే హాయిని
పంచేంద్రియాలకూ కాస్త పంచనీ

నీ నవ్వే కొసమెరుపుగా
నా కన్నుల్లో నిలిచిన వేళ
అపరిమితానందం ఆలింగనం కాగా
పువ్వై విరిసిన నన్ను మైమరచిపోనీ

నవలనై నీతో చదివించుకున్న స్మృతులు..
కెరటాలై కన్నుల్లో ఉప్పొంగుతూండగా
పరవశాల మల్లెలు సిగ్గిల్లినట్లు
మరోసారి అనురాగ విపంచిని మీటుకోనీ..!!

//నీతో చెప్పాలని//




అవ్యాజమైన భావాలతో అల్లుకొనే నిన్ను..
నా ఆత్మకు అద్దముగా మలచుకున్నాను..
నీ రూపు కన్నుల్లో లాస్యమైనప్పుడు
మెరుగుపెట్టిన వెన్నెల నేనై వెలిగాను
చూపులు వెదజల్లిన అమృతధారల్లో తనువారా తడిచాను
నీ ప్రేమగంధం నాపై కుమ్మరించినప్పుడు
మధుమాస కుసుమాల పరిమళన్ని ఆఘ్రాణించాను
నీలో దాగిన నేను దూదిపింజెనై తాదాత్మ్యమొందాను

నీ శ్వాసలు గాడ్పులై తాకినప్పుడు
నాపై నీ ఆర్తిని అనువదించుకున్నాను
కురులను ముద్దాడే నీ పాలవేళ్ళలో నా అరచేతులు అదుముకున్నాను..
నీ జ్ఞాపకాలు స్వరాలై మదిని మీటినప్పుడు
కొసరాత్రులకై కలవరించాను
హృదయం పాడే ప్రతిపాటలో నీ నాయికనై పురులువిప్పాను..
నీ వలపు రాతిరి లాలింపు కోరినప్పుడు
నా ఎదనే పూల ఒడిగా నీకు పరిచాను
వేకువ సుప్రభామై కావాలనుకున్నప్పుడు కలకూజితమై మేలుకొలిపాను

నీకు మాత్రమే చేరువైన నేను
నీ ఊపిరికి శృతిగా మారిపోయాను
పంచమాన్ని పలుకలేని నీ మౌనంలో
తమకమై ఏనాడో ఒదిగిపోయాను..!!
 

//అనుభూతి సుస్వరం//




హద్దులెరుగని ఆనందంలో
హృదయమొకటి మెలిదిరిగినప్పుడు
రెక్కలిప్పిన కన్నులు కాస్తా
అరమోడ్పులై మెత్తగా నవ్వుతుంటే..

అదురుతున్న పెదవుల ప్రకంపనాల్లో
నిన్ను చదవగలిగిన సంతోషాలు
నాలో మధురిమను చిలికిస్తున్నప్పుడు
దోసిళ్ళకొద్దీ ప్రేమను నింపుకున్నట్లు
నీలో స్వప్నాలు నిద్దురలేస్తుంటే
రాతిరి పుట్టిన కోరిక పరిమళించి
మనసాపలేని ఉల్లాసముతో
ఊహల తెమ్మెరొకటి గుసగుసలాడుతుంటే
సాన్నిధ్యపు వెచ్చదనమెంత గమ్మత్తో

అతిశయానికందని భావాలతో
అనంత రాగరంజితపు అనుభూతుల కావ్యాలు
వెన్నెలై కురిసిపోవడం నాకు మాత్రమే అనుభవేకవేద్యం
నిన్నటిదాకా నిశ్శబ్దమనుకున్న సుప్రభాతం
వసంతపు కోయిలపాటగా వినబడుతుంటే
నాలో ఉప్పొంగిన రసఝరొక్కటి చాలదూ
నీలో మౌనానికి నేను స్వరమయ్యానని చెప్పేందుకు..!!
 

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *