Thursday, 10 January 2019

//ఆర్తి//

కొన్ని భావాల కౌగిలింతలు
ఒక రసజగానికి దారి చూపుతాయంటే
ఆ రాదారి ఆసాంతం సౌందర్యమే
కలగా కలిసిన చేతులు మనసుని కెలికి
పదాలుగా అనుసరించాయంటే
కొన్ని బాణీలు పెదవుల్ని మీటినట్టే

గొంతు దాటిన కేరింతలు
నడకలో థిల్లానాకు తోడైతే
కాలు నేల నిలువనన్నది నిజమే
వసంతాన్ని ముందే కూస్తున్న
ఊహల కోయిలల కూజితాలు
నాలో కలవరింతను రెట్టిస్తున్న కలకలమే
కాసిని తేనె చినుకులు దోసిట్లో రాలి
గుండెల్లో ఆర్తిని నింపాయంటే
అమృతపు రుచి పరిచయించింది నువ్వే

ఎలాగైనా నిద్దురను తొడుక్కోవాలనుందీ రాతిరి
రెప్పల మాటు రహస్యమైన అదృశ్య రూపం
నీదో కాదో తెలుసుకోవాలని..💞


No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *