సగం నిద్దురలో మెలకువొచ్చినప్పుడు
చెమ్మగిల్లిన కళ్ళు
కనుచూపు మేర చీకటిలో
దిగులు జడివాన కురిసిన భావాన్ని చిత్రించుకున్నాయి..
పూసిన చందమామ పున్నమయిందని
గుర్తు చేసినందుకేమో
గాయమిప్పుడు తిరిగి రాజుకుంది..
నీతో కలిసి పంచుకున్న ఇష్టాలు
ఎప్పటికప్పుడు కొత్తగా కదిలొచ్చే కబుర్లు
ఒక్కటిగా వెచ్చబెట్టుకున్న క్షణాలు
నీ మనసుని పట్టించినప్పటి అపురూపాలూ
మూకుమ్మడిగా సాధిస్తున్నట్టు
ఓ నిశ్శబ్ద స్వరం లోలోపల..
హేమంతమింత కృష్ణవర్ణమా
కాసిని కన్నీళ్ళకే మనసు మూగబోయి
కలలూ కలకలం రేపగలవన్నట్టు..

No comments:
Post a Comment