వేవేల పదాలుగా కురిసిన ఇష్టం
అపరిమిత దూరాన్ని దాటి
చూపుల్లో నక్షత్రమై మెరిసినప్పుడు
మెత్తగా మొలకెత్తిన నవ్వులు
మందారాల్ని తలపించాయంటే
ఎద'కందిన' ఊహలు ప్రత్యేకమైనవే..
తలపుల సెగ తగిలిన వేళ
మళ్ళీ మళ్ళీ అదే పాట వినబడి
పెదవుల్లో జలజలా మకరందం ఊరినప్పుడు
సన్నగా మొదలైన కూజితాలు
కొత్తరాగాలు రాజేస్తాయంటే
అనుదినం పరవశాల ధూపమేసినట్టే..
మత్తుగా కరుగుతున్న రాత్రి
మనోగతాన్ని లిఖించమంటే
పులకరింతల పర్వం కవనమై కదిలినందుకు
పొద్దువాలిన ముచ్చట్లకు ముగింపెక్కడుంటుంది
ఆత్మానందపు దారుల్లో అనుభవాల అనుసరణ తప్ప..

No comments:
Post a Comment