ఏకాంత పరిష్వంగంలో
నిన్నూ నన్నూ కలిపిన శూన్యం
ఈపాటికి తీరాన్ని దాటేసుంటుంది
సగంసగం మూసిన కన్నుల్లో చినుకులు
జీవితం తప్పిపోయి చానాళ్ళయిన జ్ఞాపకాలు
అలవిమాలిన ఊహల్లోని
అపురూపక్షణాల కువకువలు
అగరుబత్తిగంధంలా అలుముకుంటూ
మరచిపోయిన ప్రణయవేదాన్ని
ఊపిరిగా మార్చేయగల మాధుర్యాలు
ఎవరో కనుబొమ్మలెగరేసినప్పుడు
తడబడ్డ చూపులు దిగి
గుండెను సవరించినట్టు
ఈ చలిగాలి రాగం
ఒక మూర్ఛనగా మొదలై
లోపలి గమకాన్ని తీయగా పల్లవిస్తుంది
నువ్వూ నేనూ తమకం
వేళకాని వేళల్లో వానొచ్చినప్పుడల్లా
ఇదేగా స్వగతం..!!
No comments:
Post a Comment