Sunday, 1 January 2017

//చిలిపి..//



ఓయ్..
ఏంటోయ్ నువ్వు
ఇంతమందిలో అలా
కవనాల వరదలా
అల్లిబిల్లి కలలా
మైమరపు మరువాలు చల్లి
సరాగపు మంత్రాలతో గిల్లి..
చిలిపి మాటలు వల్లిస్తుంటే..
హృదయబరువు మోస్తున్న నీకు తెలీదా
జాబిల్లినెలా ఉడికించాలో..
స్వప్నాలను రద్దు చేసి జాగారమెలా చేయాలో..!

//రసరాగాలు//



కొన్ని రాగాలంతే..
పగలూ రేయిని ఏకం చేసి
బంగారు కలల నులివెచ్చని హృదయస్పందనలు
చిరుపెదవిపై పాటలో కలిసి
రావాలనుకుంటాయి..
మధురోహల పలకరింపులు
నిశ్శబ్దాన్ని గేలిచేసి
నాలో నేనే నవ్వుకొనేలా
తడవకోసారి తడుముతుంటాయి..ప్రేమగా..

కన్నుల్లో నక్షత్రాలు
సన్నగా ఒణుకుతూనే విచ్చే
డిసెంబరు పూలు
మసకచీకటి మధ్యమావతిలో
వెన్నెలతో ఊసులాటలు..
ఓహ్..ఇప్పటికీ మరపురాని మధురానుభూతులే

కొన్ని రసరాగాలంతే
మోడ్పును అరమోడ్పుగా మార్చి
పెదవిని మౌనానికి వదిలి
మనసులో పూలవానలు కురిపించి
పరిమళించేలా చేస్తుంటాయి
అప్పుడెప్పుడో పుస్తకాల మడతల్లో
దాచుకున్న సుతిమెత్తని
నెమలికన్నులా ఓరకంట నిమురుతుంటాయి

నేనంటే నీకిష్టమని
కళ్ళతో నవ్వినప్పుడు
నిరుర లేకుండా నన్ను తలచావని
తొలిసారి చెప్పినప్పుడు
నీలో భావుకత్వాన్ని
గులాబీగా పంచినప్పుడు
నిన్ను తాకిన చిరుగాలొచ్చి
నాలో వేడిని చల్లార్చినప్పుడూ
ఎన్ని రసానుభూతులో ఎదనిండా

కొన్ని రాగాలంతే
మనసారా పాడనివ్వవు
ఆనందంతో గుండె నింపవు
అంతరంగపొరల్లో ఎన్ని విరహాలు నలుగుతున్నా
పులకింతను మాత్రం బయటపడనివ్వవు
మనోగతాన్ని ఎప్పటికీ తర్జుమా చేయవు..!!

//హృదయవేశం//



కొన్ని స్మృతుల కల్లోలాలలా కదిలిపోతుంటే
జాలిగా జారిపోతున్న కన్నీటికి భాషేముంటుంది
భావాలకందని ఆవేశాలు
బయటపడ్డందుకే వియోగాలుగా మిగులుతాయనిపించినప్పుడు
కొన్ని వాదోపవాదాలు నిశ్శబ్దానికి విసిరేస్తేనే బాగుండేదనిపిస్తుంది

అప్పటిదాకా నక్షత్రాల్లో ఊరేగిన మనసు
హఠాత్తుగా లోయలోకి జారిపోయినట్లయ్యాక
ఊబిలో కూరుకుపోయేప్పుడు ఎన్ని ముడుపులు మొక్కినా
విషాదాన్ని ఆపడం ఎవరి తరమూ కాదన్నట్లు
జవాబు దొరకని ఎన్నో ప్రశ్నలు నిట్టూర్పుల నడుమ నలిగి
ఆత్మశోధనను తిరగేస్తున్నప్పుడల్లా తొలుస్తున్న ఆలోచనలో
ఎందుకో..ఎప్పటికీ అర్ధం కావు
గతాన్ని నెమరేసుకుంటున్న భాష్పాల రహస్యాలు
అస్తమించిన అవ్యక్తానుభూతుల నినాదాలు..!!

//వేకువ//



కలలు కూలిన చప్పుడుకి
కన్నులు తెరువక తప్పలేదు
చిన్నప్పుడు నేను నాటిన మొక్కే
నాతో పాటు ఎదిగి
ఎన్నో గువ్వల గుసగుసలకు..ఉదయకిరణాల తాకిళ్ళకు
సాక్ష్యమై నిలబడ్డ సౌందర్యముగా వెలిగింది

స్నిగ్ధరాగాల కోయిలమ్మలు
మొదటిపాట తమదే కావాలనుకున్న కిలకిలలో
రోజుకో భావాన్ని అనువదించుకొనే
కవితావేశాలు కొన్ని
గుప్పెడంత గుండెల్లోని సవ్వళ్ళను కూడి
సరిగమల మధురిమలకు పదపల్లవులను కూర్చుకున్నాయి

వికసించిన పువ్వుల్లో నవ్వులను
కాజేసే మట్టిబొమ్మలా నేను
మౌనాన్ని మీటుకుంటూ
మరోకొత్త అర్ధవంతమైన పాటొకటి
రాసేందుకు ఉద్యుక్తమయ్యాను..!!

//మరువాలు..//



నెమరేసుకున్నా ఆ నాలుగు మాటల్లోనూ
అప్పుడప్పుడూ నవ్వుకున్న మధుర క్షణాలు
రాజుకున్న ఆనందాల పుటలు తిప్పేకొద్దీ
తలపుల కుదురు కదిలినట్టు
మనసంతా కురిసిన వెన్నెల వానలు

కాలం పొరలు విప్పుతూ ఋతువులు మార్చుకుంటున్నా
ఆకాశమెన్ని భాష్పాలు రాల్చినా
మదిలో వేదన ఉల్లాసంగా మారేందుకు
ఎన్ని అనుభూతులు వెల్లువెత్తాలో
ఎంత ఆర్తిని కుమ్మరించాలో

మరపురాని జ్ఞాపకాల వెతుకులాటలో
ఎన్ని మైళ్ళు వెనక్కి నడిచినా
అలుపన్నది కాన రాకున్నా
శిశిరాలు మాత్రం ఎదురుకాక మానవు
నీరవం పడగలెత్తి కృష్ణపక్షాన్ని తడమకా మానదు
అయినా అప్పుడప్పుడూ తడుముకోక తప్పని స్మృతులు కొన్ని
మరువనివ్వని మరువాలై పరిమళించే పరవశాలు కొన్ని..!!

//అదంతే..//




ఏదీ నచ్చదు..

అప్పటిదాకా ఇష్టమని మనసంతా ఆనందం పరచుకొని పెదవులపై నెలవంకను దించినా..ఇప్పుడెందుకు నచ్చలేదో..ఒక్క కారణమూ దొరకదు.

ఇంద్రధనస్సు మోసుకు తిరుగుతున్నానన్న భావనలో నేనున్నా రంగులు కరిగి విషాదం మిగులుద్దేమోనని బెంగగా ఉంది

నీకు దూరం జరగడం కుదరదని తెలిసిపోయాక..ఊహలకు దారి మరింత సుగమమయ్యింది.

ఎర్రగులాబీనెంత చూసినా తనివి తీరక బుగ్గలకు రాసి ఆ సున్నితాన్ని సంతోషానికి ముడేసినా హృదయం నవ్వలేదంటే అప్పుడర్ధమయ్యింది..మనసంతా నువ్వే నిండినా చూపులకందేంత దగ్గరలో ప్రస్తుతం లేవని..

నిన్ను రాయొద్దని ఎన్నిసార్లనుకున్నా..ఏకాంతాన్ని గమనించాక అర్ధమైంది..నిన్ను రాసేందుకే కలమిప్పుడు కదిలిందని..!!
 
 

//సజీవ క్షణాలు//



కురిసే ప్రతిచినుకూ
గోరువెచ్చగా హృదయాన్ని తడుముతుంటే
జ్ఞాపకాలలోకి ఒదిగిపోవడం తొలిసారి కాదు

నిట్టూర్పుల నడుమ చలించని మనోరధం
నిన్నూరేగించడం అబద్దం కాదు
ఆరారు ఋతువుల గమనంలో
విరహమొచ్చి మనసుని ఆక్రమించినా
నీ అనురాగానికి పరితపించడం
అనుభూతుల కుంభవృష్టిలో మునిగిపోవడం
మచ్చికైన ఏకాంతాన్ని ఆఘ్రాణిస్తూ
యుగయుగాల మన సాన్నిహిత్యాన్ని నెమరేసుకోవడం
ఇప్పటికీ నువ్వున్న క్షణాలు సజీవమే నాకు
నేనే నువ్వైన పరిమళం ప్రమోదమే నాకు

కదిలిపోతున్న కాలాన్ని
కలగా కరగొద్దని
ఒక్కసారి ఆగిపొమ్మన్నందుకైనా
ఏకాకితనాన్ని ఉక్కిరిబిక్కిరవనీ

ఇంతకీ
హేమంతమిప్పుడెందుకు కురిసిందో మనసుని అడగకు
కన్నీరెందుకు ఒలికిందో కన్నులను తొలవకు..!!

//తెర//



ఎప్పటినుంచో కప్పుకున్న తెర
ఇన్నాళ్ళూ మనసు చాటు చేసి
తనకూ నటించడం చాతనవుననే
విషయాన్నలా గుర్తుచేసుకుంది

శిలలాంటి హృదయాల నడుమ
కుటిల మనస్తత్వాలు..తడి తెలియని భావాలు
అంధకారపు ప్రతిబింబాలు
వీటి నడుమ ఇమడలేనంటూ
పాత్రల్లో ఒదిగిన నీటివలే
తనకు తానే అబద్దాన్ని ముసుగేసుకుంది

ఇప్పుడొక ఉషస్సుని పట్టుకోవాలనుకున్న ప్రతిసారీ
ఉదయకిరణాల రంగులు
వెక్కిరించి ఉరికినట్లనిపిస్తూ క్షణాలను వృధా చేస్తున్నాయి
విహంగాలై వలసొచ్చే ఊహలు సైతం
అస్తమించే ఏకాకితనాన్ని పలుకరించడం అనవసరమని కదిలిపోతున్నాయి

రేయింబవళ్ళు వ్యత్యాసమెరుగని నటనలో
ఆరితేరిపోయాక
అంతరాత్మ ఘర్షణ అక్షరాలను తాకింది
ఋతువులనే రాయాలనుకున్నక గ్రీష్మమైనా శిశిరమైనా తప్పదనుకుంటూ..!!

//ఎందుకో ఏమో..//



అప్పుడప్పుడూ ఒక భావం అర్ధం కానప్పుడు
అక్షరాలను అదేపనిగా చదవక తప్పదన్నట్లు
ఎంత చదివినా అర్ధంకాని నువ్వూ నాకంతే

అప్పటిదాకా ఏదో లోకానికి తీసుకుపోయే నువ్వే
హఠాత్తుగా ఒంటరిని చేసి కనుమరుగవుతావ్
ఆగి ఆగి కురిసే కన్నీటితో
భగ్నమైన హృదయం ఆకాసేపూ తేలికపడినా
నీ విశాల ప్రపంచంలో నాకు చోటేదని
ప్రశ్నించుకు మరీ రోదిస్తుంటా
కొన్ని తీయని జ్ఞాపకాలు కొత్తగా గాయం చేసినట్లయి
పదేపదే భంగపడుతుంటా
నీ ఒక్క స్వప్నం కోసమైనా నిదురోవాలని
ప్రయత్నించి విఫలమవుతుంటా
రాతిరి నీలిమ కరిగి నారింజ వేకువవుతున్నా
నీ ఊహనే మల్లెతీగలా హత్తుకుపోతుంటా
నా ప్రేమకి పిచ్చని పేరుపెట్టి తప్పుకున్నావని
లోలోపలే ఏడ్చుకుంటుంటా
చివరికి నీలోనే నాకు సాంత్వనుందని గ్రహించి
నీ తలపునే పెనవేసుకుపోతుంటా..!!

//నా మనసంతా..//



మసకేసిన ఆకాశంలో
నక్షత్రాలు మిణుకుమన్నాయంటూ
ఏదో కల్పిస్తావ్

నిన్నటి స్మృతులన్నీ
నేడు కలలుగా కంటూ
వర్తమాన దారుల్లో అలా తప్పిపోతుంటావ్

అక్షరాలొచ్చి అలముకోగానే
నిద్దురలేచిన ఆర్తిని అనువదించాలంటూ
మనోరహస్యాన్ని విప్పేస్తావ్

నా వెనుక అనురాగాన్ని పాడుతూనే
గొంతు మూగబోయిందంటూ
పసికూనవై నిట్టూర్చుతావ్..

ఇప్పుడిక దీర్ఘకవిత రాయకపోతేనేమిలే
నా మనసంతా పుప్పొళ్ళైతే చల్లుతున్నావుగా..!!

//మాయ కలలు//



కొన్ని కలలంతే..
నిరీక్షణలో నీడలై వెంటాడుతూ
తరలిపోతున్న జ్ఞాపకాల్ని వెనక్కి పిలుస్తూ
పగిలిపోతున్న గుండెనూ
ఆగిపోతున్న ఊపిరినీ
ఆగమంటూ తొణుకుతుంటాయి..

ఏ ఆలోచనకో అల్లుకున్న చూపులు
నీ తలపుకి ఊయలూపుతూ
ఎన్ని నిట్టూర్పులు విడుస్తాయో
నీవులేని నా నిశ్శబ్దంలో
శూన్యం జన్మెత్తాలని చూస్తుంటే
పాటలో కుదురుకోలేని రాగంలా మిగిలిపోతాయి..!!

//నేనే..//



నవ్వుకుంటున్నా నేనే..
చినుకుగా కురిసే నీ చూపులజల్లునూహించుతూ
ఊపిరి శృతిగా శ్వాసల సంగీతానికి లయమై
నాలో అణువుగా కుదించుకు ఇగురులెత్తిన చైతన్యమైనప్పటి
నీ ఎర్రని నవ్వుల్లో మరోసారి కలువగా పూస్తూ
నెమరేస్తున్న స్మృతుల మడుగులో మునిగిపోతూ..

ఒదిగిపోతున్నా నేనే..
హృదయాన్ని కలిపితే మధురిమగా మారి
నీ తీయని కలల కలహంసగా చేరి
సురభిళ సౌందర్యాన్ని తనువెల్లా దాచి
చిరునవ్వులు చిందుంచు చిన్మయిగా..
శూన్యాన్ని నింపుకొనే కలశముగానే ..

కదిలిపోతున్నా నేనే..
సౌరభాల కల్లోలానికి ఊపిరిని తోడుకుంటూ
తేనెవరదల ప్రవాహానికి పులకింతను ఆపుకుంటూ
కన్నుల్లో ప్రవహించు అనుభూతిని దాచుకుంటూ
పరవశించు క్షణాలను పదివేలుగా పంచుకుంటూ
నీ స్వప్నానికి రంగులద్దాలని తొందరలోనే..

కురిసిపోతున్నా నేనే..
వెన్నెలకై ఎదురుచూసే చకోరముగా నిన్ను తలచుకుంటూ
శరత్తులోని మహత్తును నిలువెల్ల ఆస్వాదించు ప్రేమమూర్తివని
మకరందపు పుప్పొడిని మనసారా తాగి
గులాబీలవానకై వేచి చూసే విరహానివనుకుంటూ
నిరంతర ప్రేమాగ్నిలో జ్వలించే తాపసివనుకుంటూ..!!

//విషాదం//


ఒక్కోసారి కదలంటున్న క్షణాల్ని
నక్షత్రాలను లెక్కించి విసిగినట్లుగా పోల్చుకున్నా
కొన్ని స్మృతుల కల్లోలాలు
తవ్వకుండానే మనసుపొరల్లోంచీ బయటపడుతుంటే
తలవాల్చిన స్వరాల విలవిలలో కలిసి
విషాదాన్ని మెరుగుపెట్టినట్లుంది

బదులు దొరకని ప్రశ్నల పరంపరలో
బిత్తరపోయిన మౌనమొకటి
అగాధాన్ని ఊహిస్తూ మాటల్ని సాయమడిగింది
అప్పటికే యుగాల శూన్యానికి
అలవాటు పడ్డ మనసు ద్రవించి
అశ్రువులను స్రవించడం తెలుస్తోంది
ఇప్పుడిక కాలం కరగడం మరింత కష్టమే
వేసవి రాత్రి దీర్ఘమన్నట్లు
కొన్ని ఆలోచనలు భరించడమూ క్లిష్టమే..!

//గమ్యం//



మనసుకి నవ్వడం నేర్పి
ఆనందపు శిఖరాలు చేర్చి
కలలకు కోటిరంగులను కూర్చి
నిన్ను గెలిచేందుకు చేసిన తపస్సునంతా
ఒక్క లిప్తలో తిరస్కరించి తప్పుకున్నావ్..

అరచేతికి అందేంత చేరువలో నేనున్నా
క్షణాలు యుగాలుగా మారినట్లు
కొన్ని బలహీనతలు జయించాలన్నట్లు
మాటలన్నీ మౌనంతో ఓడించి
ఒక్క చూపుతో పరతత్త్వాన్ని ప్రవచిస్తావ్..

కాలమనేది
ఋతువునాపలేని మేఘములా కదిలిపోయేది
మనసుపొరలను విప్పలేని
నిస్సహాయతలో ఏమార్చి
వెలువెత్తు కలల తాకిడిలో ముంచెత్తి పరుగుపెట్టేది..

ఎప్పుడైనా ఎడారితనమంటిన శూన్యంలో
సంవేదన మీటినప్పుడు
లాలస నర్తించినప్పుడు
దూరాల నడుమ నిలిచే దారుల్లో
ఆకాశమంటాలనే అత్యాశ నీదవ్వాలి

నిన్నల్లో విడిచేసిన అమూల్యబంధాలు
నేటికీ సజీవమై మెలిపెట్టాయంటే
వర్తమానాన్ని కొనసాగించేందుకో మార్గం
సుగమం కావాలంతే..
నీ గమనానికో గమ్యం నిశ్చయించబడాలంతే..
గతాన్ని మరుపుకి ఒదిలి జీవితాన్ని దిద్దుకోవాలంతే..!!

//కార్తీక పౌర్ణమి//



ఆకాశం రాల్చుతున్న వెన్నెలకు
అణువణువూ సుస్వరాలను నింపుకున్నట్లు
పక్షానికోమారు మనసు పరవశించడం
జీవితానికదో పెద్ద అనుభూతి సంగీతం

మౌనం సైతం కొత్తరంగులు నింపుకునే రేయి
చంద్రకాంత పువ్వులతో గుసగుసలు కుదిరి
ఏకాంతానికో ధ్యానం కుదిరినట్లు వివశం

తెరతీసిన వెలుగురేఖల మెరుపులు
నిశీధిని మిరుమిట్లతో కమ్మినట్లు
అంతరంగంలోని ఆహ్లాదమొకటి
కళ్ళెదుట రూపెత్తి
వెన్నెల్లో స్నానం చేసేందుకు రమ్మన్నగానే..
నీలిరంగు చినుకు సవ్వళ్ళు
హృదయరాగంలో కలిసి మెత్తగా నవ్వినట్లు
ఎంత తెల్లగా ఉందో ఆ నవ్వు..
షోడశకళల జాబిల్లి పూర్ణమైనందుకు

కార్తీకపౌర్ణమి కళలెంత కమనీయమో
తీయని ప్రకంపనలు తనువంతా రేగినట్లు
మనసంతా మరులకవిత పొంగినట్లు..!!

//నిన్నందుకోలేని దూరం//




అలసటెరుగని పాదాలు
నిద్దురను దరిచేరనివ్వని కళ్ళు
ఎంతకాలం నడవాలో తెలియని దూరం
నిన్ను గమ్యం చేసుకు మొదలెట్టిన అడుగులకి..

భవిష్యత్తే శూన్యంగా కనిపించే నాకు
రాత్రైతే కలలు మాత్రం ఎక్కడివి
నన్ను మరచి చాల కాలమయ్యిందంటోంది
నీ జ్ఞాపకాలను మోసుకు తిరిగే హృదయమిక్కడ

తూరుపు తట్టి లేపడాలు..పువ్వుల మేలుకోడాలు
ఉదయపు నయగారాలు..మధ్యహ్నపు మిలమిలలు
చిలుకల చిరుగీతాలు..పొద్దుగుంకు పచ్చికదారులు
హృదయవీణ రాగాలు..అనుభూతుల మురిపాలు
ఇప్పుడేవీ సజీవమై లేవు

కనుమరుగైన నిన్ను వెతుకు దీక్షలో
పొగిలిన మనసు నిరంతరాన్వేషణ
ఇదొక్కటి మాత్రమే నిజమై తొణుకుతోంది..!!
 

//రహస్యం//




ఒక అస్తిరమైన చంచలత్వాన్ని
మనసు మోసుకు తిరుగుతున్నాక
నీలాకాశపు సందు చివర్లో
మేఘాన్ని కప్పుకున్న పొగమంచులా
ఒకనాటికి కరుగక తప్పదు.

బదులు దొరకని కొన్ని ప్రశ్నల అలజడిలో
కదలనంటున్న అడుగులు
ఊపిరిని ఎగదోసుకున్న చప్పుళ్ళలో
ఒక్క తలపు చాలు
నాకోసం ఒకరున్నారని..

అసలే నవ్వూ శాశ్వతం కాదిక్కడ..
పుడుతూనే ఏడుస్తూ నవ్వినా
పోతూ నవ్వు నటించి ఏడిపించినా
జీవితానికి అర్ధమదేగా..
నేలకి విసరబడ్డ శకలాల జీవన రహస్యమదేగా...!
 

//రాత్రి//


రాత్రి పరుగుపెడుతుంది..
ఏ వాక్యమైనా రాసుకొనేందుకు
సిద్ధంగా ఉన్న నున్నని కాగితంలా
రహదారి ఖాళీగా ఉంది

నీలి మేఘమాలెందుకో
పువ్వులా తల పైకెత్తి అనంతంలోకెందుకు తొంగి చూస్తున్నానో ఆరా తీస్తుంది

ఆకాశాన్ని వెలిగించే రేరాజు
తారకోసం నిశ్శబ్ద కలలు కంటున్నాడేమోననుకుంటూంటే
ఇంతసేపూ మచ్చికైన గాలి మాత్రం
మైకం కమ్మిన ఊహల్లో మిన్నకుండిపోయింది

మదిలో కల్పనలింతే
రేయెంత వేగిరమై సాగినా
ఆశలకు రెక్కలొస్తే ఎగరాలనుకుంటూ..
వేళ మించకుండా
రెండుగుండెల దూరాన్ని చెరపాలనుకుంటూ ..!!

//విరాళి వియోగం//




ఉత్సాహం ఉవ్వెత్తాలని చేసిన ప్రయత్నాలన్నీ
వెనుదిరిగే కెరటాల మాదిరి నీరసించి
నువ్వు చెంత లేవని నిట్టూర్చడమిప్పటికెన్నిసార్లో
నింగిని విడిచి నేల రాలిన తారకలా
పూలగుంపుల నడుమ తిరుగాడినా
నిన్ను తప్ప వేరే శ్వాసించని అశాంతిగా కదులుతున్నా

వసంతం కోల్పోయిన మదిలో
పరధ్యానంగా మొగ్గేసిన ఊహలకు
ప్రాణమొచ్చి పరిమళించడం సందేహమే అయినట్లు
వెండికాంతుల జలాలపై పడవలో విహరిస్తున్నా
నా కన్నీటి బరువు తూకానికి
హృదయమంతా ఉద్విగ్నమై ఒణుకుతున్నా

వేళ కాని వేళలో భావాలకి రెక్కలొచ్చినట్లు
అనంతంలోంచీ ప్రళయంలోకి పయనించాలని చూసే
వర్తమానాన్ని కాదని రేపటిని కలగంటున్నా
నీ కన్నుల కొలనులో కదలాడే దీప్తి నేనవ్వాలని
నీ పరవశానందపు స్ఫూర్తి నేనై
నీ నిశ్శబ్దపు సంగీతంలో జీవం నేనవ్వాలని..!!
 

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *