Wednesday, 6 July 2016

//జీవనభ్రమ//



నిన్నటి నిజమదే..
నేడు భ్రమవుతుందనుకోలా
ఎందుకో తెలీదు..
అప్పుడు నచ్చింది ఇప్పుడెందుకు నచ్చలేదో..
అప్పటి తీపి ఇప్పుడెందుకు వగరయ్యిందో..
హరితస్మృతులన్నింటికీ శిశిరమెలా అంటుతుందో..
దారి తప్పిన మనసులో మౌనమెందుకు చేరుతుందో..
అంత తేలికా హృదయాలు విరిచేయడం..
దూరాన్ని తేలిక చేసి..
కాలాన్ని బుజ్జగించి..కలలన్నింటిలో నింపుకున్నా..
కాలావధిలో అన్నీ కొట్టుకుపోవడమేనా..
మిధ్యాబింబాలుగా మిగిలే జీవిత భ్రమలంటే ఇవేనా..
కంటిచూపు కొలవలేని నైరాశ్యమంటే ఇదేనా..!!

//నీ కోసం//




నేనో మోవిని ఆలకించాను
చెప్తే నమ్మవని.
కోయిల కూసిందని సరిపుచ్చుకున్నాను..

మధుమాసం తడిమినిందనుకున్ననోసారి..
వెన్నెల వెచ్చగా గిచ్చుతుంటే
హిమబిందువుని కాస్త సాయమడిగాను

కెంపులను రమ్మన్నాను
నా పెదవులపై విశ్రమిస్తే
పంచమవేదం నేర్చుకోవచ్చని నచ్చచెప్పాను

కనురెప్పలపై కావ్యాలు..
మడత విప్పితే కందిపోగలవని
మనసుతో మధుమాలికలను చదివాను

తీరానికావలి వైపు నీవున్నావనే నమ్మకంతో
ఆశానౌకకై వేచి చూస్తూ
క్షణమో యుగముగా నిశ్వసిస్తున్నాను..

నాలో ఊపిరి.. నీ తలపుగా..
నీ శ్వాసలో పరిమళమై రావాలనే..
జీవిస్తున్నాను..!!
 

//నీవు లేని నేడు//



నిన్నటిదాకా వేడుకనుకున్నదే..
నేడు వేదనై మిగిలింది
కన్నీటికింత విలువుందని తెలీదు
ఆపినా ఆగకుండా కన్నుల నుండీ జారిపోతుంటే
నిస్సహాయినై నిలబడిపోయా
మనసేదో తేలికైన భావన..

ఆ కాసేపే..
మరో జ్ఞాపకమొచ్చి మెలిపెట్టేక
భారమైన మబ్బులు మరింత ఉధృతమైనట్లు
యుగుయుగాల స్మృతులన్నీ ఒకేసారి దాడి మొదలెట్టాక
మచ్చికైన క్షణాలన్నీ ముసురుపట్టి రోదిస్తుంటే
సడలిపోయిన అనురాగాన్ని తలచుకుంటూ
విడిచిపోయిన వసంతాన్ని వెతుక్కుంటూ
కాలంతో కలిసి ఎగిరిపోయిన ఆత్మీయతను పరామర్శించుకుంటూ
నిస్తేజమైన విషాదాన్ని తాగక తప్పట్లేదు
అగుపించని మనసుపొరల్లో అలజడెందుకో అర్ధం కాదు
నిరాశల తమస్సులో మోయలేని దుఃఖాలు..
అస్తమించిన నీ హృదయంలోని ప్రేమలా..
నాలోని సంగీతాన్నంతా కాజేసి
సమస్త శుభఘడియలనూ దూరం చేసి
ఎందుకింత నిర్దయో నాపైన..
అందుకే ఏకాకితనానికి చేరువైన నేను ఒంటరిగానే కూర్చున్నా..
ఏ మేఘసందేశమూ అక్కర్లేదుగా..
కన్నులు కురవడానికే ఐతె..!!
 

//మౌనాన్ని దాటాక..//


అంతకు ముందూ..ఆ తరువాత..
అప్పటిదాకా మౌనవాటికలా నా హృదయం..
నీదీ అంతేననుకుంటా
ఎండిన గుండెప్పుడు చెమరించిందో గుర్తులేదు
రాతిరంతా రాగాలపాలయ్యే దాకా
మౌనాన్నప్పుడే ముగించేసా..నీ పలుకు వినాలనే ఆరాటంలో..

ఇక హృదయంతో వేరుపడక తప్పలేదు
మనసయ్యిందంటున్నా ఉలుకూపలుకూ లేదనే
వస్తూనే క్షణాలకు శుభయోగం కలిగించావని చెప్తే నమ్మని మది
కెరటమై ఉప్పొంగే భావాలన్నీ తనవేనని భ్రమిస్తుంటే
అనంతంలో వికసించిన స్వప్నాకృతి నీదేనని చెప్తున్నా
నీరవంలో ప్రణయానికి రాగమందించింది నువ్వేనని వివరిస్తున్నా
కన్నుల్లో నీ వలపలా కదులుతుంటే మనసు తీయనిబాధ నీవేగా
రేరాణిపువ్వుల కుసుమవృష్టిగా నన్నంటిపెట్టుకున్న పరిమళాలు నీవేగా..
నీ ప్రణయమిచ్చిన పరవశానికే స్వప్నాలు ఊయలూగుతుంటే
పల్లవించిన పెదవిపై పాటలన్నీ అంకితం నీకేగా
ప్రతితలపులో నిన్నే హత్తుకున్నాక..

ఇప్పుడు ఆస్వాదనలో ఆరితేరడంలో వింతేముందనుకుంటున్నా

//నీలో నేనై..//


వినిపించింది నీ వలపుపాట..
సజీవ రాగంతో..లయ చెదరని భావముతో..
నీ శ్వాసల వెచ్చదనానికే వివశమవుతూ
వగలుపోయింది నిన్నలేని నా ఒయ్యారం నేడు..
ఊహలు నిజమై నరాల్లో తీగలు సవరిస్తుంటే..
పలికిందొక ప్రియమైన ప్రణయనాదం..
గమకాల మధురిమలకే తేనెలు కురిసిపోతుంటే
తాదాత్మ్యమైపోతున్న అణువణువులో..
ఓపలేని అనుభూతుల తిమిరింతలు..
కన్నుల్లో ఆపలేని పున్నమి వెన్నెల కాంతులు
దాచలేని బింబాధరాల నునుపులోని తొణుకులు..
ఒదిగిపోతూ కరిగిపోతూ..
ఒకరిలో ఒకరమై చేరిపోతూ
మబ్బుకలలు నారు పోసుకుంటూ
మనకి మనమే పదిలమైపోదామా..!!

//అపశృతి//



నేను సైతం మారాలనుకుంటా..
ఇన్నాళ్ళూ నిన్నే ప్రపంచముగా తలచినందుకు
అయినా.. నీకు నేనేమీ కాలేకపోయినందుకు
నాకు నన్నే పరాయిని చేసి నువ్విడిచినందుకు
పొరపాటు చేయడమే తెలియని నా భావాలు..
అక్షరాలుగా నిన్నెందుకు ఎంచుకున్నవో తెలియనందుకు

మొత్తానికే మూగదానిగా మారిపోయాను..
పెదవులు పాడే మొదటిపాట నువ్వనుకున్నందుకు
ఇప్పుడిక వేరే శిశిరాలెందుకులే జీవితానికి..
దిగుళ్ళయిన జ్ఞాపకాలన్నీ మూటగట్టి నువ్వందించాక
ప్చ్..అయినా సరే..
మనసుతో సంబంధం లేని శరీరమలా కదులుతూనే ఉంటుంది
కనుమరుగై కొన్ని జీవితాలను తలక్రిందులు చేయలేక.!!
 

//స్మృతులు//



హృదయమాపలేని ఆనందమంతా
రాత్రికే బయటపడుతోంది
రెప్పలు మూతబడగానే
రాగరంజిత నిమీలితాల్లో
స్వప్నమై నీలా కవ్విస్తూ
అయినా..
నువ్వెక్కడుంటే నాకేమిలే..
నా హృదిగదిలోకి ఒక్కసారి నీవడుగుపెట్టాక
పారిజాతమై అమరుకొనే అనుభూతులు
నాలో మౌనాన్ని మెత్తగా కరిగించాక
ఆనందభాష్పంలోని అస్పష్ట ప్రకాశంలా
నీ స్మృతులున్నా చాలుగా..!!

//తను...//


తను లేని జీవనం నన్ను బండరాయిగా మార్చినా..
కాసిని జ్ఞాపకాలైతే తోడున్నవిగా..
కభి అల్విధ నా కెహ్నా..తానే అని మరచినా..
తన తలపును వాటేసిన నా మది మరువలేదుగా..

తనతో గడిపిన అందమైన ఉదయాలేవీ తిరిగిరాకున్నా..
నా ప్రత్యుషపు మేలుకొల్పు తన అరవిందమేగా..
కాలం తరలిపోతున్న ప్రవాహవేగాన్ని నేనడ్డుకోలేకపోయినా
ఎల్లకాలం నాలో వసంతం పూయించే చిరునవ్వు తనదేగా..

నాలో మౌనాన్ని ప్రణయగీతంగా పల్లవింపజేసి..
పరిమళాల పూదోటకు రాగాలందించింది తానైనా
నన్ను మరచిపొమ్మనే ఆత్మవంచన కబుర్లు
మదిలో రక్తాన్ని మరిగించాలనో..హృదయాన్ని ఛిద్రం చేయాలనో..

ఎప్పటికి తెలుసుకుంటాడో మరి..
నా భావాల నక్షత్రాల మాటున వెలుతున్నది తానేనని
ఆత్మ రాసుకొనే ప్రతి అక్షరం తన అనుభూతేనని..
నా ఒంటరి ఆలోచనలో ఏకాంత తీరమెప్పటికీ తానేనని..!!

//నవ నాగరికత//


ప్రకృతి సందేశం వినే తీరికెక్కడుంది నేటి తరానికి
ఎవరి చిరునామా వారే వెతుక్కుంటున్న నాగరికతలో
పువ్వుల పరిమళాన్ని గమనించేదెవరని
వీచే గాలి ఊసులను ఆలకించేదెందరని
సూర్యోదయ సూర్యాస్తమానాలూ..
చందమామ.. పాలపుంతలూ తిలకించే హృదయమెవ్వరిదని
చెమ్మగిల్లిన చూపులోని ఆర్ద్రతొకటి తాకివెళ్ళినా
నిండు మనసుతో తడమలేని మొండి మనసులు
సజీవమనుకొనే కణాలు మరణించినందుకేమో
ప్రాణంలేని మరబొమ్మలే సాటి మనుషులు
అనుబంధాలన్నీ గాలిలో దీపాలై రెపరెపలాడుతుంటే
అనుభూతులకి వేరుగా సమాధి చేయాల్సిన పనేముందన్నట్లు
ఆశలన్నీ దహించుకుపోవడం నిజమే
అందుకే అప్పుడప్పుడూ నీరవమూ గాయపడుతుందేమో
రవళించేందుకు ఒక్క అడుగూ కదిలి రాలేదని..!!

//నీవు//


చేతికందినట్లనిపించే అందని ఆకాశమే నీవు
మౌనంగా వినిపించే వేణునాదానివే నీవు
ఎప్పటికీ అర్ధం కాని ప్రహేళికవే నీవు
మనసును పెనవేసే పున్నాగువే నీవు
మల్లెల్లో నిదురించే పుప్పొడివే నీవు
మంచుతెరను ముసుగేసుకున్న వేకువే నీవు
నిశ్చలత్వాన్ని ఆపాదించుకున్న గంభీరానివే నీవు
నిజంలా అనిపించే అబద్దానివే నీవు

అయినా కానీ..
ఎద నిండా పరచుకున్న అనురాగమే నీవు
అక్షరమై ఒదిగిపోయే నా కవనమే నీవు
కలలో సైతం నన్ను వీడని బంధమే నీవు..
అనుక్షణం నాలో ప్రవహించే చైతన్యమే నీవు..
వేదనలో వెన్నుతట్టే లాలింపువే నీవు..
నీరవంలో వినిపించే ప్రేమస్వరమే నీవు..!!

//నిరీక్షణ//



వేసవికీ తొలకరికీ నడుమ విరిగాలి
తీయని నీ స్మృతులనేవో కదిలిస్తుంటే
మల్లెమొగ్గల ముసురేస్తూ మనసూ
తటిల్లతై పులకరిస్తూ తనువూ
ఊహలూ స్వప్నాల పరిధి దాటి నీ ఒక్క తలంపునే స్పృశిస్తుంటే
రుధిరానికెంత చైతన్యమో
అంతరంగానికెంత హృద్యంగమో..

ఊపిరిలో ఊపిరి కలిసి అవ్యక్తరాగాలనేవో కనుగొన్నట్లు
గాలిలో నీ ఊసులు మువ్వలై మది చేరుతుంటే
ఏ తపస్సూ చేయకుండానే ఏకాంతంలో తరలొచ్చే
కొబ్బరి మీగడంటి కమ్మని నీ వలపుతో
కాలాన్నీ దూరాన్నీ జయించాననే అనిపిస్తోంది..

అల్లంత దూరానుంటూనే నీవు చేసే చిలిపిమాయలో
ఎన్ని అర్ధరాత్రి ఉషోదయాలో..
ఎన్ని మండుటెండల సిరివెన్నెలలో
అతిశయమని నువ్వు అరవిచ్చి నవ్వుకున్నా..
క్షణక్షణమూ నీ నిరీక్షణలో నేననుభవించే
తీయని దిగులైతే నిజమే తెలుసా..!!

//తీయని జ్ఞాపకం//




జన్మజన్మల జ్ఞాపకమేదో తడిమినట్లుంది
నీవో యువశిల్పివై నన్ను చెక్కుతుంటే
పదేపదే మనసు మైమరపులో జారిపోతుంటే

నీ తలపు ఊయలూపినప్పుడు తెలియనేలేదు
మల్లెకొమ్మకు ఎలా ఊగుతానోనని
మనసు గుభాళించినప్పుడే కనుగొన్నా మాయేదో జరిగిందని

ఆకాశమే కదలాడుతున్న భావమొకటి
మబ్బులొక్కక్కటిగా తరలిపోతున్న భావాలై
నా అనుభూతిని నీకు చేరవేస్తుంటే..
నిజమే మరి..కాలావధిలేని నిశ్శబ్దమొకటి
రాగాకృతులన్నింటినీ నిశీధిలో మింగేస్తే
అనుబంధాలు అనుకోకుండానే మరణిస్తాయి..

వసంతం పన్నెండు మాసాలకొక్కసారే వస్తేనేం..
కోయిల చైత్రమొచ్చాకే కూస్తేనేం..
మధుమాస హాసాలు ఆస్వాదించడం మానలేముగా
ప్రేమొచ్చి పలుకరిస్తే చిరునవ్వును దాచలేముగా
వెన్నెలా చీకటీ విడివిడిగా కనిపిస్తున్నా..
పున్నమైతే వెండితీగలా వెలిగేది రాతిరి వేళల్లోనేగా..!!
 

//క్షతగాత్రి//


మది మౌనవించిన నిశ్శబ్దంలో
పెదవి ముడి విప్పలేకున్నా
హృదయన్ని మెలిపెట్టే జ్ఞాపకంలా
చిత్తభ్రాంతి ఒకటి అర్ధాంతరంగా మిగిలిపోతుంది..

అప్పుడే చిప్పిలిన వేడి కన్నీరు
రెప్పల మాటున బొమ్మలను మసక చేస్తూ
మనసు పొరల తవ్వకాన్నిక
నిలిపి వేయమని వేడుకొంటుంది

ఇన్నాళ్ళూ మనసున ఘల్లుమన్న మువ్వలు
ఒక్కొక్కటిగా రాలిపోతుంటే
పిడుగులు కదిలిన సవ్వళ్ళు
కర్ణకఠోరమై..నా ఒంటరితనంలో..

ఇప్పుడిక ఉదయాస్తమాన రహస్యాలు
గులాబీ పూల సౌరభాలు
కావ్యసృష్టికే మాత్రం సాయపడవుగా
నీ అనురాగానికి దూరమైన నా అజ్ఞాన తిమిరంలో..!!

//హృదయ కల్లోలం//



జీవచ్ఛవమై నిలిచా నేనే
నువ్వన్న ఆ నాలుగు మాటలకే
దుఃఖాశ్రువులే చినుకులై రాలిన వేళ
మసకేసిన మనశాకాశాన..
భావాల వరదొక్కటి చెలియలకట్టను దాటి ప్రవహించింది
మేఘరంజని తప్ప ఆలపించనంటున్న కన్ను
కనుపాపలను సైతం ఉప్పునీటిలో ముంచింది
నా పెదవంచుల్లో పాడలేని నీ గీతం
విషాదవీచికై ప్రేమ శరణార్ధిగా మారింది
ఇన్నాళ్ళూ మనసులో చెక్కుకున్న ప్రేమాక్షరాలు చెల్లాచెదురై
గుండె పగిలిన తీరున విరిగిపడ్డాయ్
అంబరమై నీలో పరచుకోవాలనుకున్న ఆశలు
ఆకృతి దాలచని శిలలై నిలిచిపోయాయ్
బరువైన నిశ్శబ్దాన్ని మోసే నిశీధిలా
ఈ రాత్రి రోదించింది
కలలో కట్టుకున్న వెన్నెలగూడు కరిగిపోగా
నీలా జారిపోతున్న నిశ్వాసను నిజం తెలుసుకోమని వేడుకుంటూ
మరోసారి శూన్యమై తెల్లబోతున్నా..!!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *