మంచు కురిసేవేళ నవ్విన మల్లెలకు పరిమళం ఎక్కువని మనసుకెక్కిన "కిక్కు" చెప్పింది ఎక్కువ దూరం వెళ్ళకుండానే ఇన్నాళ్ళూ వెతికినది దొరికిన Smiley ఎమోజీ మొహంలో..
నేనో విహంగం..నాదే ఆకాశం.. నేనో సముద్రం..నాదే సమస్తం.. ఈ క్షణపు అస్తిత్వమే స్వభావ సహజసిద్ధమైనదని తెలిసాక చుట్టూ వెదజల్లుకున్న పుప్పొడి అలజడి ఎక్కువై ఆనందవిషాద మిళితంలో హాయి రహస్యం తెలిసింది.. నాలో నేను ప్రవహిస్తున్న తీరులో Happy Harmones.. Now I feel like I'm Not Alone..
దగ్గరగా వినిపిస్తున్న పాటెంతో నచ్చిందిప్పుడు "ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు.. ఇన్నాళ్ళకు విరిసె వసంతములు.."
నువ్వు నవ్విన పరవశాలు ముద్దులుగా నా బుగ్గలు తాకినప్పుడే తెలిసింది హద్దులు తెలియని మనసు జలపాతమై ఎగిసిందని నాకు తెలిసిన అమావస్యకు చీకటొక్కటే తెలుసు.. నిన్నూ నన్నూ కలపమని నేలజారే నక్షత్రమేదో కోరుకొని ఉంటుంది.. ఒక్కొక్కటిగా రాలిన భాష్పానికి మాటలొస్తే.. మోము కప్పుకొని తీర్చిన ముంగురుల అలుకలే మోహమై కురిసాయని మౌనంగా మార్చుకున్న మన గుండె ఊసులే చెప్తాయి.. తడి పెదవుల్లో ఊరిన మకరందం నువ్వు తాగిన తన్మయత్వాన్ని పాడతాయి..
రెండు తెల్లని పావురాల్లా మనిద్దరం.. కొత్తగా రెక్కలొచ్చిన ఆకాశంలో స్వేచ్ఛా విహారం.. రోజూ కలలో కనిపించేదే నిజమైనట్టు.. నేనే నువ్వైపోయిన క్షణాలనడగాలి.. అంతగా నన్ను లాలించిన నీ సమక్షంలోని గమ్మత్తేమిటోనని..💞
వేవేల పదాలుగా కురిసిన ఇష్టం అపరిమిత దూరాన్ని దాటి చూపుల్లో నక్షత్రమై మెరిసినప్పుడు మెత్తగా మొలకెత్తిన నవ్వులు మందారాల్ని తలపించాయంటే ఎద'కందిన' ఊహలు ప్రత్యేకమైనవే..
తలపుల సెగ తగిలిన వేళ మళ్ళీ మళ్ళీ అదే పాట వినబడి పెదవుల్లో జలజలా మకరందం ఊరినప్పుడు సన్నగా మొదలైన కూజితాలు కొత్తరాగాలు రాజేస్తాయంటే అనుదినం పరవశాల ధూపమేసినట్టే..
ఇన్నాళ్ళూ నీ మౌనంలో మరపురాని కావ్యాలెన్ని రాసావో నా అలుకలోని పంతాలు ఈనాటికి తీరలేదు పాటక్కడ పలుకిక్కడని ఉడుక్కుంటూ నీ ధ్యాసనెంత కదపాలని చూసినా ఓ పలుకు ముత్యమూ జారలేదు
ఎన్ని ఘడియలు రెప్పలు మూయక నా రూపాన్నారాధించావో నిద్దురలో నే నవ్వుకున్న స్వప్నాన్నడగాలి మనసంతా సంచరించే చనువు నాకెందుకిచ్చావో మాత్రం నీ ఆంతర్యపు ఆకాశానికే తెలియాలి అనుసరించడం ఆపేయమని అడగాలని నాకున్నా రహస్యమయ్యేందుకు నీ హృదయం తప్ప వేరే చోటేదీ లేదు కనుక ఈ దూరాన్ని చెరపమనే నే వేడుకుంటున్నా..
ఎంత మెత్తగా కదిలిందో హేమంత రాత్రి వెచ్చని పరిష్వంగంలో నన్నుంచి ఇచ్చిన కల ఒకటే అయినా ఎన్ని ఊహలు నిజం చేసిందో చీకటంటే దిగులు మోసుకు తిరిగే సమయమనుకున్నా వెలుగు తప్పించే శూన్యమని రాగాలు మింగేసే రహస్య దుఃఖమనుకున్నా
మనసుని లాగే లేత కాంతి సుగంధమై పొదుపుకున్నాక అరవిరిసిన అందం హాయిరాగాన్ని కోరింది గుండె లయని మార్చే వెచ్చని ఊపిరి కోసమని అంతరంగం అలుకను వీడింది
మనసున మనసై మెదులుతూ నువ్వున్నా మనం కలిసే కాలం కోసమే ఎదురుచూపు మిన్నొదిలి కురిసే మంచు మోహనమైతే లోలోపల పల్లవిస్తున్న ప్రణయం పూర్వీ కళ్యాణియే..
కొన్ని భావాల కౌగిలింతలు ఒక రసజగానికి దారి చూపుతాయంటే ఆ రాదారి ఆసాంతం సౌందర్యమే కలగా కలిసిన చేతులు మనసుని కెలికి పదాలుగా అనుసరించాయంటే కొన్ని బాణీలు పెదవుల్ని మీటినట్టే
సగం నిద్దురలో మెలకువొచ్చినప్పుడు చెమ్మగిల్లిన కళ్ళు కనుచూపు మేర చీకటిలో దిగులు జడివాన కురిసిన భావాన్ని చిత్రించుకున్నాయి..
పూసిన చందమామ పున్నమయిందని గుర్తు చేసినందుకేమో గాయమిప్పుడు తిరిగి రాజుకుంది.. నీతో కలిసి పంచుకున్న ఇష్టాలు ఎప్పటికప్పుడు కొత్తగా కదిలొచ్చే కబుర్లు ఒక్కటిగా వెచ్చబెట్టుకున్న క్షణాలు నీ మనసుని పట్టించినప్పటి అపురూపాలూ మూకుమ్మడిగా సాధిస్తున్నట్టు ఓ నిశ్శబ్ద స్వరం లోలోపల..
హేమంతమింత కృష్ణవర్ణమా కాసిని కన్నీళ్ళకే మనసు మూగబోయి కలలూ కలకలం రేపగలవన్నట్టు..