Tuesday, 6 September 2016

//నీవల్లే..//


అందరూ వాన కురిసిందని ఎందుకంటున్నారో
నాకైతే అమృతం కురిసిన రేయిగా అనిపిస్తుంటే
మొన్నలా లేని నిన్నటి రోజు
నాకు తోడై నువ్వున్నావనిపించాక
కన్నీరూ తీయనయ్యిందంటే నమ్మేదెందరో..

ఎవరూ సాహసించి అడుగిడని నా ఏకాంతంలో
పాలనురుగువై కదిలావంటే
నేను తడిచింది నిజమేగా
ఇన్నాళ్ళూ వెలగని దీపికలు
నిశిరాతిరిని తరిమింది కల కాదుగా
విషాదాన్ని ఆలపిస్తూ పంచమాన్ని మరచిన పెదవికి
అర్ధాన్ని అల్లుకొని
పల్లవించు పరవశపు పులకలు పూసింది నిన్నేగా
అవును..నీవల్లే..
వర్షమంటే గుబులై మండిపడే నాకు
ప్రేమతుంపర్ల ప్రియమైన సౌరభాలీనాడు..
రసఝరి మడుగులో మునిగినట్లుందీ అనుభవం
మళ్ళీ మళ్ళీ వానొస్తే మొలకెత్తాలనే మరో జీవితం..!

//స్మృతుల పరవళ్ళు//


రాతిరంతా కనులు మూతబడవెందుకో
మనసు పొరలను తవ్వుకుంటూ
కలలేమో రావాలని ఎదురు చూస్తుంటాయి
రెప్పలకౌగిలిలో కాసేపైనా సేద తీరాలనుకుంటూ
పగలబడి నవ్వాలనుకున్న పెదవులు
గజ్జెకట్టి ఆడాలనుకున్న పదములు
చీకటింట వెలిగే మెరుపు చురకలు
ఊయలూగాలనుకొనే మది మబ్బులు
కాలాన్ని కదలమని తొందరపెట్టే వేకువలు
ఎంత తాగినా తనివి తీర్చలేని వెన్నెలలు
ఊహ్పిరి శృతి చేసి పాడుకున్న జోలలు..
నిలకడ లేని తనువున రుధిర స్రవంతులు
ఈ రాతిరింకింతే..స్మృతుల పరవళ్ళు
నిద్దుర కరువైతేనేమి..కొన్ని స్వరాల పుట్టుకలు
అబ్బురమనిపించే ఆనందహేలలు
జలజల జారే శ్రావణపు జల్లులు..!!

//నాలో సంగీతం//


ఆ సంగీతం
ఎటుపోయిందో..
నన్ను నాకు కాకుండా చేసి నీతో వచ్చేసింది
ఐతేనేమి..
ఆమనొస్తే కోయిల కూయడం సహజమైనంత గమ్మత్తుగా
నీ గాత్రంలోని గీతం నా హృదయాన్ని మెలి తిప్పింది
నువ్వు ప్రేమించిందీ సంగీతాన్నే కదా
నా ఎదంతా తపనల సరిగమైనప్పుడు పొరబడ్డానేమో
నీ గమకంలో పలికిన తమకాలు నావేనని..

భరించరాని సంతసం విషాదానికి దారి తీసినట్లు
నువ్వు చల్లిన భావాల మత్తు నుంచీ బయటపడలేదింకా
చూపులకు అందనంత దూరంలో నువ్వుంటున్నా
హృదయన్ని వెంటాడే వేదనలా
నీ పాట వినబడుతోందిలే
ఒంటరితనమో శాపమనుకున్నా ఇన్నాళ్ళూ
నన్ను ఆనందానికి దూరం చేసిందని
ఇప్పుడిదే బాగుందనిపిస్తుంది
నా ప్రేమతపస్సులో నీ స్వరం
కవితాత్మగా కమ్ముకుంటుంటే..!!

//వానా వానా వెల్లువాయే..//


ఈ ఉదయం
మట్టిపరిమళం మదిని తాకినప్పుడనుకున్నా
తెల్లవారిందాకా వాన కురిసుంటుందని
తరంగాలై తన స్మృతులు తయారు మళ్ళీ
నిన్నో మొన్నో కలిసినట్లు
మనసు నాపడం నావల్ల కావడం లేదు..

ఎవరిపనుల్లో వారు
మరో యాంత్రికతకు సిద్ధమవుతూ జనాలు
ఆదివారమనేమో
బడికి తొందరలేని ఆటవిడుపులో పిల్లలు
పని హడావుడి అంతగా లేని అతివలు
నాకెందుకో మరి
తూరుపు రేఖలు విచ్చగానే మెలకువొస్తుంది
ఈరోజుకి సూర్యోదయముందో లేదో తీలీదు గానీ
తన తలపులతో నాకైతే రసోదయమయ్యింది
తనింకా నిదుర లేచాడో లేదో
నా ఊహలే తనలోనూ మెదులుంటాయనే నమ్మకం
తర్వాతైనా అడగాలి
ముసురేసిన ఆకాశం నన్ను గుర్తుచేసిందో లేదోనని
ఇహ నాకైతే..
వేరే లోకంతో పనేలేదుగా
కాలానికి ముందుకెళ్ళడమే గానీ వెనక్కు మళ్ళడం తెలీదనుకుంటూ
మరోసారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇలా..!!

//రసానుభూతులు//


నేనెక్కడున్నానో వెదికా నా మనసంతా నువ్వయ్యాక
నన్ను నేనెప్పుడో మరిచా నిన్ను తలచిన అనుభూతి తీపయ్యాక..
చేయీ చేయీ కలిపి నడిచిన ఊహలో
వెన్నెల చల్లదనాల్ని పూసుకొని పాలవాకలుగా కలిసి ప్రవహించడం
మల్లెరేకుల పారవశ్యపు పరిమళమద్దుకొని రాగాలను రవళించడం
నీ ఊపిరి రసఝరి గాలితరగల్లో విహంగమై విహరించడం
బింబాధరాల మధుమాస దరహాసాల్లో నెలవంకలు నవ్వుకోవడం
వేల కావ్యాల పరవశ ఉద్దీపనంలో సొగసు మెరిసిపోవడం
అబ్బబ్బా..
ఆరారు కాలాలూ ఆదమరపులేగా నీ నెమరింతల్లో కాలమిలా సాగిపోగా
ఆమనికి పూసిన పువ్వుల్లా నాలో అరవిరిసిన నవ్వులు
అక్షరాలకందని మైమరపులా మదిలో కురిసిన మకరందపు వానలు..
ఇహ చిలిపికలల గిచ్చుళ్ళేగా రేయంతా.. నీ వలపునూహిస్తూ నిద్దరోతే..!!

//నమ్మకం//


వేదనకే అతీతమైపోయా
నీపై నాకున్న ప్రేమనే లేపనముగా పూసుకొని
నీవిచ్చిన గాయాలను అపురూపముగా నిమురుకొని
అగాధం పెంచాలని చూసే నీ మాటలను దాటుకొని
మదిలో మౌనాన్నే బృందాగానం చేసి వింటున్న ఓపిక నాది
నిప్పుల ఉప్పెనై కాల్చేసే నీ అహంకారపు నినాదాలకు
పెదవిని ముడేసుకొని రోదిన్స్తున్న హృదయం నాది..
ఎవరి సాంగత్యంలో నీ మనసు కుదించుకుపోయినా
అనుమానపు గుబురు చీకట్లనే ఆచ్ఛాదనగా కప్పుకున్నా
ఇప్పటి నీ ప్రవర్తనెంత విలక్షణంగా మారిపోయినా
మల్లెపందిరి కింద మనం పంచుకున్న రాగాలు
మరువాన్ని మించి పరిమళాలను పంచుకున్న అనురాగాలు
ఇవన్నీ కన్నుల్లోనే సజీవమై నర్తిస్తుండగా
నీలోని బలహీనతనూ స్వీకరిస్తున్నా..
ఊపిరాగేదాకా నమ్మకాల నిచ్చెనను విడువక
నీ హృదయాన్ని అధిరోహించేందుకే ప్రయత్నిస్తా
ఎప్పటికీ నువ్వు నావాడివని గుర్తించేదాకా
పరవళ్ళెత్తి ప్రవహించే సెలయేరునై ఎదురుచూస్తా..!!

//నాకు నేను..//


మనసెక్కడో అవలోకిస్తోంది..
పరిభ్రమిస్తున్న రాగాకృతులను అందుకోలేక
ఉనికిలేని అలంకారమై మిగిలిపోయింది
అగమ్యమైన రంగులకలలో అన్వేషణ మొదలెట్టి
మరో లోకపు మధురానుభూతులను ఊహించాలని ప్రయత్నించి
అతీతమైన ఆలోచనాతరంగాలలో తూగుతూ
గాఢాంధకారపు కమురుకంపులో డస్సిపోయింది..
తొణుకుతున్న నిశ్వాసలు
శూన్యంలోకి ఇగిరిపోయాక
అక్షరాలను ఆరా తీయడం మొదలెట్టానప్పుడే

తెగిపోయిన దారాన్ని ముడేయాలనే సంకల్పంతో
అందుకోలేని ఆకాశం వంక చూసాక
హృదయమెక్కడో దారితప్పిన భావన నిజమనిపిస్తోంది
అనంతంగా ప్రవహిస్తున్న అశ్రువుల సాక్షి
విషాదాన్నిక విజేతను చేయను
ఆనందదీప్తులను నాకు నేనే వెలిగించుకొని
చిరునవ్వును నిద్ర లేపుతాను
నన్ను నియంత్రించాలని చూసే నీరవ స్వరాన్ని
గొంతులోనే నొక్కిపెడతాను
బాధల కక్ష్యలో తిరుగాడటం మాని
నన్ను నేనే సంజీవనిగా మలచుకుంటాను..!!

//ప్రణయ కాలం//


ఏం మాయ చేస్తుందో కాలం
అక్కడ నిన్ను..
ఇక్కడి నన్ను
హృదయపు దారాలతోనే ముడేసింది
క్షణమైనా ఆగని ఊహలతో తపస్సు చేయిస్తుంది
అంతరంగాలకు వంతెనేసి
తెరలు తెరలుగా నీ ఊసులనే ఆలకించమంటూ
చెవిలో పారవశ్యాన్ని కుమ్మరిస్తుంది
నీ పరిష్వంగంలో పరవశించిన
అవ్యక్త సరాగాల సాన్నిహిత్యాన్ని
ఊపిరిలో మునకేసి ఊయలూపుతోంది

నీడలా వెంటాడే
నీ తలపును హత్తుకుంటున్నా
తనివి తీర్చక తన మానాన తను సాగిపోతుంది
ఎర్రని నా నవ్వుల్లో
నీ రూపాన్ని దాచుకోమంటూ
నా చెక్కిలి గుంటలను తడిమిన
నీ చేతుల సున్నితత్వాన్ని గుర్తుచేసి
మళ్ళీ మళ్ళీ విరహాన్ని రగిలిస్తుంది
ఇప్పుడిక అధరాలపై వెలిగే మందహాసానికి
కారణాలు వెతకొద్దని మందలిస్తుంది..!!

//ఒక సాయంత్రం//


మరపురాని మునిమాపు కాదంటావా
వెచ్చని నా ఒడిలో చేరి
పెదవిప్పకుండానే కాటుకలతో ఊసులాడి
కన్నులను అరమోడ్పులు చేసి
సంపెంగల పరిమళాన్ని మనసుకద్ది
మౌనరాగంతోనే మోహాన్ని రచించి
అంతరంగపుపొరల ఆనందపు కొసలల్ని సుతారంగా మీటి
అనుభూతుల వెన్నెల్లో విహరించిన వేళ

గుర్తుందిగా నాకు
నీ చూపుల వివశత్వంలోనే నన్ను చేరిన భావం
మబ్బులమాటు చేరిన చందురునేమడగను
మచ్చలు లేని మరో జాబిలి నా సరసనుండగా
తన మోము చిన్నబుచ్చుకొని జారుకున్నావెందుకనా
మన కిలికించితపు వలపు తిలకించి స్వేదమెక్కడంటిందనా
మసకవెన్నెల్లో ఒణికి మబ్బుదుప్పటి కబ్బుకున్నావెందుకనా..
ఇప్పుడిక కురులను మాత్రం అడిగేదేముందిలే
నీ స్పర్శతో ఉంగరాలుగా మారి ముడుచుకుపోయాక
మరింత మెత్తగా నీ చేతుల్లోకే జారిపోతామంటుంటే..!

//వ్యధ//


కొన్ని వ్యధలంతేనేమో
జవాబు దొరకని ప్రశ్నలై వేధిస్తుంటాయి
అంతరాత్మను అదేపనిగా గిచ్చుతుంటాయి
ఆత్మీయతెరుగని గుండెగదిలో
అనంతమైన శోకమై ఊగిసలాడుతుంటాయి
ఎదురీదాలనుకొని సతమతమై ఉక్కిరిబిక్కిరవుతుంటాయి..

వెలుగునీడల తమస్సులో తారాడే భావాలు
ఒకరికొకరం కాలేని బంధాలు
మొక్కుబడిగా సాగే సంభాషణలు
అనుభవాలకు తలవంచిన అభిప్రాయాలు
దుఃఖమై కరిగిపోతున్న భాష్పాలు
నిశ్శబ్దాన్ని నింపుకున్న ఒంటరితనంలో
అశ్రుగీతాలై మిగిలిన విశ్వాసాలు
అందుకే..
కలకలమని ఘోషిస్తుంటాయి విముక్తమవని కంఠాలు
వేదనలై మిగులుతుంటాయి అంతస్సూత్రాల సూత్రాలు..!!


//ఒక్కటే ఆశ//


ఎందుకో ఆశను వీడలేను
నువ్వినడానికే ఇష్టపడని
నా అనుభూతుల అమృతాలు
రేపటికి నీపై చినుకులుగా కురవచ్చు
నా హృదయంలో పరిమళించిన పంచమం
ఈ మౌనరాగల స్వరసంగమం
నీ కలలో తేనెవరదై కొట్టుకొనీ రావొచ్చు

మరచిపోగలనా ఆ రోజు
నన్ను నువ్వు కలసిన తొలినాడు
రాలుతున్న పువ్వులు అక్షంతలై
మనల్ని తడిపిన సాయింత్రం
ఒక్కో పువ్వునూ దోసిలిలో చేర్చి
మాలగా కూర్చుకున్న తన్మయత్వం
అదేమో తొలిపరిచయమని నాకనిపించలేదుగా
పున్నాగ పరవశంతో నీ చూపులజల్లు
పోటీపడి నన్ను ముంచెత్తాక
లోకంలో ఈనాటికి ఎన్నో కధలు జరిగుండొచ్చు
నా గుప్పెడుగుండెలో చైతన్యం నీవయ్యాక
మదిలో కదిలే ఆకృతి దృశ్యాల్లో
కధానాయికుడవు నీవేగా
ఒక్కసారి నీ మనసు కన్ను తెరిచి చూడు
నువ్వనుకొనే కృష్ణపక్షం గడిచిపోయాక
పున్నమివెన్నెల్లో మిగిలిపోయేది మనమేగా
రేపటి మరో రచనకు శ్రీకారమయ్యేది మన ప్రేమేగా..!!

//అదే కోరిక//


పరుగాపలేని జీవనపయనంలో ఒక్కోసారి
అంతకు మించినదేదో కావాలనే కుతి
నిరాకారపు అస్తిత్వానికి లోబడక
అనుభవాలను దాటుకుంటూ పోవాలనే కాంక్ష
పాతబడ్డ సంతోషాలను కాలదన్ని
కొత్తగా సృష్టించుకున్న ప్రపంచాన్ని పొందాలనే ఆరాటం
శబ్దాలు ప్రవహించలేని ప్రశాంతతలో
స్వప్నాలను నెమరేసుకోవాలనే వాంఛ..
హృదయాంతర్భాగపు నిశీధిలో నిలబడి
నిశ్చలమై నిర్నిమేషమై పరిశుద్ధమవ్వాలనే తపన
మేఘఘర్జనల సవ్వళ్ళను ఆలకిస్తూ
సర్వావస్థలందూ ఆనందరాగాన్నే ఆలకించాలనే ఆశ
అగాధ నీలికడలి పొలిమేర అంచుల్లో
అమృతపుజల్లుల్లో తడవాలనే వినమ్రకోరిక..!!

//తమస్సు//



నన్ను నేను మరచి..
నీ పిలుపుకై దారి కాచి
కన్నుల్లో తామర ఒత్తులు వెలిగించుకొని
రేయంతా నిరీక్షించింది నిజమేగా

నా ప్రతిమాటకూ
అగరొత్తుల అత్తర్లు పూసినా
వెగటు పుడుతోందని..
నీ పలుకు శూలాలతో పొడిచి
మదిని గాయపరిచింది నిజమేగా
ఎప్పుడైనా
నాకు నేనుగా
నాకిష్టమైన పాటగా పల్లవించగలిగానా
ఎప్పటికప్పుడు నిందారోపణలతో
అనుక్షణం వెంటాడే నీడవై
చీకటి రక్కసిలా నన్ను భయపెట్టేది నిజమేగా
పుల్లవిరుపులూ..మూతివంకర్లు
అభిమానం నొచ్చుకొనేలా మాటలూ
నన్ను హింసించడమే ధ్యేయంగా ఈటెలు
కన్నీటి తెరలకి అంకితమిచ్చి
నిర్జనగృహంలో నన్ను నిర్బంధించి
బ్రతికుండగానే ఆత్మసమాధి చేసింది నిజమేగా
ఆ మనోవైకల్యం
నీలో ఎందుకలా పురివిప్పిందో గానీ
పరాభవంతో నన్నో పరాజితను చేసింది
అందుకే
ఇప్పుడేం చెప్పినా దండుగే
ఆశలన్నీ నీరుకారి తరలిపోయాక
ఎండిన హృదయం..
ఏకాంత తమస్సును హత్తుకున్నాక..!!

//కనకాంబరాలు//


ఎంత సున్నితమైన కనకాంబరాలో
లేతకెంజాయ వర్ణపు గొలుసుకట్లు
నిలువెల్ల సౌందర్యాన్ని దాచుకున్న
మెత్తని కుసుమ శలాకలు
ముంగిలికి వన్నె తెచ్చు స్నిగ్ధ లావణ్యాలు
లలిత కోమలమై మదిని దోచు పూబాలలు
అతివల కురుల సోయగాన్ని పెంచు ఎర్రని సిరులు
మధురభావనలు ఉద్దీపించు సన్నని సొబగులు..
సహజవాసన లేని సువర్ణ పుష్పాలు
కదంబంలో ప్రేమగా ఇమిడిపోవు మౌన తారకలు
అరుదైన అలంకారపు సమ్మోహనాలు
రాజసపు కలలకు రూపమిచ్చు దీపికలు..
నిరాడంబరపు అస్తిత్వానికి సాక్ష్యాలు
అమూల్య పారవశ్యానికవి రసగీతికలు..!!

//నాలో కురిసిన కౌముది//


నీలో వానై కురిసిన కవిత్వమే
నాలో వెన్నెలై విరిసింది విచిత్రంగా
చడీ చప్పుడూ లేకుండా..
ప్రవహించే చుక్కలపూల ఆకాశం నుండీ
వేల అనుభూతులు నాకోసమే జార్చినట్లు..
నేనే ఒక వెన్నెలై అలలారుతాను
వాడిపోయిన కేసరాలు వెన్నెలకు చిగురించినట్లు
నిస్తేజమైన నా మది మేల్కొంటుంది
పూలపుప్పొడిపై పొంగిన తేనె తరంగమైనట్టు
కురుసిన వెన్నెల్లో నా మేనూ..నా భావమూ తడిచి
మరో రసానుభూతికి ఆయత్తమవుతాము
నిజం..
చంద్రకాంత శిల వంటి నన్ను కరిగిస్తున్న వెన్నెల
మంచిగంధమై నా చుట్టూ పరిమళిస్తూ
అలౌకికమైన కవిత్వమై నన్ను ప్రేరేపిస్తుంది
దిగులు మేఘాలంటిన వేదనలన్నీ
అవ్యక్తమనే ఆలోచనకు తావివ్వక
అక్షరమనే ఆలంబనతో..మరో విషాదానికి చరమగీతమై
ఆనందానికి ప్రాణం పోయమంది..!!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *