వాళ్ళెప్పటికీ గుండెల మీద చెయ్యేసుకోరు
కొడుకు చిటికెనవేలు పట్టుకు నడిచొచ్చిన రోజున
కన్నుల్లో నిప్పులు కురిపించి
శక్తి కొలదీ చూపులతో గాయం చేసి
సద్దు చేయని కలలను సైతం
రెప్పల నుండి వెళ్ళగొట్టి
ఏటెల మాటలతో వేకువ నిద్దురలేపి
తమ పెత్తనాన్ని గర్జించిన పెద్దరికం
తనకో కూతురుందనే నిజాన్ని మరచిన అత్తరికం
భార్య మాటలకే వంతపాడే మామ(గ)తనం
అప్పటికి వారికో హృదయముందో లేదో తెలీదు
ఇంట్లోకి మల్లెనే వారి మనసుల్లోకి ప్రవేశం లేదప్పుడు
ఆమె రూపమో కంటకింపు
ఆమె కదలికో వెగటుకంపు
ఆమె నవ్వుకో గ్రహణం..ఆమె ఆనందమో మౌఢ్యం
అప్పటికి వారు గుండెలపై చెయ్యేసుకోలేదు
ఆమెకో తొలిచూలు..అంబరాన్నంటే మధురిమలు
ఆశీర్వదించేందుకే చేతులూ సాగలేదు..మనసులూ లొంగలేదు
దినదిన ప్రవర్ధమానమవుతున్నా తేజం..కలిగించలేదెవ్వరిలో సంచలనం
సహనమై కరుగుతున్న కాలం..అమృతంగా మారబోనంది విషం
అప్పుడూ వాళ్ళు గుండెలపై చెయ్యేసుకోలేదు
ఒంటిమీదికిప్పుడు వయసొచ్చింది..చూపు చెదిరింది
స్థానబలం మారినా తరతరాలుగా తలకెక్కిన అహంకారం
కుదుళ్ళను కత్తిరించుకు పోనంటుంది
బాధ్యతలు నెరవేర్చమంటూ సాధిస్తుంది
అనుబంధమనే మెలిక ముడిలో
ఆమెకెప్పుడూ ఉరే కొసమెరుపు
అయితేనేం..
వారికి గుండెలపై చెయ్యేసుకొనే అవసరమే లేదు..

No comments:
Post a Comment