Friday, 6 May 2016

//కలబోసుకుందాం రా..//



భావాల నక్షత్రాలన్నీ హృదయాకాశంలో మెరుస్తుండగా
మోవికి మౌనాన్ని ముసుగేస్తావెందుకో
వసంతరాణి వన్నెలన్నీ వెంటేసుకొని
చైత్రగీతాలను ఆలపించేందుకు రమ్మంటుంటే
రాలిపోయిన శిశిరాకులను లెక్కిస్తావెందుకో
ఆనందంతో ప్రజ్వరిల్లే మల్లెలవేళ
కరిగిపోయిన స్మృతులను నెమరేసుకుంటూ
చిరునవ్వును పారేసుకుంటావెందుకో
ఆకాశవీధుల చేరి పాలపుంతల కొనమీటి
కౌముదీ కిరణాలను దరిచేర్చక
సంగీతాన్ని ఏకాంతానికి అర్పిస్తావెందుకో
బాధల దావానలమెప్పుడూ దహించేదేగా
మత్తకోకిలల మరందాన్ని కాస్త తాగి
నిశ్శబ్దక్షణాలకు కాస్తంత అనుభూతుల సౌరభాన్ని అలదుకుందాం రా.!!

//తొలకరి జల్లులు//



అగ్నిపత్రాలు రాల్చే గ్రీష్మం వెనుదిరిగకుండానే..
వానకోయిలలు తెచ్చిన మేఘసందేశానికి..
మెరుపుతీగలు తోడయ్యాయి..
సంధ్యారాగం పూసుకున్నట్లయ్యింది ప్రకృతి
మంకెనపువ్వులూ..పగడపువ్వులూ..కుంకుమపువ్వులూ..
ఎర్రనై పుట్టించిన సెగలన్నీ కడిగేస్తూ..
సంపెంగల చలికి చల్లగాలి పాట పాడినట్లు..
మట్టి పరిమళగంధానికి తనువు పులకించినట్లు
గోడచాటు కొండమల్లెలూ తడిచేట్టు..
తొలకరి జల్లో..తమకపు జల్లో..
కురిసిందిగా చిరుజల్లు..పుడమితల్లి నవ్వేట్టు..
దాహార్తితో ఎండినబీడు చిన్నగా ఒణికింది..
కోమల నవపల్లవాలు ఉలిక్కిపడ్డాయి..
మెరుస్తున్న ఆకాశంతో ప్రకృతి సర్వం రసప్లావితమైంది..
చైతన్యంలో ఓలలాడింది..
నేను సైతం అంటూ..
నిండిన సరోవరాలతో పాటుగా నా మనసూ నిండింది..!!

//కలువల కన్నులవేనా...//




నా చూపులకంత పదునుందని తెలీదు
మూసిన రెప్పలూ నీతో ఊసులాడుతాయని
తెరిస్తే మరింత ప్రేమగా పలకరిస్తాయని
నాలోని సౌందర్యమంతా కన్నులలో పోతపోసుకొని
నీకు సంతోషమిచ్చే కవనాలని తెలీదు..
నీ చిత్తభ్రాంతిలో నా కన్నులు కావ్యాలంకారాలని
నీ కుంచెలో జారిన వెన్నెల సిరులు నా చూపులేనని
నీ అక్షరాల వెంట పరిగెత్తినప్పుడూ తెలీలేదు
నీ మనసుకు వెచ్చని మధువైనా
నీ స్వప్నాల అనుభూతి లోగిళ్ళనైనా
నీ నిశ్శబ్దక్షణాలు వెతికేది నా కన్నులనేనని తెలిసాక
ఆనందం నక్షత్రమై మెరిసింది
కన్నులతో నవ్వడమంటే ఏంటో అర్ధం తెలిసింది
విచ్చుకున్న కలువల కాసారం నీ రూపునలా దాచుకోమని చెప్పాక..!!

//ఓడిన హృదయం//



మౌనాన్ని చేరదీసిన మనసు..
శూన్యమై మిగిలిపోయింది
కాలపు రెక్కలతో ఎగిరిపోయిన సాయంత్రం
వెనుదిరిగి రానంది
మదిలో పల్లవిస్తున్న విషాదగీతం
వసంతాన్నిక పాడలేనంది
వెతలుగా మిగిలిన స్మృతులు
వేదనగా విచ్చుకున్న అనుభూతులు
హృదయాన్ని నరకం చేస్తుంటే
సమాధి చేయాలనే ఉంది భావాలన్నీ..

ఎదురుచూసినా జాడరాని వేకువలు
కలల వాకిలిలో నిర్లిప్తమవుతుంటే
హృది చేసుకొనే ఆత్మవంచన
అస్పష్టమై కదిలింది
నేను మెలకువలోనూ స్వప్నించే నువ్వు
కలవరమై దిగులు కుమ్మరిస్తుంటే
తిరస్కరింపబడిన మమతొకటి
అధైర్యాన్నే కౌగిలిస్తుంది..
తిరిగి ప్రాణంలేని రాతిగా మారిపోయానేమోనని
అనుమానమొస్తోంది..!!

//కవిత్వపు జాడ//



ఎక్కడో ఉందనుకున్నా కవిత్వం..
నల్లని నీ కనుపాపలలోకి చూడక మునుపు
నీ చూపు పలికే భావాన్ని చదవనప్పుడు
ఎక్కడో దాగిందనుకున్నా కవిత్వం
అరవిరిసిన నీ అధరాలను గమనించనప్పుడు
చిరుదరహాసపు పెదవొంపుని గుర్తించనప్పుడు
ఎక్కడో నిద్రించిందనుకున్నా కవిత్వం
నీ మేని పరిమళం నన్ను తాకనప్పుడు
తొలిస్పర్శలోని మెత్తదనం నాకు పరిచయమవనప్పుడు

ఎక్కడో విరహిస్తుందనుకున్నా కవిత్వం
నీ హృదయం కోసం నేను పరితపించనప్పుడు
నీలోని ప్రేమను పూర్తిగా అనుభవించనప్పుడు
ఎక్కడో ప్రవహిస్తుందనుకున్నా కవిత్వం
జాలువారే కన్నీటిచుక్కలో అదృశ్యమై కానరానప్పుడు
మదిలోని సుధామధువు ఆనందభాష్పమని తడుముకోనప్పుడు..!!

//నీవు లేని నేను//



వేదనకే వేదన కలిగిస్తున్న స్మృతి
నా చూపుకందని దూరాలకు నిన్ను చేర్చిన నిష్కృతి
అనంతానంత శూన్యాలూ ఏకమైన అనుభూతి
నన్నో దిక్కులేని సమాధిని చేసిన నీ తిరస్కృతి
ఆశలన్నీ శిశిరాలై రాలిపోవునని ఊహించని వెర్రితనం
నా ఊహల సరిహద్దుని దాటి నువ్వెళ్ళావన్న నిజం
నమ్మకమెక్కడ మిగిలింది ప్రాణమా
నా ఆనతి లేక ఊపిరినే విడువనని మాటిచ్చింది నీవేగా
ప్రాణాలయిదింటినీ నిట్టూర్పులో చేర్చి విడవగలిగా తప్ప
నీ శ్వాసలో చేరి నీ ఊపిరి కాలేకపోయా
నీవు లేని నా జీవనం నిర్జీవపు ఎడారిలో ఒంటరిపయనం
హృదయం శబ్దించని జనారణ్యంలో జీవనమెక్కడ వెతికేనని
ఈ ఆత్మవంచన నాకు చేతకానిది
నిరాసక్తమైన నిశ్శబ్దక్షణాలను కదలమని అదిలించే సాహసం నావల్ల కాదు
రాబోయే ఏకాంతరాత్రిలోనే మృత్యువుని అతిధిగా రమ్మని ఆహ్వానిస్తాను
అనురాగపూర్ణ నిశ్శబ్దగతుల గుండానే నీలో చేరిపోతాను
నీకై జ్వలిస్తున్న నా హృదయాన్ని నీకందించి నేను సైతం విశ్రమిస్తాను..!!

//విషాద వసంతం//




అనుభూతినే ఆరాధిస్తూ..అనుభవాలనే ఆర్జిస్తూ
ఆలోచన నిత్యకృత్యమై అక్షరమొక నక్షత్రమై
స్మృతులనే మోహిస్తూ మౌనాన్నే ధ్యానిస్తూ
రాగాలనే మరచిన వసంతాలెన్నో

నీరవాల నీరదాల నిర్ద్వంద్వాల నిర్బంధంలో
నిరాశలోకి జారిపోయిన నిర్వేదాలెన్నో
మదివేసవికి తాళలేక..కన్నుల్లో ఇమడలేక
హృదయంలోనికి ఇంకిపోయిన అశ్రువులెన్నో

చిరునవ్వును చేరలేక చింతాజలధిని దాటలేక
తడబడే అడుగుల విషాద జీవితాలెన్నో
సడిలేని నిశ్శబ్దంలో..అస్తిత్వం కోల్పోయిన రాతిరిలో
వర్తమాన రాహిత్యాన్ని చేరదీయాలనుకొనే ప్రయత్నాలెన్నో..!!
 

//నీకు//



కొంటె చూపుల హారతులే నీకు..
నీ నిరీక్షణకు కానుకగా..
కరముల దండల ఊయాలలే నీకు..
నీ ప్రేమకు లాలనగా..
కమ్మని ఊసుల ముచ్చట్లే నీకు..
నీ ఆరాటానికి సన్నాయిగా..
కొన్ని నవ్వుల అభిషేకాలే నీకు..
నీ ఆరాధనకు వెన్నెలగా..
కోటి కూజితాల స్వరాలు నీకు..
నీ హృదయానికి ఆలాపనగా..
కార్తీక దీపాల వెలుగులు నీకు..
నీ రాతిరికి వెలుగుచినుకులుగా..
కొంగొత్త విరహాల భావాలు నీకు..
నీ స్వప్నాలకు బాసటగా...
కొన్ని ఏకాంతాల సంగీతం నీకు..
నీ మౌనానికి పల్లవిగా..!!

//చైత్రపౌర్ణిమ//




ఈ వెన్నెల రేయి..
గాలితో ఎగిరొచ్చిన నీ ఊసుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ
ఎప్పటికప్పుడు మరలా నీతో ప్రేమలో పడుతూ
నీవులేని క్షణాలను బుజ్జగిస్తూ
వేయి కంఠాలతో పిలవాలని మనసవుతున్నా
మౌనవించిన మోవినై నిలబడుతున్నా..
నక్షత్రాల వెలుగులో నీ రూపాన్ని అవలోకిస్తూ
ఇవ్వడం మరచిపోయిన ముద్దులను గుర్తుచేసుకుంటూ
నిన్ను పలకరించే ఉదయం కోసం
త్వరగా తెల్లారమని వేకువను వేడుకుంటున్నా..!!
 

//సుధాసంగీతం//



ప్రతి ఉదయం..సాయంత్రం
అదే ప్రకృతి..నీలా.. నాలా..
నీ ఊసులో నాలా..
నా ఊహలో నీలా..
నీ సమక్షంలో గడపడమేగా నాకిష్టం
సంగీతాన్ని వెలువరించే సంధ్యారాగం
సుధా మధువులెన్నో ఒంపేవేళ
నా తోడుగా నీవుంటేనే నాకిష్టం
కలల హరివిల్లులో ఊయలూగడం
భావాలకందని భాష్యాలు కూర్చడం
మెలకువలోనూ స్వాప్నించడం
అనుభూతి గులాబీలు వికసించడం
గాలికబుర్లను ఆస్వాదించడం
ఏదైనా ఇష్టమే..
వీటితో పాటు నా అంతరంగధ్యానం నీవైతేనే..
భావ పవనాలు హృదయాంతరాళలో వీచి
సౌందర్యాన్ని నింపే వేళ
అధరాలపై చిరునవ్వైనా..అరచేతిలో అరచేయైనా నీదే కావాలి
మన ప్రేమ తేజస్సుతోనే సంధ్యలు వెలగాలి..!!

//ఏకాంత క్షణాలు//



ఏకాంతంగా మార్చేసుకున్నా ఒంటరితనాన్ని
కొన్ని స్మృతులు సారంగి నాదాలై వీనుల విందవుతుంటే
రాధామనోహరపూల పరిమళం నీలా నన్ను తాకినట్లుంటే
మేఘాలన్నీ భావాలై నీ ఊసు మోసుకొస్తుంటే
వసంతమెక్కడో లేదని వలపు వక్కాణించినట్లు
పూల చినుకులన్నీ ప్రణయాలనే కురిపిస్తుంటే
నిన్ను దాచుకున్న హృదయం వేరే స్వర్గమెందుకని ప్రశ్నిస్తుంటే
చివరివరకూ నీ జతగానే జీవించాలని మనసంటుంటే
నీవు సవరించిన జుత్తును నేనే నిమిరేసుకుంటూ
నీ స్పర్శలోని మాధుర్యాన్ని నెమరేసుకుంటూ..
ఆగిపోయిన ఊహను కదిలిరమ్మంటూ
మకరందంగా మనం మారిన క్షణాలను హత్తుకుంటూ
ఇప్పుడిక వాదించేదేముంది నీతో..
నా నిత్యానుభూతివే నీవయ్యాక
నా బంగరు లోకమే నీవయ్యాక..!!

//ఒక ఎడబాటు//



అదో రకం స్థబ్దత
ఏదో రాయాలని కలం పట్టి కూర్చుంటే
అక్షర హృదయం మాత్రం నిన్నే రాయమంటుంది
ఎంత వద్దనుకున్నా ఆలోచనా రహదారులన్నీ
నిన్నే గమ్యంగా నిర్దేశిస్తుంటే
చిరునామా నీ గుండెచప్పుడేనని నిర్ధారణయ్యింది
మనసుకు మక్కువైన తాదాత్మ్యతొకటి
నీ అనురాగంలో గుర్తించినందుకేమో
ఎడబాటులోనూ ఒక దగ్గరతనం పరిమళిస్తుంది..

ఆవిరైపోయిన సంతోషాన్ని తప్ప
నన్ను ప్రేమిస్తున్నావన్న నమ్మకాన్ని హత్తుకోనందుకేమో
నీవు లేని ప్రతిక్షణం విరహమై వేధిస్తుంది
నిన్ను తలచి గొణుక్కొనే ప్రతిమాటా సరిగమై రవళిస్తుంటే
నా సాన్నిధ్యమెప్పుడూ నీతోనేనని మనసు చెప్పింది
అలలు అలలుగా అనుభూతులు ఆవృత్తమవుతుంటే
నీ మనసు నా స్మృతులనే కౌగిలిస్తుందని తెలిసినా
హృదయవేదనెందుకలా చంచలిస్తుందో
మానసికోల్లాసమెందుకలా మౌనవిస్తుందో..!!

//వేదనా స్మృతి//



ఎందుకలా నిర్దయగా..
నీ ముందు అస్తిత్వాన్ని ఒదులుకొని
ఒంటరితనాన్ని సేద తీర్చుకోవాలని చూసినందుకా..
నా మనసంటే అంత లోకువ

నిదురను తరిమేసే రాతిరి వెతలలో
ఆవేదనొకటి హృదయాన్ని భగ్నం చేస్తుంటే
నిన్ను పిలవమన్న ఆశలను తరిమికొట్టి
కన్నీటిని వర్షించే నయనాన్ని అదిమిపట్టా
జీవితపుటలు నలిగిపోతున్న గ్రీష్మంలో
దాహంతో ఎండిపోతున్న హరితపత్రాన్నై
నీ ఒక్క పలకరింత చిలకరింత కోసమే
నా పెదవుల నవ్వును సైతం పారేసుకున్నా..

ఊహలన్నీ అక్షరాలుగా రాసి నిన్నలరించినా
అధ్యయనం చేతగాని ఆవలితీరంలో నువ్వు నిలబడ్డాక
సూర్యాస్తమయం కిటికీగుండా వీచే చిరుగాలిని సైతం
నిర్దాక్షిణ్యంగా కసిరి కొడుతున్నా
గుండెవాకిలి తోసుకొచ్చే చనువు నీతో నాకున్నా
నన్ను నాలా గుర్తించలేని నీ అహంకారంలో
తప్పు ఒప్పుల పట్టికను పరీక్షించలేక
కంపిస్తున్న మౌనాలనే కౌగిలిస్తున్నా..

నీవు కనువిప్పి చూసే నీ తీరిక సమయంలో
నేనొక నిజమైన నిస్స్వార్ధమైన
అనురాగ రంజితమైన భావముగా కనిపిస్తే
నీకై ఎదురుచూసిన నా శూన్యాలు నిండుతాయేమో
ఒకనాటికి సహనం కోల్పోయిన నేను కనుమరుగైనా
నీ హృదయంలో చెమరింపు కాగలుగుతానేమో..
అదీ నీకు మనసుంటేనే సుమా..!!

//మౌన మోహనం//



ఎదలోని మౌనం..మోహమో..మోహనమో
నీ తలపులో విహరించే ప్రతిక్షణమూ స్వర్గమై
ఏకాంతాన్ని మల్లెలుగా కూర్చుకుంటుంటే
ఆ కాస్త వివశమూ మోహమేనేమో
సౌందర్యాన్ని రచించి రాగాలను అన్వేషించేవేళ
వాలు చూపుల నుండీ జారి
పెదవులపై తారాడిన ఊహించని స్వరాలాపన మోహనమేనేమో
శిశిరపత్రాలన్నీ ఎద నట్టింట చేరి
అపురూప రంగవల్లికగా మారిన వైనం
నీరవాన్నే రాగరంజితం చేసే కలస్వనం
దరహాస పరిమళాల పారిజాతం
గాలి అలలన్నీ కెరటాలై
విరులవనాన్ని తడిమిన క్షణం
వేల మధుమాసాల కలయికేగా హృదయం
ప్రణయానికి ప్రాణం పోసే ప్రణవం..!!

//మౌన పల్లవి//



ఒక మౌనం చినుకై రాలింది
నీ నిశ్శబ్దాన్ని తడమాలని..
ఒక చమరింపు నీకందించాలని
నీ స్మృతులలో నా రూపం అస్పష్టమైనా
తిరిగి స్వచ్ఛమయ్యేందుకు సహకరించాలని

ఒక మౌనం నవ్వింది
నీ హృదయానికి సౌరభమివ్వాలని
అపుడైనా అనుభూతి పారిజాతాన్ని గుర్తిస్తావని
నీ జ్ఞాపకాలలో నేను జీవించే ఉన్నానని చెప్పాలని

ఒక మౌనం గెలిచింది..
నిర్జీవపు నీరవమైన ఎడారిలో సవ్వడించినందుకు
నీ స్వప్నాల్లో నిత్యమూ నన్ను పరామర్శించినందుకు
క్షణాలను తవ్వుకొని మరీ నన్ను తలచుకున్నందుకు..

ఒక మౌనం జావాబయ్యింది
నీ ప్రహేళికనింక అంతం చేయమని
వసంతమై విచ్చేస్తా
శిశిరాన్నింక సాగనంపమని..
నువ్వెన్ని చెప్పినా సరే..
నీలో పల్లవించే ప్రేమ నిరాసక్తంగా వినిపించినా సరే
నిండైన నీ గళంలో..ఎప్పటికైనా కళ్యాణిని నేనే..!!

//స్మృతి శకలాలు//




నే మరణిస్తేనేమి..
నా జ్ఞాపకాలైతే మిగిలే ఉన్నవిగా
తృప్తినిచ్చే ఒక ముగింపు నా జీవితంలో లేకున్నా
నీకు ఆధారమైన స్మృతులన్నీ నావేగా
ప్రత్యుష నిశ్శబ్దమొకటి మొగ్గ తొడిగినప్పుడల్లా
నీ మనసుతడి చెమరింపులో నే చేరిపోలేదా
అనంతానంత శూన్యాలలోకి నడచిపోయింది నేనైనా
నీ మౌనంలోని విషాదమంతా నా ఛాయదేగా
ఎన్ని హృదయాలు నన్ను తడిమి చూసినా
నేనొక్క హృదయాన్ని మెలిపెట్టిందైతే నిజమేగా
మరి మృత్యువు ఓడిపోయినట్టేగా..
నీ అనుభూతుల అలలలో నేనెగిసిపడినప్పుడల్లా..!!
 

సమరుచులకు ఉగాది పెన్నిధి.. మరి సమభావాల సంఘీభావం మనిషికి ఏది



షడ్రుచుల సమ్మేళనాల మేళవింపు ఉగాది
ఆరారు ఋతువులూ ఆమనిలో చేరి ఆలపించు వసంతగీతి
ప్రతిరుచీ తనకు తానే ప్రత్యేకమై
కలలపునాదులకు ముహూర్తమైన రసప్లావిత వేడుక
కష్టసుఖాలను సమంగా ఆస్వాదించమనే సందేశమై
అగణిత విశ్వాసాల సమ్మోహిక..
చేదు, తీపి, వగరు, పులుపు, ఉప్పూ, కారాల కలయిక
జీవనసారం మొత్తం ఉగాదిపచ్చడిలో మిళితమై మేలేఇక

ఆకుపచ్చని కోక సింగారించిన ప్రకృతి
రాలిన ఆకు మాదిరే జీవితం చిగురిస్తుందని సూచిస్తున్నా
వివిధ సంస్కృతులు, కులాలు, మతాలు, వంశాలతో
మనిషికెక్కడ మిగిలిందని సంఘీభావం
చివురులు మేసే కోయిల జనచైతన్యాన్ని జాగృతం చేసే వేళ
అంతరాంతర హృదయాహ్లాదిగా మారిపోవడం మనకు రావాలి
విశ్వరహస్యాలన్నీ తనకే తెలిసిన భావనలో
తన వినాశనానికి ఊళలు వేసుకొనే దోపిడీ వార్సత్వపు ప్రతినిధులొకవైపు
జాత్యహంకార జాడ్యాలతో కులమతాల పిచ్చితో
రూపుమాపలేని స్వార్ధ గవ్వలేరుకొనే ఘర్షణతో విజృంభించే వైరుధ్యాలు మరోవైపు.
చిటికెడు తీపి చవిచూసాక వగరునూ..పులుపునూ వెతకడం మానేసి
మరింత తీపికై ఎగబడితే వెగటుదనమే మిగిలినట్లు
నిత్యం జరిగే బ్రతుకుపోరులో...సామ్యవాదమే మృగ్యమై
నైతికమైన సమభావాలకు సమాధులు కడుతుంటే.
రుచులు ఆరగించినంత తేలిక కాదుగా
భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆవిష్కరించాలనే కోరికలు
మానవత్వాన్ని మించిన మతమేదీ లేదని మనుషులంతా ఏకమైతేనే అది ఉగాది
పురోగతిని అన్వేషిస్తూ చీకటి మాటున వెలుగును కనిపెట్టి
లక్ష్యానికి చేరువైతేనే అసలైన ఉగాది..!!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *