Tuesday, 2 January 2018

//నిన్ను కోరి..//


కదిలే కలలా రేయంత నడిచా
కరిగే మనసా నీ రూపేదని
నిన్నే కొలిచా నీకోసమె నిలిచా
వరమై నువ్వొస్తే తరించాలని

నా ప్రేమలోనే నిను దాచుకున్న
ఆరాధనంతా అమరమే అనంతమే
నీ నీడ నాపై ప్రసరించగానే
వెలుగై మెరిసా నిజమే
పదముపదములో ఉన్నది నువ్వేగా
నా పగలైనా కథవైనా నువ్వేగా
నీ కోసమే వెతికే నయనం
నిను పొందగా జన్మే ధన్యం
మనసంత భావం నువ్వే..!!

ఈ హేమంతంలో..

ఈ హేమంతంలో..
ఈ ఉదయం..కొన్ని మౌనాలను మోసుకొచ్చింది
అనంత మంచుబిందువులొకటై కురుస్తున్న సౌందర్యం
అదో అలౌకిక స్నానంగా తడిపింది
మనసంతా మధూలికమై..ఏకాంతానికి నివేదనై
భావాలకు వంతపాడింది..
రాగాలు చెలరేగిన పెదవులిప్పుడు విచ్చుకున్నాయి
పువ్వుల నవ్వుల్లోని అర్ధాలనిప్పుడు పట్టుకున్నాయి
ఊహాయానమిప్పుడు తేలికయ్యింది
క్షణాలను అనుసరిస్తున్న అనుభూతులు తీపవగానే..


//చంద్రోదయం..//

పాశురాలు పాడుతున్న పరవశంలో నేనుండిపోయా
నీకూ నాకూ నడుమ రాగమేదైతే ఏముందని
నీ ఎదురుచూపుల చింతనలో
మనసు పాడే సన్నాయి రాగం
అనంతాన్ని ప్రతిధ్వనించి
నా ఊపిరికి పరిమళమిచ్చింది
క్షణాల కదలికలో ఇప్పుడొక సంకేతం..
చంద్రోదయానికి దగ్గరలోనే నువ్వున్నావని
నాకై వెన్నెలను స్రవించేందుకు సిద్ధమవుతున్నావని..


//ఉన్నంతలో..//




మనసు వెళ్ళిన దారినల్లా
అనుసరించడం కాళ్ళకి కాని పని
కళ్ళు కలిసిన ఆనందాన్నల్లా
సొంతం చేసుకోవడం చేతికెప్పటికీ చేతనవదు
అయితే
ఎప్పటికైనా మోడు చిగురించాలనే
ఆశకు మాత్రం అంతముండదు

ప్రతి అడుగులో విషాదం వెంటబడుతున్నా
గాఢ సుషుప్తిలో ఆనందతరంగాల్లో తేలినట్లుండటం
నిదురలో నేను నవ్వుతున్నంత నిజం
ఎప్పుడో చదివిన కథలో జరిగినట్లు
కొన్ని యుగాల తర్వాత మానసిక సంగమం
క్షణకాలపు అనుభూతిని సైతం వదులుకోడానికి సిద్ధపడదు..

ఏమో
కొన్ని కులాసా రాత్రుల్లో నువ్వు కన్న కలను
నేను నిజం చేశానంటే
ఎప్పటికీ నాకు అర్ధమవదు
నాలోని శూన్యాన్ని దిగంతాలకు నెట్టి
నీ ఎద నింపిన అమృతం
నా కంటిచివరి చుక్కలో ఇప్పటికీ వెలుగులీనుతుంది..
అయినా..
కొన్ని అనుభవాలకి reasoning దొరకదు
నమ్మకాలు నిజమని నమ్మి కావాలనుకున్నది అందినా కూడా..!!

//మౌనాలాపన..//




మనసు పగిలిన శబ్దమైనప్పుడు
మారు పేరు మౌనమని వినబడింది
రెప్పలమాటు నీలాలు ఒకొక్కటిగా ఘనీభవించాక
రాత్రుల రంగు మారినట్టు..

మాటలెన్ని దాచుకున్నా పాటలు కాలేని
పదాలకు తెలుసు
మౌనమెంత హింసోనని
పూల ముచ్చట్లను కబళించిన దిగులు మేఘం
విస్పోటించడం చేతకాక
కాటుక కంచెల వెనుక బిక్కుబిక్కుమంటుంది

కనుపాపలు పారేసుకున్న కలలు
దారితప్పి ఏ అరణ్యంలో చొరబడినవో
కొన్ని రాత్రుల సంఘర్షణలు శూన్యాన్ని సంధి చేశాయి
ఏకాంతం చేసే ఆర్తనాదం ఆత్మానుగతం
ఉన్నతస్థాయి విషాదమే ఇప్పటి వర్తమానం... 

//కురుక్షేత్రం..//




అవును..
నాకూ నా తలపులకీ నడుమ
పూసగుచ్చుకున్న కొన్ని భావాలు
కాగితంపై ఒలకనంటూ తిరుగుబాటు
ఏకాంతంలో కదులుతున్న నీడలనూ ధిక్కరింపు
రంగురంగుల కలలనీ వీడిపోయిన ముక్కలు
శ్వాసకందని పరిమళం అడవిపాలు..

సాయంకాలపు విరామంలో జ్ఞాపకాల హోరు
సముద్రమంటి అంతరాత్మతో విభేదించడం విచిత్రం
గుప్పెడు మనసుకెన్ని ఆరాటాలో
చలిస్తున్న అనుభవంలో జవాబులేని ప్రశ్నలన్ని..!!

కదులుతున్న క్షణాలను అందుకోలేని యాతనలో
మరలిపోతున్న వసంతాన్ని రమ్మనలేని అచేతన..
నవ్వించాలని చూసిన పెదవులకు సహకరించక..
ఒక్కోసారి చూపుల ఉదాశీన
ఈ బ్రతుకునెలా దాటాలో..రక్తమలా ఉడుకుతూ ప్రవహిస్తుంటే..:(

//Tum Bin..//




ఓ ఆనందానికని వెతుక్కుంటూ ఎన్ని రోజుల్ని మోసానో
ఆ క్షణం రానే లేదు
మనసు మాత్రం అలనాటి మేఘసందేశాన్నింకా
అదే పనిగా చదువుతూ ఉంది
తనువు దాటి నీలోకి తొంగి చూడాలనుకున్న చూపులు
అశ్రువులను చేరదీస్తూనే దాచుకోవాలని విశ్వప్రయత్నిస్తుంటే
ఎప్పుడో ఒకటైన ఆత్మలు మాత్రం
మౌనాన్నెప్పుడో ఆదమరచి పాడేసుకున్నాయ్
మనసారా నిమిరే రెండు చేతుల్లో సేద తీరినట్లనిపించాక
కొన్ని అబద్ధాలు అతికినట్లనిపించవుగా
అందుకే..
Tum Bin Jaun kahaan...

కలలోకైనా వస్తానని మాటిచ్చాక
నిద్రలోనే శాశ్వతంగా నేనుండిపోలేనా.. 

//మౌనాన్ని దాటాక..//




కొన్ని మాటలు నీ మౌనాన్ని దాటొస్తే ఎంత బాగున్నాయో. నా కోసం నువ్వు వెతికావన్న ఊహ మనసంతా బంగారు కాంతులు నింపింది.
సంగీతంలో మమేకమై నే తీసిన రాగానికి కోయిలమ్మ పాటతో సరి పోల్చావంటే నా గొంతుకి ముత్యాలహారం నువ్వలంకరించినట్లుంది. వెన్నెల తాగి పెదవి కందిందేమోనని నువ్వు ప్రశ్నించిన భావుకత నన్ను సిగ్గు పూలతో కప్పింది. నీ గుప్పెడు భావాలు కవిత్వంగా మారి నాలో పరిమళాలు నింపుతున్నట్లుంది.
మానసికంగా నీకు దగ్గరైన ఈ క్షణాల్లో మౌనమెటు పోయిందో గమనించలేదు. ఇప్పుడీ కలస్వనాన్ని ఆపడం కష్టమే మధురభావాలు నాలో అనంతమవుతుంటే. మళ్ళీ పల్లవి మొదలయ్యేలా ఉన్నది నిజమే, ఊహల రసవాహినిలో మునుగుతూంటే.
తొలిచూపు చేసిన మాయకి ఈ రాతిరికెన్ని పులకింతలో రేపు వేకువకి నీకు నివేదిస్తాలే. నా కాటుకతో జత కట్టిన నీ కన్నులు ఇంకెన్ని కథలు చెప్తాయో వినాలనుంది. ఇప్పుడిక నీ పిలుపుకే నా ఎదురుచూపులు నన్ను నేను కొత్తగా వినేందుకు..:) 

//సముద్రముతో మనము..//





వస్తున్నా..
సముద్రపు తీరం వెంట నడుద్దాం రమ్మన్నావుగా
నేనొస్తున్నా
నింగీ నేలా కలిసిన అద్భుతం కన్నా
మన పాదముద్రలొకటై నడిచే ఇసుకలోనే విచిత్రం
కలిపి రాసుకోలేదు కానీ మన పేర్లు
గిలిగింతను ఆపలేదుగా అప్పుడప్పుడూ కలసుకుంటున్న మన వేళ్ళు
గుండె నిండుగా పొంగుతున్న ప్రేమ
ఒలికిపోతుందేమోనని ఒణుకుతున్న పెదవి
చూపులను చదివేస్తావేమోననే తొందరలో
తన్మయత్వాన్ని మోయలేని కన్నులు
ఓయ్..
రాస్తానంటే ఆకాశం కాగితమవుతుందేమో మరి..:) 


//మన కథ..//



సదా మరందాన్ని వర్షించే నయనం
ఎప్పుడూ మాటల్ని తాగేసి మత్తుగా మిగిలే మౌనం
క్షణాల కదలికలను పాటగా మలచుకుంటూ నిత్యం
ప్రాతఃకాలానికి అరవిరిసే పెదవంచున పుష్పం
ఉన్నట్టుంది ఆవేశాన్ని గుప్పించే కోపం
నువ్వంటే ఇదేగా..

ఎప్పుడూ కలల్ని కన్నులమాటు దాచుకొనే భాష్పం
తలపుల మూటల్ని నిరంతరం మోసే హృదయం
రంగుల సాయంత్రాన్ని చీకట్లోకి ఉరకలెత్తించే విషాదం
నిశ్శబ్దానికి మరో నిశబ్దాన్ని నిర్వచించే కవిత్వం
వసంతంలోనూ శిశిరాన్నే నెమరేసుకొనే ఒంటరితనం
నేనంటే ఇంతేగా

ఎలా జారిపడ్డామో ఒకే వృత్తంలోకి
ఇద్దరం ఒకే ఆకాశాన్ని కప్పుకున్నట్టున్నా
వెచ్చదనాన్ని అనుభవిస్తూ నువ్వు
హేమంతానికి ఒణుకుతున్నట్టు నేనూ
అందుకే వానొస్తే బాగుండనిపిస్తుంది
ఒకసారి చిత్తుగా తడిచి
ఒకరిలో ఒకరం నిమగ్నమయ్యేందుకు..


//తనివి తీరలేదు..//




కొన్ని తలపులు సీతాకోకలై తడిమినప్పుడు
జ్ఞాపకాలు కవితలై మనసంతా గెంతులేస్తాయి
నాలో దాగిన నీ సందడి ఉత్సవమై
చిరునవ్వుల భావానందం కల్యాణిరాగాన్ని పాడమంటుంది
సంపెంగి ధూపమల్లె నా ఊపిరి నాకే వింతైన గమ్మత్తులో
చిలిపి వెన్నెల గంధమై ఊయలూపుతుంది
మకరందమేదో కురిసి ఏకాంతాన్ని వెచ్చగా తడిపినట్టు
కొన్ని మధురభావాలకు అంతముండబోదు
మౌనపు సంప్రీతిలో ఉక్కిరిబిక్కిరయ్యే నాకు
తీరని తనివినిలా రాయాలనే ఉంటుంది
అవును
సాయంకాలపు నీరెండల్లో పంచుకున్న క్షణాల పరవశాలు
కాటుక చుక్కలై కదులుతున్నా..ఆ అనుభూతిని కౌగిలించాలనే ఉంటుంది..:) 
 

//నువ్వో నిశ్శబ్దమైతే//



కొన్ని వేలభావాలు నీకోసం పూసి పువ్వులను తలపించి
నా అక్షరాలకి పరిమళం అంటిందనుకున్న వేళ
నువ్వో లోకంలో అందనంత దూరంలో
మరో నవ్వులో సంతోషాన్ని ఆలకిస్తుంటావ్
నా ఆకాశం నువ్వని నక్షత్రాల్ని వెక్కిరించినంత సేపు పట్టలేదేమో
మంచు దుప్పటి తెరగా మారి నా చూపులకో ఆనకట్ట వేసింది

అప్పటిదాకా కురిసిన వెన్నెలంతా తాగేసి
దాహం తీరలేదని నువ్వన్నాక
రాత్రిని ఆపాలని ప్రయత్నించి నేనోడిపోయా..
నాకు తెలుసు నువ్విటు రావని
ఏ కలలోనో రెక్కలు అతికించుకుంటూ
మరో విహారానికని సిద్ధమవుతుంటావ్
కొన్ని ఆశలు చేజారిన విషాదంలో నేనేమో
కన్నీటిని చెక్కిలిపై జారొద్దని వేడుకొంటున్నా..

హృదయాన్ని ఓదార్చుకోవడం నీకు చేతనైతే
నీకు దూరమవడం ఎంతసేపని
జ్ఞాపకమైతేనే నన్ను గుర్తిస్తావంటే
ఈ నరకాన్ని ముగించడం చిటికెలో పని..!!

//మన'సు'పారిజాతం..//



శీతాకాలపు ఆకాశపందిరి కింద పారిజాత సుమాలు
స్వప్నం నుంచీ వేరుపడి జారినట్టు తలక్రిందులయ్యాయి
మౌనరాగపు తాదాత్మ్యంలో మనసు మైమురిసినందుకు
అరమోడ్పు కళ్ళు నవ్వుతెరల్ని దాచుకుంటున్నాయి

పరవశాన్ని కలగంటూ నిద్దురోయిన రాత్రి కనుక
వేకువింకా మత్తుగా సోలిపోవాలనే చూస్తుంది
మనసు చించుకు పుట్టిన భావాల పరిమళం నన్నిప్పుడు
అచ్చం ఉషోదయపు సువాసనంత స్వచ్ఛంగా తాకింది..:)

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *