Saturday, 15 April 2017

//అపరిచితం//




నా పరిచయానికంత విలువ ఇవ్వలేదనుకుంటా
ఒకే ఆలోచనగా మొదలైన ఇద్దరం
తలకో పోరాటాన్ని తలకెత్తుకున్నాక
ఘర్షణో ఉన్మత్తమై గర్జించింది
లోపాలు లేని నిన్ను
అవిశ్రాంతంగా మదిలో కలుస్తున్నా
వాస్తవంలో నీ పిలుపుకై నిరీక్షిస్తూనే నేనున్నా

మెలికెలు తిరుగుతున్న స్వప్నమొకటి
ఏమార్చుతూ
ఉలికిపాటుతో నిదురను భగ్నం చేసాక
నడిరేయిన ఒక శూన్యం వెక్కిరించింది
నిస్తేజమైన నయనం
వద్దన్నా కన్నీటిని ఆహ్వానిస్తూ
అస్తిత్వాన్ని దెబ్బ తీసింది

ఇపుడు అపరిచితులమైతే బాగుండనిపిస్తుంది
అందని చందమామనై నిన్నూరించేందుకైనా..:'( 

//రెప్పచాటు వెతలు//



ఊపిరాడని నడివేసవి
ఊహకందని గాయాలనోర్చుకుంటూ
ఉస్సూరుమంటూ ఉలికులికి పడుతుంది

నెమరేసుకున్న కూజితాలు
నిరంతరాలాపనలు దాటి
గుండెఘోషలో అడుగంటుకున్నాయి

నేత్రాంచలాలు దాటిన స్వప్నాలు
నిరాశను కడిగే కన్నీరుగా మారేందుకు
పదేపదే కురిసేందుకైనా సిద్ధమన్నాయి

వెతల మేలుకొలుపుతో
కళ్ళిప్పుతూ మొదలైన జీవితం
ప్రతిఘటించే మనసును ఓర్చుకోమంది

విశ్రమించినా అంతమవని వేదనలు కొన్ని
హృదయాన్ని చుట్టుముట్టిన తాకిడిలో
ఆనందపు నిచ్చెన ఎక్కాలనుకున్న ప్రతిసారీ కూల్చేస్తాయి
అరవిరిసే నవ్వులను ఆమడ దూరముండమని విసిరేస్తాయి..!!

//రెక్కలొచ్చినందుకే..//



వస్తున్నా..వస్తున్నా..
నువ్వు ఆహ్వానించిన కవన వనానికి
నువ్వంపిన గంధాలను నిలువెల్లా పులుముకొని

వసంతం..వెన్నెల తీగల బంధాన్ని చూపించింది

మరాళం..నాలోని సౌశీల్యాన్ని ప్రోదిచేసింది..

మయూరం..నన్ను చూసి నేర్చిన నడకలాపి నిలుచుంది

మయూఖం..నా నొసట వెలుగై ప్రకాశించింది

సంధ్యాసమయం..కుంకుమపువ్వులను అరుణరాగాన్ని ఆలపించమంది

సమీరం..మనసైన ఊహలా కదిలింది

మందారం..రెక్కలు విప్పిన సౌందర్యమై ఆహ్వానించింది

పారిజాతం..తనలోని దైవత్వాన్ని కాస్త పంచింది..

పచ్చదనం..నన్ను తనలో కలుపుకొని మెరుపులీనింది

కీరం..తన పలుకుల తేనెలతో మదిని దోచింది

కపోతం..నాకై నువ్వంపిన రాయబారాన్ని పాడింది..

వనం..వేసవిని మాయ చేసి హృదయాన్ని సేద తీర్చింది..
మానసిక దాహాన్ని వెదురు నాదముతో పోగొట్టింది.. 


//చెలిమి//




నిన్న కూడా ఇలానే మొదలయ్యింది..
ప్రయాణమంటూ చేయకపోయినా అదే ప్రయాణీకులతో..
కొత్తబంధాలేవో కలుపుకోవాలని ఎదురొస్తాయి
ఆసక్తి లేని అనుబంధాల్లో సమీకరణాలేవో కూర్చుకుంటూ

తప్పేముందిలే..
నీతో నడిచేందుకో హృదయం కదిలొస్తుంటే
కాదని చెలిమికి తలుపులు మూసేయడం..
చచ్చిన నిన్నట్లో రేపటి భవిష్యత్తుని ఆపేయడం..!! 

//ఇంకా..ఏదో..//




నీతో ఏదో చెప్పాలనిపిస్తుంది
శూన్యానికి నన్నొదిలి నువ్వు నడిచెళ్ళిపోయాక
మదిలో దాచుకున్న మాటలన్నీ అక్షరాలవుతాయి
నీ తలపుల క్రీనీడల్లో కంపించు నా ఊహలు
వెలికొసల్లోకి ప్రయాణించి నిన్ను రాయమంటాయి

అదెంత స్వాతంత్ర్యమో నీకు
నా ముభావాన్ని మనోరంజనంగా మార్చేందుకు
రెప్పల యవనికపైకొచ్చి అలా కదులుతావు
ఎన్ని కవితలు రాసి ఏముంది
ఏ ఒక్కటీ నిన్ను మీటనప్పుడు అనుకుంటాను..

కానీ
మౌనంగా నా కదలికలు గమనిస్తూ
హృదయ సంచలనాన్ని వెంటాడుతూ
అప్పుడప్పుడూ తొంగి చూసే నీ చూపుల కిరణాలు
సూటిగా హృదయాన్ని తాకే వెన్నెలలై
మరో కోల్పోయిన అనుభూతిని రాయమన్నప్పుడు
అప్పుడు చూడాలి నవ్వుతెర కదలికలు నా పెదవులపైన..;) 

//అలుకల కల//




ప్రతి ఉదయం నీకెంత ఆత్రమో
రాత్రికి కలలోకి నిన్ను రానిచ్చానో లేదోనని
చంద్రకిరణాలకి సైతం చల్లబడని నా మనసుకి తెలుసు
నీకై నిరీక్షణెంత కఠినమో

కాలమలా కదిలిపోతున్నా ఆపలేని నిస్సహాయత
మధురమైన ఊహలూ..మృదువైన నవ్వులూ
నా నుంచీ వేరు పడుతుంటే
అలుకలు అలలై నన్ను అల్లుకున్నప్పుడు
చుట్టూ సముద్రమెంతున్నా దాహం తీరదన్నట్లు
వెన్నెలెంత కురుస్తున్నా
నా తాపమిప్పుడు తీరేది కాదన్నట్లు..

సప్తస్వరాలున్న నా ఎదలో
సప్తవర్ణాల హరివిల్లు తెల్లబోయినట్లు
మౌనాన్ని రద్దుచేయాలనుందిప్పుడు కొద్దిగా
సవ్వడించే నీ ముద్దుల సద్దుగా..!!
 

//చివరి ప్రయాణం లోగా..//




జ్ఞాపకాల మూటను మోయలేక అలసిపోతావప్పుడు
పంచుకునేందుకు నేనుండను
ఒక తీయని మాటేదైనా ఉంటే వినిపించవూ..

నన్ను కనులారా చూడాలనుందనుకుంటావ్
కలనైనా కనబడమని అర్ధిస్తావ్
కన్ను మూసేలోగా కొన్ని క్షణాలైనా కరుణించవూ

నా పలుకు తీపులకై కలవరిస్తావప్పుడు
కానీ వినేందుకీ లోకాన్ని విడిచిపోతాను
ఈలొపే నా హృదయాన్ని ఆలకించవూ

నీ ఊసులకు మురుస్తానని తెలిసీ
మౌనంతో నన్ను నిరాకరిస్తావ్
దాచుకున్న మనసు ముసుగోసారి తీయవూ..

నాలో తప్పులనే తలపోస్తూ వెక్కిరిస్తావ్
అస్థిత్వమొకటుందని గమనించవు
నాలోని ఆవేశాన్నిప్పుడే మన్నించవూ

త్వరలో మరణం నన్ను పొలిమేర చేర్చక తప్పదు
పావుకోళ్ళు ధరించిన వసంతుడివై
ఈలోపే నన్ను దరిచేరి ఆదరించవూ..!!

Sadly..The Only Way Some People Will Learn To Love U Is After Losing U.. :( 

//సంస్మృతి//



జ్ఞాపకముందిగా

వాస్తవం కరుగుతున్నా
గతంలోనే నేనుంటున్నా

వాన కోసం చకోరమూ
నీ పిలుపు కోసం నేనూ
విరహమై ఎదురుచూస్తున్నాం

గుర్తుంచుకో
మనోసంచారీ

నువ్వెంత దూరమైనా
నాలో చక్కదనమెప్పటికీ నీకే

వేల హృదయాలు నిన్ను మోహించాయని
కోటికళ్ళు నిన్ను వెంటాడాయని

పదే పదే పరిహసించవుగా

మనో విహారీ
ఎప్పుడైనా నా మదిలోకి ఆగి చూసావా

స్మృతిలోకి రావోయి
నా కౌగిలిలో స్వర్గాన్ని చవి చూడలేదూ

చలించమాకు
నువ్వెతుకుతున్న జాబిల్లిని నేనే

కవ్వించకు..కలహించకు
కరుణించి చూడు
నీకై నిలువెల్లా కనులై
నిరీక్షిస్తుంది నేనే..!! 


//వాళ్ళు//



వాళ్ళెప్పటికీ గుండెల మీద చెయ్యేసుకోరు
కొడుకు చిటికెనవేలు పట్టుకు నడిచొచ్చిన రోజున
కన్నుల్లో నిప్పులు కురిపించి
శక్తి కొలదీ చూపులతో గాయం చేసి
సద్దు చేయని కలలను సైతం
రెప్పల నుండి వెళ్ళగొట్టి
ఏటెల మాటలతో వేకువ నిద్దురలేపి
తమ పెత్తనాన్ని గర్జించిన పెద్దరికం
తనకో కూతురుందనే నిజాన్ని మరచిన అత్తరికం
భార్య మాటలకే వంతపాడే మామ(గ)తనం
అప్పటికి వారికో హృదయముందో లేదో తెలీదు

ఇంట్లోకి మల్లెనే వారి మనసుల్లోకి ప్రవేశం లేదప్పుడు
ఆమె రూపమో కంటకింపు
ఆమె కదలికో వెగటుకంపు
ఆమె నవ్వుకో గ్రహణం..ఆమె ఆనందమో మౌఢ్యం
అప్పటికి వారు గుండెలపై చెయ్యేసుకోలేదు

ఆమెకో తొలిచూలు..అంబరాన్నంటే మధురిమలు
ఆశీర్వదించేందుకే చేతులూ సాగలేదు..మనసులూ లొంగలేదు
దినదిన ప్రవర్ధమానమవుతున్నా తేజం..కలిగించలేదెవ్వరిలో సంచలనం
సహనమై కరుగుతున్న కాలం..అమృతంగా మారబోనంది విషం
అప్పుడూ వాళ్ళు గుండెలపై చెయ్యేసుకోలేదు

ఒంటిమీదికిప్పుడు వయసొచ్చింది..చూపు చెదిరింది
స్థానబలం మారినా తరతరాలుగా తలకెక్కిన అహంకారం
కుదుళ్ళను కత్తిరించుకు పోనంటుంది
బాధ్యతలు నెరవేర్చమంటూ సాధిస్తుంది
అనుబంధమనే మెలిక ముడిలో
ఆమెకెప్పుడూ ఉరే కొసమెరుపు
అయితేనేం..
వారికి గుండెలపై చెయ్యేసుకొనే అవసరమే లేదు.. 


//నిశ్శబ్ద రాగం//




మౌనానికలవాటు పడ్డ మొదట్లో
నాకేదో అయ్యిందన్నారు కొందరు
అశాశ్వతమనుకున్న కొన్నింటిని విడిచేసాక
నిశ్శబ్దమొకటి శాశ్వతముగా ఉంటానని చేరింది

ఇరుసంధ్యల స్వరాలు..అపరాహ్న మూర్ఛనలు
వెన్నెల కౌగిలింతలు మొహం మొత్తాక
భ్రమరాలూ..సీతాకోకలూ దూరమయ్యాక
కొడవాగులూ..గోగుపూలతో చెలిమి వీడాక
ఒంటరితనమో విషాదమై
నేత్రాంచలాలకు వేలికొసను దగ్గర చేసింది..

ఏ రాగమూ నచ్చలేదంటే నవ్విపోతారని
సంగీతాన్నిప్పుడు నేస్తం కట్టేసా
ఏకాంతమిప్పుడు రవళిస్తోంది..
సరికొత్త స్వరకల్పనతో తాళాలు మార్చుకుంటూ.. 

//గిచ్చుళ్ళు//




ఊహల కెరటంలానో
పువ్వుల గంధముగానో
అల్లుకున్న కవితగానో
పాడుకున్న వరాళిరాగంలోనో
అలవోకగా వచ్చి చేరిపోతావు
నన్ను మరచిపోవద్దంటూ..

మనసంత మకరందముగా
ఆకాశమంత పందిరిగా
సొగసంత హృద్యంగా
చినుకంత పరవశముగా
క్షణమంత సంతోషముగా
జీవితమంత వసంతముగా
సిరిమల్లెంత అందముగా
ఒళ్ళంత తుళ్ళింతగా
రేయంత స్వప్నముగా
వలపంత తీయంగా
నన్నొచ్చి గిచ్చిపోతావు
వెన్నెల సంతకాలన్నీ నీకే కావాలంటూ
హృదయంలోని మెత్తదనమంతా నీకే అందాలంటూ

నా చూపంచున చిరునవ్విప్పుడు
పులకింతలు తప్పవన్నట్లు..;) 

//ఆమె..//




ఆమె నవ్వింది..
అవమానాల గతాన్ని అడుసులోకి తొక్కి
ఊపిరి బరువెక్కిన క్షణాలను దాటి
చేదు కన్నీటిని విదిలించి నిశ్శబ్దాన్ని నెట్టుకుంటూ
హృదయ శకలాలను శిధిలాలకు ఒప్పగిస్తూ
తనను తానో అద్భుతమని గుర్తు చేసుకుంటూ
మనసారా నవ్వింది

ఆమె నేర్చింది..
కొత్తగా మౌనాన్ని నేర్చింది
మనసు విరిచే మాటల్ని గాలికొదిలి
వ్యర్ధమైన విషయాలపై కుతూహలాన్ని ఆపివేసి
ఆపద్ధర్మపు స్నేహాలపై ఆసక్తిని హరించి
అక్షరాలకు గొంతిచ్చి స్వరపేటికకు మూతపెట్టి
తిమిరానంతర వెలుగొచ్చి తనకు మరో పుట్టుకనిస్తుందని
మనసా వాచా నమ్మింది

ఆమె కదిలింది
అడుగులకు పైమెట్టు లక్ష్యాన్ని నిర్ణయించి
తనలోని చలనంతో ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంటూ
ఆశాకిరణాల కాంతిపుంజాల్లో నడక దిద్దుకుంటూ
ఉత్సాహం గొంతువిప్పు క్రొంగొత్త ఊహలను పాడుకుంటూ
చపలచిత్తాన్ని పునాదులతో పెకిలించి విముక్తి పథంవైపు
పొరలుపొరలుగా విషాదాన్ని రాల్చుకుంటూ..గెలుపు దిశగా
శూన్యాన్ని వెక్కిరిస్తూ కదిలింది..!!
 

//విషాద వలయం..//




ఎన్నో అనుకుంటాం
ఉదయాన్నే ఓ ఉద్విగ్నతొచ్చి నిద్దుర లేపాలని.
ప్రేమగా ఓ చేయొచ్చి ముంగురలను సవరించి లాలించాలని
ఘడియకో చిరునవ్వుల వర్షం పెదవులపై కురవాలని
లోకం కనిపించని చిక్కని రాగబంధంలో ఇమిడిపోవాలని
క్షణాలకు తీరిక లేనంత వడిగా కాలం ప్రవహించాలని
అనుబంధానికో సరికొత్త నిర్వచనమిచ్చి ఆదర్శమవ్వాలని..
కానీ
ఎందరో మగమహారాజులు
అధికారంతో ఆడదాన్ని అణచాలని చూసేవారు
అహంకారంతో ఆగడం చేసి స్త్రీని హింసించేవారు
తనలో బలహీనతల్ని వాదనతో గెలవాలని ఎగిరేవారు
విచక్షణారహితానికి మగటిమితో ముసుగేసేవారు
సామాజిక కట్టుబాట్లను చూపి స్త్రీని నిస్సహాయతకు పురిగొల్పేవారు
మనసులో వికృతానికి ప్రేమనే పూతేసి ఉచ్ఛు బిగించేవారు
పురుషాధిక్యతతో సర్దుకుపోమని సలహా ఇచ్చేవారు
కళ్ళలో నీళ్ళు మాత్రమే నింపడం చేతనైన మహాపురుషులు
అందుకే
బంధాలంత బలహీనం
అనుబంధం
కొన్ని జీవితాల్లో విషాద వలయం..:( 

//ఏకాంతం//




ఏకాంతమెంత బాగుందో
ఊహలకు రెక్కలొచ్చి కాలాన్ని చుట్టొచ్చి
ఆకాశ తారలతో నేస్తం కడతాయి

ఆవిరవ్వని వెన్నెలనీడల ఆకృతుల్లో
శిశిరంపు ఆకుల సవ్వళ్ళు
నిశ్శబ్దాన్ని గలగలమని మింగేస్తాయి

మబ్బుపూల పరిమళానికి
మత్తిల్లిన రేయిలో
హాయి పాటలు పెదవులపై ప్రవహిస్తాయి

కలల్లో విడిచేసిన వర్ణాలన్నీ
విరిసిన పువ్వులై
పలకరించేందుకు తొందరపడతాయి

నిరంతర నా నిరీక్షణేదో
ఫలించినట్లు
కోటిభావాలు చిరునవ్వులై పెదవంటుతాయి

అంతకంతకూ పెరుగుతున్న
పరవశాల హోరులో
సంతోషపు సుళ్ళు చప్పుడవుతాయి

మనసంతా చిగురించిన ఆశలిప్పుడు
సరిగమల సమీరాన్ని తాకి
జిలిబిలి స్వరపల్లకిలో ఊయలూగుతాయి.. 

//ఒంటరి ఊపిరి//



మురిపించే రాతిరిలో
మనసుగది తలుపుతట్టి
చూపు కొసలకు వేళ్ళాడుతూ అలా నిల్చున్నట్లనిపిస్తావు
పెదవుల్లో ఆ నవ్వొకటి
మౌనాన్ని ఆసరా చేసుకొని చూపుల్లో ఇంకిపోతూ

నా గుండెలోని రాగాలన్నీ
గొంతుదాటి రానంటూ పెట్టే అల్లరికి
నిద్ర నటిస్తున్న రేరాణులు నవ్వుకుంటుంటే
నిశ్శబ్దాన్ని చీలుస్తూ మనసు విసుక్కుందిలా
ఊహలచిత్రాలెన్నని గీస్తావంటూ

వెచ్చని మాటొకటి విందామని
తనువెల్లా చెవులు చేసుకున్నా
ఒక్క పలుకు చినుకూ కురవదు
వశం తప్పిన అనుభూతిని దిద్దుకొనేందుకు
దీర్ఘమైన నీ ఆస్వాదనలో మునిగి
కొన్ని జ్ఞాపకాలతో కన్నులు తడుపుకుంటాను

మనసు బరువెక్కుతోందిక్కడ
కాలం కరుతున్న కొద్దీ ఊపిరి కృత్రిమమైనట్లు
అంతుపట్టని పరివేదన కాటుకను జార్చేసినట్లు
ఏకాకితనం రెండింతలై ఆత్మ విచ్ఛిన్నమైనట్లు.. 



Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *