Monday, 2 December 2019

// ఎటు చూసినా //

మనసు తెరుచుకొని ఎదురుచూసినప్పుడల్లా
విషాదం వెక్కిరిస్తున్నట్లుంది
నీ అడుగులకి అందనంత దూరం
కాలమెందుకు కల్పించిదో తెలియని గాయమిది

నేనొక్కటే నిర్లిప్తనై
విశ్వమంతా వెలుగుతున్నట్టు
నా వ్యధను చుక్కలు సైతం గుసగుసలాడినట్టు
ఎటు చూసినా శూన్యమే నన్నావరిస్తుంది..

ప్రణవమంటి నీ పిలుపుకి బదులిచ్చేలోపు
అదృశ్యమై..
నిట్టూర్పుల ఆవిరిని మాత్రం మిగిల్చావు

ఆరాధనకర్ధం తెలియాలంటే
జీవితాన్ని సహజీవనం చేయాలట
ఏమో..
కలల మంచుపొర కప్పుకుని కూర్చున్నా నేనైతే
నీ చిరునవ్వులప్పుడంతా నా సొంతానికేనని 😍💜  

// నా ఆరాటమే //

చిట్టడివిలాంటి నా మదిలోకి
చందమామలా నువ్వొచ్చినందుకేమో
నెలకో నాలుగురోజులు మాత్రం.
పున్నమిపువ్వు విచ్చినట్టు వాసనేస్తాను

నువ్వేమో.. 
దూరమన్నది నా కేవల భ్రమైనట్టు
వెనుకెనుకే తిరుగుతుంటావు
అదేపనైనట్టు అలిగిన కన్నుల్లోకి తొంగిచూస్తూ
మౌనమో కలస్వనమైనట్టు పులకరిస్తావు

ప్చ్...
ఎదురుచూసిన హేమంతం రానే వచ్చింది
నా ఆరాటమే చల్లగా మిగిలిపోయింది
మనోవిడిది వెచ్చనిపొరల్లో నేనూహించే నీ స్పర్శ ఒక్కటే
నన్నిప్పుడు కౌగిలిస్తున్న అమరసౌఖ్యమని తేలిపోయింది 😣 

// కలిసున్నామా //

కలిసున్నామా మనమసలు
కావలసిందేదో కరవడినట్లు ..
దూరానికర్ధం ఇప్పుడే తెలుస్తోందా..😱

హృదయం తడిగా ఉండాలని అనుకున్నందుకేమో
ఎన్నో యుగాలుగా అలవాటైనట్టు..
అక్కడ ఎక్కువైన నీరు కన్నుల్లోంచి దుముకుతోంది తేలిగ్గా
అయినా మనసు బరువు తగ్గలే..😣

అనుబంధమయ్యేంత అమరిక ఏముందని మధ్యన
మానసిక బంధుత్వాన్నీ నిలుపుకులేని నిస్సహాయినయ్యా
కల్పించుకున్నదంతా భ్రమని ఒప్పుకోవలసిందేమో
ఏమో..ఇప్పటికిప్పుడు..నువ్వెవ్వరో..నేనెవ్వరో😢 

గుండెల్లో మెలిదిరుగుతున్న ఊహలిప్పుడు
కాబోయే కలలో.. భయమనిపించే నిజాలో.. తెలీనట్టు
నా ఒంటరితనమిప్పుడో నల్లరంగు పులుముకుంది
ఏమో పంచవన్నెల రంగులు నాకచ్చిరావేమో..😒   

// Non verbal //

Non verbal..
ఒక్కమాటైనా లేదా చెప్పడానికీ
నాకిష్టంలేని నిశ్శబ్దాన్ని నువ్వాలకిస్తున్నావు కదూ
ఏం చెప్పిందది..
నేనో శిలగా మారినందుకే సడిలేదని చెప్పిందా
కనురెప్పలపై నిద్దురనీడలున్నా కునుకేయనివ్వని కథ..
వాస్తవంలో జరుగుతున్నదేనని చెప్పిందా
కన్నీటికి తడవని మధురపదాల పొందిక
అనంతకోటి గొంతుకల ప్రేమరాగంలో
నేనొంటిగా పాడుకుంటున్న యుగళగీతమైతే
నీ మధురస్మృతుల్లో నేనో కలగా మిగిలిపోతాలే
అయినా..
సముద్రంలో కలవాలని ఉరకలేసే నదినేం కానుగా
ఒక్క ఋతువుకే కరిగే హేమంతాన్ని కనుకే కదిలిపోయా 😣

// అరాచకాలు //

వావీవరసా లేదూ..మానవీయ మృదుత్వం అసలే లేదు..
స్త్రీ విలువ తెలియని మదాంధునికి
ఆకృత్యాలలో ఆరితేరిన రాక్షసులు
కాపుకాసి నరమేధానికి సిద్ధపడుతూ
తెగబడుతూ అరాచకాలు సాగిస్తున్న నిర్లక్ష్యానికి

వయసో శాపం..అందమో శాపం..
వంటింట్లో ఊడిగం..యాతనలో జీవితం..
ఒకప్పుడు ఆడపిల్లకి
స్వేచ్ఛకోసం పోరాడినంతసేపు పట్టలేదు
శలభంలా కాలి నుసయ్యేందుకీనాటికి

కన్నుల్లో పాపగానే దాచుకోవాలేమో ఆమెని
కలకాలం బ్రతికి బట్టకట్టాలనుకునే అత్యాశకి
ఆకాశంలో సగమెక్కడ మహిళ..
వెలుగకముందే చుక్కలా రాలిపోతున్న పాపానికి 😢😣

// వలపు //


ఏదో మహత్తుకి తపించి
దూరాన్ని కరిగించి నిన్ను నాకు
దగ్గర చేసిన వేకువంటే ఇదే..

నీకిష్టమైన అలికిడంటే
నా గుండెచప్పుడేనని
మరోసారి ఋజువైన రసోదయం కదా మరి..

కాలం అడ్డుపడలేని
ఊహల కలయికలో
మన ఇద్దరి ఏకాంతం.. వలపు జలపాతం 💕💜

// కొసమెరుపు //

పిచ్చిగీతల నొసటిరాతల్లో అంతులేని కథేమిటో
మలుపులెరుగని జీవితానికి గమ్యమెక్కడో

ఋతురాగం తెలియని కొమ్మకి పువ్వులు పుట్టినా
ఆర్తిలేని హృదయంలో పదమైతే పూయదన్నట్టు.
కన్నీటి నవ్వులకే పరిమితమైన చూపుల్లో
కలకాలం ఆశావర్షాన్ని కురిపించేదెవ్వరో

లోపల గడ్డకట్టిన జీవనది ప్రవహించాలనుకున్నప్పుడు
మనసుని విదిలించడం కూడా తెలియాలన్నట్టు
విగతమైన అల్పస్వప్నాల మైమరపు
వేకువ వెన్నెల్లో కనిపించని నక్షత్రాల కొసమెరుపు..😣

// అశ్రువిన్యాసం //

కొబ్బరిమొవ్వలోని చిన్నివెన్నెలకి మైమరచిన మనసు
నీ ఊహల సాంత్వనకని కళ్ళు మూసుకోవడం తెలుసా

పాలనురగ వంటి ప్రేమసాగరం
ఎదలోయల్లో ప్రవహిస్తుందంటే నమ్మవా
భాష్యంగా మిగల్లేని స్నిగ్ధక్షణాలు
వడివడిగా కదిలిపోతుంటే ఏం చేయనూ..😒

గుండెల్లో మొదలై గొంతులో ఆగిన సప్తస్వరాలు
ఇన్నాళ్ళూ రవళించకుండా ఆగి
మృదువైన మందహాసమై బయటపడుతుంటే
మంచి ముత్యాలు ఏరుకోడానికి రావెందుకూ

ఉత్తరంగితమైన రుధిరపు రాగం
మునిపంట ఆగిన వివశత్వపు కృతికాగా
గుచ్చుతున్న నీ విరహం
రెప్పలమాటు దాగుళ్ళాడుతున్న అశ్రువిన్యాసం 😣💞

// అశోకవనం //


మనోపుష్ప సౌరభం ఆస్వాదించలేని అంతరాత్మ
మట్టితో తయారైన బొమ్మ సమానం

విఫలమైన ఆశల్లో కోరుకున్న స్వప్నం
నిర్జీవమైన ఎడారిలో నిట్టూర్పుల సంగీతం

మనసు అరల్లోకి తొంగిచూడనివ్వని అనుబంధం
వెతుకులాటలోనే గడిచిపోయే జీవితమాద్యంతం

ఆలోచనల అంతరార్ధం అశోకవనమైతే..
నేనో సీతనై..నువ్వు రాకాసివైనట్టు..😣

// వేకువ //

మసకచీకటి క్షణాల శబ్దరహిత వేకువలో
తొలివెలుగు రూపమై చేరువైన ప్రియమైన అతిథీ..
నువ్వలా అపరిచిత కృతులు మొదలెట్టగానే
ఝల్లుమన్న నా గళరాపిడి గమకమై ఎగిసింది

మధువీక్షణాల కువలయ నయనం
కుంకుమపూల తోటను చేరి
కుసుమపరాగ మధూళీ వశమై
ప్రేమామృతపానం చేసినట్టుంది

దేహంపై మెరుస్తున్న ఈ ఉద్వేగం
నీ కవిత్వంలా నాకనిపిస్తుంది
ఎప్పుడైనా నన్ను రాసున్నావా
అదేమో..ఇక్కడంతా
కొన్ని వాక్యాల తీపిమరకలు..
ప్రపుల్లమై నవ్వుతున్న కార్తీకదీపాలు..💜💕

// నిశ్శబ్దం //


గాలి వీచినప్పుడల్లా తలలూపే పూలు
ఏ ప్రేమరాగానికి పరవశిస్తున్నవోనని తలపోసా
అణువణువూ మధురాన్ని పొందిన అలౌకికాన్ని ఆరాతీసి
మౌనాన్ని తర్జుమా చేసే స్పర్శ ఉంటుందని తెలుసుకున్నా

మనసంతా కళ్ళు చేసుకొని సంతోషపడ్డ
సాయింత్రమేదీ ఈనాటికీ లేదసలు..
కలల వంతెన మీద కలిసిన నువ్వూ నేనూ
నవ్వుతూ కదిలే క్షణాల కోసమనే ఎదురుచూస్తున్నా

అనాదిగా ముద్రించుకున్న నిశ్శబ్దం
వెన్నెలొచ్చి తాగేయాలేమో ఇప్పుడు
కొమ్మల నడుమ కూసే కోయిలనై..
మురిపెముగా కనుచివరలు కలిసేలా కువకువలాడాలనుంది 💜☘️

//అంతేగా..//

అప్పుడప్పుడు మత్తుగా తూలే గాలి ఊసులు
ఆలకించకపోవడం మంచిదే..

ఆవరించిన చీకటిలోని అపరిపక్వత వింతలు
తెలుసుకోకపోవడంలోనే సంతోషముంది

ఒక్కోసారి మనసు మాట వినక తప్పకున్నా
అలజడి రేపే అస్పష్టాల ఆరాలు తీయరాదు

పీడకలలు రగిలించే సెగలు తలుస్తూంటే
వర్తమానం ఉనికి కోల్పోయి ఉక్కిరిబిక్కిరవుతుంది

సంతోషమనే గమ్యానికి నేర్పుగా చేరాలంటే
మనమే విషాదాన్ని ఏదోక మలుపులో విడిచిపెట్టాలి
లేదూ..
పాత్ర ముగిసేదాక నటిస్తూనే ఉండాలంటే
జీవితం అపాత్రదానమై ముగిసినా విచారించరాదు ☺️💜

// శరన్మేఘం //

సాయింత్రమైతే చాలు
ఈ శరన్మేఘం
హృదయపు బరువుని ఓర్చుకోనన్నట్లు
చల్లగా కురుస్తుంది

విషాదమో అలవాటుగా మారిందని
తెలుసుకున్న పెదవి
చివరంటూ లేని నవ్వులు
కానుకగా కావాలనంది

సగంసగం కనకాంబరం రంగు
మనోన్మయ కావ్యమై
చీకటితో మాట్లాడేందుకు
అనంతమైన సరిహద్దులు దాటేస్తుంది
ఈలోపే..
ఆఘమేఘ శకలం
మనసుని రంజించాలని
అమృతపుజల్లుని ఒలికించి
కొసమెరుపు తీపిని పంచిస్తుంది..☺️💜

// దిగులు //


చలనమాగిపోయిన చివరి కాంతిరేఖ
నీ రూపుదైనప్పుడు
మనస్సొరంగంలో ప్రవహిస్తున్నా
మోహం నిజమని ఒప్పుకోవడం కష్టమేలే..

నాకు నేను ఓడి
నిన్ను గెలుచుకోలేని అనుబంధంలో
జీవితేచ్ఛ ఓ అబద్ధమని
నమ్మించలేని ప్రయాసలో
శూన్యంలోని నక్షత్రానికి మాత్రమే
సమానం నేను

ఇప్పుడు అలసిన కళ్ళల్లో
దిగులు మరకలు తప్ప ఏమున్నాయని
విషాదాన్ని పులుముకున్న ఆవేదన తప్ప..😣  

//ప్రేమకవిత//

ఏ ఊహ చివరనో నిలబడి
ఎలా నా సంతోషమయ్యావో
ఇప్పటి ఉదయాస్తమానాల సరాగం నువ్వు

అందుకే...
విశ్వమంతా మేల్కొన్నా
స్వప్నాల సందిట్లో నేను..
నన్ను గెలిచిన నీ చిరునవ్వుకి పరవశిస్తూ
రెప్పలమాటున అదే ప్రేమకవితగా రాసుకుంటూ 💕💜

//ఏడో రుచి//


పొడిపొడిగా చూస్తున్నట్లే
కరచాలనం చేసే ఆ కళ్ళు
కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వవు

కొన్నాళ్ళే కదా మౌనమనుకుంటా
నీ చేతివేళ్ళ స్పర్శ తగిలిన కలలోకి
జారిపోయిన ప్రతిసారీ
చెప్పా పెట్టకుండా
వచ్చేసే నీ తలపులంటే ఇష్టమే కానీ
కదిలిపోయే క్షణాలను ఆపలేని అశక్తి ఒక్కోసారి..

సగం సగం అనుభూతుల సావాసంలో అలసిపోతున్న నేను
ఆగని కాలాన్ని ఆపలేను..కానీ.. తిట్టుకుంటూ గడిపేస్తాను
ఎక్కువగా ముడిపడకని మనసుకి చెప్తున్నా

తీపిని మించిన ఏడో రుచికి అలవాటుపడుతుంటే
రేపు దిగులైతే ఓర్వలేనని..😁😍

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *