Monday, 6 February 2017

//విఫలం//



రాసేందుకో కారణం కావలనేమో..
అప్పుడప్పుడలా దూరం జరుగుతుంటావు
నిశీధికి రంగులద్దడానికి నన్నంటగట్టి
గుండెను జ్వలించేట్టు చేస్తావు
విశ్వాసానికో భూకంపం సృష్టించి
ఆత్మబంధానికి బీట్లు పట్టించి కదిలిపోతావు
కనిపించని తిరుగుబాటుతో రెచ్చగొట్టి
చెరుకు తీపి నా ఊహల్ని ధ్వంసం చేసి పోతావు

ఏకాకితనపు నిట్టూర్పులకు నన్ను విడిచి
అస్పష్టభావాల గుంపుతో తరలిపోతావు
నిశ్శబ్ద దేవతల ఆరాధనలో మునిగే నేను
విషాదాన్ని తాగి నిషాదాన్ని సవరిస్తాను
అస్తమించే సంధ్యల్లో అసహాయినై
ఆకాశపు మైదానంలో తప్పిపోతాను
ఓదార్పు కోరే కెరటాన్నై తీరానికెగిసినా
ఒడ్డునాగలేని అలగా అల్లాడుతాను
భావానికతీతమైన వాక్యంలో నిన్ను పొదగాలని
మరోసారి ప్రయత్నించి దారుణంగా విఫలమవుతాను.. 


//కొన్ని కొన్ని..//


కొన్ని తడియారని జ్ఞాపకాలు
ప్రాణం పోసుకున్నట్లు
మదిలో సప్తవర్ణావిష్కరణలు

కొన్ని వెతల దూరాలు
కాలం పూసిన లేపనాలు
రాలిన ఆకుల కొమ్మకు వసంతాలు

కొన్ని అస్పష్ట దృశ్యాలు
అపురూప క్షణాల కలయికలు
పగటికలల చిద్విలాసపు కేరింతలు

కొన్ని రంగుల సమ్మేళనాలు
నవరాగాల పల్లవులు
గుసగుసలిప్పుడు సంగీతాలు

కొన్ని అక్షరాల వారథులు
ఊహాతీతమైన అనుభూతులు
కవితావేశపు మురిపాలు

కొన్ని భావాల కిరణాలు
చిరునవ్వుల మందారాలు
తిమిరాన్ని తరిమే ఆనందాలు

కొన్ని నక్షత్రాల తళుకులు
పసి వెన్నెల సౌందర్యాలు
ఈ రాతిరికవే పులకింతలు.. 


//అసంపూర్ణం//



ప్రతిరేయి నిద్దరోని నీరవంలో
నీ ఊహలతో నేనూసులాడుతుంటా
నా చెక్కిట విరిసే కెంపుల సాక్షిగా
నిన్ను నా ఏకాంతంలోనికి ఆహ్వానిస్తా

నా నిరంతర జ్ఞాపకాల ఒరవడిలో
నిన్ను మాత్రమే సంప్రీతిగా మునకలేయనిస్తా
రాలు పూల పుప్పొడి వర్ణాలనూహిస్తూ
అపరంజి భావాలెన్నెన్నో పులుముకుంటా

నువ్వో కెరటానివి నాకు..
తీరాన్ని ఝుమ్మనిపించే వెచ్చని రాగాలాపన
తెలిసిన మోహానివి..

అందుకే
భంగపడ్డదక్కడే మనసు
ఆకర్షణకు తప్ప ఆత్మీయతను లొంగని హృదయాన్ని ముడేసుకున్నందుకు
ఇప్పుడు కొన్ని నవ్వులకోసం వెతుకుతున్నానని తెలిసాక
ఎప్పటికీ నేనో అసంపూర్ణ కవితనేనని ఒప్పుకుంటున్నా.. 


Sunday, 5 February 2017

//ఏకాంత మౌనం//


ఏకాంతానికి మాల వేసి వరించాలనుకుంటా
నీ ఊహను కమ్ముకోవాలని మనసు గోలపెట్టినప్పుడు

కొన్ని రాగాలు మధురించే క్షణాలు
తీయగా కదులుతున్నప్పుడు
హృదయస్పందన చేసే సవ్వడి
నీలో లీనమైన నా ఆత్మకే తెలుసు
సుగంధాన్ని సంతరించుకున్న సమీరం
నులివెచ్చని నా శ్వాసను చేరి
నిలువెల్లా వెన్నెల నింపినప్పుడు జాబిల్లికి చేరువైన వైనం
నీలో ఊయలూగే నా స్వప్నాలకే తెలుసు

సంగీతాన్ని మరిపించే చిరునవ్వు పలకరింపు
గులాబీల వసంతోత్సవం
నాలో సరసానుభూతుల కావ్యానికి శ్రీకారమైనప్పుడు
దోబూచులాడుతున్న నిశ్శబ్దానికి తెలుసు
నీ జ్ఞాపకాల పరిమళం

మధురిమ తెలిసిన మౌనమిప్పుడు
హద్దుల్లేని అంతరిక్షానికి పాకినట్టు భావనలు
స్పందించే సమస్తాలు నిన్నే ఆవరించినట్లు..:)

//తలపోత//



అలసిన కన్నుల అలజడి
సద్దుమణిగి
నిద్రించేందుకు రమ్మంటుంది

ఆ కాస్త భావావేశమూ
ప్రాణంలో ప్రసరించి
ఏకాంతానికి దారడుగుతుంది

అప్పుడప్పుడూ కదిలే
అపస్వరమొకటి
అనిశ్చితాలతో బేరమాడుతుంది

కోర్కె సడలిన రాతిరిలో
ఆద్యంతరహితమైన చీకటి
స్వేచ్ఛ దొరికి నర్తిస్తుంటుంది

శూన్యమంత మనసు వినువీధుల్లో
స్వప్నమొకటి
మరపురాని జ్ఞాపకాలను తోడి
హర్షాతిరేకంతో నన్ను నవ్వించాలని చూస్తుంది..:)

//మౌనం వెనుక//



ఆలోచన తొణికినప్పుడల్లా మనసు కమిలిపోతుంది
నవ్వుతూనే గుండెను రెండుగా చీల్చినట్లు
ప్రాణాన్ని చిదిమేస్తున్న భావనలు
హృది కల్లోలానికి సాక్ష్యంగా
కన్నులు విడిచిన భాష్పాలు
చెక్కిలిపై చారలుగా మిగిలిపోతూ..

శూన్యాన్ని కౌగిలించే దైన్యంలో
మనసుపొరల్లోపలే మూలిగేందుకు
గుబురుచీకటిని వెతుక్కుంటూ
తరలిపోతున్న ఊసుకు తెలుసు
తరగలుగా వీచిన తలపులు గడ్డకట్టినవెందుకో
కుసుమించిన ఆశలు మరణించినవెప్పుడో

పొడిపొడి మాటల పరిహాసాలతో
కుదించుకుపోయే బంధాలు
ఊపిరినాపాలని ముసురుపట్టించే స్మృతులు
ముసుగు తొలిగిన మనసు కొలమానంలో
అంతులేని అంధకారాన్ని కనుగొన్నాక
మౌనం అనివార్యమైంది..
నిశ్శబ్దం అలంకారమైంది
ఇప్పుడిక ఎటు చూసినా ఏముంది
మరణమంత సహజంగా ఒంటరితనం చుట్టుముట్టాక..

//కొన్ని క్షణాలు//



అదిగో వినిపిస్తుంది..నాలో సంగీతం నాకు
తరలిపోయిన భావమొకటి వెనుదిరిగినట్లు
విప్పారిన వెన్నెల్లో నవ్వులు చిమ్మినట్లు
అరవిరిసిన పూలపరిమళం చుట్టుముట్టినట్లు

అదిగో..అక్కడో సౌందర్యావిష్కరణ
నేనో మైమరపుకు చిరునామా అయినట్లు
అపూర్వ తన్మయత్వానికి మది తేలికయినట్లు
సరాగాల విలాసానికి చేరువైనట్లు

మనోరథం అటే కదులుతోంది
అలలుగా రమ్మని పిలుస్తున్న సముద్రానికేసి
అణువణువూ నింపుకున్న తేజస్సును కూడి
ఆ రసవాటికలో మునకలేయమని

అనుభూతి సిద్థించాలనుకున్న ప్రయత్నం ఫలించింది
ఒంటరితనాన్ని పూరించుకొనే అవకాశం దొరికింది
ఎగిరిపోతున్న కాలానికి గాలమేసినట్లయ్యింది
ఈ క్షణాలిక నావే..పూర్తిగా నాకే...

//ఈ వేళ..//



మనసంతా పరచుకున్న విరజాజుల పరిమళాలు తూచి
తన్మయత్వపు జడివానలు కురిపించు ఆనందం నీది
శుభమూర్తం కుదిరిందని పూలకలలు కోసుకొచ్చి
తపనల సరిగమలు వెదజల్లాలనే పరవశం నాది..

చీకటి కొమ్మకు పూసిన వెన్నెల ఱేడు నీవు
నీకోసమే విరిసే విరిసిగ్గుల తామర నేను

కన్నుల్లో స్వప్నాలు స్వర్గాన్ని తలపించే వేళ
హృదయమాపలేని జోలపాటలెన్నో కదా
అందుకే..మధుమాసపు మనోకోయిలనిప్పుడిక నేను..
నీకు మాత్రమే వినిపించాలనుకొనే ప్రణయ భావాలతో..

//ఆత్మ శోకం//



కదిలిపోతున్న కాలాన్ని ఆగమన్నప్పుడు
బహుశా కలలో ఉండుంటానేమో..
ఊహల సమూహాలన్నీ ఒకేసారి
చుట్టుముట్టినప్పుడు తెలుస్తుంది
అంతర్లోకంలో ఆవేదన
విరుచుకుపడుతుంది హృదయం పైనేనని

గమ్యంలేని ఆకాశంలో చివరి అడుగు
ఎటువైపో తెలీనట్లు
ఎన్నో మలుపులు ఛేదించాక
నిరీక్షణలో క్షీణించిన అమరత్వం
విషాదాన్ని విశేషంగా వర్తించింది
వసంతాన్ని వరించాలనుకున్న జీవితం
అనుభూతుల కల్పనలో ఉప్పొంగలేక
శిశిరానికి రాలి మట్టిలోనే చివుక్కుపోతుంటే
మరో పుట్టుక కోసం విశ్వాసాన్ని కూడాదీసుకున్నట్లుంది

నిశ్శబ్దంలో నిశ్చలంగా ఎగురవలసిన సీతాకోకలు
గాయాలు తడుముకుంటూ కదులుతున్నట్లు
కొన్ని తడియారని జ్ఞాపకాలు
విద్యుధ్ఘాతాలై కాటేసే వేళ
యావజ్జీవ ఖైదీనేగా
ప్రేమ సమాధైన చోట ఆత్మ వినాశనమేగా..

//ప్రేమ కెరటాలు//



మూసిన రెప్పలపై అధరాల సంతకం
నువ్వు తాకుంటావనే సున్నితమైన సడి
అపురూపమైన ఒక భావం..
ఈ చీకటి కెరటాలలో నీ జ్ఞాపకాల వలలు
ఏడురంగుల ఇంద్రధనస్సులై నన్నల్లుకుంటూ

మనసు మడతలు విప్పితే వచ్చే పరిమళమంతా
నీ ఊహదేనన్న వాస్తవం చాలదూ
ఉక్కిరిబిక్కిరవ్వడానికి..
నువ్వూ నేనూ స్వప్నంలో కలుస్తున్నా
వాస్తవంలో తప్పిపోయిన ఆత్మలం
కాదనగలవా..

తలపులు సయ్యాటాడే ఒక రాత్రికి
నక్షత్రాలలో విహరించినట్లనిపిస్తే
మధురక్షణాలెక్కడో లేవని అనిపించడం తప్పు కాదు
మనసు దాచలేని నీ చూపులు
కొత్తలోకానికి రమ్మంటుంటే
మౌనమే మధురిమకు సమాధానమై
కదులుతున్న క్షణాలను ఆగమన్నది నిజమే
కొన్ని అక్షరాలు కాగితంపై ఒలికిపోతుంటే
వసంతం వెన్నెలను గుప్పింది గురుతే

ప్రేముందని మనసివ్వలేదు..నేనే నువ్వయినప్పుడు
ప్రేమన్నది కృతి కాక మానదు..నాతో నీవున్నప్పుడు..:)


Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *