Friday, 29 May 2020

// రోహిణి..//

నిలబడ్డచోట నిప్పులగుండం
అనంతమైన సెగలుచిమ్ముతూ
ఉడుకు వాసనేస్తుంది
కరిగి నీరవుతూ దేహం చేస్తున్న
హాహాకారానికే గొంతెండిపోతుంది

వేసవిగాలుల దాడికి నిద్రాసనంలో సొమ్మసిల్లి
ఎండపొడకి మొరాయిస్తున్న
ఆత్మను నిద్రలేపున్న విఫలప్రయత్నంలో
కొంత అనివార్యపు యుద్ధమవుతుంది

కాలాన్ని కత్తిరిస్తున్న రోహిణికి
పగులుతున్నవి రోళ్ళు మాత్రమేనా
సకల జీవరాసీ ప్రాణాలొడ్డి ఓర్చుకుంటున్న తాపం
ఏటేటా పెరుగుతున్న భూభారపు ముఖచిత్రం
తప్పని తెలిసీ దిద్దుకోలేని మన చేతకానితనం
రాబోవు తరాలకు మనమందిస్తున్న కాలుష్యపు భవితవ్యం 😞

// శిలాజలమైపోవద్దని..//

వైశాఖం వంతెన దాటేలోపే
కొన్ని కలల చిత్రాలను నాకొదిలేసింది
ఎదలో కవిత్వాన్ని ఆపేసి శిలాజలమైపోవద్దని
మాట తీసుకొని మరీ కదిలింది

నన్ను దాటిపోయిన చిరునవ్వులు
నీవైపొచ్చాయేమో అడగాలనుకుంటానా..
కాగితమంతా నీ పాదముద్రలతో కనికట్టు చేస్తూనే
చాలాసార్లు అదేమో క్లుప్తంగా ఉండిపోతావ్

నీ పేరు మౌనమని
రెప్పలమాటు అలలు విరిగిపడుతున్నా
అమాస కదా అనే ఆశావాదానికి నిర్వచనానివని
నాకు తెలిసిపోయాక ఇంకేమడగనూ..

అలవాటైన మనసుపాటలో ఐక్యమయ్యి
అంతరంగ పయనంలో సాగిపోతున్నా..
దారంతా నీలినీలి పువ్వులు
ఏరుకోమనే నీ భావాలకు మల్లేనే..😂💜

// వేకువ చుక్కలు //

నవ్వే నీ కళ్ళు వేకువ చుక్కలు
నన్ను మేల్కొలిపే దీపాలు
నా అందమైన ఊహాలోకానికి వారథులు
ఏకాంతపు కలల ప్రాకారాలు

మేఘాలకొసకు పుట్టిన మెరుపులు
విరజాజి రేకుల్లో పాలదొంతరలు
నీ సమస్త భావాల ప్రకంపనలూ
నన్ను నీలో కలిపేసుకున్న భాష్యాలు

ప్రేమాన్వీ..
నీ చూపుల తాదాత్మ్యాలే
నే నిరంతరం పేర్చుకొను పదాలు
అవి ఎగిసిపడే అలల వెన్నెలపొరలైతే
మనసంతా అత్తరు ప్రవాహాలు
తొలివలపు లాలస మేలిముసుగులో
నన్ను రగిలించే చిలిపి మోహపుధారలు 💕💜

//ఇటు తిరుగకు..//

కొసరి కొసరి మైమరచిపోయేంత అశాంతి
గుండెల్లో అలల మాదిరి జలజలలో
సందిగ్ధమైన స్పర్శ నీ తలపుదేనా

ఆకాశానికి వెన్నెల హారతి పడుతున్న వేళ
గాలి తునకలు మోసుకొస్తున్న పరిమళానికి
నిదురన్నది రాని రాత్రి ఈ పంచాశ్రువులెందుకో

అతులితానంద కన్నీటి రాగంలో
రెక్కలు తొడగలేని ఆత్మగీతం
ప్రతిధ్వనిస్తున్న పర్వం అవేదనదా..

జీవనవేదపు ప్రవాహవెల్లువలో
తడవని తామరాకులా ..నువ్వో అన్వేషివి
వసంత విరితావులా నేను..నీ వెనుకడుగుని..

ప్రేమాన్వీ..
ఇటు తిరిగి నన్ను పరామర్శించకు
నే పరితపించిన పాటకి గొంతు కలుపుతూ పద ముందుకు..💕💜

Wednesday, 6 May 2020

// చెప్పేదేముంది..//

చెప్పేదేముంది
రోజూలానే ఉదయమయ్యింది
వేకువ కన్నుతెరిచి
మృదువైన కోలాహలాన్ని తెచ్చింది
గుర్తుతెలియని రాగాలు రెక్కలిప్పుకున్న గువ్వలై
పూల తెమ్మెర పదాలు సహా
జీవనగీతం వినిపిస్తున్నాయి

కానీ
చిరునవ్వుకి కారణం వెతుకుతున్న సమయమిది
కన్నీటితెర వెనుక జ్ఞాపకాల పారవశ్యాలు
దిగులుమేఘపు కవిత్వాన్ని పాడమంటున్నా
ఊపిరాడనివ్వని ఉక్కబోత
ఒక్క కలనీ తొడుక్కోనివ్వలేదు

వసంతానికీ విషాదం తెలుసనుకుంటా
అంతర్లోకపు నిరసనేదో నిశ్శబ్దాన్నే కోరుతున్నట్టు
గొంతు సవరించినా అపస్వరాలు
తలపుని కలుపుకోలేకపోతున్న కాలం
అలలు నెమ్మదిస్తున్నట్లనిపిస్తున్న గుండెసముద్రం 😣

// కన్నీటికథల రహస్యం //

దీర్ఘనిశ్వాసకే ఆరిపోయే దీపంలా
రెపరెపలాడుతూ ఊగుతున్న ఉరికొయ్యలా
కాలంలో ఎప్పుడు కొట్టుకుపోయిందో
కౌగిలింతకూ నోచుకోని కాగితంపువ్వు జీవితం

చీకటితో గొడవపడుతున్న సమయంలో
కలలపై నిర్మించుకున్న వంతెన విరిగి
కనుకొలుకుల్లో ఇసుకమసి నింపి
చివరి అంకపు పరాచికాన్ని ఆడనివ్వని అంతర్వేదం

తడిమి చూసుకున్నా సంతోషం తగలని నిస్సహాయమే..
శాపాన్ని వెంటేసుకొచ్చిన శూన్యాకాశం
ఓదార్పు సైతం కూడదీసుకోలేని నిట్టూర్పుల్లో
ఎవ్వరికీ తెలియని కన్నీటికథల రహస్యం 😣

// అడగాలని ఉంది..//

నిశ్శబ్దాన్ని రాల్చుతున్న ఆకాశానికెంత కష్టమొచ్చిందో
నిచ్చెనమెట్ల మీదుగా ఆరాతీసినా దాని గొంతే వినబడనట్లు
కలలు పారేసుకున్న దారిలో ఎంత దూరం నడిచినా
ఆద్యంతం లేని విషాదం మాత్రం వెనుకే వస్తుంది

అన్ని సీతాకోకలకి రంగులేసేంత ఓపికున్న దేవుడికి
నన్నెందుకు చిమటగా మిగిలించాడో వెతికి అడగాలని..
రెక్కలొచ్చినప్పుడంతా కిటికీలోంచీ ఎగరాలనుకుంటానా
గాలొచ్చి గాయాన్ని గుర్తుచేసి మరీ జోకొడుతుంది

ఇంత చెప్పినా నువ్వేం నమ్మవుగానీ..
అందానికి అవతలున్న ప్రతిబింబం తెలుసా నీకు
ఆ రెప్పల కింద సముద్రముందని తెలియాలంటే
నా చెక్కిలి రుచి చూడవలసిందే నువ్వొకసారి 🙂         

// అంతర్ముఖం.//

పలుకు బంగారమైన చోట
ఆరాటపడే హృదయమేదీ చిరునవ్వదు

మాట మనసుల్ని దగ్గర చేస్తున్నప్పుడు
దానికి ప్రత్యామ్నాయం ఏముందని..
అక్షరాలకు చినుకులుగా మారడం తెలుసు కనుకనే
కురిసి హృదయాన్ని తడపడం నచ్చదు

మనిషి లోపలి మనిషిని తట్టిలేపలేని
ఘనీభవించిన రాచరికపు స్నేహాలు ఎవ్వరికోసమని..
మౌనం ముసుగేసుకున్న కెరటం తీరాన్ని తాకలేనట్టు
అనురాగం ఆవిరైన మేఘం తొణికేదెన్నడో చెప్పలేరెవ్వరూ

కృష్ణపక్షపు చంద్రుని ముఖచిత్రమే..
కరిగిపోతున్న అనుబంధపు అంతర్ముఖం..😣

// జ్ఞాపకాల గది //

పాడుతూ ఉన్న మది పాడవుతుందని తెలిసినా
జ్ఞాపకాల గది వీడి బయటకీ రాదు
ప్రణయాక్షరాలను పేర్చడమూ ఆపదు

నా నాలుగు క్షణాల నిత్యానందాలు
కెరటంలో దాగిన కడలిలా
నీలోపలున్నాయని తెలిసాక..
ఇష్టమంటూ నువ్వు మిగిల్చిన మౌనంలో
ముత్యాల తుంపరలెన్నో
ఊపిరాడనంతగా తడిచిపోతున్నానిలా

సంతోషాన్ని నెమరేస్తూ జరుపుతున్న కాలహరణంలో
లోనికి ఇంకడం తెలియని కన్నీరు
మంచి ఘడియలకి ఎదురుచూస్తున్నట్టు
ఏకాంతం చేసే వినోదానికి నవ్వడం నేర్చుకుంటుంది

ఊహకందని నిశ్శబ్దమేదీ మన మధ్య లేనందుకే
తెరతీయకుండా నువ్వు పలుకుతున్న పదాలనే నేనాలపిస్తున్నా 😉💜

// ప్రత్యేకమైన రోజులివి //

దేశదేశాలూ పశ్చాత్తాపంతో పయనమాపేసినప్పుడు
తొలిసారి ఊపిరి పీల్చుకుంటున్న విశ్వాన్ని చూడు

వేకువ చుక్కలదండ వేసుకున్న వేసవిలో
కొన్ని యుగాల పులకరింపుని
అరమోడ్చిన కళ్ళతో
అద్దంలో చూసుకుంటుంది ప్రకృతి

మేఘాల మెరుపూ..కోయిల పిలుపూ
ఊహల విరుపూ..బుగ్గల ఎరుపూ
వివశించక తప్పని వింత అధ్యాయపు
ప్రతీదీ ప్రత్యేకమైన రోజులివి

కాలుష్యపు వలువలు వీడిన లోకం
రంగురంగుల చిలిపినవ్వుల మైకంతో..
అడివిగాలి ఆకాశంలో దారితప్పి ఇటొచ్చినట్టు
మనసంతా మరుమల్లె సువాసనా సందళ్ళు

ఇప్పుడెవరూ సుప్రభాతం పాడక్కర్లేదు
ఆశలద్దుకున్న అనుభూతులతో కళ్ళవే విచ్చుకుంటాయి 💜 

// కాలం //

అపారమైన శక్తి కలిగిన కాలం
కోట్లానుకోట్ల క్షణాల కౌగిలికి పుట్టిన నిజం
జీవితాన్ని శాసిస్తూ తను మాత్రం కదిలిపోవు దూరం
ఆద్యంతాల అనుభవాలను కనికట్టు చేయగలుగు వేదం

గుండెలమాటు అశను తీర్చగలిగే ప్రణవనాదం
మనసుపడ్డ కవితలా రంజింపజేయు దరహాసం
శిలను శిల్పంగా మలచగల నిశ్శబ్ద గమనం
రెప్పలమాటు నులివెచ్చని కన్నీటిని తీపి చేయగల సాక్ష్యం

యుగయుగాల అవకాశావాదుల కాలక్షేపం
ద్వేషం చేసిన మాయని గాయానికి మంత్రం
అవధుల్లేని విషాదాన్ని మరిపించు నవరాగం
నిర్లక్ష్యపు ఆఖరివాక్యాన్ని క్షమించు ఔదార్యం

అనుకోని మలుపులా ఎదురొచ్చి హత్తుకోగల కెరటం
ఊహించని ఉప్పెనలానూ ముంచగలదీ శూన్యం
విశ్వం దాకా విస్తరించిన అదృశ్య చరిత్ర పుటం
నమ్మగలిగితే నిత్యస్ఫూర్తినిచ్చు కన్నుల్లో దైవం 🙏💜

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *