Tuesday, 29 December 2015

// ఆ కళ్ళు//




// ఆ కళ్ళు//
కలల యవనికను గుట్టుగా తెరిచే వాకిళ్ళు..
తలపులకు తలుపులు తీసే అందమైన లోగిళ్ళు..
రెప్పల సయ్యాటలో దాగిపొమ్మనే సంకేతాలు
కమ్మని కౌగిలికి రమ్మని ఆహ్వానించే చిలిపి నెగళ్ళు
వేల ఆనందాలకాంతులు తనలోనే ఇముడ్చుకున్న గోళాలు
ప్రకృతి భాషను ప్రేమగా చదివే జావళీలు
ఆమని నయగారాలు సన్నగా వొంపు కెరటాలు
పిట్టల రెక్కల చప్పుళ్ళకి తాళమేసే కిటికీలు
పెదవుల వలపుపదాలకు తాళమేసే రవళులు..
ఊసులకు మరువాలనద్ది పరిమళింపజేసే యుగళాలు..
వెన్నెల మౌనాలను రట్టు చేసే సందళ్ళు..
వెరసి..
ప్రియమైన చెలికాడ్ని చాటు చేసే మేఘాలు..
విరహించిన మదిలో తమకాన్ని రేకెత్తించే మోహాలు..wink emoticon

//మనసు దాహం//






//మనసు దాహం//
మనసుదాహమెన్నటికీ తీరదనే అనుకున్నా..
నువ్వు నాలోకి అడుగులేసే వరకూ
తడబడే నా గుండెను వాత్సల్యంతో అదిమి పెట్టేవరకూ..
ఏకాకితనమప్పుడే చిగురించిందనుకుంటా..
జీవనకాసారంలో నీతో పయనం మొదలైనప్పుడు..
నీ నవ్వుల అంచుల్లో ఊగుతున్నప్పుడు గమనించనేలేదు..
నువ్వో పెదవిప్పని మౌనానివని..
అయితేనేమిలే..
నీ మౌనం..
నా నిశ్శబ్దాన్ని పూరించింది..
ఓదార్చే వీచికై నా ఏకాంతాన్ని ముద్దాడింది..
ఊహలకందని అంతర్నాద సంగీతమై ఓలలాడించింది..
కొమ్మకొమ్మలోని కోటిరాగాలనూ వినిపించింది..
అలజడిలేని అందమైన కావ్య ప్రవాహంలో తోడుగా నిలిచింది..
దప్పిక తీరని నదికి నీ దరి సాంత్వనిచ్చింది..!!

//హేమంతం//






//హేమంతం//
మొత్తానికొచ్చింది హేమంతం..
ఇన్నినాళ్ళ ఎదురుచూపులకి సాంత్వనమిస్తూ..
రెప్పలకి రెక్కలు తొడిగి..
అంతఃచక్షువుల ద్వారాలు తెరిచి
స్వర్గలోకపుటంచులను దాటి పైకెగిరి..
నులివెచ్చని మధురోహలను హత్తుకోమంటూ..
స్మృతుల ప్రవాహంలో తేలియాడిస్తూ..
గడచిన అనుభూతుల గంధాన్ని మదికి పూసి..
పూలపుప్పొళ్ళు పూసుకున్న సీతాకోకలా ముద్దులొలుకుతూ..
ఊపిరిని వెచ్చబెట్టి కాంక్షను పురిగొలుపుతూ..
కాటుకకన్నులను మంత్రించే తన ఎర్రని చూపులు..
పగడపు పెదవుల్లో పూయించిన నిష్కారణపు నవ్వులు..
వెల్లువైన చలికి ఒణికి తొణికిన దేహతంత్రులు..
అంబరాన్ని చుంబించాలనిపించే భావాకర్షణలు..
ఎంత గ్రోలినా దప్పిక తీర్చలేని రసవాటికలు
మౌనంలోకి ఆవిరైన చిలిపి సంకేతపు అలలు..
వర్ణనాతీతమైన కల్పనా సౌందర్యాలు..
కన్నుల యవనికపై తారాడి నిదురను భగ్నం చేస్తూ..
మరపురాని ఆనందాన్ని పున్నాగ అల్లికలై పెనవేస్తూ..

//రాతిరి రాగం//





//రాతిరి రాగం//
నిన్ను పరిచయించిన పున్నమే...నాలో వెలుగులు చిమ్మింది
వరమైన కల తనువుకు తీయందనాలు పూసి..
జాబిల్లికి చేయిచాచే సాహసం ఇచ్చింది
హృదయతంత్రులను మీటిన సంగీతం..
మరుమల్లె సిరులకు నవ్వులను కానుకిచ్చి
అమృతక్షణాలకు ఆజ్యం పోసింది..
కలవెంక ఒదిగినట్లు నీ కౌగిలిలో..
అనంతవిశ్వరహస్యమై నే దాగినట్లు..
మోడ్పులైన చూపుకి ఆవహించిన మత్తు
రాగరంజితమైన సిగ్గులు మోముకు చేర్చి
బుగ్గలూరిన ఆనందాన్ని యుగళం చేసి..
గులాబీ పరవశాన్ని దరహాసం చేసింది..
అనురాగపు పరిమళాన్ని లోలోనే చవిచూడమంటూ

//కొన్ని జీవితాలు//





//కొన్ని జీవితాలు//
శ్రమ విభజన సరిగానే జరిగేదేమో ఆనాడు..
కనుకనే సంసారాలంత సజావుగా సాగేవేమో..
పరస్పరావగాహనతో బాధ్యతలు పంచుకున్నందుకు..
సంప్రదాయం విధించిన పాత్రలను ఇరువురు సమంగా పోషించినందుకు..
భర్త కష్టపడి సంపాదించడం..భార్యాబిడ్డల్ని కాపాడటం
ఇల్లాలు ఇంటినీ..పిల్లలనూ చక్కదిద్దడం..
సామాజిక ఒత్తిడిలేని సుఖసాగరం..
ఆర్ధికపరమైన పేచీలు లేని అన్యోన్య సంసారసూత్రాల ఆధారం..
కాలంతో కలిగిన కలకలం..
పురుషులతో సమానంగా ఆర్థిక చైతన్యం..
స్త్రీ గడపదాటి ముందడుగు వేయడం
ఎంత ఆర్ధిక స్వాతంత్ర్యమున్నా..తప్పని తనవైన ఇంటిబాధ్యతలు
ఏకకాలంలో పలుపాత్రలు పోషించినా
సమాధాన పరచలేని పరిస్థితులు
రాజీకి రాలేని వివాదాలు..విబేధాలు..
సంసార సిద్ధాంతంలో పెనుమార్పులు..
పురుషుడి పక్షపాతానికీ..అహంకారానికీ..
ఆడవారి తెగింపుకీ..సాహసానికి..
విచ్ఛిన్నమౌతున్న వివాహబంధాలు..
అతికించాలని చూసినా వీలుపడని పగిలిన హృదయాలు..

//అనుపల్లవి//




//అనుపల్లవి//
రసప్లావిత హర్షాతిరేక మనోజ్ఞమైన మందిరాన...
సురుచుర సుగంధ సుధాభరిత సల్లాప సమయాన
మధుమోహిత మరందాల వానల..
ఆవిరిదారుల ఊగీ తూగి..
శ్వాసలు దాచిన ప్రణయపు దాహములో..
పూల తెమ్మెరల కలహంస అడుగుల మడుగుల తూచి..
మనసున ఎగిసిన వినీలగగనాల పాలపుంతల
మృదుమంజుల కలకూజిత కలస్వనాలలో..
సరసోత్సవ శుభఘడియల మంగళనాదాలలో
అరమోడ్పుల అలకనంద అధరపాన ఆలింగనంలో..
చెరిపేసిన హద్దుల వలపు ఆనందభైరవి..
రాగరంజిత భావతమస్సులో నీవశమే నేనైతే
తలవంచిన రేయి గడువు..తమకమాపని తనువు గెలుపు..
అనుభూతియై మనసు వీణలు మీటదా..
అనుపల్లవై అనురాగము శృతి చేయదా..!

//నువ్వే విజేత//




//నువ్వే విజేత//
ఇష్టంగా చేసేది ఏన్నడూ కష్టం కాదుగా..
అదే ఆత్మవిశ్వాసమై విజేతగా నిలబెడుతుందిగా
నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆశావాహ దృక్పధం
ఎంతటి అపజయాన్నైనా ఎదుర్కోగలదు..
శ్రమను గుర్తించి ప్రోత్సహించే మంచిమనసులకు కొదవలేనప్పుడు..
పట్టుదలకు స్వయంకృషిని జోడిస్తే చాలుగా..
నిరంతరం కొత్త అంశాలకు పదును పెడుతూ..
కన్నకలలకు సాకారం చేసుకోవాలంటే..
ఊహకందని ప్రణాళికలతో పొరపాట్లను అధిగమించి..
ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ముందుకేగాలి..
అంతిమవిజయాల అలౌకిక స్థితికి..
మానసికంగా సంసిద్ధత కావాలి..
వైఫల్యాలను మన్నించుకొని..
సమస్యను సామరస్యం చేసి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి..

//ఆ నవ్వులో//




//ఆ నవ్వులో//
నిన్న వినబడని సవ్వడేదో..
నాలోని మౌనాన్ని భగ్నం చేస్తూ..
మనసు దాచలేని ఉల్లాసమేదో..
చూపు దాటి గెంతులేస్తూనే ఉంది..
ఒక చెలిమి..
ఒక దూరం..
చేరువైన అనుక్షణం..
అచ్చంగా మనదే కదూ..
ఓయ్...చైతన్యమా..
నా వెన్నెలంతా నీలో దాచుకున్న నిజం..
అబద్ధమైతే కాదు గానీ..
ఇప్పుడైతే..
కెరటమై పొంగింది కేరింత నీ చిన్నారి నవ్వుల నెలవంకలో

Friday, 18 December 2015

//ఇద్దరమే//


నా..నీవు..
జ్ఞాపకాల అరల్లో కానుకలా..
అతి మధురం ఓ మురిపెం..
నీ..నేను...
వసంతయామినిలో రాధికలా..
అభిసారికలా..ప్రియ గీతికలా..
నా..నీవు..
హృదయస్పందనలో వేడుకలా..
మనోల్లాసం..నూతనోత్తేజం..
నీ..నేను
పలుకు తేనెల కోయిలలా..
ఓ చెరుకు తీపిలా..నీ చెక్కెర మోవిలా..
నా..నీవు..
తడియనాటి నవ్వుల నెలవంక..
హద్దులేని ఆకాశాన..అలుపులేని వెన్నెల చారిక..
నీ నేను..
ఎన్నడూ ముగిసిపోని రంగులకలలా..
వాడిపోని భావమాలికలా..వెలిసిపోని వసంతంలా..
నా..నీవు..
పాలపుంతలోని అందంలా..
శారదరాత్రుల విరహంలా..అందని గగనకుసుమంలా..
నీ..నేను...
ఆనందాన్వేషణలో మరీచికలా..
వేసవి మల్లెల వివశంలా...కమ్మని ఊహల గుసగుసలా..

//ఆ నవ్వులో//



నిన్న వినబడని సవ్వడేదో..
నాలోని మౌనాన్ని భగ్నం చేస్తూ..
మనసు దాచలేని ఉల్లాసమేదో..
చూపు దాటి గెంతులేస్తూనే ఉంది..
ఒక చెలిమి..
ఒక దూరం..
చేరువైన అనుక్షణం..
అచ్చంగా మనదే కదూ..
ఓయ్...చైతన్యమా..
నా వెన్నెలంతా నీలో దాచుకున్న నిజం..
అబద్ధమైతే కాదు గానీ..
ఇప్పుడైతే..
కెరటమై పొంగింది కేరింత నీ చిన్నారి నవ్వుల నెలవంకలో..!! 

Tuesday, 1 December 2015

//వాడు//




వాడికలాగే ఇష్టం..
తనవారిని పొగుడుకొని ఎదుటివారిని తూలనాడటం..
అవసరానికి వచ్చినవారిని చులకన చేయడం..
ఆపై అక్కర్లేని సాయానికి వెళ్ళి భంగపడటం..

వాడికలాగే ఇష్టం...
తనకన్నా ఎత్తున్నవారిని ఎగతాళి చేయడం..
నిండుహృదయాలలో లోపాలను ఎంచడం..
ఆపై మంచితనానికి మసిపూసి ఆనందించడం..

వాడికలాగే ఇష్టం..
ఆడపిల్లని అబ్బురపడుతూనే అపహాస్యం చేయడం..
గిలిగింతల మాటలనుకొని వికృతంగా వాగడం..
ఆపై లోకువై నొచ్చుకోవడం..

వాడికలాగే ఇష్టం...
మాటలవేగంతో మాయ చేయడం..
నైపుణ్యాన్ని గాలమేసి ఆకట్టుకోవడం..
ఆపై బంధానికి బంధీ కాలేనని చేయీవడం..

వాడికలాగే ఇష్టం..
చీకటిని చేరదీసి రోదించడం..
చల్లని జాబిల్లిలో మచ్చలు వెతకడం..
ఆపై కావ్యోద్ధరణంటూ అక్షరాల్ని లాలించడం..!!
 
 

//మనసుపుస్తకం//




పగటికలల ఉనికిని
పెదవంచుకి రంగేసి..
కరిగిన చెమరింపును..
చెక్కిలిపై చారగా ఎండగట్టి..
అతాలాకుతలమైన అంతరంగాన్ని..
ఉగ్గబట్టి ఆపి..
శ్వాసను భారం చేసి..
అంతర్వాణితో అనుసంధానం కాలేని హృదయం
అలోఉకికానందానికి దూరమవుతుంటే..
నిట్టూర్పుల నీరవంలో..
మరణించిన మనిషి జ్ఞాపకంలా..
మిగిలిందొక శూన్యం..
అతీతమైన స్థబ్దత హిమాలయమై ఎదిగిపోగలదని భావించి..
ఒక్క నేనే అనేకమై..
దిగంబరాకాశంలా విస్తరించి..
ఆసక్తిలోనే ఆనందముందన్న నిజాన్ని గ్రహించి..
నిద్దురలేని కళ్ళకు..
వ్యధ నిండిన మనసుకు..
మనసు పుస్తకం బహూకరించాలనుకున్నా..
ఊహను దాటి వాస్తవం ముందుకు నడిపిస్తుంటే..
జీవితాన్నిలా అక్షరబద్దం చేస్తున్నా..!!

//నా నువ్వు//




ఎందులో ఎక్కువని యోచిస్తున్నా..
భావకుడివని అందునా..
నిన్ను మించిన ముగ్ధమైన భావములున్నవిగా నాలో..
కవీంద్రుడివని అందునా..
నువ్వు చూడని రహస్యాలు మిగిలున్నవిగా నాలో..
రసేశ్వరుడివని అందునా..
నవరసాలపుట్టని సైతం పట్టించుకోని వాడివిగా..
చంద్రుడివని అందునా..
నీ అందం వెల్లువలో ప్రవహించేది నా వెన్నెలేగా..
మన్మధుడివని అందునా..
నాలో రహస్యమవుతూనే నలుగురికీ కనిపిస్తున్నావుగా..
తీయనివాడివని అందునా..
నీలో తీపిగోదారై ఉరకలెత్తుతున్నది నేనేగా..
కిలాడి దొంగవందునా..
నా సర్వం దోచి కేవలం ఊహల ఊసే మిగిల్చినందునా..

ఒక్క విషయంలో మాత్రం నువ్వెక్కువని ఒప్పుకుంటున్నా..
నీ మనసును మక్కువకొన్న నా మనసుందిగా నీదగ్గర..
అందుకే నువ్వెక్కువ..
అన్నీ ఉన్నా..మనసు లేని నాకన్నా..!!
 
 

//వాస్తవ స్పర్శ//




అందరూ విడిచిపెట్టేసారని వాపోయి ఏం ప్రయోజనం..
జీవితంలో విలువైన కాలం తిరిగిరాదని తెలిసీ చేజార్చేసాక..
సంతోషానికని అమర్చిన సౌఖ్యాలు..
మితిమీరి మరో ప్రపంచపు అంచుల్ని చూపిస్తే..
పొద్దస్తమానూ తూలిపడుతూ తడబడే చూపులతో..
కన్నవారి కలలన్నీ కామజ్వాలలో ధ్వంసం చేసుకొని..
కట్టుకున్నదాన్ని కాలసర్పానికి విడిచేసి..
ఆమె శోకాన్ని సైతం సొమ్ము చేసుకొని..
కన్నబిడ్డలను గాలికొదిలేసి..
వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా చిదిమేసి..
దుర్వ్యసనాలకు చిక్కి..రోగాలకు సిగ్గును తాకట్టు పెట్టి..
ఆరోగ్యంతో పాటు దిగజారిపోతున్న విలువలను పైకెత్తలేక..
బాగుపడలేదని లోకం నిందిస్తుందనుకుంటే ఏం లాభం..
అహంకారంతో జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాక..
ఓడిపోయిన నిస్సహాయతకు నక్కవినయాల ముసుగేస్తూ..
వాస్తవానికి ఎవరిని మోసం చేసాననుకుంటున్నాడో..
తనకు తానే బలైపోతున్న మతిలేని మృగంలా వాడు..!!
 
 

//కార్తీక వెన్నెల్లు//



మంచుబిందువులను రాల్చుతోంది వెన్నెల..
హేమంతానికి తొందరపడ్డట్టుగా..
మనసు పలికే మౌనగీతమేదో ఎదలో రేగుతుంటే..
ఆపసోపాలు పడుతున్న విరహం నిట్టూర్చింది..
తెల్లని పాలవెన్నెల నురుగులా జారుతుంటే..
పరిమళ నెత్తావులకు తాపం ఎగిసిపడుతుంది..
అరమోడ్పులైన కన్నులు సిగ్గుతెరలను మూసేస్తుంటే..
చూపులకందని ఆర్ద్రత వెల్లువయ్యింది..
ఎగిసే ముంగురులు అల్లన మోమును దాచేస్తుంటే..
గతంలో నీ అరచేతి స్పర్శ తనలోకి లాకెళ్ళినట్లుంది..
చెదిరిన కలలన్నింటినీ పోగేసి పొదుపుకుంటున్నానందుకే..
నా మౌనాన్ని నీ ధ్యానంతో అనుభూతించాలని..
నీ తలపుతో నన్ను నేను నింపుకుంటున్నా..
మన ప్రేమసుధాసారాన్ని ఆకాశపందిరిలో ఆస్వాదించాలనే..!!


//ఊహల కోయిల//



వెదికానప్పుడో వసంతాన్ని..
అందరాని కొమ్మల్లోకి చూపుని సారించి..
నా ఊహలోని కోయిలలు..
రంగులద్దుకొని రాగాలు తీసినట్లు కనిపిస్తుంటే..
మౌనపంజరాన్ని వీడిన మనసు..
రెక్కలు విప్పుకొని తానే ఓ కూజితమై కూసింది..
విరహంలో నా మనసుతడి..
నీ చూపును చెమరించినట్లు..
నన్నో పూలజల్లుగా తడిమింది..
ఆస్వాదించే చోటు..
నీ తలపుదేనని తలచిన చకోరి సొగసు.
వాయులీనమై చిలిపిదనాన్ని చేరదీసింది..
అప్పుడే వగలు కురిసిందో భావవీచిక..
గ్రీష్మంలో వసంతగీతాన్ని ఆలపిస్తానంటూ..
అమరగీతమైన నాలో ఆనందమొకటి..
గగనమెగిసింది అనురాగ సల్లాపమై..!!


//మైత్రీబంధం//

అమాసలంటని అసమానకాంతి..
అమృతక్షణాల వసంతగీతి..
వేకువకుంకుమల మధురానుభూతి..
విరిసుగంధాల మరందాలతీపి..
ఆలిబిల్లి ఆశల ఆలింగనరీతి..
మానసవీణ మలహరసంగీతి..
విరహపుశ్వాసల వెచ్చనిరాత్రి..
సల్లాపమాధుర్య ప్రణయశృతి..
ప్రవహించు నిత్యమై జీవనది..
సుగమమే ప్రయాణం నవ్వులచెలిమది..:)


//వేకువ కల//

పురివిప్పిన సంతోషతరంగాలలో..
అపరిమితమైన అనురాగం వెల్లువై ఎగసిన క్షణాన..
అదృశ్యమైన నక్షత్రమేదో రాలిపడి..

కోరిక కోరమన్నట్లు..
నిను నాలో దాచుకున్న ఆనంద పారవశ్యం..
ఈ క్షణాలనిలాగే శాశ్వతం చేయమని వేడినట్లు..
తధాస్తన్న తారలు చేయి కలిపి నృత్యాన్ని చేసినట్లు..
చిరునవ్వుల మిణుకులతోనే నన్ను దీవించినట్లు..
రసమయ కాంతిధారల కిరణాలలో నే తడిచినట్లు..
తాము దాచుకున్న పరిమళమంతా నాకర్పించినట్లు..
చిరుగాలుల తరంగాలకి విరినై నేనూగినట్లు..
ప్రకృతిలోని రాగాలన్నీ నాలోకొచ్చి చేరినట్లు..
చెక్కిట రాలిన వెచ్చని చెమరింపు తీపైనట్లు..
నిన్ను ప్రేమించేందుకు నాలో రసజ్ఞత నింపినట్లు..
ఇదంతా తెలివేకువ కలంటే నమ్మలేనట్లు..

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *