Tuesday, 7 March 2017

//పాపనే..//




నవ్వడం తప్ప తెలీదు నాకేమీ..
ముద్దులు తప్ప మీరిచ్చింది నాకేదీ..

అర్ధంకాని పిట్ట కధలకు తల ఊచినా
అద్దంలో నా మోమును నేనే వింతగా చూసుకున్నా

అమ్మమ్మ కధలన్నీ ఆర్చర్యంగానే వింటున్నా..
తోటలోని పువ్వులతో ఊసులెన్నో చెప్పుకున్నా

కలలో కాగితప్పడపై ఊరేగుతున్నా..
ఇలలో ఆవు లేగనే తరుముకున్నా
నా మాటలకు ముచ్చటపడి నవ్వుకున్నా
కవితగా కాలేని భావమై మిగిలిపోయా..
కొమ్మల్లో రేపటికి పువ్వుగా మారలేక
పిడికెడు పిచ్చుక ప్రాణముగా కొట్టుకుంటున్నా..!!
 

//దూరం//



యే ములాఖాత్ ఏక్ బహానా హై..
పాటపాడి మరీ కవ్వించి రెచ్చగొడతావెందుకో

ఋతువుల రంగులు మారుతున్నా
పువ్వులు రాలి సరికొత్తపువ్వులు పుట్టి నవ్వుతున్నా
ఆకాశవీధిలో తొలిపొద్దు చుక్కల ఊసులు ముగుస్తున్నా
ప్రాణవిహంగం ఊహల్లో ఎగిరి అలసిపోతున్నా
సంధ్యారాగపు సరిగమలు అవరోహణలోకి దిగుతున్నా
పొద్దువాతారి వెలుగునీడలు దోబూచులాడుతున్నా
లలిత కవితలన్నీ విషాదపు సుషుప్తిలోకి జారుతున్నా
రోజులు వత్సరాలై కాలం కదిలిపోతున్నా
మన మధ్య దూరం మాత్రం తరగకుంది

నువ్వు తప్ప వేరే ఏదీ సంతోషమివ్వని లోకంలో
నేనో ఒంటరితనంతో సహజీవనం చేస్తాను
చూపులకందనంత దూరంలో నువ్వున్నా
మనసుకి మాత్రం దగ్గరేనని సర్దుకుంటాను
నీ హృదయాన్ని తాకి ప్రవహిస్తున్న నా ప్రశ్నలకు
బదులెన్నటికీ దొరకదని తెలిసినా
నీ జ్ఞాపకాలనలా మోస్తూనే ఉంటాను..!!

//అదేగా జీవితం..//



తలపులతోటలో ఎదురుచూసిన ప్రతిసారీ
మనసు మెచ్చిన పువ్వే పూయదు
అమావస్య తిరిగొచ్చిందని ఆకాశంలో
నక్షత్రాలు మెరవక మానవు
సంతోషం అస్తమించిందని కన్ను
మౌనాన్ని వలచిన నిశీధిని కోరదు

విశ్వశూన్యంలో నిద్దరోయిన నిశ్శబ్దంలో
మెరుపుతీగల నృత్యాలో విలాసపు కల..
కవిత్వాన్ని ప్రేమించడం మొదలెట్టాక
జీవించడం మొదలయ్యిందన్నది ఎంత సత్యమో
కల్పనల కుంభవృష్టిలో నిలువెల్ల తడిచాక
పులకింతల దరహాసాలు అంతే మధురం
ఆకునీడల్లో తలదాచుకోవడమూ అద్భుతమే..

చందమామ చేతిలో పండిందని
పూసంత పున్నమికి అలగడం తెలీనట్లు
వసంతమంటే ప్రత్యేకమైన అనురక్తి లేని కాలానికి
ఋతువులన్నీ సమానమే
స్మృతులన్నీ కరిగిపోయిన జీవితంలో
హేమంతం కురవక తప్పదన్నట్లు
విషాదం గూడు కట్టుకుందని ఎద
ఆనందభైరవిని ఆలకించడమాపదు..
ఒంటరితనాన్ని ఉషస్సు వెళ్ళగొట్టాక
బంగారుక్షణాలు హత్తుకోక ఆగవు.. 


//ఎడబాటు//




నాకు నేనుగా ఒంటరిదాన్నే నా విశ్వంలో
ఆలోచనగా నాలో చేరిన నువ్వు
విడదీయరాని బంధంగా చుట్టుకున్నాక
వశం తప్పిన వసంతమేదో
తన చిరునామా మార్చుకున్నట్లు
మనసంతా పచ్చని పుట్టుకలు

పదమూ పదమూ కలిసి వాక్యం సమకూరినట్లు
నువ్వూ నేనూ ఏకాత్మగా మారిపోయాక
జరిగిన అద్భుతాన్ని నెమరేయకుండానే
అగాధంలోకి నెట్టేసిన విధి
వెక్కిరిస్తూనే ఉందలా
ఉన్మత్తను ఆవహించిన అపశకునంలా

ఎప్పట్లాగే ఉంది ఆకాశం
మేఘమేదీ కురవట్లేదు
కానీ ఋతువు కాని ఋతువులో
కన్నుల్లో నీటి చెలమలు
మూసేసినా రెప్పల తలుపుల ఆనకట్టలు దాటుకుంటూ
శోకం ప్రవహించు వేదనదయినట్లు

కొన్ని కలయికల అంతరార్ధాలు రహస్యాలైనట్లు
కొన్ని ఎడబాట్ల గ్రహణాలు ఎప్పటికీ అంతుబట్టవు.. 

//శిశిరమూ-సోయగమూ//



ఒక్కో ఆకు రాలుతున్న సవ్వడిలో
ఒక్కో కల కరిగినట్లు
కాలం పొరలు విప్పుకుంటూ కదిలిపోతుంటే
పురి విప్పుకోడానికి సిద్ధమైన ప్రకృతి
వెన్నెల్లో పాదరసం కలిసి జాలువారుతున్న
తొలిపొద్దు సౌందర్యం
జిలిబిలి సీతాకోక చిలుకల్లోని రంగులు పులుముకున్నట్లు
క్షణానికో పరవశాన్ని కట్టబెడుతుంది..

పూలగంధాల పన్నీటి తీపులు
మధురభావాల పక్షుల పాటలు
పరిమళాలను ప్రవహించే సెలయేరు
కోమలసమీరపు మెత్తని తాకిళ్ళు
హృదయంలో రసానుభూతుల రాగాలు
గుంపులుగా తరుముకొస్తున్న భావాలు
రెక్కలొచ్చి ఎగిరిపోకముందే
అక్షరం చేసి బంధించాలనుకోగానే
ఏకాంతం సాయమొచ్చింది
ఇప్పటికింకా జ్ఞాపకాల గిచ్చుళ్ళు మొదలవనందుకు
శిశిరాన్ని సైతం మనసు చేరదీసింది.. 

//శూన్య మాసం//




మల్లెలు విరిసే కాలం మధుమాసం
ఒంటరి మనసుకదో పరితాపం
నిర్వచనానికందని నిశ్శబ్దం

హృదయం కంపించడం నిజమైనప్పుడు
ఆశల పునాదులకు పగుళ్ళు పడటం సహజం
నిశ్శబ్దపుటంచున నిలబడ్డ స్వప్నాలు
శూన్యాకాశపు నీలి అగాధాన్ని చూస్తున్నప్పుడు
తమస్సు వెక్కిరించిన వైనం
ఋతువు కాని ఋతువులో కవనం కన్నీరయ్యిందంటే
మౌనం మేఘరంజనయ్యిందని అర్ధం

గుండెచప్పుడు గుట్టుగా కొట్టుకుందంటే
ఊపిరి మాత్రమే ఉందని భావం
అలంకారాన్ని శబ్దించడం మానేసిన అక్షరం
నిట్టూర్పును రాసుకోవడం విషాదం
ఉద్వేగకెరటాలు హఠాత్తుగా శాంతించాయంటే
కొన్ని జ్ఞాపకాలు సుడిగుండంలోకి నెట్టాయన్నది సత్యం

కాలం కుట్టాలని ప్రయత్నించిన
అనుబంధమిప్పుడొక అతుకులబొంత
మాఘమాస మాధుర్యమో అగ్నికుండ.. 
 

//నేనెవరంటే..//



ఎన్నిసార్లడుగుతావో నువ్వెవరని..
నీ ఊహల పరిష్వంగములో అల్లరి నాయికని
కలలు కను చూపంచున నులివెచ్చని దీపికని
నీ రూపాన్ని ఆనందపు అత్తరుగా పూసుకున్న హర్షికని
మధుమాసపు నీ నవ్వుల్లో రహస్య మౌనికని
నిన్నే కోరి నిరంతరమర్చించే భావాల మాలికని
నీ మదిలో వెన్నెల నింపే మైమరపు ఛురికని
మరుల రుచుల మగత పెంచే చిలిపి పంచదారికని
వలపు జల్లులతో ఏకాంతపు దాహార్తిని తీర్చు హారికని
నీ ఉచ్ఛ్వాసనిశ్వాస ఊపిరి సంగీతంలో మనోజ్ఞ గీతికని
కనుపాపల కౌగిలిలో నిన్ను ఇముడ్చుకున్న కోరికని
మనసుపొరల మాటు ఆశలాబోసి నిన్నే తపిస్తున్న మదనికని
నీ ఊసులన్నీ పాటగట్టి పాడుకున్న భావుకని
నీతో సంగమానికై తపస్సు చేసే ప్రేమికని
లలితకవిత మేలిమలుపులతో నిన్నల్లుకున్న మల్లికని
నీ మధురస్వప్నాల వేకువ కొమ్మల్లో చైత్రికని
నరనరాల నీ అనుభూతుల్లో ఊయలూగు చెలి రాధికని
దూరాన ఉంటూనే మాయ చేసిన నీ మచ్చికని..:) 





//నువ్వే లేకపోతే..//




నువ్వే లేకపోతే..
నా పెదవంచుకిన్ని ఒంపులెక్కడివి
మధువులదొంతరలోని తీపిలెక్కడివి
నా కాటుకకళ్ళకిన్ని స్వప్నాలెక్కడివి
రాతిరి ఇంద్రజాలంలోని రాగాలెక్కడివి
నా నరనరాల్లో చైతన్యమెక్కడిది
నక్షత్రమండలంలో ఊరేగు భావనెక్కడిది..

నీ తలపే నిద్దురపోతే..
వసంతానికి దారెటు కనుగొనేది
పువ్వుల పరిమళాలెక్కడని వెతికేది
ఆకాశానికి నిచ్చెనెటు వేసేది
ఆనందపు మకుటమెప్పుడు అలంకరించేది
ప్రియమైన అక్షరానెప్పుడు హత్తుకొనేది
నాలోని ప్రేమనెన్నడని రాసేది

నీ పిలుపే తడమకపోతే..
ప్రణయగీతానికి పల్లవెప్పుడు కూర్చేది
మౌనాన్నెలా పాటకట్టి పాడేది
పూల గాలుల గంధమెప్పుడు పీల్చేది
వెన్నెలదారుల్లో ఎన్నిసార్లని తప్పిపోయేది
ఎక్కడని నిను వెదికి అలసిపోయేది
హృదయాల దూరాన్నెట్లా అధిగమించేది..

నీ వలపే కరువైపోతే..
మదిలో ఆవేదనెట్లా మోసేది
ఆత్మ సొరంగానెట్లా తవ్వేది
విషాద శూన్యాన్ని భరించేది
నిటూర్పులనెట్లు ఆగమని శాసించేది
నువ్వే కావాలన్న కోరికనెట్లు సమాధి చేసేది
మరణాన్ని కోరుతున్న తనువునెట్లు భరించేది..!!
 

//నీ నీడ//



నీ నీడ నన్ననుసరిస్తూ
వీడిపోయిన స్మృతులను సంచలించింది

ఇప్పుడిప్పుడే గాయాలు మాపుకుని
నీరెండిన కళ్ళకు
గతాన్ని గుర్తుచేసి
మౌనాన్ని తుడుస్తానంటూ
కన్నీటిని ఒలికించింది

నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ
జ్ఞాపకాల అలజడి రేపి
ఊసులు మరచిన నీరెండల్లో
భావుకత్వపు రంగులు పంపింది
సాయం సంధ్యను మరచిన నా వీనులకు
మలయమారుత రాగంతో సాంత్వనిచ్చింది..!!

//మెలంఖలీ//

//మెలంఖలీ//

గమ్యమెరుగని జీవన పయనంలో
నిలకడలేని నిముషాలతో
పోటీపడుతూ
జ్ఞాపకాల ఊరేగింపును దాటుకుంటూ
ముందుకు పోవాలని
ప్రయత్నించిన ప్రతిసారీ
ఏవో పొలికేకల శబ్దాలకు ఉలికిపాట్లు..

అరలుగా నిండిన అశక్తత
అగుపడని చెరసాలలో బంధించినట్లు
వశీకరించిన అనుభవాలను కూడి
వద్దనుకుంటూనే
అదే పనిగా
బరువెక్కిన శూన్యాన్ని మోస్తుంటుంది..

ఒక మెలంఖలీ
మనసు గుండా ప్రవహిస్తూ
తనలో తాను మమేకమై
భావోద్వేగాన్ని జయించాలనుకొని
ఒంటరితనానికి బానిసయ్యింది..

ఈ తలపుల దండయాత్రలు
అశాంతిశిఖరాలను దాటి
నిశ్శబ్దాన్ని వెలిగించాలనే యాతనలోనే
కొన్ని రాత్రుల కలవరింపులు
బదులు దొరకని ప్రశ్నల ప్రకంపనలు..!!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *