Thursday, 25 February 2016

//కొన్ని నవ్వులు//



అలంకృతం చేసా నా చిరునవ్వుని..
హేమంతవెన్నెల్లో నాకోసం ఎదురుచూసే
నీ కన్నుల్లోని కాంక్షను కని
నిరీక్షణా క్షణాలను సైతం అమృతపానం చేస్తూ
ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్న నీ నీరవంలోకి
మౌనగీతమై వినబడాలనే తలంపుతోనే..

నా పెదవంచుని మునివేళ్ళతో తాకే మధురోహను హత్తుకుంటూ
విరహంలోని మధురిమను అనుభవైకవేద్యం చేయాలని దోబూచులాడుతూ
నీలోనే దాగిన నా పరిమళాన్ని అప్పుడప్పుడూ నీకంటగడుతూ
నాలో పాలపొంగై ఎగిసే ఉత్సాహాన్ని అదిమిపెడుతూ..

నీ ఊపిరి వేణువై నాలో సెగలు రేపేవరకూ
నాలో తమకాన్నలాగే ఆగమంటూ..
గుండెసవ్వడి తలదాల్చి వినేవరకూ
నీ తలపులనలాగే హత్తుకుంటూ..
అరవిరిసిన మందారనవ్వు నేమాత్రం వాడనివ్వక..
తొలిమచ్చికలో నీకు కానుకివ్వాలని..
కాపాడుకొస్తున్నా..!!

//కన్నీరు//




కన్నీరంటే భయం పోయిందెందుకో..
నీ స్మృతులలోని కమ్మదనాన్ని రుచి చూసాక..
ఓదార్పే అవసరం లేని గోదారిలా మారాక..
ఆగి ఆగి మెరిసే ఆ ముత్యపు చుక్కలు..
చూపును మసగ్గా చేసాక..
నువ్వు మాత్రమే నా ఏకైక భావననిపించేలా..
వెచ్చదనం తెలుస్తోంది..
కన్నీరు పన్నీరై తీయందనాలను చిలికిస్తుంటే..
ఉప్పదనం మాయమై మరందాలను తలపిస్తుంటే..
విషాదమై రాలినా నా భావమింతేననిపిస్తోంది..
నా కనుకొలుకుల్లో నువ్వు చేరడమే ధన్యమనిపిస్తోంది..
కన్నీటికి ఇన్ని రంగులున్నాయని తెలియని నాకు..
అన్వేషించకుండానే నీ ధ్యాసలో ఆనందం హరివిల్లయ్యింది..!!
 

//నారింజ ప్రేమ//



ఎప్పుడు ప్రేమయ్యిందో తెలియదు
నారింజరంగును ఇష్టపడటం సైతం గుర్తులేదు..
ఎన్ని సాయంసంధ్యవార్పుల్ని తిలకించానో
కెంజాయివర్ణపు ఆకాశాన్నంతగా పరీక్షించలేదు..
మిసమిసలాడుతూ నోరూరించే నారింజపండు
సరసంగా గొంతులో జారినప్పుడూ నచ్చుకోలేదు..
అమ్మ కట్టిన నారింజ పట్టుపుట్టమేనాడూ మెచ్చలేదు..
అరవిరిసిన దానిమ్మపువ్వు నారింజ రంగేమిటో అర్ధం కాలేదు..
ఆనాడు నేను కట్టిన నారింజ వాయిలు చీర..
అతని కన్నుల్లో తటిల్లతలు మెరిపించినప్పుడు..
నన్నో అపరంజిని చేసి అపురూపంగా చూసాడని గుర్తించా..
సింధూరపువ్వంటే తెలుసా నీకన్నప్పుడు..
రెప్పమూసి తెరిచేలోపే కన్నుగీటి కరుమరుగైనప్పుడు..
తలవంచి తనువును హత్తుకున్న నారింజరంగుని చూసా..
లేతబంగారు వర్ణానికి ధీటుగా అమరిన సొగసు..
నారింజరంగులో ప్రతిబంబించి అరుణిమైన మోము..
మునుపులేని సిగ్గుని పరిచయించిందప్పుడే బుగ్గలకని..
ప్రేమలోకానికి చేయందించి ఆహ్వానించబోతోందని గ్రహించా..
అప్పుడే మొదలయ్యిందేమో నారింజ ప్రేమ నాలో..!!

//గతం గుర్తులు//



గుండెనిండా గుర్తుల గాయాలే..
ఊపిరితిత్తుల గుండా నీ తనూపరిమళం సోకినట్లనిపిస్తే..
చేసే ప్రతిపనిలోనూ నువ్వే గోచరిస్తుంటే
నాలో రహస్యమైన నిన్నెవరైనా కనిపెడతారని కంగారవుతోంది
కన్నులోంచీ గుబులు కన్నీరు వెచ్చగా కరుగుతుంటే
గతంలోనే బ్రతకడం బాగుండనిపిస్తోంది..
నీకై వేచివేచి నాలో నిరీక్షణ క్షీణించి
నిద్దురరాని కనురెప్పలు కొట్టుకొనే యుద్ధంలో..
ప్రళయం పుడుతుందేమోననిపిస్తోంది..
గ్రీష్మర్తుల్లో నిర్జీవమైన మోడులా మారిన నాలో
అమృతవర్షమై కురిసే నీకై ఎదురుచూపులు ముగిసేదెన్నడో..
అలజడులకు దూరమై నేను విముక్తమయ్యేదెన్నడో..
అనంతమైన అశృవులై ప్రవహిస్తున్న దూఃఖానికి ముగింపు కనుగొనలేక
గమ్యముందో లేదో తెలియని ఏకాంత మనోవనంలో విహారమేమిటో..
మొత్తానికి మౌనాక్షరాలుగానే మిగిలాయి నా పాటలోని పల్లవులు..
నాలోని సంగీతాన్ని నువ్వు మోసుకుపోయాక..!!

//శిశిర వసంతం//



తనువంతా తిరుణాళ్ళు
నీ చూపులో వలపుభాషను చదివినకొద్దీ
పంచమవేదం సంగీతమై మీటినట్లు..
వేయిదీపాల వెలుతురులు నాలో మిరుమిట్లై నవ్వుతుంటే
విరిసిన వెన్నెల తనది కాదని..
ఆకాశజాబిలి సిగ్గుపడి తొలిగినట్లు..
పున్నమిపువ్వులు పూసేస్తుంటే మనోవనాన..
కలవరానికిక కొదవేముందని..
కనువిని ఎరుగని మృదుస్పర్శ కవ్విస్తున్నట్లు..
అలలైన కలలు నిజమై సాక్షాత్కరిస్తుంటే
తస్కరించలేని తమకమేదో..అమృతం కరిగి చినుకై కురిసి..
పారవశ్యం జలపాతమైనట్లు..
శిశిరానికందని ఆశలు ఆకాశానికెగిరి అల్లరిచేస్తూ..
గాలికి పూసిన గంధంలా వసంతమై తడుముతుంటే..
విహరించాలనే ఉందలా విశ్రాంతనేదే లేకుండా..!!

//ఆ హృదయం//



వెలసిపోయిన సంతోషాలు
అలసిపోయిన ఆనందాలు
రెప్పల పరదాల మాటున దాగిన గాజుగోళీలైన నీ కళ్ళు
ఎంతటి అస్తిత్వమున్నా..
హృదయాన్ని దాచుకోవడం నీ గొప్పదనం
మమకారాన్ని పంచుకోవడమే నీ లక్షణం
ఆకురాయి అద్దంలో మసిబారిన నీ అనుభవాలు..
ప్రాణంపోయినా నోరు మెదపనివ్వని నీ అసహాయతలు..
హక్కులూ బాధ్యతల నడుమ సతీవతి ధర్మాలు
విలువల మధ్య..ద్వంద్వాల మధ్య ఆవిరైన అనుభవధారలు..
ఎక్కడో లేదుగా అంధకారం..
ఒక్కమారు నీ హృద్గుహలోకి తొంగిచూసే
ధైర్యముంటే..
కనిపించదా కృష్ణబిలం..!!


//సంక్రాంతి//

వచ్చేసింది సంక్రాంతి..
ఏడాదిలో తొలిపండుగ నేనేనంటూ..
పౌష్యమి సౌరభాలను వీచుకుంటూ..
హేమంతపు శీతలాన్ని తనువుకిస్తూ..
నీలిమేఘాల సవ్వళ్ళు చిలిపి లాహిరులవుతుంటే
ముద్దలై రాలే హిమవర్షాన్ని నేలకు జార్చేస్తూ
మనసులోని నిగ్గులన్నీ ముంగిట్లో ముగ్గులుగా మార్చేస్తూ
వేకువకు కొత్తందాల్ని పులిమేసి నవ్వించినట్లు..
వచ్చేసింది సంక్రాంతి..
పల్లె అందాల పచ్చలు పొదుపుకుంటూ..
పచ్చని తెలుగందాలు పలకరించిపోతుంటే
రైతన్నల మోముకి రెట్టించే కాంతులిస్తూ..
గాలిపటాలై ఎగిరిపోదామని పిల్లలకు స్వేచ్ఛనిస్తూ..
వినోదంలోనే విశ్రాంతినెతుక్కోమని పిలుపునిస్తూ
వచ్చేసింది సంక్రాంతి..
బంధుసముద్రాన్నంతా ఒకచోట చేర్చి సింధువై కలసిపోమంటూ..
సంప్రదాయపు సందళ్ళను హరిదాసు సంకీర్తనలు చేస్తూ..
క్షీరాన్నపాయసాలను వెచ్చగా ఆరగించమంటూ
అల్లరల్లరై భావవల్లరులు గిజిగాళ్ళై అల్లేస్తుకుంటూ..
మదిలో ఆనందసమ్మేళనాన్ని ముడేసుకోమంటూ..
వచ్చేసింది సంక్రాంతి..సంతోషాల స్రవంతి..


Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *