Saturday, 31 October 2020

// మార్పు //

ఎప్పుడూ తన మాటే చెల్లాలనుకొనే జీవితం దారులన్నీ మూసేసి మార్పు అనివార్యమంటుంది మౌనాన్ని కౌగిలించిన గడ్డిపువ్వులా మారిపోయాక నక్షత్రాల కోసం నిరీక్షణ ఆగిపోతుంది గాయాల్ని రేపే గతం మనసుని సాంత్వనో వెన్నెలనీ నలుపు చేసే చీకటో తెలియకనేమో నేల తడిచే నాలుగు రోజులూ కలవరింతలు వానై కురుస్తుంటాయి రెప్పలకు కునుకెందుకు లేదో అనుకోరాదప్పుడు వెతలకు మూగసాక్ష్యంగా కన్నులూ తడుస్తున్నప్పుడు 😣

Friday, 30 October 2020

// ఆ దారి //

ఆ దారి ఎడారి వైపుకని తెలిసే నువ్వు పయనం మొదలెడతావ్ అక్కడో పలకరింపు లేదని నీకు నువ్వే దహించుకుపోతావ్ ఎవ్వరినీ తోడు రానియ్యవూ ఆగి కాసేపు ఆలోచించవూ మాటలు దాచుకున్న మౌనం నువ్వు మూగపుస్తకంలా నిన్ను చదువుకోవాలి నిన్ను ప్రశ్నించాలంటే అసహనానికి సిద్ధమవ్వాలి మానసికంగా మాత్రమే నువ్వని మది తలుపేసుకోవాలి..😣

Wednesday, 7 October 2020

// సంధ్యారాగం //

పంచభూతాల్లో కలిసిపోయే పంచప్రాణాలు ఈ రోజుకి చైతన్యం..రేపటికి నిర్జీవం నీ కంటి మెరుపులో నా ప్రతిబింబం మాత్రమెప్పటికీ పదిలం.. నేలకు రాలిన పువ్వులు చిరునామా మార్చుకొని మట్టికి పరిమళాన్ని పంచినట్టు మనసు వాసన తెలిసిన నీకు నా ఉనికి నీతో కదిలే సజీవ లక్షణం.. చీకటిలోనో..ద్వీపంలోనో నువ్వొంటరి కావు వాస్తవాన్ని భూతద్దంలో చూడకు రేపటి వెన్నెలను ఈరోజు ఊహిస్తేనే నీకు నువ్వో దిక్సూచివి అవధులు దాటే కాలంతో పోటీపడి చిరునవ్వుని గతంలోకి తోసేయకు ఆశలు రేకెత్తినప్పుడే సూర్యోదయం అందం పూలగాలి సోకితేనే అది సంధ్యారాగం 💜💕

// గాల్లో దీపం //

పొద్దుగుంకేలోపు జీవితాన్ని మజిలీకి చేర్చాలన్న ఆవేశపు నడక ముగిసేదెన్నడో దారిపొడవునా ఓర్చిన కష్టాల ఎదురీతలు, అసహాయ మూగబాధలకు విముక్తి ఎప్పుడో మిణుక్కుమన్న ఆశ ఆసరాతో మొదలైన గమనం..గాయమైనా..ఫలించేది ఎందరికో బ్రతుకు బరువు మోయలేని అంధకారంలో అకారణన ద్వేషాన్ని జయించి సజీవులయ్యేదెందరో ఇన్నాళ్ళూ ముడుపుగట్టి దాచుకున్న ఆరోగ్యం గాల్లో దీపమయ్యాక..దుఃఖమవని క్షణాలెక్కడని వెతకాలో 😞 కొత్తగా మరోసారి "నడత" నేర్చుకునైనా వర్తమానాన్ని కాపాడుకుందాం అనివార్య నిశ్శబ్దానికని .. ఘనీభవించిన కాలానికి చలనమొచ్చింది కనుక ఏమరుపాటునొదిలి ఈ యాదృచ్ఛికానికి ఎదురీదగలిగినోళ్ళకే విజయమని గుర్తుపెట్టుకుందాం.!!

Friday, 2 October 2020

// నువ్వంటే ఇదేగా //

అనుభవాల్ని దాచుకున్న నుదురు నుదుటిగీత మెరుపులు మహాకాంతులు వెన్నెలను పరితపించే కళ్ళు.. కళ్ళు విచ్చుకున్న మల్లెలు పరిమళానికే తడబడు నాసిక నాసిక నింపుకున్న వెచ్చనిశ్వాసలు మౌనముద్రలో మృదు చెక్కిళ్ళు చెక్కిళ్ళు దాచుకున్న నవ్వులు అనంత పరవశాల పెదవులు పెదవులు పలుకుతున్న స్వరాలు ఆకాశమంత సువిశాల మనసు మనసు చల్లని మాటలు కాలాన్ని ఆలకిస్తున్న చెవులు చెవిలో హోరెత్తు మురిపాల కెరటాలు చలువపందిరి వేసిన నల్లమబ్బు మబ్బుతెరల మాటు చంద్రుడు నువ్వంటే ఇదేగా 😎💜

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *