Wednesday, 30 October 2019

//లేదనుకుంటా//

 
ఆకులు ముడుచుకున్నంత మెత్తగా నీలో సగమై
నా ప్రతిబింబాన్ని నీ ఆనందంలో చూడాలనుకున్నా
మనసుని చూపుతో సంధించి పరివ్యాప్తమయ్యాక
కొన్ని మధురోహలనైనా నీ చెంత పరిమళించనీయవే..

నిన్నటి నిశ్శబ్దాన్ని మధురస్వరముగా మార్చి
కొన్ని క్షణాల నవ్వులుగా నీకు పంచాలనుకున్నా
ఉదయం నుంచీ ఎదురుచూస్తూ ముత్యపుచిప్పలవుతుంటే
నా అలిగిన కళ్ళను బ్రతిమాలాలని కూడా నీకనిపించదే..

నా మెలకువలో ఊగిసలాడుతున్న స్వప్నాలను
నిన్ను ఊయలూపే ప్రణయమాలికగా పాడాలనుకున్నా
నీ మోహాన్ని నా మనోభావానికి కూర్చి
రసవాహినిగా ప్రవహించేందుకు కరిగి కవితవ్వవే..

సరే..నిన్నలరించే ఆకర్షణేదీ నాకు లేదనుకుంటా
నీలో అనురక్తి అలల మదిరి అటుఇటు కదులుతున్నాక 😔😢

//మరకలు//


బుగ్గలపై కాసిని మరకలు కనిపించాయని
కళ్ళను తిట్టుకుంటే..
ఈసారి ఆనందాన్ని సైతం స్రవించడం మానేస్తాయి..

వ్యూహను రచించేందుకు విధిగా ప్రశ్నలు పుట్టాయంటే
జవాబులు అవసరం లేని గడిచిపోయిన గతపు చిహ్నాలట
సహజీవనమంటూ మొదలెట్టాక..
భ్రమల వెంట పరుగులు ఆపాల్సిందే మరిక

అనుభూతుల్లో అసంతృప్తిని వెతికావంటే
జీవితం విచ్ఛిపోయిన అనుభవం లెక్కట..
అప్పుడిక ఏ పాఠమూ తలకెక్కదిక..
నీకు నువ్వే శలభమై దహించుకు పోవాలనుకున్నాక

పరిచయాన్ని తిరిగి అపరిచితం చేస్తావెలా
చెరిగిపోయిన గాయాన్ని జ్ఞాపకం పేరిట పిలిచి మరీ ఇలా..😣😒

//ఆకాశం//

 
నులివెచ్చగా దేహం కంపించగలదని
కలల్లో నీతో కబురులాడే కనులకి తెలుసోలేదో
అంతరాళంలో ఆకాశం ఆలపిస్తున్న ఆనందభైరవి
ప్రతిధ్వనిస్తున్న సవ్వడి నీకు అనుభవమయ్యే ఉంటుంది
మబ్బులా కప్పుకున్న ఏకాంతంలో అదే మాట వినిపిస్తుంది

నిజంగా అన్నావా..
"A part of me always loves a part of u.." అని..
నాలోంచీ నేనూ..నీలో వువ్వూ..మనకి మనం
ఎదురుపడకుండానే వలపు జలపాతంలో తడిచున్నామా..🤔

నిమజ్జనం చేసేసిన భావాలకు మాటలొస్తే ఏమంటాయో
నీ ప్రేమకు భాష్యం నా భాష్పాలుగా వివరిస్తాయేమో
ఏం చెప్పనిప్పుడు..
నీలో చిరుకోపాన్ని సైతం అందమైన నవ్వుగా మార్చి నన్ను ఓదార్చుతున్నాక..

అయినా సరే..
నీ సమస్తాన్ని తలపు చాటునే దాచుకో ఇక
నా హృదయం పక్షి ఈకలా గమ్యాన్నెప్పుడో మరిచిపోయిందని చెప్తున్నాగా 💕

//నీ దర్శనం //


 
కలల సాగరంలోని అలల్ని గుర్తు చేస్తున్న ఈ ఉదయం
హృదయ జతులను లయబద్దం చేస్తున్న సమ్మోహనం

భావాతీత ధ్యానంలో మెరుపులా నీ 
దర్శనం 
చప్పుడు చేయని నా గుండెలో వింత సంస్పందనం

చినుకుపూల పరిమళాలతో తడితడిగా పలకరిస్తున్న వాన
మనసులో మల్లెపందిరేస్తున్న ఈ క్షణాలలో

నీ కన్నుల్లో ప్రతిబింబం నాదేనన్న ధిలాసా
వర్ణలద్దుకున్న సీతాకోకనై నే విహరిస్తున్న కులాసా

మృదుమధురంగా కదిలే చిరుగాలి గుసగుసలు పదాలుగా
కవితలన్నీ స్వరాలై ఎదలో కేరింతల వెల్లువలు

పునరావృత్తమవుతున్న ఈ మోహం బుగ్గల్లో మొదలై
పెదవులపై ప్రేమ రచనకు శ్రీకారమవుతున్న సూచనలు

కలువలు కొమ్మలకు పూస్తాయన్నా నమ్మేస్తానిప్పుడు
నీ ధ్యాసలో ముద్దవుతూ నే మురుస్తున్నప్పుడు..💜💕

//కాలం//

అనుభవాల ఆకృతుల్ని
అందంగా చిత్రించు కాలం
శిల్పాన్ని శిలగానూ మార్చగలదేమో

అదేమో
రెప్పల మాటు కలగా ఉంటూనే
కన్నీటినీ తలపులకు తోడిస్తుంది

తమకంగా మారాల్సిన కెరటాన్ని
ఒడ్డుకి చేరి మురిసేలోపునే
వెనుకకు మరలమని శాసిస్తుంది

అందుకే
మన ఇతిహాసంపై సంతకం చేయాల్సిన మనసు
గాయం చేసి కనుమరుగవుతుంది
జీవితపు ఉనికిని
ప్రపంచానికి పరిచయం చేయాల్సింది పోయి
పలాయన వాదాన్ని ప్రోత్సహిస్తుంది

విముక్తి పొందేందుకు
స్వప్నంలోకి అదృశ్యమైన ఆత్మను
మనోగగనపు పొలిమేరల్లోనే ఆపేస్తుంది

నీటి మీద రాసిన రాతలా
మారిన జీవితం
కథగా చెప్పుకోవడానికి తప్ప
కలవరించేందుకేం మిగిల్చిందని

కాలమిప్పటికే కంగారు పడుతూ కదులుతుంటుంది..
కాసేపు ఆగమనేలోపు ఎన్ని జ్ఞాపకాలు జారిపోతాయో
కొన్ని పులకింతలనైనా రెప్పలపై వెచ్చబడేందుకు అనుమతినిస్తుందో లేదో అడగాలి 🙂

//ఒంటరితనం//

నీటి తుంపర్లతో మసకేసిన సాయింత్రం
మనసంతా నిండిన దిగులు
నువ్వు చెంతలేని ఈ ఒంటరితనమే

అలల చిందులతో ఉరకలేసి ఎంత కాలమయ్యిందో
లయ కోల్పోయిన నా ఊపిరిసెగలో తెలుస్తుంది

లాలించేందుకొక్క ఊహ కూడా కదిలి రాలేదంటే
నా లోపల మధువు పొంగి పొరలాలేమో ప్రతిసారీ

సంతోషం తెలియని పువ్వు
సుగంధాన్ని వెదజల్లడం మరిచినట్లు
నాలో ఆవరించిన చీకటి పొర
పారవశ్యాన్ని దాచిపెడుతుందేమో

అనురాగపు మగత కావాలనుకున్నప్పుడు
ఒక్క నీ అనురక్తి మాత్రమే చేయందివ్వగలదు

ఇప్పుడీ నిశ్శబ్దం చెదరాలంటే చైతన్యం కావాలి
ముద్దు పుట్టేంత మంత్రం నువ్వే వచ్చి విరచించాలి 😣💕

//గుండె రాయి//

పున్నమి ఎందుకు వలవిసిరిందో

నిద్దురరాని ఆ కళ్ళకు

లోకం అంధకారమైంది

అంధకారమైన హృదయవిదారక ఆర్తనాదం..

ఇన్నాళ్ళూ ఆలకించిన సంగీతం

కేవలం ధ్వనించిన నిశ్శబ్దమని తేల్చింది

నిశ్శబ్దం తేల్చిన మధురానుభూతుల్లో

చిరిగిపోయిన మనసుపొర

ఆరారగా కురుస్తున్న అంతు తెలియని కన్నీటిధారయింది

కన్నీటిధారల విషాదానికి ఓర్చినందుకేమో

గుండె రాయిగ మారి

మరోసారి తనో జీవచ్ఛవమని ఋజువు చేసింది 😢

//అలౌకికం//

నీకూ నాకూ వంతెనేసిన వర్తమానం
గతజన్మలో వేరుచేసిన కాలమైయుంటుంది

సందిగ్ధమైన ప్రకోపానికి ఏ లాలిత్యం తగిలిందో
పెదవులు దాటొచ్చిన నీ మౌనానికే తెలిసుంటుంది

మబ్బులమాటున దాగిన రంగుల చిత్రంలా
నీ ఎదను రేపుతున్న అలలసవ్వడిని ఆలకించి చూడు
మనసుకందిన రాగమో రమ్య వేదమయ్యుంటుంది

దూరమంటూ నాకు దగ్గరకాలేని
ఉషస్సుని ఇన్నాళ్ళకు తడిమి చూసావేమో
ఆవిరయ్యిందనుకున్న స్వప్నం
ఆహ్వానించి ఎదుట నిలిచింది నేడు
కనుకనే..
తిరస్కరించలేని ఓ పులకింత
నీలో ఒదిగిన నా ఊహై ఉంటుంది
ఊపిరి సామగానమైన శూన్యంలో
ఈ అలౌకికం పరమానందమయ్యి ఉంటుంది 💕💜

//పున్నమి//


పట్టుచిక్కకుండా పరుగెత్తే కాలం
పరవశమేదో ఆకర్షించినందుకే ఆగుంటుంది

పున్నమి సోయగం మనసుకి దడికట్టి
ధ్యానంలోనూ కవ్వించాలని చూస్తుంది..

గగనాన మెరుస్తున్న పాలపుంత చేతికందినట్టు
మనోల్లాసం అణువణువునా విస్తరించి సమ్మోహిస్తుంది

ఊపిరి కదులుతున్న ప్రాణానికి పట్టింపులేకున్నా
మౌనం ముగ్ధమైన ఆత్మను కుదిపి తీరుతుంది

వెన్నెల అందరిపై సమానంగానే కురుస్తుందనుకున్నా
ప్రకృతి ప్రసాదానికని ఆశపడ్డ నాకు ఇంకొంచం కావాలనిపిస్తుంది

క్షణాల కేరింతలన్నీ ఈ రాతిరి పూలధనువులైతే
వలపుచూపు గుచ్చిందని రెప్పల బరువుని నిదురలోకి దించలేను
 మధువొలుకుతున్న పెదవుల తమకాన్ని కాసేపైనా నవ్వనిస్తాను..😄💕

//నువ్వంటే ఇదేగా..//

నవ్వే పెదాల మౌనం
విసిరే చూపుల బాణం
నువ్వంటే ఇదేగా..

వెలుగు కిరణాల వాకిళ్ళను దాటి
హృదయంలో లేలేతవెన్నెల కురిపిస్తున్న
అరమోడ్చిన చందమామ నువ్వేనని
నీ అల్లరి కదలికలతో పోల్చుకున్నా..

నేనులేని రాతిరి నీలో అలికిడంటే
అది నా పేర కలవరింతేగా..
ఊపిరి పరిమళం నిండిన మనసుపొరల్లో
ఎప్పటికీ ఆవిరవని ఆనందం కదా ఇది

ఆవును..శ్రావణంలో కోయిల కూసినంత మధురం
హా...
నాకు తెలిసింది ఇదొక్కటే..
నా జీవితం నీ తలపుల నిత్య విరహగీతం 💕💜

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *